Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తొలి వికెట్ – ఐనా బ్లాంక్ ఫేస్! సారాంశ్ జైన్‌ ఎందుకంత ఉద్వేగరహితుడు ?

August 27, 2026 by M S R

.

ఐసీసీ క్రికెట్‌లో తొలి వికెట్… కానీ అతని మొహంలో మాత్రం ఆనందం, ఉత్సాహం వంటి ఎలాంటి ఫీలింగ్ లేదు! ఎవరు తను..? ఎందుకింత నిర్లిప్తత? అంత ఉద్వేగరహితంగా ఎలా ఉండగలుగుతున్నాడు..? 

సాధారణంగా క్రికెట్‌లో తొలి టెస్ట్ వికెట్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్షణం. బౌలర్ పరుగెత్తుకుంటూ వస్తాడు… చేతులు పైకెత్తుతాడు… తోటి ఆటగాళ్లు చుట్టుముడతారు… ఎవరో హగ్ చేసుకుంటారు… కెమెరాలన్నీ ఆ ఆటగాడి మొహం మీదే ఉంటాయి. ఆ క్షణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది.

Ads

కానీ కొలంబోలో సారాంశ్ జైన్ తొలి టెస్ట్ వికెట్ తీసుకున్న దృశ్యం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. లహిరు కుమార బంతిని ఆఫ్‌సైడ్‌కు ఆడబోయాడు. ఎడ్జ్ తీసుకుంది. బంతి కవర్ల వైపు గాల్లోకి లేచింది. ధ్రువ్ జురెల్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు.

వికెట్ పడింది. అంతే… సారాంశ్ మొహంలో వీసమెత్తు భావోద్వేగం కూడా లేదు! చూస్తున్నది బంతినే. క్యాచ్ పూర్తయిన తర్వాత కూడా అదే ప్రశాంతమైన, నిర్వికారంగా, నిర్లిప్తంగా ముఖం. పెద్దగా అరుపు లేదు. చేతులు పైకెత్తడం లేదు. ఎలాంటి ఎగిరింత లేదు. పక్కనున్న వాళ్లతో హడావుడి లేదు.

ఏదో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక సాధారణ బంతిని ఆపినట్టే! చివరికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ దగ్గరకు వచ్చి అతడిని అభినందించాల్సి వచ్చింది.

33 ఏళ్ల వయసులో తన తొలి టెస్ట్ వికెట్… అదీ జీవితంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన వికెట్. అయినా ఆ మొహంలో ఇంత నిర్లిప్తత ఎలా సాధ్యమైంది?

బహుశా సారాంశ్ జైన్ జీవితంలో ‘ఇప్పుడే సాధించాను’ అనే భావన కంటే… ‘ఇంకా చేయాల్సింది ఉంది’ అనే భావనే ఎక్కువగా ఉండొచ్చు. ఎట్ లాస్ట్, వరల్డ్ క్రికెట్ నా పేరూ లిఖించుకున్నాను ఇప్పటికైనా అనే భావన ప్రబలంగా ఉండటం వల్ల కూడా కావచ్చు.

ఎందుకంటే భారత టెస్ట్ జట్టులోకి రావడానికి అతడు ఒకటి రెండు సీజన్లు ఎదురుచూడలేదు. పన్నెండేళ్లు ఎదురుచూశాడు.

ఇండోర్‌కు చెందిన సారాంశ్ జైన్ 1993 మార్చి 31న జన్మించాడు. కుడిచేతి ఆఫ్‌స్పిన్నర్. ఎడమచేతి బ్యాటర్. తండ్రి సుబోధ్ జైన్ కూడా మధ్యప్రదేశ్ తరఫున రంజీ క్రికెట్ ఆడినవాడే. అంటే క్రికెట్ అతడికి కొత్త ప్రపంచం కాదు. తండ్రే తొలి కోచ్. ఇంటి పైకప్పునే ఒకప్పుడు నెట్‌గా మార్చి కొడుకుతో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు.

అయితే కథ ఇక్కడి నుంచి కాస్త కఠినంగా మారుతుంది. సారాంశ్ అప్పటికే 21 ఏళ్ల కుర్రాడు. ఇండోర్ క్లబ్ జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. క్రికెట్‌లో తన దారి వెతుక్కుంటున్న రోజులు. అదే సమయంలో ఇంట్లో తండ్రి సుబోధ్‌కు నోటి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఆపరేషన్ జరిగింది. చికిత్స జరిగింది. మాట్లాడలేని పరిస్థితి.

కానీ కుటుంబం ఆ విషయాన్ని సారాంశ్‌కు వెంటనే చెప్పలేదు. అతడి క్రికెట్ దృష్టి చెదరకూడదని తల్లి, అన్నయ్య విషయం దాచారు. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత తండ్రి పరిస్థితి చూసి సారాంశ్ కుప్పకూలిపోయాడు. తండ్రి మాట్లాడలేడు. కొడుకును ఓదార్చడానికి నోరు సహకరించదు.

అప్పుడు సుబోధ్ పెన్ను, కాగితం తీసుకున్నాడు. ఒక వాక్యం రాశాడు. “నువ్వు ఎంత బాగా ఆడితే… నేను అంత త్వరగా కోలుకుంటాను.” ఆ చిన్న కాగితం సారాంశ్ జీవితంలో పెద్ద మలుపుగా మారింది.

అతడు క్రికెట్ వదిలేసి తండ్రిని చూసుకోవాలనుకున్న దశ కూడా వచ్చింది. కానీ తండ్రి ఇచ్చిన ఆ మాట అతడిని మళ్లీ మైదానంలోకి పంపింది. ఆ చీటిని సారాంశ్ ఇప్పటికీ తనతో ఉంచుకున్నాడు. ఆ తర్వాత మొదలైంది అసలు పోరాటం.

2014-15లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం. ఆ తర్వాత సీజన్ మీద సీజన్… రంజీ… దులీప్ ట్రోఫీ… ఇండియా-ఏ… పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. ఐపీఎల్‌లో కోట్లు పలికే ఆటగాడిగా మారలేదు. సోషల్ మీడియాలో పెద్ద స్టార్ కాలేదు.

ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2,223 పరుగులు, 188 వికెట్లు. బ్యాటింగ్‌లో రెండు సెంచరీలు, 14 అర్ధసెంచరీలు. 2025-26 దేశవాళీ సీజన్‌లో అతడి ప్రదర్శన ఒక్కసారిగా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ తరఫున ఏడు రంజీ మ్యాచ్‌ల్లో 518 పరుగులు, 30 వికెట్లు. దులీప్ ట్రోఫీలో సిరీస్ ప్లేయర్. ఫైనల్లో 49 పరుగులకు ఐదు వికెట్లు.

శ్రీలంక-ఏతో జరిగిన అనధికారిక టెస్టుల్లోనూ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక వయసు మాత్రం 33. ఈ వయసులో చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ చివరి దశకు చేరుకుంటారు. టెస్టు జట్టులోకి రావడం గురించి ఆలోచించడం కంటే… దేశవాళీ క్రికెట్‌లో ఇంకెంతకాలం ఆడగలమా అని ఆలోచించే వయసు.

కానీ సారాంశ్‌కు మాత్రం ఇంత లేటు వయస్సులో తలుపు తెరుచుకుంది. ఇలా చాలా అరుదు… శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో చోటు. కొలంబోలో తుది జట్టులో అవకాశం. 33 ఏళ్ల వయసులో టెస్ట్ అరంగేట్రం.

1998లో రాబిన్ సింగ్ తర్వాత ఇంత ఆలస్యంగా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. భారత పురుషుల టెస్టు చరిత్రలో 320వ ఆటగాడిగానూ అతడి పేరు నమోదైంది. టెస్ట్ క్యాప్‌ను రవీంద్ర జడేజా చేతుల మీదుగా అందుకున్నప్పుడు మాత్రం సారాంశ్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

అది ఎందుకో కూడా అర్థమవుతుంది. అది అతడి ఒక్కరి విజయం కాదు. తన కొడుకు భారత్ తరఫున ఆడాలన్న కలతో, 2014లో క్యాన్సర్‌తో పోరాడిన తండ్రి సుబోధ్ జైన్ కల కూడా. “నేను క్యాన్సర్‌తో పోరాడింది నా కొడుకు భారత్ తరఫున ఆడటం చూడటానికే” అని సుబోధ్ చెప్పాడు. కొడుకు టెస్ట్ క్యాప్ అందుకున్న రోజు తనకు కొత్త జీవితం వచ్చినట్టుగా అనిపించిందని అన్నాడు. అందుకే క్యాప్ తీసుకున్నప్పుడు తండ్రి గుర్తొచ్చి కాస్త ఉద్వేగపడ్డాడేమో… అంతే…

సారాంశ్

మరి అలాంటి మనిషి తొలి టెస్ట్ వికెట్ తీసుకున్నప్పుడు ఎందుకు అంతగా స్పందించలేదు? అది బహుశా మనం బయట నుంచి చూస్తున్నంత సింపుల్ విషయం కాకపోవచ్చు. సారాంశ్‌కు వికెట్ అనేది సంబరపడాల్సిన కొత్త అనుభవం కాదు. పన్నెండేళ్లుగా రంజీ మైదానాల్లో అదే పని చేస్తున్నాడు.

వందలాది బ్యాటర్లను ఔట్ చేశాడు. ఎన్నోసార్లు మంచి ప్రదర్శన చేశాడు. ఎన్నోసార్లు సెలెక్టర్ల కోసం ఎదురుచూశాడు. ఎన్నోసార్లు దేశం కోసం ఆడే అవకాశం వస్తుందేమో అనుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ అవకాశం వచ్చినా… తన పని తాను చేసుకున్నట్టే చేస్తున్నాడు.

అందుకే కావచ్చు ఆ మొహంలో అంత ప్రశాంతత. లేదంటే… జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు చూసిన తర్వాత ఒక క్రికెట్ వికెట్ పెద్ద భావోద్వేగంగా అనిపించకపోవచ్చు. తండ్రి క్యాన్సర్‌ను చూశాడు. క్రికెట్ వదిలేయాలనుకున్న దశను చూశాడు. పన్నెండేళ్ల నిరీక్షణను చూశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలబడటానికి చేసిన పోరాటాన్ని చూశాడు. 33 ఏళ్ల వయసులో టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.

ఇక తొలి వికెట్ పడినప్పుడు? “అది కూడా నా పనిలో ఒక భాగమే” అన్నట్టుగా నిర్వికారంగా నిలబడ్డాడు. అందుకే సారాంశ్ జైన్ తొలి వికెట్‌లో మనకు కనిపించింది కేవలం ఒక బౌలర్ వికెట్ కాదు. ఆవేశాన్ని మించి అనుభవం నిలిచిన ఒక ముఖం.

విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోయినంతగా ఓటములను, నిరీక్షణను, పోరాటాన్ని చూసిన ఒక క్రికెటర్ ముఖం. కొలంబోలో అతడు తీసిన తొలి టెస్ట్ వికెట్‌ను చూసి తోటి ఆటగాళ్లు అభినందించారు. కెమెరాలు ఆ క్షణాన్ని రికార్డు చేశాయి. క్రికెట్ గణాంకాల్లో మరో వికెట్ చేరింది. కానీ ఆ స్టోన్‌ఫేస్ మాత్రం సారాంశ్ జైన్ కథ మొత్తాన్ని చెప్పేసింది.

కొన్ని విజయాలు వచ్చినప్పుడు మనిషి ఎగిరి గంతేయడు…
ఎందుకంటే ఆ విజయానికి చేరుకునేలోపు అతడు లోపల ఎన్నోసార్లు ఏడ్చి ఉంటాడు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్లాన్-ఏ అయిపోయిందట – ప్లాన్-బీ ఉందట – ఐతే ఇదంతా పెద్ద ప్లానే !!
  • తొలి వికెట్ – ఐనా బ్లాంక్ ఫేస్! సారాంశ్ జైన్‌ ఎందుకంత ఉద్వేగరహితుడు ?
  • నో, నో – ఆ కోర్టు ఆర్డర్లు టాక్సిక్ రివ్యూలను అడ్డుకోలేవు… ఇదీ క్లారిటీ !!
  • ఆ పాటలోని తాత్వికత, వైరాగ్యం… సినారె, వేటూరి పట్టుకోగలిగారా ?!
  • డెడ్లీ కాంబో ! *ఆపరేషన్ గ్రేటర్ బంగ్లాదేశ్* కుట్ర విచ్ఛిన్నం !!
  • Nakshatra – ఈ మణెమ్మను అలా స్వచ్ఛంగా ఉండనివ్వండర్రా…
  • అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!
  • వెకిలి రాఖీ యాడ్‌ను నగల కంపెనీ తీసేసింది ! ఎవరి పరువు పోయింది ?!
  • మతం మా విశ్వాసం – ఓనం మా సంస్కృతి – కేరళ కొత్త తరం అభిమతం !!
  • ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions