.
నో డౌట్… ప్రధాని మోదీ బలం ఏమిటయ్యా అంటే..? ఓ సమర్థ నాయకత్వం లేని ప్రతిపక్షం… పర్టిక్యులర్‌గా అత్యంత అపరిణత నాయకుడు రాహుల్ గాంధీ..! తన సొంత ప్రధాని జారీ చేసిన ఉత్తర్వుల ప్రతుల్ని తనే చింపేయడం దగ్గర నుంచి… పార్లమెంటులో ప్రధానిని కౌగిలించుకుని… తాజాగా ఇటలీ ప్రధానిని కూడా వెక్కిరిస్తూ… మోదీపై సంస్కారహీనమైన ఆలింగనాల సెటైర్ వేయడం దాకా…
నాయకుడిగా ఎలాగూ పనికిరావడం లేదు, కనీసం ఓ వ్యక్తిగా కూడా నానాటికీ తీసికట్టు… ఎక్కువగా విదేశీ కల్చర్ అలవాటున్న రాహుల్‌కు బహిరంగ ఆలింగనాలు అంటే అవి రొమాన్స్ కాదనే బేసిక్ సోయి లేకపోవడం, అలాంటి ప్రతిపక్ష నేత ఉండటం ఈ దేశ రాజకీయాల దౌర్భాగ్యం… పైగా ఈ సెటైర్ ఎపిసోడ్‌లో అంతటి షీలా దీక్షిత్ కొడుకు కూడా పాలుపంచుకోవడం మరో వెగటు పోకడ…
Ads
అప్పట్లో అరాఫత్, ఇందిర ఆలింగనం వంటివి బీజేపీ క్యాంపు సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి కౌంటర్ చేయాల్సిన పనే లేదు… వదిలేసి ఉండాల్సింది… ప్రజలకు అర్థమవుతూనే ఉంది కదా రాహుల్ సంస్కారరహిత వైఖరి…
రాజకీయాల్లో సిద్ధాంతాలు, రాద్దాంతాలు, ఘర్షణ, వేడి సహజం… కానీ వ్యక్తులుగా పరస్పర గౌరవ మర్యాదలు అవసరం… గుర్తుందా..? రాజీవ్ గాంధీ వాజపేయిని ఏదో అధికారిక పని మీదే అమెరికా పంపించి, అక్కడే చికిత్స తీసుకుని రండి మాస్టారూ అని ఆప్యాయత ప్రదర్శించడం..!! పీవీ తనను ఏకంగా ఐరాసకు పంపించి ఇండియా ప్రయోజనాల జెండా ఎత్తాలని అభ్యర్థించడం… అంతెందుకు మరో ఉదంతం చెబుతాను…

ఇది సోషల్ మీడియాలోనే కనిపించింది… భారతీయ రాజకీయాల్లో సైద్ధాంతిక భేదాలు, తీవ్రమైన రాజకీయ చర్చలకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ, కొన్నిసార్లు చరిత్ర ఒక చిన్న చిత్రంలో మొత్తం రాజకీయాల కంటే పెద్ద కథను మిగిలిస్తుంది.
ఈ సంఘటన 1972 నాటిది… సిమ్లా ఒప్పందంలోని నిబంధనలపై ప్రతిపక్షంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉండేవి. జనసంఘ్ ప్రముఖ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ఒకరు. పార్లమెంట్‌లో ఆయన దీనికి వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించారు.
ఇదే సమయంలో, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చర్చల కోసం వాజ్‌పేయిని ఆహ్వానించారు. అయితే, ఒక గదిలో కూర్చుని చర్చించుకోవడానికి బదులుగా ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతారు.
ఆ సమయంలోనే అకస్మాత్తుగా చిరుజల్లు కురవడం మొదలైంది. ఎవరో ఇందిరా గాంధీ కోసం ఒక గొడుగు తెచ్చారు. ఇందిరాజీ ఆ గొడుగును తెరిచారు… ఆ తర్వాత జరిగిన ఘటనే నేటికీ వారి సంబంధానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా గుర్తుండిపోయింది.
ఆమె ఆ గొడుగును తన తలపై పట్టుకోకుండా, అటల్ బిహారీ వాజ్‌పేయి తలపై పట్టారు. వాజ్‌పేయి మాట్లాడుతూనే ఉన్నారు, ఇందిరా గాంధీ ఆయనపై గొడుగు పట్టుకుని అలాగే నడిచారు.
ఒకవైపు దేశ ప్రధాన మంత్రి…
మరోవైపు ప్రతిపక్షంలోని ఒక అగ్రనేత…
భావజాలంలో తీవ్రమైన వ్యత్యాసాలు…
కానీ ఆ క్షణంలో వ్యక్తిగత ఉన్నతి, పరస్పర గౌరవానికి సంబంధించిన ఒక గొప్ప దృశ్యం కనిపించింది. ఈ సంఘటనను తర్వాత కాలంలో సీనియర్ బీజేపీ నాయకుడు ఎస్. శేషాద్రి చారి ఎన్డీటీవీ (NDTV) కార్యక్రమంలో ప్రస్తావించారు. ఆయన అటల్‌ను ఈ చిత్రం గురించి అడగగా, ఆయనే స్వయంగా ఆ సంఘటన నేపథ్యాన్ని వివరించారట.
ఈ కథను మరింత ప్రత్యేకంగా మార్చేది ఇదే— రాజకీయాల్లో వ్యతిరేకత ఉండవచ్చు, కానీ ప్రత్యర్థిపై గౌరవం అంతరించిపోవాల్సిన అవసరం లేదు.
ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిల రాజకీయాలు వేర్వేరు సిద్ధాంతాలపై ఆధారపడినవి. ఇద్దరూ ఒకరి విధానాలను మరొకరు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఆనాటి రాజకీయాల్లో వ్యక్తిగత సంభాషణలకు, పార్లమెంటరీ మర్యాదలకు కూడా తగినంత స్థానం ఉండేదని ఇటువంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి.
బహుశా అందుకే, నేడు ఈ గొడుగు వర్షం నుంచి రక్షించే కేవలం ఒక వస్తువులా కనిపించదు… అది భారతీయ రాజకీయాల్లో ఒక సువర్ణ యుగానికి ప్రతీకగా నిలిచింది. రాజకీయ వ్యతిరేకత మధ్యలో కూడా మానవ సంబంధాల వెచ్చదనం ఎలా ఉంటుందో ఆ దృశ్యం మనకు చాటిచెప్పింది.
Share this Article