Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు మీడియా స్వర్ణయుగం ముగిసింది – ఇప్పుడంతా వాట్సప్ జర్నలిజం !!

August 13, 2026 by M S R

.

Murali Buddha …. జర్నలిజం స్వర్ణ యుగం చూసిన చివరి తరం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు … అతను ముఖ్యమంత్రులతో రోజూ ఫోన్లలో కబుర్లు చెప్పుకొనే జర్నలిస్ట్ కురు వృద్ధుడు . ఏదైనా సమస్య వస్తే సీఎంలు అతనికి ఫోన్ చేసి సలహాలు అడిగేవారు . అలాంటి సీనియర్ జర్నలిస్టును పాతికేళ్ల వయసున్న ఓ మంత్రి ఎవరు నువ్వు అని అడిగేసరికి భూమి గిర్రున తిరిగినట్టు అనిపించింది . దానితో ఆ జర్నలిస్ట్ ఆఫీసుకే పరిమితం అయి, ఫీల్డ్ రిపోర్టింగ్ మానేశారు .

నేను సీతారాంను అని ఓ మంత్రికి ఫోన్ చేస్తే… సీతారామా ? నేను కదా సీతారాం, ఇంతకీ మీరెవరు ? అని
పాతికేళ్ల కుర్ర మంత్రి అడిగితే – పాపం యేమని పరిచయం చేసుకుంటాడు ఆ సీనియర్ జర్నలిస్టు..? అలా అడిగిన వారు సీతారాం అయితే , అలా అడిగినందుకు ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడింది సీతారామే…

Ads

1983 లో టీడీపీ అధికారంలోకి వచ్చింది . మంత్రుల్లో పాతికేళ్ల వయసున్న తమ్మినేని సీతారాం కూడా ఉన్నారు . ఆ కాలంలో హైదరాబాద్ లో కీలక రాజకీయ వ్యవహారాలు చూసే జర్నలిస్ట్ లు అరడజను మంది . వారిలో ఒకరు యుఎన్ఐ రిపోర్టర్ ధర్మవరపు సీతారాం . కొమ్ములు తిరిగిన జర్నలిస్ట్ . నిజాం మరణించిన విషయాన్ని ముందుగా ఫ్లాష్ చేసిన జర్నలిస్ట్ . ముఖ్యమంత్రులతో ఫోన్లలో కబుర్లు చెప్పుకున్న తరం .

1983 లో టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పటి వరకు ఉన్న రాజకీయ ఉద్దండులు తెరమరుగై కొత్త వారు రాజకీయ తెరపైకి వచ్చారు . తన జర్నలిజం అనుభవంలో సగం వయస్సున్న తమ్మినేని సీతారాం అలా అడిగే సరికి… ఇక కాలం మారింది . ఈ వయసులో ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నేను పలానా అని పరిచయం చేసుకోలేను అని డి.సీతారాం అప్పటి నుంచి రిపోర్టింగ్ వదిలేసి, ఆఫీస్ కు పరిమితం అయ్యారు . తరువాత డక్కన్ క్రానికల్ లో చేరి డెస్క్ కు పరిమితం అయ్యారు . సీతారాం తెలుగు , ఇంగ్లీష్ లో బాగా రాసే వారు .
ప్రతి జర్నలిస్ట్ కు ఇలాంటి సంధి కాలం వస్తుంది .

2014 లో రాష్ట్ర విభజన మొత్తం జర్నలిజంకే సంధి కాలంలా మారింది . ఒకవైపు రాష్ట్ర విభజన… బాబుతో పాటు టీడీపీ కాంగ్రెస్ సీనియర్లు ఆంధ్రాకు వెళ్లారు . వారితో పాటు మీడియా . తెలంగాణలో తెరాస తొలిసారి అధికారంలోకి వచ్చింది .

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు , తెలంగాణ అనుకూల, వ్యతిరేక సమావేశాలతో అప్పటి వరకు మీడియా క్షణం తీరిక లేకుండా గడిపింది . విభజనతో ఒక్కసారిగా మీడియా పని తీరులో స్తబ్దత ఆవరించింది . ఒకరకంగా తెలుగు జర్నలిజం స్వర్ణ యుగానికి ముగింపు కాలం ఇది .

మా రోజులే వేరు .. ఇప్పుడు కాలం మారింది . ఇవి అందరూ చెప్పే మాటలే .. . నిజంగా మా రోజులే వేరు .. ఆ రోజులు మళ్ళీ రావు .. అంటే అప్పుడు జర్నలిజం పవిత్ర జలాల్లో ప్రవహించి, ఇప్పుడు మాత్రం చెడిపోయింది అని కాదు . అసలు మీడియా పుట్టిందే రాజకీయ పక్షాల కోసం . రాజకీయ ప్రచారం కోసం .

మత ప్రచార గ్రంధాల కోసం తొలి ముద్రణయంత్రం ఆవిష్కరిస్తే మన దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం కోసం,  కాంగ్రెస్ ప్రచారం కోసం తొలితరం పత్రికలు పని చేశాయి . తరువాత కమ్యూనిస్ట్ ల పత్రికలు పుట్టాయి . తెలుగునాడు విషయానికి వస్తే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల పత్రికలు కూడా టీడీపీ కోసం పని చేశాయి .

తెలుగుదేశం తొలి ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో ముద్రించారు . కాంగ్రెస్ ఎంపీకి చెందిన ఆంధ్రజ్యోతి సైతం టీడీపీ కోసం పని చేసింది . కాంగ్రెస్ ముద్ర ఉన్న ఆంధ్రభూమి 2004 ఎన్నికల్లో టీడీపీ గెలుపు అంటూ సర్వేలతో టీడీపీ కోసం తపించింది . ఒక దశలో తెలుగునాట మెజారిటీ మీడియా టీడీపీకి ఊపిరిగా పని చేశాయి .

ఇప్పుడంటే అన్ని పార్టీలకు పత్రికలు ఉన్నాయి కానీ వెన్నుపోటుతో సహా మెజారిటీ మీడియా బాబు టీడీపీ కోసం పని చేసింది . మరి ఇందులో స్వర్ణ యుగం ఎక్కడుంది అంటే ? మీడియా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ నిష్పక్షపాతంగా లేదు . స్వర్ణయుగానికి దీనికి సంబంధం లేదు .

****

దాదాపుగా 2014 వరకు కూడా మీడియా ఫీల్డ్ లో చురుకుగా పని చేసేది . ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం , అధికారంలోకి రావడం , నాదెండ్ల వెన్నుపోటు , ఎన్టీఆర్ ఓటమి , చెన్నారెడ్డి కాంగ్రెస్ వీడడం , కాంగ్రెస్ లో చేరి సీఎం కావడం , నక్సలైట్ ఉద్యమం విజృంభణ , మావోయిస్టు పార్టీ ఏర్పాటు , చర్చలు , లొంగుబాట్లు , చంద్రబాబు వైస్రాయ్ వెన్నుపోటు , నిండు సభలో ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకోవడం , వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన తమ్ముళ్లు , బాబు సీఎం కావడం , హైటెక్ సిటీ , భూమి పూజ , ప్రారంభోత్సవం , విద్యుత్ ఉద్యమం , కాల్పులు , జల దృశ్యంలో తెరాస ఆవిర్భావం , కరీంనగర్ లో తొలి బహిరంగ సభ , వైఎస్ఆర్ సీఎం కావడం , ఉదృతంగా సాగిన తెలంగాణ ఉద్యమం , రాష్ట్రపతి పాలన , తెలంగాణ ఏర్పాటు, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం , ( ఆంధ్రాలో బాబు ప్రభుత్వం ) ఏర్పడడం… వీటన్నిటికీ సాక్షిగా నిలిచి, వార్తలు కవర్ చేసిన అనుభవం స్వర్ణ యుగం . నూతన తరానికి ఈ అవకాశం లేదు . ఇప్పుడంతా వాట్సాప్ జర్నలిజం .

ఆ రోజుల్లో కీలక సంఘటనలే కాదు చిన్న నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ లకు సైతం హాజరై, ఇష్టాగోష్టి ద్వారా బోలెడు విషయాలు తెలుసుకొనే అవకాశం ఉండేది . ఎన్టీఆర్ భవన్ , గాంధీ భవన్ , సిపిఐ , సీపీఎం కార్యాలయాలు , బీజేపీ , తెరాస కార్యాలయాల్లో బోలెడు రాజకీయ చర్చలు . ప్రెస్ కాన్ఫరెన్స్ అరగంట అయితే రెండు గంటలు రాజకీయ చర్చలు సాగిన కాలం అది .

జర్నలిజం వృత్తిలో ఆసక్తి ఉంటే తనివితీరా జ్ఞాన తృష్ణ తీర్చుకున్న కాలం అది . అందుకే అది జర్నలిజంకు స్వర్ణయుగం . ఆకాలం నాటి రిపోర్టర్లు బాబు అనుగ్రహంతో మీడియా ఓనర్లు అయ్యారు . అది విలువల గురించిన స్వర్ణయుగం అని కాదు… ఫీల్డ్ లో పని చేయడానికి సంబంధించిన స్వర్ణ యుగం .

క్యాబినెట్ సమావేశం అంటే… లోపల ఏం జరిగిందో తెలుసుకోవడానికి కనీసం డజను మంది మంతులను విడివిడిగా కలుసుకున్న కాలం . తెలంగాణ ఉద్యమ సమయంలో డీసీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు ఓరోజు అక్బరుద్దీన్ తో మాట్లాడితే… జూన్ వరకు ఎందుకు, ఇంకా ముందే తెలంగాణ ఇచ్చేద్దాం అని సోనియా గాంధీ చెప్పిన విషయం , జగన్ పై ఆమె కోపంగా ఉన్న విషయం తెలిసింది …

జర్నలిజం బతికి ఉన్న స్వర్ణయుగంలో నలుగురితో మాట్లాడితే ఢిల్లీ రహస్యాలు కూడా తెలిసేవి . 2014లో రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితి మారిపోయింది . ప్రతి పార్టీకి సొంత మీడియా ఉండడమే కాదు , ప్రత్యర్థి పార్టీ మీడియాను తమ పార్టీ కార్యాలయాల్లోకి రాకుండా నిషేధం విధించారు . రెండు రాష్ట్రాల్లోనూ ఇదే . సంప్రదాయ జర్నలిజం స్థానంలో వాట్సాప్ జర్నలిజం యుగం మొదలయింది .
****

ఒకప్పుడు ముఖ్యమంత్రికి మాత్రమే పిఆర్ఓ ( పౌరసంబంధాల అధికారి) ఉండేవారు . బాలయోగి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓ జర్నలిస్ట్ అసెంబ్లీకి పిఆర్ఓ పోస్ట్ క్రియేట్ చేసి ఆ పోస్ట్ లో వెళ్ళాలి అని తీవ్రంగా ప్రయత్నం చేశాడు . బాలయోగి అప్పటి సీఎం బాబును ఎన్నిసార్లు కలిసి కోరినా ససేమిరా అన్నారు బాబు .

ఇప్పుడు సీఎంకు ఓ అరడజను మంది పిఆర్ఓలు ఉంటే . మంత్రులకు ఒక్కరు లేదా ఇద్దరు , ఎంపీలకు , శాసన సభ్యులకే కాదు , చోటా నాయకులకు సైతం పిఆర్ఓలు ఉన్నారు . మంత్రులు , నాయకులు జర్నలిస్ట్ లను కలవరు , జర్నలిస్ట్ లు వారిని కలువరు . వాట్సాప్ – పిఆర్ఓలే అనుసంధాన కర్తలు . ఒకరి ముఖం ఒకరు చూసుకోవలసిన అవసరం లేదు .

ఒకప్పుడు సీఎం ఒళ్ళో కుర్చున్నారేమో అనిపించేంత సన్నిహితంగా మీడియా కూర్చునేది . ఇప్పుడు సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే భారీ బహిరంగ సభలా అడ్డంగా బ్యారికేడ్లు తప్పవు . తెలంగాణ ఏర్పడిన తరువాత సబితా ఇంద్రారెడ్డి చేవెళ్లలో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఎదురుగా దాదాపు వంద లోగోలు కనిపించేసరికి భయపడి పోయారు ఆమె.

సచివాలయంలో మీడియాకు పెద్ద గది ఉండేది . ఎన్టీఆర్ సీఎంగా ఉండడం , ఆయన్ని దించడానికి ఇక్కడే తొలిసారి సమావేశం కావడం, జర్నలిస్ట్ లే సాక్ష్యం . సచివాలయంలో మీడియా చెట్టు కింద గంటల తరబడి చర్చలు సాగేవి . ఇప్పుడు జర్నలిజం వాట్సాప్ లో ముడుచుకు పోయింది . చారిత్రక సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో వచ్చే థ్రిల్ వాట్సాప్ సమాచారంలో ఉండదు . గడిచిపోయిన జర్నలిజం స్వర్ణ యుగం మళ్ళీ రాదు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Batwara 1947 – ఆ చరిత్రను గుర్తుచేసింది – కదిలించలేక పోయింది !!
  • Dirty – Hug Politics …! మరో మెట్టు జారిపడిన రాహుల్ గాంధీ !!
  • ఓం పురి ! ఎల్లలు దాటిన నటన ! ఇండియన్ సినిమా శిఖరం !!
  • కేసీయార్ వాటర్ బ్లండర్స్ ! రేవంత్ రెడ్డి రిపేర్లు !!
  • మొన్న ధర్మేంద్ర ప్రధాన్ – నిన్న నితిన్ గడ్కరీ – నేడు నిర్మలా సీతారామన్ !!
  • Viswanath & Sons – కమర్షియల్ మసాలా ట్రెండ్ల నడుమ- ఫీల్ గుడ్ మూవీ…
  • సలాం రాకీ భాయ్..! యశ్ జీవితమూ ఓ సినిమా స్పూర్తి కథే!!
  • ఒక అభిజిత్ దీప్కే – ఒక సౌరవ్ దాస్ – ఒక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి !!
  • ఆరుగురు అత్తలు – 14 మంది కోడళ్లు … ఒకే కప్పు కింద కలిసిమెలిసి..!!
  • Trolling – సోషల్ మీడియాలో కోతి రాతలు – పావురాల రెట్టలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions