.
ఈనాడు నాణ్యతా ప్రమాణాల పతనం గురించి పదే పదే చెప్పుకుంటున్నదే… నిన్న ఫస్ట్ పేజీలో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే ఓ కథనం ప్రచురించబడింది… సరిగ్గా రాయలేని అసమర్థత కావచ్చు, దిద్దలేని నైపుణ్యలేమి కావచ్చు కానీ.., కాళేశ్వరం మూడు బ్యారేజీలకు సంబంధించి, కుంగిన ఆ మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోని పియర్లు తప్ప మిగతావన్నీ సూపర్ కాంక్రీటు నాణ్యతతో ఉన్నాయని CWPRS సంస్థ తేల్చేసిందని రాసుకొచ్చింది…
అన్నారం, సుందిళ్ల బరాజు పియర్ల నాణ్యత అయితే భేషుగ్గా ఉందనీ, ఎక్సలెంట్ అనీ సదరు సంస్థ తేల్చి చెప్పిందట… అబ్బే, హరీష్ రావు, కేటీయార్ చెబుతున్నట్టు జస్ట్, ఆ ఒక్క బ్లాక్‌లోని అయిదారు పియర్లలో కాస్త ఇబ్బంది ఉంది తప్ప… మిగతా నిర్మాణాల్నీ సూపర్బ్ సుమీ అని సర్టిఫికెట్ ఇస్తున్న తరహాలో రాస్తూ పోయింది ఈనాడు…
Ads
దాన్ని బట్టుకుని గులాబీ క్యాంపు, చూశారా, ఈ కాంగ్రెసోళ్ల కుట్ర, తప్పుడు ప్రచారాలు చేశారు, అసలు నాణ్యత భేషుగ్గా ఉందని కేంద్ర సంస్థే సర్టిఫికెట్ ఇస్తోంది తెలుసా అని ఏవేవో సోషల్ ప్రచారాలకు, సమర్థనకు దిగారు… రాసేది ఎక్స్‌క్లూజివ్ స్టోరీ అయినప్పుడు, అది సరిగ్గా ఉందా, తప్పుడు సమాచారం పాఠకుడికి వెళ్తుందా సరిచూసుకోవాలి ఓసారి… అది లోపించింది ఈనాడులో…

CWPRS ఏం పరీక్షలు చేసింది..? పియర్ల కాంక్రీట్ నాణ్యతతో ఉందా లేదానేది మాత్రమే, సరే, కుంగిన ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న ఆ పియర్ల కాంక్రీట్ నాణ్యతతో లేదని తేల్చింది… అంతేతప్ప మిగతా బరాజులు, మేడిగడ్డలోని ఇతర బ్లాకులు బాగున్నట్టు చెప్పిందని ఈనాడు రాసుకొచ్చింది… అసలు ఆ బ్లాక్, ఆ పియర్లే కదా మేడిగడ్డకు కీలకం… అంతేకాదు…
అసలు బరాజులు ఎందుకు ప్రమాదకరం అంటున్నారంటే… అవి పునాదుల లోపాలు… వేళ్లే సరిగ్గా లేకపోతే చెట్టు ఎలా నిలబడుతుంది… NDSA తేల్చింది అదే… ఆ ముఖ్యాంశాలను ఈ కాంక్రీట్ పరీక్షల స్టోరీలో ఖచ్చితంగా ప్రస్తావించి ఉండాల్సింది, లేకపోతే పాఠకుడు మూడు బరాజులూ సేఫే, ఒక్క ఆ బ్లాక్ తప్ప అని పొరపడే ప్రమాదముంది… దీన్నే సోయిలేని వార్తారచన అంటారు…
నిజానికి ఆ బరాజుల లోపాలు ఇవీ… చాలా ప్రమాదకరమైనవి కూడా, అందుకే నీటి నిల్వ తగదు అని ఖచ్చితంగా హెచ్చరించింది…
1) బ్యారేజీని “ఫ్లోటింగ్ స్ట్రక్చర్” (తేలియాడే నిర్మాణం) గా డిజైన్ చేసి, క్షేత్రస్థాయిలో మాత్రం దానిని “రిజిడ్ స్ట్రక్చర్” (గట్టి నిర్మాణం) లాగా నిర్మించారు. ఈ డిజైన్‌కు, నిర్మాణ విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసమే బ్యారేజ్ కుంగుబాటుకు ప్రాథమిక కారణం.
2) బ్యారేజ్ పునాది కింద ఉండే ఇసుక ప్రవాహం కారణంగా కదిలిపోయి కొట్టుకుపోవడం (Piping), పునాది (Foundation) కింద తగినంత భరించే సామర్థ్యం (Bearing Capacity) లేకపోవడం వల్ల రాఫ్ట్ కుంగిపోయి, దానికి అనుసంధానంగా ఉన్న పిల్లర్లు పగుళ్లు ఇచ్చి కుంగిపోయాయి.
3) భూగర్భంలో ఏర్పాటు చేసిన సీకెంట్ పైల్స్ (Secant Piles), కటాఫ్‌ల నిర్మాణంలో కఠినమైన నాణ్యతా ప్రమాదాలు పాటించకపోవడం వల్ల అక్కడ ఖాళీలు ఏర్పడి నీరు లీకైంది. ఇది క్రమంగా బ్యారేజ్ బలహీనపడటానికి దారితీసింది.
4) బ్యారేజ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి (2019-20) కింది భాగంలో ఉన్న సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు, లాంచింగ్ ఏప్రాన్లను సరిగ్గా తనిఖీ చేయలేదని, ఎలాంటి నిర్వహణ చర్యలు చేపట్టలేదని నివేదిక…
5) మేడిగడ్డ తరహాలోనే డిజైన్ చేసిన ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా ఇలాంటి లోపాలే ఉన్నాయి… ఇప్పటికే కొన్ని చోట్ల నీటి బుడగలు (Boiling signs) వస్తున్నాయి…
… ఇవి కదా కాళేశ్వరం రోగలక్షణాలు, వ్యాధి నిర్ధారణలు… మరి పియర్ల కాంక్రీట్ నాణ్యత బాగుంది తెలుసా, అన్నారం- సుందిళ్ల అయితే సూపర్, బంపర్ అన్నట్టు రాస్తూ పోతే… పాఠకులకు ఏం చెబుతున్నట్టు..? కాళేశ్వరం వైఫల్యగాథను పక్కదోవ పట్టిస్తున్నారా..?!
Share this Article