.
తెలుగులో మంచి సినిమా పాటలు లేవా? ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ప్రయోగాలు కూడా ఉన్నాయి. కానీ…
“గుద్దుతా నీయవ్వ గుద్దుతా”, “గుగ్గు గుడిసుంది”, “లే లే లేలేలే నా రాజా”, “అబ్బనీ తీయని దెబ్బ” లాంటి కమర్షియల్ చెత్త వెగటు పాటల గోలలో, మంచి పాటలు చాలా మరుగున పడిపోయాయి.
Ads
పాట అంటే హీరో, హీరోయిన్ చుట్టూ తిరగాలి…
రెండు చరణాల మధ్య నాలుగు స్టెప్పులు పడాలి…
ఓ ఐదు పదాలు రైమ్ అవ్వాలి…
మరో ఐదు పదాలు ట్రెండింగ్ కావాలి…
ఇదే పాటకు పరమార్థం కాదు. ఒకప్పుడు సినిమా పాట కథలో ఒక పాత్రగా ఉండేది. పాత్ర మనసులో ఏముందో చెప్పేది. పాత్ర చెప్పుకోలేని మాటను చెప్పేది. కొన్నిసార్లు కథనే ముందుకు తీసుకెళ్లేది.
బాలచందర్ సినిమాల్లో కావచ్చు… భాగ్యరాజా సినిమాల్లో కావచ్చు… రజినీకాంత్, కమలహాసన్, చిరంజీవి లాంటి స్టార్లు కూడా కేవలం హీరోలుగా కాకుండా నటులుగా, పాత్రల్లోకి, దర్శకుల ఊహల్లోకి ఒద్దికగా ఒదిగిపోయిన రోజుల్లో ఇలాంటి పాటలు వచ్చాయి. చాలా వచ్చాయి.
అలాంటి పాటల్లో ఒకటి… “జూనియర్… జూనియర్… జూనియర్…” ఇది కథ కాదు సినిమాలోని పాట. ఇటీవల రీల్స్, స్క్రోల్స్ చేస్తుంటే ఓ చిన్నపాప ఈ పాట పాడుతుండటం కనిపించింది. అంత చిన్న వయసులో ఆ పాటలోని భావం ఆమెకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. కానీ ఆ పాట మాత్రం మళ్లీ చెవిలో పడింది.
అక్కడి నుంచి వెనక్కి వెళ్లి చూస్తే… అది పాట కాదు. ఓ మనిషి తనతో తాను చేసుకున్న వాదన. ఆత్రేయ రాసిన గీతం. ఒకసారి పాటను చదవండి. అప్పుడు అర్థమవుతుంది… పాట రాయడం వేరు, పాత్ర మనసును పాటగా రాయడం వేరు.
కమల్ హాసన్ ఇందులో వెంట్రిలాక్విస్ట్. తన చేతిలోని బొమ్మ మాట్లాడుతున్నట్టుగా తనలోని మనసును బయటకు తెస్తాడు. కానీ ఇది ప్రేమను ప్రకటించే విజయగీతం కాదు. ఇది ప్రేమను చెప్పుకోలేకపోయిన మనిషి విఫల ప్రయత్నం.
అతనికి జయసుధపై ప్రేమ ఉంది. నేరుగా చెప్పలేడు. చెబితే ఆమె ఎలా స్వీకరిస్తుందో తెలియదు. పైగా ఆమె అప్పటికే జీవితంలో బాధపడిన మనిషి. అలాంటి పరిస్థితిలో… తన ప్రేమను ఆమె మీద రుద్దలేడు. అందుకే బొమ్మను మధ్యలో పెట్టుకున్నాడు. బొమ్మ మాట్లాడుతోంది. కానీ మాటలు అతనివే. బయటికి వస్తున్నది బొమ్మ గొంతు. కానీ బయటపడుతున్నది అతని హృదయం.
“ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు…” మొదటి మాట నుంచే అతను తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. నీ హృదయం ఎక్కడుంది? నువ్వు ఏ వైపు ఉన్నావు? నీకు ఈ ప్రేమ ఎందుకు?
ఇంత తొందర ఎందుకు? ఎందుకంటే అతనికి తెలుసు… తన ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు. తన స్థానం ఏమిటో కూడా అతనికి తెలుసు. అందుకే వెంటనే… “అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు…” ఇది ప్రేమికుడు ప్రేయసిని ఉద్దేశించి చెప్పే మాట కాదు. తనను తానే తక్కువ చేసుకుంటున్న మాట.
“నువ్వెవడివిరా?
నువ్వొక ఆటబొమ్మవి.
ఆమె జీవితంలో నీ స్థానం ఏమిటి?”
అనే ఆత్మన్యూనత. తనను తాను నిందించుకోవడం. తన ప్రేమకు తానే అర్హత లేదని తీర్పు చెప్పుకోవడం. అందుకే… “ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ…”
అక్కడే ఈ పాటలోని అత్యంత అందమైన రూపకం వస్తుంది. గడ్డిపోచ. అది ఎక్కడ పెరుగుతుంది? ఒడ్డున. నీటిలో కాదు. నీటికి దగ్గరగా ఉంటుంది. కానీ నీటిలో భాగం కాదు. అదే అతని పరిస్థితి.
ఆమె జీవితానికి దగ్గరగా ఉన్నాడు. కానీ ఆమె జీవితంలో భాగం కాలేడు. చూడగలడు. ఆశపడగలడు. ప్రేమించగలడు. కానీ… అందుకోగలడా? అక్కడే ఆ గడ్డిపోచ రూపకం అతని మొత్తం జీవితాన్ని పట్టేస్తుంది.
కానీ బొమ్మ అక్కడితో ఆగదు. “ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు… వుందని ఎందుకు ఒప్పుకోరాదు…” ఇప్పుడు స్వరం మారుతుంది.
ఇప్పటివరకు తనను తాను తిడుతున్న మనిషి… ఇప్పుడు తన ఉనికిని సమర్థించుకోవడం మొదలుపెడతాడు. “సరే. నేను గడ్డిపోచనే అనుకుందాం. నేను ఆటబొమ్మనే అనుకుందాం. అయితేనేం?
నాకు హృదయం ఉండకూడదా? నేను ప్రేమించకూడదా?” ఇదే అసలు సంఘర్షణ. తాను ఎవరో అతనికి తెలుసు. కానీ… తాను మనిషినన్న విషయాన్ని మాత్రం అతని మనసు వదులుకోదు.

“రబ్బరు బొమ్మకు రాగం తెలుసు… ఆటబొమ్మకు ఆశలు తెలుసు… ఇద్దరు ఒక్కటీ ఎందుకు కారాదు…” ఇది కేవలం చమత్కారమైన పదప్రయోగం కాదు. ఇది ఆ పాత్ర ఉనికిపై వేసుకున్న ప్రశ్న. రబ్బరు బొమ్మకు రాగం తెలుసు. ఆటబొమ్మకు ఆశలు తెలుసు. అయితే…
నేను కూడా ప్రేమను అనుభవించగలనని ఎందుకు అంగీకరించకూడదు? యాంత్రికంగా కనిపించే మనిషికి భావోద్వేగాలు ఉండవా? సమాజం ఎవరో ఒకరికి ఒక హోదా ఇచ్చిందని… అతని హృదయానికి కూడా అదే హోదా ఉండాలా?
అతను తన ప్రేమకు న్యాయం వెతుక్కుంటున్నాడు. ఆమెను ఒప్పించడానికి ముందు… తనను తానే ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
తర్వాత… “సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా… కోకిల గానం కాకి పాడితే ద్రోహమురా…” ఇక్కడ మళ్లీ ఆత్మన్యూనత. సముద్రం ఉన్నా దాహం తీరదు. నీకు అంతటి కోరిక ఎందుకు? కాకి కోకిలలా పాడితే అది సహజంగా అనిపిస్తుందా?
నీ ప్రేమ కూడా అలాంటిదే కాదా? అర్హత లేని వాడి ప్రేమ. సరిపోని వాడి ఆశ. తనను తాను మరోసారి వెనక్కి లాగుకుంటున్నాడు. కానీ వెంటనే… “తీగకు పందిరి కావలెగానీ… తెలుసా నువ్వే పందిరని…”
ఇక్కడ ఆత్రేయ ఒక్కసారిగా ఆ పాత్ర మనసును తిప్పేస్తాడు. తీగకు పందిరి కావాలి. ఆ తీగకు ఆధారం కావాలి. కానీ…
ఆ ఆధారం తానేనని ఆమెకు ఎలా తెలుస్తుంది? ఇదే అతని విషాదం. తాను ఆమెకు ఉపయోగపడగలనని తెలుసు. ఆమెకు ఒక ఆసరా కావాలని తెలుసు. కానీ… తానే ఆ ఆసరా అని చెప్పుకోలేడు.
“నీటిని చూసి దాహము వేస్తే… తేనె కోసం తేటి వస్తే… పాపం గీపం అనడం ఛాదస్తం…” ఇక్కడ పాట తన అసలు ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. ప్రకృతిలో కోరిక సహజం. దాహం వేస్తే నీరు వెతుక్కుంటాం. తేనె కావాలంటే తేనెటీగ వెళ్తుంది. అయితే ప్రేమ కోరుకోవడమే పాపమా?
మనిషికి ప్రేమ కావాలనుకోవడం నేరమా? అతను తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఒకవైపు “నువ్వెవడివి? నీ స్థాయి ఏమిటి?” అని తిట్టుకుంటున్నాడు. మరోవైపు “నీకూ హృదయం ఉంది కదా!” అని తనను తానే నిలబెడుతున్నాడు. ఇదే ఆ పాటలోని అసలు నాటకం.
పాటలో ఇద్దరు మాట్లాడటం లేదు. ఒకే మనిషిలోని రెండు మనసులు మాట్లాడుతున్నాయి.
అక్కడితో ఆ అంతర్మథనం ముగిసిపోదు. “మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం…” ఎండిపోయిన మోడు కూడా మళ్లీ చిగురించాలని కోరుకుంటుంది. అది తప్పా? మాట్లాడలేని మనసు కూడా ప్రేమను కోరుకుంటే… అది మోసమా? ద్రోహమా?
ఇక్కడ బొమ్మ అతని మనసు. అతను నేరుగా చెప్పలేని మాటను బొమ్మ చెబుతోంది. కానీ వెంటనే… అతనిలోని మరో మనిషి మళ్లీ దాన్ని ఎగతాళి చేస్తాడు.
“చైత్రములోన చినుకు పడాలని కోరేవు… మార్గసిరాన మండుటెండకై చూసేవు… ఉదయం కోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు…” చైత్రంలో వర్షం కావాలంటావు. మార్గశిరంలో ఎండ కోసం చూస్తావు. ఉదయం కోసం పడమర వైపు చూస్తావు.
ఏమిట్రా నీ పిచ్చి? అది స్వీయనింద కాదు మరి ఏమిటి? తన కోరికకు తానే వ్యతిరేకంగా నిలబడటం. తన ఆశను తానే వెక్కిరించుకోవడం.
కానీ… చివరికి మనసు ఓడిపోదు. “ఎండా వాన కలిసొస్తాయి… వెలుగు చీకటి కలిసుంటాయి… జరగని వింతలు ఎన్నో జరిగాయి…” అక్కడే చిన్న ఆశ. ఎండా, వాన కలిసి రావచ్చు. వెలుగు, చీకటి ఒకే ప్రపంచంలో ఉండవచ్చు. ఇప్పటివరకు జరగనివి కూడా ఏదో ఒకరోజు జరగవచ్చు. అయితే ఆమె తన ప్రేమను అంగీకరించకూడదని ఏముంది?
అదే అతని చివరి ఆశ. అది గెలిచిన ప్రేమ కాదు. అది… ఓడిపోవడానికి భయపడుతున్న ప్రేమ.
ఇదంతా ఒక వెంట్రిలాక్విస్ట్ బొమ్మతో మాట్లాడుతున్నట్టుగా చూపించడం అసలు ప్రయోగం. మిమిక్రీలోని ఒక ప్రత్యేకమైన కళను తీసుకొచ్చి… “చూడండి, హీరో వెంట్రిలాక్విజం చేయగలడు” అని చూపించలేదు. ఆ కళను పాత్ర మనస్తత్వానికి వాహకంగా మార్చారు.
బొమ్మ మాట్లాడుతోంది. కానీ అది నిజానికి అతని మనసు. బొమ్మ తన ప్రేమను ప్రకటిస్తోంది. అతను మాత్రం బయట నిలబడి తనను తానే నిందించుకుంటున్నాడు. ఒకే ఫ్రేమ్‌లో… ప్రేమించాలనుకునే మనిషి ఒక వైపు, తాను ప్రేమించడానికి అర్హుడిని కాదనుకునే మనిషి మరో వైపు…. అదే ఈ పాట.
చివర్లో ఎప్పుడో జయసుధకు విషయం అర్థమవుతుంది. బొమ్మ పేరిట నువ్వు మాట్లాడుతున్నావని తెలుసు. అది వెంట్రిలాక్విజం అని కూడా తెలుసు. కానీ నీ మనసును కూడా బొమ్మ మాటల్లో చెబుతావని ఊహించలేదు… అంటుంది…
అక్కడ… బొమ్మ ఓడిపోయింది. వెంట్రిలాక్విజం ఓడిపోయింది. ముసుగు తొలగిపోయింది. మనిషి మాత్రం మిగిలాడు. తన ప్రేమతో. తన భయంతో. తన ఆత్మన్యూనతతో. తన చిన్న ఆశతో.
ఇప్పుడు చెప్పండి… ఇది పాటా? కథలో ఓ పాత్ర తనతో తాను మాట్లాడుకోవడమా? లేక… ఒక మనిషి తన హృదయానికి తానే రాసుకున్న లేఖా? అందుకే పాత పాటలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తే… మనకు కేవలం సంగీతం వినిపించదు.
ఒక కాలం వినిపిస్తుంది. పాటను కథ కోసం రాసిన కాలం. పాత్ర కోసం రాసిన కాలం. పాత్రలోని మనిషి కోసం రాసిన కాలం. ఇప్పుడు పాట అంటే రీల్‌లో రెండు స్టెప్పులు వేయడానికి పనికొచ్చే నాలుగు పదాలు కావచ్చు. అప్పుడు… ఒక పాత్ర చెప్పుకోలేని మాటకు పాట గొంతయ్యేది.
అందుకే ఈ పాట ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా నిలిచింది. ఆ చిన్నపాప ఏదో సింగింగ్ షోలో పాడిన రీల్ చూస్తున్నప్పుడు కూడా… మనకు కొత్త పాట వినిపించలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఓ బొమ్మ గొంతులో దాక్కున్న ఒక మనిషి హృదయం మళ్లీ వినిపించింది.
“ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు…” అది కేవలం ఆ పాత్ర ప్రశ్న కాదు. ప్రేమకు అర్హతల్ని కొలిచే ప్రతి మనిషికీ వేసిన ప్రశ్న.
Share this Article