.
ఖండాంతర వివాహాలు కొత్తేమీ కాదు… వాళ్లు ముందుయుగం దూతలు! విశ్వమానవులు!! ఇది వాటిల్లోనే మరో భిన్నమైన ప్రేమకథ… తన రూట్స్ మరిచిపోని, తన ‘పుట్టింటి’ మత సంప్రదాయం పట్ల నమ్మకాలు సడలని వధువు… ఓ దూరదేశపు రాజకీయ నాయకుడిని ఇక్కడికి తీసుకొచ్చి, 22 ఏళ్ల కొడుకు సాక్షిగా… మూడు ముళ్లు వేయించుకున్నఓ ‘తల్లి’ పట్టుదల…! జై గురువాయూరప్ప!!
గోత్రాలు, కులాలు, శాఖలు, భాష, ప్రాంతాలు, సంస్కృతులు, వయసులు… ప్రస్తుతం తెలుగు పెళ్లిళ్లు ఓ మాయ, ఓ భ్రమలో కొట్టుకుపోతున్న వివాహ పొంతన, గుణాల లెక్కింపు వంటివేమీ లేవు ఇందులో… ఈ కథ బ్రిటన్‌లో మొదలైంది…
Ads
నిధిన్ చంద్… పిరవం సమీపంలోని పాంపాకుడ ఆమెది… 2008లో ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లింది. ఇంజినీరింగ్ చదివిన తర్వాత ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు యూకేలో విదేశీ విద్యార్థులకు సంబంధించిన వీసా నిబంధనలు మారాయి.
నిధిన్ కూడా ఆ సమస్యను ఎదుర్కొంది. తన సమస్యతో ఆగిపోలేదు. భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యూకే పార్లమెంట్ కమిటీ ఎదుట ప్రస్తావిస్తోంది, పోరాడుతోంది… అక్కడే అప్పటి యూకే ఎంపీ మార్టిన్ డేతో పరిచయం ఏర్పడింది…
మొదట ఫోన్ సంభాషణలు. ఆ తర్వాత ప్రత్యక్ష పరిచయం. 2016 ఫిబ్రవరిలో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. కొన్ని నెలలకే మార్టిన్ తన మనసులో మాట చెప్పాడు, ప్రపోజ్ చేశాడు… ‘కలిసి బతుకుదామా’?
నిధిన్‌కు అప్పటికే ఒక గతం ఉంది. ఆమె విడాకులు తీసుకుంది అప్పటికే…. 12 ఏళ్ల కుమారుడూ ఉన్నాడు… ‘ఇదీ నా గతం’ అని చెప్పింది… మార్టిన్ సమాధానం సింపుల్… ‘నీ కొడుకూ మన కుటుంబంలో భాగమే’…
మార్టిన్ తన తల్లిదండ్రులకు నిధిన్‌ను పరిచయం చేశాడు. వాళ్లు కూడా ఆమెను ఆప్యాయంగా అంగీకరించారు. మార్టిన్ తల్లిదండ్రులు నిధిన్ కొడుకు వేదిక్‌ను తమ కుటుంబ సభ్యుడిగానే చూసుకున్నారు…
నిధిన్ మార్టిన్‌ను కలిసినప్పుడు వేదిక్‌కు 12 ఏళ్లు. ఇప్పుడు అతనికి 22. అతను చదువు పూర్తి చేసుకుని ఎడిన్‌బర్గ్‌లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. అంటే.. పదేళ్ల క్రితం తల్లి జీవితంలోకి వచ్చిన మార్టిన్‌ను ఇప్పుడు తన తల్లికి భర్తగా, తన కుటుంబ సభ్యుడిగా చూస్తున్నాడు. ఇదే ఈ కథలో అసలు ముచ్చట.
పెళ్లి అప్పుడే అయిపోయింది.. కానీ ఆమెకు ఆ పెళ్లి జరిగినట్టు లేదు… 2016లోనే మార్టిన్, నిధిన్ యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ మనసులో మాత్రం ఒక కోరిక మిగిలిపోయింది. ‘‘గురువాయూరులో కన్నయ్య ముందు కూడా పెళ్లి చేసుకోవాలి.’’ అది వెంటనే జరగలేదు. అదంత సులభంగా జరగలేదు.
మార్టిన్ 2018లో కేరళ వచ్చాడు. 2019లో వచ్చాడు. 2023లో కూడా వచ్చాడు. కానీ ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి. కేరళ వరదలు వచ్చాయి. కోవిడ్ వచ్చింది. కుటుంబ సభ్యుల అనారోగ్యాలు వచ్చాయి. అలా రోజులు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. కానీ నిధిన్ ఆ కోరికను మాత్రం వదల్లేదు.
చివరకు.. కన్నయ్య ముందు! 2026లో మార్టిన్ నాలుగోసారి కేరళకు వచ్చాడు. ఈసారి మాత్రం ఏ అడ్డంకీ రాలేదు. గురువాయూరులోని శ్రీకృష్ణుడి సన్నిధిలో సంప్రదాయ పద్ధతిలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆలయ పట్టణంలోని పుష్పాంజలి ఆడిటోరియంలో వివాహానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు జరిగాయి. బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. వేదిక్ శంకర్ కూడా ఆ వివాహ క్షణానికి సాక్షిగా నిలిచాడు.
పదేళ్ల క్రితం చట్టబద్ధంగానే భార్యాభర్తలయ్యారు. పదేళ్ల తర్వాత ఆమె కోరుకున్న దేవుడి ముందు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇందులో విడ్డూరం ఏమీ లేదు. కొందరికి పెళ్లి అనేది ఒక రిజిస్ట్రేషన్. కొందరికి రెండు కుటుంబాల కలయిక. మరికొందరికి అది ఒక దేవుడి ముందు తీర్చుకునే మొక్కు. నిధిన్‌కు మూడోది.

స్కాట్లాండ్ రాజకీయాల్లో మార్టిన్.. పాంపాకుడలో నిధిన్ … మార్టిన్ డే సాధారణ వ్యక్తి కాదు. మూడు టర్మ్‌ల పాటు యూకే పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. 2024 ఎన్నికల్లో వెస్ట్‌మినిస్టర్ సీటు కోల్పోయిన ఆయన 2026లో స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్‌లిత్‌గో నియోజకవర్గం నుంచి గెలిచి మళ్లీ ప్రజాప్రతినిధిగా మారాడు. ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు.
అటు నిధిన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే స్కాటిష్ నేషనల్ పార్టీ కార్యకలాపాల్లో, మార్టిన్ ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొంది. అంటే ఇది కేవలం ‘‘స్కాటిష్ ఎంపీకి మలయాళీ మహిళతో పెళ్లి’’ అనే వార్త కాదు. అంతకు మించి..!!
ఇక్కడ ఓ ప్రశ్న… ప్రాంతం, దేశం, ఖండం, కులగోత్రాలు, జాతులు, సంస్కృతుల లెక్కలన్నీ ఆమె అధిగమించింది కదా… మరి ఆ గుడిలోనే దేవుడి ఎదుట పెళ్లిపై ఆమె మనసు ఎందుకు తన్లాడింది..? ఇదొక్కటీ ఆమె ధోరణిలో భిన్నంగా ఉంది కదా..? అవును, కానీ కొన్ని ఉద్వేగాలకు, బలమైన నమ్మకాలకు లాజిక్కులు ఉండవు, లెక్కలు ఉండవు..!!
Share this Article