.
కొన్ని నగరాలకు రెండు ముఖాలుంటాయి. పగలు కనిపించే ముఖం ఒకటి. రాత్రి కనిపించే ముఖం మరొకటి. కేపీహెచ్‌బీ కూడా నాకు అలాంటి ప్రాంతంగానే అనిపిస్తుంది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడ నిలబడితే జీవితం పరుగెడుతున్నట్టు ఉంటుంది. మెట్రో, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, కార్యాలయాలకు పరుగులు తీస్తున్న యువతీయువకులు, పిల్లలను పాఠశాలలకు తీసుకెళుతున్న తల్లిదండ్రులు, టిఫిన్ సెంటర్ల ముందు జనాలు…
ఎక్కడ చూసినా బతుకు మీద ఆశ కనిపిస్తుంది. అదే ప్రాంతాన్ని రాత్రి పదకొండు గంటల తర్వాత చూస్తే కొన్ని వీధుల్లో మరో ప్రపంచం మెల్లగా మేల్కొంటున్నట్టు అనిపిస్తుంది. ఆ ప్రపంచం గురించి నాకు తెలిసింది ఒక శనివారం రాత్రి.
నేను స్నేహితుడి పుట్టినరోజు వేడుక ముగించుకుని ఇంటికి వెళుతున్నాను. రాత్రి పదకొండున్నర దాటింది. ఒక హోటల్ దగ్గర పోలీసు వాహనాలు కనిపించాయి. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు కొందరు యువతులను బయటకు తీసుకొస్తున్నారు. ముఖాలకు చున్నీలు అడ్డం పెట్టుకుని వాళ్ళు వాహనంలోకి ఎక్కుతున్నారు. చుట్టూ చిన్న గుంపు చేరింది. ఎవరో మొబైల్‌తో వీడియో తీస్తున్నారు.
Ads
“వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారట!”
ఎవరో నవ్వుతూ అన్నారు. ఆ మాట వినగానే మరికొందరి ముఖాల్లో ఆసక్తి కనిపించింది. నాకు మాత్రం ఆ అమ్మాయిల ముఖాలు సరిగా కనిపించలేదు. వాళ్ళ కళ్ళు మాత్రమే కనిపించాయి. ఆ కళ్ళలో భయం, అవమానం, నిస్సహాయత కనిపించాయి. వాహనంలోకి ఎక్కబోతున్న ఒక అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది.
“మేడమ్! నా ముఖం వీడియో తీయనివ్వకండి. మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
ఆమె ఏడుస్తూ చెప్పిన ఆ ఒక్క వాక్యం నన్ను అక్కడే నిలబెట్టేసింది. అప్పటివరకు నేను కూడా అక్కడ జరుగుతున్నది ఒక పోలీసు దాడిగానే చూస్తున్నాను. ఆ క్షణంలో మాత్రం పోలీసు వాహనంలోకి ఎక్కుతున్నది ఒక ‘వ్యభిచారిణి’ కాదు… ఎక్కడో ఒక ఇంట్లో తన కూతురు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటుందని నమ్ముతున్న తండ్రి కూతురేమో అనిపించింది.
నా స్నేహితురాలు మాధవి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తుంది. అక్రమ రవాణాకు గురైన మహిళలు, లైంగిక దోపిడీకి గురైన అమ్మాయిల పునరావాసం కోసం వాళ్ళ సంస్థ పనిచేస్తుంది. మరుసటి రోజు ఆమెను కలిసాను.
“నిన్న రాత్రి ఒక పోలీసు దాడి చూసాను.”
“ఎక్కడ?”
“కేపీహెచ్ బీలో.”
ఆమె ముఖంలో పెద్ద ఆశ్చర్యం కనిపించలేదు.
“అక్కడ మాత్రమే కాదు. నగరంలో చాలా ప్రాంతాల్లో, అనేక నగరాల్లో, పల్లెల్లో, దేశమంతా జరుగుతూనే ఉన్నాయి.”
“వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా?”
మాధవి నా వైపు చూసింది. మనకు చట్టం గురించి ఉన్న అతి పెద్ద అపోహల్లో అదొకటని చెప్పింది. వయోజనురాలైన మహిళ తన ఇష్టంతో ఈ వర్క్ చేస్తుంటే, కేవలం ఆ కారణంతోనే ఆమెను నేరస్థురాలిగా చూడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెప్పింది. స్వచ్ఛందంగా ఆ వృత్తిలో ఉన్న వయోజన మహిళను కేవలం సె- వర్కర్ అనే కారణంతో వేధించకూడదని వివరించింది.
“మరి పోలీసులు దాడులు ఎందుకు చేస్తున్నారు?”
“ఎందుకంటే కథ అక్కడితో అయిపోదు.”
ఆ తర్వాత మాధవి వివరించిన విషయాలు విన్నాక నాకు సమస్యలోని మరో కోణం అర్థమైంది. ఒక వయోజన మహిళ స్వచ్ఛందంగా ఈ వర్క్ చేయడం ఒక విషయం. వ్యభిచార గృహాన్ని నిర్వహించడం మరో విషయం. మహిళలను మోసం చేసి తీసుకొచ్చి ఈ పనిలోకి దించడం, వారి సంపాదన మీద బతకడం, బలవంతంగా నిర్బంధించడం, అక్రమ రవాణా చేయడం, మైనర్లను ఇందులోకి తీసుకురావడం మరింత తీవ్రమైన నేరాలు. అంటే ఒకే హోటల్ గదిలో దొరికిన ఐదుగురు మహిళల వెనుక ఐదు రకాల కథలు ఉండవచ్చు. అందరినీ ఒకే ముద్ర వేసి చూడటం ఎంత సులభమో, ఒక్కొక్కరి కథ తెలుసుకోవడం అంత కష్టం.
కొన్ని రోజుల తర్వాత మాధవితో కలిసి వారి సంస్థ నిర్వహించే కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్ళాను. అక్కడే నేను మొదటిసారి దీప్తిని చూసాను. ఇరవై ఆరేళ్ళుంటాయి. జీన్స్, కుర్తా వేసుకుని ఉంది. చూస్తే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయిలాగే ఉంది. నిజంగానే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.
“నెలకు ముప్పై రెండు వేలు వస్తాయి సార్!”
నేను ఆశ్చర్యంగా చూసాను. ఉద్యోగం ఉన్న అమ్మాయి ఇక్కడ ఎందుకు? ఆ ప్రశ్న నా ముఖంలోనే కనిపించి ఉండాలి.
“ముప్పై రెండు వేలకు హైదరాబాద్‌లో నేను ఊహించుకున్న జీవితం రాలేదు సార్!”
ఆ ఒక్క వాక్యం వెనుక నాకు ఒక తరం కనిపించింది. మొదట హాస్టల్. తరువాత స్నేహితులతో అద్దె ఫ్లాట్. ఖరీదైన ఫోన్ వాయిదాలు. క్రెడిట్ కార్డు. వారాంతపు పార్టీలు. సామాజిక మాధ్యమాల్లో ఇతరులు చూపిస్తున్న జీవితాన్ని తానూ జీవించాలనే కోరిక. జీతం పెరగలేదు. ఖర్చులు మాత్రం పెరిగాయి. మొదట అప్పు చేసింది. తర్వాత మరో అప్పుతో మొదటి అప్పు తీర్చింది. ఒక రోజు స్నేహితురాలు ఒక ఫోన్ నంబరు ఇచ్చింది. రెండు గంటలకు పది వేలు వస్తాయని చెప్పింది. మొదట అసహ్యంగా అనిపించిందట. తర్వాత తన క్రెడిట్ కార్డు బిల్లు చూసిందట.
“మొదటిసారి వెళ్ళినప్పుడు రాత్రంతా ఏడ్చాను సార్!”
“మరి రెండోసారి?”
దీప్తి నవ్వింది. ఆ నవ్వులో ఆనందం లేదు.
“రెండోసారి అంతగా ఏడుపు రాలేదు. మూడోసారి అసలు ఏడవలేదు. అదే నాకు భయం వేసింది.”
నాకు సమాధానం దొరకలేదు. మనిషి తప్పు చేయడం కన్నా, తాను చేస్తున్నది తనకు తప్పుగా అనిపించడం మానేయడం మరింత ప్రమాదకరమేమో అనిపించింది. అయితే ఆమెను చూసి జాలి పడటమో, పూర్తిగా సమర్థించడమో కూడా నాకు సాధ్యం కాలేదు. ఆకలి వల్ల తీసుకున్న నిర్ణయానికీ, తన ఆదాయానికి మించిన జీవితం కోసం తీసుకున్న నిర్ణయానికీ తేడా ఉండాలి. ప్రతి తప్పునూ పరిస్థితుల ఖాతాలో వేసేస్తే వ్యక్తిగత బాధ్యత అనే మాటకు అర్థమే ఉండదు.
అక్కడే మరో మహిళను చూసాను. ఆమె పేరు రేణుక. ఒక జిల్లాలోని చిన్న గ్రామం నుంచి వస్తుంది. భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలు. అత్తమామలకు ఆమె హైదరాబాద్‌లో ఇళ్ళల్లో వంట చేస్తుందని తెలుసు. నెలలో రెండు మూడు రోజులు మాత్రమే నగరానికి వస్తుంది.
“ఒక్క రాత్రికి వచ్చే డబ్బు కోసం నెలంతా పొలంలో పని చేయాలి సార్!”
ఆ మాటను నేను సమర్థించలేకపోయాను. ఖండించలేకపోయాను.
“ఇంకో పని చేసుకోవచ్చుగా?”
“చేసాను సార్! పత్తి ఏరాను. మిరపకాయలు కోసాను. ఇళ్ళల్లో అంట్లు తోమాను. హోటల్లో పాత్రలు కడిగాను. నా కొడుకు ఇంజనీరింగ్ ఫీజు మాత్రం వాటితో కట్టలేకపోయాను.”
“మీ అబ్బాయికి తెలుసా?”
ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
“తెలిస్తే నేను బతకను సార్!”
ఆ మాట విన్న తర్వాత నేను ఇంకేమీ అడగలేకపోయాను. ఆమె శరీరాన్ని అమ్ముకుంటుంది. కానీ కొడుకు మనసులో ఉన్న ‘అమ్మ’ను మాత్రం అమ్మకానికి పెట్టలేదు. అతని దృష్టిలో ఆమె ఇప్పటికీ తన చదువు కోసం కష్టపడుతున్న అమ్మే. ఆ భ్రమను కాపాడుకోవడమే ఆమెకు మిగిలిన ఆస్తేమో అనిపించింది.
మూడో కథ మరింత భయంకరంగా అనిపించింది. సంధ్యను స్వయంగా ఆమె భర్తే తీసుకొచ్చి హోటల్ దగ్గర దింపుతాడట. మొదట నేను నమ్మలేదు. భర్త చిన్న వ్యాపారం చేసి నష్టపోయాడు. అప్పులు పెరిగాయి. మద్యం అలవాటైంది. ఒకరోజు అతనే ఈ మార్గం సూచించాడు. ఆమె ఒప్పుకోలేదు. కొట్టాడు. తర్వాత పిల్లలను చూపించి భయపెట్టాడు. కొంతకాలానికి కొట్టాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అప్పులు ఆమెను కొట్టడం మొదలుపెట్టాయి.
“ఇప్పుడు మీ ఇష్టంతోనే వస్తున్నారా?” మాధవి అడిగింది.
సంధ్య చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా తలెత్తింది.
“ఇష్టం అంటే ఏమిటి మేడమ్?”
గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
“నా ముందు రెండు దారులు పెట్టి, రెండింటిలో ఒకటి ఎంచుకోమంటే అది నా ఇష్టం. ఒక్క దారే పెట్టి ‘నువ్వే ఎంచుకున్నావు’ అంటే… అది కూడా నా ఇష్టమేనా మేడమ్?”
ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. చట్టంలోని ‘సమ్మతి’ అనే పదానికి కూడా ఒక్కోసారి జీవితంలోని సంక్లిష్టతలు సవాలు విసురుతాయేమో అనిపించింది. ఒక మనిషి తనంతట తాను తీసుకున్న నిర్ణయానికీ, పరిస్థితులు గొంతు మీద కత్తి పెట్టి తీసుకునేలా చేసిన నిర్ణయానికీ మధ్య చాలా పెద్ద దూరం ఉంటుంది.
అప్పుడే నాకు మరో విషయం అర్థమైంది. చట్టానికి వయసు కనిపిస్తుంది. సమ్మతి కనిపిస్తుంది. నేరం కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఆ సమ్మతి వెనుక ఉన్న ఆకలి కనిపించకపోవచ్చు. అప్పు కనిపించకపోవచ్చు. భర్త బెదిరింపు కనిపించకపోవచ్చు. పిల్లల స్కూల్ ఫీజు కనిపించకపోవచ్చు. మరోవైపు అవసరం పేరుతో పెరిగిన విలాసపు కోరికలు కూడా కనిపించకపోవచ్చు. అందుకే ఒకే వృత్తిలో ఉన్న ప్రతి మహిళనూ ఒకే కొలమానంతో కొలవడం తప్పనిపించింది.
ఆ కేసుల గురించి తెలిసిన ఒక పోలీసు అధికారితో మాట్లాడే అవకాశం వచ్చింది.
“సార్! ఒక సందేహం. స్వచ్ఛందంగా ఈ వర్క్ చేస్తున్న వయోజన మహిళను కేవలం ఆ కారణంతో నేరస్థురాలిగా చూడకూడదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఈ దాడులేమిటి?”
ఆయన కాసేపు ఆలోచించారు.
“మేము గదిలో ఇద్దరు మనుషులు ఉన్నారని తలుపులు పగలగొట్టడానికి తిరగం. ఒక ముఠా మహిళలను సరఫరా చేస్తుందని, ఒక ప్రదేశాన్ని వ్యభిచార గృహంగా నడుపుతున్నారని, ఎవరినైనా బలవంతంగా ఉంచారని, అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం వస్తే విచారణ చేయాల్సిందే.”
“కానీ వార్తల్లో మాత్రం అమ్మాయిలే కనిపిస్తారు.”
ఆయన ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు.
“అదే సమస్య.”
- ఆ రెండు మాటలు నాకు చాలా పెద్ద సమాధానంలా అనిపించాయి. దళారి కనిపించడు. గది ఏర్పాటు చేసినవాడు కనిపించడు. వెనుక నుంచి వ్యవస్థను నడిపినవాడు కనిపించడు. డబ్బులు తీసుకున్న మధ్యవర్తి కనిపించడు. విటుడు కూడా చాలాసార్లు కెమెరాకు కనిపించడు. కానీ ముఖానికి చున్నీ అడ్డం పెట్టుకుని పోలీసు వాహనంలోకి ఎక్కుతున్న మహిళ మాత్రం వీడియోలో కనిపిస్తుంది. మరుసటి రోజు సామాజిక మాధ్యమాల్లో తిరిగేది కూడా ఆమె ముఖమే. నేర వ్యవస్థలో చివరి మెట్టున ఉన్న మనిషి మీదే సమాజం మొదటి రాయి విసురుతుంది.
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దీప్తి గుర్తొచ్చింది. ఆమె పేదది కాదు. ఆమె ఆకలితో లేదు. ఆమెను ఎవరూ బలవంతంగా తీసుకురాలేదు. ఆమె విషయంలో మనం ఎవరిని నిందించాలి? సమాజాన్నా? ఆధునిక వినియోగ సంస్కృతినా? ఆమె నిర్ణయాన్నా? లేక అవసరానికీ విలాసానికీ మధ్య గీతను చెరిపేసుకున్న ఆమెనేనా?
రేణుక గుర్తొచ్చింది. కొడుకు ఇంజనీరింగ్ చదవడానికి తనకు తెలిసిన అత్యంత భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్న తల్లి. ఆమెను ఏ పేరుతో పిలవాలి?
సంధ్య గుర్తొచ్చింది. “ఒక్క దారే పెట్టి ఎంచుకోమంటే అది నా ఇష్టమేనా?” అన్న ఆమె ప్రశ్న గుర్తొచ్చింది. వాళ్ళ ముగ్గురూ ఒకే వృత్తిలో ఉన్నారు. కానీ వాళ్ళ ముగ్గురూ ఒకే కథలో లేరు.
మూడు నెలల తర్వాత మాధవి ఫోన్ చేసి ఒకసారి కౌన్సెలింగ్ కేంద్రానికి రమ్మంది. వెళ్ళాను. అక్కడ ఒక మహిళ కంప్యూటర్ ముందు కూర్చుని ఖాతాలు నమోదు చేస్తుంది. దగ్గరకు వెళ్ళాక గుర్తుపట్టాను. సంధ్య. మాధవి వాళ్ళ సంస్థ ద్వారా ఆమెకు ఒక చిన్న సంస్థలో అకౌంట్స్ ఉద్యోగం ఇప్పించింది. భర్త నుంచి ఎదురైన హింస, బలవంతపు దోపిడీ విషయంలో న్యాయ సహాయం కూడా అందిస్తున్నారు. నన్ను చూసి సంధ్య నవ్వింది. ఈసారి ఆ నవ్వులో భయం లేదు.
“జీతం ఎంత?”
“పద్దెనిమిది వేలు.”
ఆమె గతంలో ఒక్క రాత్రిలో అంతకంటే ఎక్కువ సంపాదించిన సందర్భాలున్నాయని నాకు తెలుసు.
“సరిపోతుందా?”
“సరిపోదు సార్!”
నేను ఆశ్చర్యంగా చూసాను. ఆమె నవ్వింది.
“కానీ రాత్రి నిద్ర సరిపోతుంది.”
నా గొంతులో ఏదో అడ్డం పడింది. డబ్బుతో కొనలేని వస్తువుల జాబితాలో ప్రశాంతమైన నిద్ర కూడా ఉంటుందని అప్పుడే మరోసారి అర్థమైంది.
బయటకు వస్తుంటే మాధవి ఇంకో విషయం చెప్పింది. రేణుక కొడుకుకు ఉద్యోగం వచ్చిందట. అతను మొదటి జీతం తీసుకుని తల్లికి చీర కొనిచ్చాడట.
“ఇక హైదరాబాద్ వెళ్ళి పని చేయకు. నేను చూసుకుంటాను అమ్మా!” అన్నాడట.
రేణుక నిజంగానే హైదరాబాద్ రావడం మానేసిందట.
“దీప్తి?”
అడిగాను. మాధవి ముఖంలో చిన్న నిరాశ కనిపించింది.
“ఇంకా వస్తుంది.”
ఆ సమాధానం నాకు నచ్చలేదు. కానీ అదే జీవితం. ప్రతి కథకూ మనకు నచ్చిన ముగింపు ఉండదు. ప్రతి మనిషినీ సమాజం రక్షించలేదు. రక్షించే అవకాశం వచ్చినప్పుడు ఆ మనిషి కూడా చెయ్యి చాపాలి. దీప్తి కథ ఇంకా ముగియలేదు. ఎప్పుడో ఒకరోజు ఆమెకు తన సంపాదనకు తగ్గట్టుగా జీవించడం చిన్నతనం కాదనీ, తన కోరికల కోసం తననే తాను కోల్పోవడం స్వేచ్ఛ కాదనీ అర్థమవుతుందేమో. అది అర్థమయ్యే వరకు ఆమె కథకు ముగింపు రాయడానికి నాకు హక్కు లేదనిపించింది.
కొన్ని రోజుల తర్వాత అదే కేపీహెచ్‌బీ రోడ్డు మీద రాత్రి వెళుతున్నాను. పెద్ద పెద్ద భవనాలు వెలుగుతున్నాయి. రెస్టారెంట్ల ముందు కార్లు ఆగుతున్నాయి. యువత నవ్వుకుంటూ తిరుగుతున్నారు. ఎక్కడో దూరంగా ఒక పోలీసు వాహనం సైరన్ వినిపించింది.
ఈ ప్రాంతం మంచిదా, చెడ్డదా అని ఒక్క క్షణం అనిపించింది. వెంటనే ఆ ప్రశ్నే తప్పని అర్థమైంది. నగరాలకు నీతి ఉండదు. మనుషులకు ఉంటుంది. చట్టం ఒక మనిషి చేసిన పని నేరమా కాదా అని నిర్ణయించగలదు. కానీ ఆ పని వెనుక ఉన్న జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చట్టంలోని సెక్షన్లు మాత్రమే సరిపోవు.
సె- వర్కర్ అంటే తప్పనిసరిగా నేరస్థురాలు కాదు. అలాగని ప్రతి ఈ వర్కర్ స్వతంత్రంగా, ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఆ మార్గాన్ని ఎంచుకున్న మహిళ కూడా కాదు. ఆ రెండింటి మధ్య ఆకలి ఉంది, అప్పు ఉంది, దోపిడీ ఉంది, బలవంతం ఉంది, వ్యామోహం ఉంది, తప్పుడు నిర్ణయాలున్నాయి, కొన్నిసార్లు స్వేచ్ఛ కూడా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క శరీరం వెనుక ఒక్కొక్క మనిషి ఉన్నాడు… ఒక్కొక్క జీవితం ఉంది.
ఆ రాత్రి పోలీసు వాహనంలోకి ఎక్కుతూ ఏడ్చిన అమ్మాయి మాట మళ్ళీ గుర్తొచ్చింది.
“మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
ఆమె చేసిన పని గురించి తీర్పు చెప్పడానికి సమాజానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి మాత్రం ఎవరికీ సమయం ఉండదు. నేను కారు ముందుకు పోనిచ్చాను. వెనుక అద్దంలో కేపీహెచ్‌బీ వెలుగులు చిన్నవవుతున్నాయి.
కొన్ని చీకట్లను పోలీసులు దాడులు చేసి తొలగించగలరు. కొన్ని చీకట్లను చట్టాలు తొలగించగలవు. కానీ ఆకలి, దోపిడీ, బలవంతం, అజ్ఞానం, అదుపులేని కోరికలు సృష్టించే చీకట్లను తొలగించాలంటే మనిషిని నేరస్థుడిగా చూసే ముందు మనిషిగా చూడడం నేర్చుకోవాలి.
ఎందుకంటే, బలిపీఠం మీద ఉన్నది ఆమె, శరీరం మాత్రమే కాదు… ఆమె ఆత్మ కూడా…. రచన: డాక్టర్ ప్రభాకర్ జైనీ
Share this Article