.
ఒక ఐ… ఒక స్పైడర్… ఒక టాక్సిక్… మస్తు హైప్… డిఫరెంటు స్టోరీ అనే ప్రచారం… అదే దిశలో ట్రెయిలర్లు… కానీ ట్రైలర్‌లో కనిపించిన హీరో… సినిమాలో కనిపించలేదు! సో, ఆ రెండు సినిమాల్లాగే ఇదీ ఢామ్మని పేలిపోయింది!
సరిగ్గా పదకొండేళ్ల క్రితం… 2015 జనవరి 14. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఐ సినిమా. ఆ సినిమాకు థియేటర్‌కి వెళ్లడానికి ఒక పెద్ద కారణం విక్రమ్ కాదు… శంకర్ కాదు… ట్రైలర్‌లో కాసేపు కనిపించిన ఆ బీస్ట్ గెటప్. ఆ గెటప్ చూసి థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడికి సినిమా ఏం చూపించింది అనేది తెలిసిందే. ఉసూరుమన్నాడు ప్రేక్షకుడు…
Ads
మళ్లీ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం… 2017 సెప్టెంబర్ 27. మురుగదాస్–మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్. ఆసక్తికి మహేష్‌బాబు ఒక కారణం. కానీ ట్రైలర్‌లో మహేష్ భుజం మీద కూర్చుని అరుస్తున్న ఆ రోబో స్పైడర్ మరో పెద్ద కారణం.

మహేష్ “ష్…” అని సైగ చేస్తుంటే… మన బుర్రలో మాత్రం ఇంకేదో సినిమా నడిచింది. థియేటర్‌లోకి వెళ్లాక ఆ ఊహలన్నీ ఒక్కొక్కటిగా చచ్చిపోయాయి.
ఇప్పుడు… 2026 ఆగస్టు 26. గీతూ మోహన్‌దాస్–యాష్ కాంబినేషన్‌లో టాక్సిక్. ఈసారి ట్రైలర్ మరీ ఇంకో లెవెల్‌లో హైప్ చేసింది. స్మశానం దగ్గర బాంబు పేలే సీన్. కార్లు. గన్స్. వింత గెటప్స్. వింత ప్రపంచం. అన్నింటికంటే ముఖ్యంగా… రాయా.
అతడిని ట్రైలర్ పరిచయం చేసిన విధానం చూస్తే… ఎవరికీ భయపడడు. ఎవరినీ లెక్క చేయడు. దేనికీ లొంగడు. ఎవరితోనూ అనుబంధాలు పెట్టుకోడు. తనకు నచ్చినట్టు బతుకుతాడు.
అంటే… “నేను ఇలా ఎందుకు బతుకుతున్నాను?” అని అడగడానికి కూడా ఎదుటివాడికి ధైర్యం రాకూడదు. అలాంటి వాడిని చూపించబోతున్నారని అనుకున్నాం. KGFలో రాకీ భాయ్‌ని చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్‌కి దగ్గరగా ఏదో ఉంటుందని అనుకున్నాం.
కానీ…
టాక్సిక్‌లో సమస్య యాక్షన్ సీన్లు కాదు.
యాష్ కాదు.
టెక్నికల్ క్వాలిటీ కాదు.
అసలు సమస్య రాయా అనే క్యారెక్టరే.
ట్రైలర్ మనకు ఒక డేర్‌డెవిల్‌ను అమ్మింది. సినిమా మాత్రం వేరే రాయాను ఇచ్చింది. ఇదే ఈ సినిమాతో వచ్చిన పెద్ద డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే ఒక మనిషి పబ్లిగ్గా ఎవరికీ భయపడకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా, తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడంటే… ఆ జీవితానికి అతను ఏదో ఒక విధంగా అర్హత సంపాదించి ఉండాలి.
మంచి పని చేసి కావచ్చు. చెడ్డ పని చేసి కావచ్చు. కానీ తన ప్రపంచంలో తాను ఏదో ఒకటి సాధించి ఉండాలి. కేవలం నలుగురిని గన్నుతో కాల్చగలిగితే సరిపోతుందా? అయితే విలన్ కూడా హీరో అయిపోతాడు. హీరోకూ విలన్‌కూ తేడా అక్కడే ఉంటుంది.
తనంతట తాను నిర్ణయం తీసుకోవడం.
తన నిర్ణయానికి తానే బాధ్యత వహించడం.
తనను నమ్మిన వాళ్ల కోసం ఎవరి పర్మిషన్ తీసుకోకుండా ముందుకు వెళ్లడం.
KGFలో రాకీ భాయ్‌కి ఆ లక్షణం ఉంది. ఒక దశలో తనకు వచ్చిన పని, తన ప్రయోజనం అన్నీ పక్కన పెట్టి సుత్తి పట్టుకుని బయల్దేరతాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది తనకు నచ్చలేదు. ఎవరైనా వచ్చి “వెళ్లి చేయి” అని చెప్పలేదు. అతనికి నచ్చింది. అతను చేశాడు.

యానిమల్ మూవీలో కూడా రణబీర్ క్యారెక్టర్ తనకు నచ్చినది చేయడానికి ఎవరి పర్మిషన్ తీసుకోడు. పుష్పలో పుష్పరాజ్ కూడా అదే. తనను నమ్మిన అమ్మాయి ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు ఎవరి దగ్గరికీ వెళ్లి “నేను వెళ్లొచ్చా?” అని అడగడు. హెలికాప్టర్ వేసుకుని వెళ్లిపోతాడు.
ఇదే హీరోయిజం. హీరో అంటే… సిక్స్‌ప్యాక్ ఉండాలి. నలుగురిని ఒక్క దెబ్బకు కొట్టాలి. గన్ పట్టుకోవాలి. కసక్ కసక్ ఢాం ఢాం పేలుళ్లు, నరుకుళ్లు, నెత్తుటి ధారలు, మాంసం ముక్కల… ఐదుగురు అందగత్తెలు చుట్టూ ఉండాలి. కెమెరా తిరుగుతుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ రావాలి. ఇవన్నీ ఉన్నా సరే…
ఒక నిర్ణయం తనంతట తాను తీసుకోలేకపోతే వాడు హీరో కాదు. టాక్సిక్‌లో మిస్ అయినది ఇదే. సినిమాలో స్టైల్ ఉంది. యష్ ఫిజిక్ ఉంది. యాక్షన్ ఉంది. గ్రాండియర్ ఉంది. ప్రొడక్షన్ డిజైన్ ఉంది. ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. ఎక్కడా రాజీపడని టెక్నికల్ క్వాలిటీ ఉంది. యాష్‌తో పాటు మిగతా నటీనటుల నటన గురించి పెద్దగా తప్పుపట్టడానికి కూడా ఏమీ లేదు.
వాళ్లు తమ పని చేశారు. కానీ… మనకు ట్రైలర్ చూపించిన రాయా ఎక్కడ? అదే ప్రశ్న. అందుకే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ అసంతృప్తి. ఇది కొత్త సమస్య కాదు. ఐలో బీస్ట్ గెటప్. స్పైడర్లో రోబో స్పైడర్. టాక్సిక్లో రాయా. మూడు సినిమాల్లోనూ ట్రైలర్ ప్రేక్షకుడి ఊహకు ఒక సినిమా చూపించింది. థియేటర్‌లో అసలు సినిమా మరోటి చూపించింది.

అందుకే ట్రైలర్ అనేది చిన్న విషయం కాదు. అది ప్రేక్షకుడితో చేసుకున్న మొదటి ఒప్పందం. “ఇదిగో… ఈ సినిమా చూడటానికి నువ్వు వస్తావు” అని చెప్పేది ట్రైలర్. ఆ మాట నిలబెట్టుకోలేకపోతే… ఎంత గొప్ప కెమెరా ఉన్నా, ఎంత గొప్ప యాక్షన్ ఉన్నా, ఎంత భారీ సెట్ ఉన్నా, ఎంత గొప్ప నటుడు ఉన్నా… ప్రేక్షకుడు బయటికి వచ్చి “బాగానే ఉంది… కానీ…” అంటాడు. నసుగుతాడు…
సినిమాలకు అంతకంటే ప్రమాదకరమైన మాట ఇంకొకటి ఉండదు. ఇంకో చిన్న విషయం. సినిమా నిడివి. కొన్ని సీన్లలో స్లో మోషన్, స్టైలైజేషన్ తగ్గించి ఉంటే ఈ మూడు గంటల పదిహేను నిమిషాల ప్రయాణం కనీసం ముప్పావు గంట తగ్గేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సీన్ ఎంత స్టైలిష్‌గా ఉన్నా… ఒకే ఫీలింగ్‌ని మళ్లీ మళ్లీ చూపిస్తే ప్రేక్షకుడికి అది స్టైల్ కాదు. స్లోడౌన్.
అయితే టాక్సిక్‌లో ఆసక్తికరంగా అనిపించిన మరో విషయం ఉంది. ఇది KGFతో పోల్చకుండా చూడాలని ప్రయత్నించినా కొన్ని పోలికలు మనల్ని వదలవు. అక్కడ బంగారం. ఇక్కడ కాసినో డబ్బు. అక్కడ ఎల్ డొరాడో బుక్. ఇక్కడ గోవా, సాల్వడార్. అక్కడ రాకీ భాయ్ ఎదుగుదలకు ఒక క్రిమినల్ సామ్రాజ్యం. ఇక్కడ రాయా చుట్టూ మరో క్రిమినల్ సామ్రాజ్యం.
కాలపరిమితులు కూడా దగ్గరగా ఉంటాయి. టాక్సిక్ ప్రపంచం 1940ల నుంచి 1970ల వరకు సాగితే, KGFలో రాకీ ప్రస్థానం 1970ల మధ్యలో మొదలవుతుంది. అంటే… జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే టాక్సిక్‌ను KGFకు ముందు జరిగే కథగా కూడా ఊహించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అది పక్కన పెడదాం.
ఎందుకంటే టాక్సిక్‌ను KGFతో పోల్చడం కంటే… టాక్సిక్‌ను టాక్సిక్‌గానే చూడటం మంచిది. అలా చూసినప్పుడు ఈ సినిమా ఒక పెద్ద విషయంలో గెలిచింది. భారీగా కనిపించడంలో. కానీ ఓడిపోయింది ఇంకో పెద్ద విషయంలో. భారీగా అనిపించడంలో. మిరపకాయ బజ్జీ అంటే కారం ఉండాలి. అది నోట్లో పెట్టుకున్న వెంటనే “అమ్మో!” అనిపించాలి. నషాళానికి అంటాలి… తీరా ఏదో చప్పటి బజ్జీ చేతికిస్తే… అదే టాక్సిక్…
అందుకే అది టాక్సిక్… కాదు, టార్చర్… ఏదీ సరిగ్గా తీయలేక రోత, బోల్డ్ సీన్లు, ఆరబోతలు… అవేనా యశ్ కీర్తికిరీటాలు… జాలేసింది యశ్‌ను చూస్తే..!!
Share this Article