.
Mohan Goteti … నాగార్జున గారి వ్యక్తిత్వం అదీ!
జర్నలిస్టులుగా చాలా మంది తారలతో మాకు బాగా పరిచయాలు వుంటాయి కాబట్టి..
పైగా ఆయా సినిమాల షూటింగులు ఎక్కువగా కవర్ చేస్తూ వుంటాం కాబట్టి..
థియేటర్లో వాళ్ల సినిమాలు చూస్తున్నప్పుడు అంతగా లీనమవ్వలేం.
మనకు తెలిసున్న వాళ్లే అక్కడ కనిపిస్తున్నారన్న భావన డామినేట్ చేస్తూ వుంటుంది.
అయితే, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా లీనమైపోతాం..
అక్కడ తెరపై కనిపిస్తున్న వాళ్లు మనకు తెలియదు.. అన్న భావనలోకి వెళ్లిపోతాం.
అలాంటి సినిమాలు నాకు కొన్ని వున్నాయి.
వాటిలో ‘అన్నమయ్య’ ఒకటి!
Ads
సినిమా చూస్తున్నంత సేపూ..
ముఖ్యంగా పతాక సన్నివేశాలలో అయితే..
నాగార్జున ఎవరో మనకు తెలియదు.. ఆయనతో పరిచయం లేదు.. అన్నంతగా మనసు ఫిక్స్ అయిపోయింది.
అంతలా నాగార్జున గారి అభినయం.. నిజంగా అలనాటి అన్నమయ్యే మన ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాడా? అనిపిస్తుంది.
ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు ఏడుకొండలవాడు పాడుతున్నప్పుడు..
చివర్లో ‘అంతర్యామి.. అలసితి..” కీర్తన పాడుతున్నప్పుడు నాగార్జున గారు ప్రదర్శించిన సహజ అభినయం మనల్ని కట్టిపారేస్తుంది.
గీతాంజలి.. శివ.. నిన్నే పెళ్లాడుతా.. మన్మధుడు.. ఇలా మంచి కమర్షియల్ హిట్ సినిమాలు ఎన్నో ఆయన కెరీర్లో ఉన్నప్పటికీ.. ఆయన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్క ‘అన్నమయ్య’ చెబితే చాలు!
మరి నాగార్జున ఎవరు?
మహానటుడు అక్కినేని వారసుడు..
ఎక్కడికి పోతాయి ఆ జీన్స్?
తనయుడి సినిమాల గురించి, ఆయన నటన గురించి నాగేశ్వరరావు గారు ఎప్పుడూ మాట్లాడేవారు కాదు.
లోలోపల పుత్రోత్సాహం ఉన్నప్పటికీ పైకి గుంభనంగా వుండేవారాయన.
‘శివ’ సినిమా అంత విజయం సాధించినా ఆయన పెద్దగా మాట్లాడలేదు.‘
అన్నమయ్య’ చూశాక మాత్రం అసలైన పుత్రోత్సాహాన్ని ఆస్వాదించారాయన.
రొమాంటిక్ హీరోగా.. టాలీవుడ్ మన్మధుడిగా.. ‘కింగ్’గా అభిమానులు పిలుచుకునే నాగార్జున మొదటి నుంచీ నవ్యతకు పెద్ద పీటవేసేవారు.
దానికి తోడు డేరింగ్ నేచర్..
సాహసాలు చేసేవారు..
లేకపోతే ‘గీతాంజలి’ లాంటి కథను చేయడానికి మరొకరైతే ఒప్పుకుంటారా?
మంచి కథతో తనని కన్విన్స్ చేస్తే కొత్త కుర్రాళ్లకి సైతం దర్శకుడిగా అవకాశం ఇచ్చేవారు.
మణిరత్నం, ప్రియదర్శిన్, ఫాజిల్ వంటి ఇతర భాషల దర్శకులతో కూడా అదే కోవలో పనిచేశారు.
నేను మద్రాసులో పనిచేస్తున్న రోజుల్లో 1991 లో అనుకుంటాను.
ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘జైత్రయాత్ర’ సినిమా షూటింగ్ కవరేజీ కోసం మద్రాసు నుంచి మా ప్రెస్ ని తీసుకువెళ్లారు.
అప్పుడు నైట్ ఎఫెక్ట్ లో నాగార్జున, విజయశాంతి తదితరులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు దర్శకుడు.
షాట్ గ్యాప్ వస్తే.. నాగార్జున గారితో చాలాసేపు బాతాఖానీ వేశాం.
చాలా విషయాలపై మాట్లాడుకున్నాం..
దేవుడిపై నమ్మకం గురించి అడిగితే వివరంగా చెప్పారు.
మాటల మధ్యలో క్యాస్ట్ సిస్టం గురించి ప్రస్తావించాను.
ఆయన నవ్వేసి..”అసలు ఈ కులాల గురించి నాకేమీ తెలియదండీ బాబూ.. నా వరకు నాకు ఇలాంటివన్నీ ఇష్టముండదు. నేనసలు పట్టించుకోను కూడా” అంటూ నిష్కర్షగా చెప్పుకొచ్చారు.
ఇంకోసారి మరో ఇంటర్వ్యూలో కార్లపై మోజు గురించి అడిగితే.. “నాకంత మోజు లేదండి.. నాన్న గారికి కార్లంటే బాగా ఇష్టం.. కార్ల గురించి ఆయనకు బాగా తెలుసు కూడా ” అన్నారు.
“అవునా?” అంటే.. తలూపారు.
“నాన్న గారిని మీరు కలుస్తుంటారు కదా.. ఈసారి అడగండి కార్ల గురించి” అన్నారు నాగార్జున.
ఆ తర్వాత ఏన్నార్ గారిని కలిసినప్పుడు ఇదే ప్రస్తావన తెస్తే.. అబ్బో .. చాలా విషయాలు చెప్పారు కార్ల గురించి..
అంతేకాదు.. అన్నపూర్ణా స్టూడియో నుంచి తమ ఇంటికి నన్ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.. ఆ కబుర్లన్నీ చెబుతూ.
ఇక నాగార్జున గారి వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది.
చాలా కూల్..
ప్రతి దానినీ సీరియస్ గా తీసేసుకోవడం.. కంగారుపడిపోవడం ఆయనలో కనపడదు.
ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోరు..
తన పనేదో తాను చేసుకునిపోతారు..
కాంట్రవర్సీలకు చాలా దూరం..
మనిషిని మనిషిగా చూసే గొప్ప వ్యక్తిత్వం ఆయనది!
స్టాఫ్ ని కూడా ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు.
ఒకసారి అన్నపూర్ణా స్టూడియోలోని ఆయన గెస్ట్ హౌస్ లో మేం మాట్లాడుకుంటుండగా.. ఆయన పీఏ వచ్చాడు.
“రేపు బాంబేకి టికెట్ చూడవా.. ప్లీజ్” అంటూ అతనిని రిక్వెస్టింగ్ గా అడిగారు.
తన పీఏని అలా రిక్వెస్టింగ్ గా అడగడం చూస్తే .. నాకు చాలా ఆశ్చర్యం వేసింది..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందిని చూస్తుంటాం.. స్టాఫ్ ని కమాండ్ చేస్తుంటారు.. కోపాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు.
కానీ ఈయన నాగార్జున!
మనిషిని మనిషిగా చూసే మనిషాయన!
అక్కినేని గారి ఫ్యామిలీని చూస్తే నాకు రాజకపూర్ ఫ్యామిలీ గుర్తొస్తుంది!
అక్కడ నాలుగు తరాలూ సినిమా ఆర్టిస్టులే అయితే.. అక్కినేని వారి ఫ్యామిలీలో ఇప్పటికి మూడు తరాలు ఆర్టిస్టులు!
ఆ మూడు తరాలూ కలిసి ‘మనం’ సినిమాలో కనిపించడం ఓ అపురూపం!
పెద్దబ్బాయి నాగచైతన్య ఇప్పటికే విజయాలు అందుకున్నాడు.
చిన్నబ్బాయి అఖిల్ కూడా తాజాగా ‘లెనిన్’ సినిమాతో పెద్ద హిట్ కొట్టడం నాగార్జున గారికి పెద్ద పుత్రోత్సాహం!
కాంట్రవర్శీలకు నాగార్జున గారు దూరమని ఇంతకు ముందే చెప్పాను కదా..
అందుకు చిన్న ఉదాహరణ చెబుతా..
ఒకసారి ఆయనని ఇంటర్వ్యూ చేస్తూ.. అంతకుముందు అపజయం పాలైన ఒక సినిమా గురించి అడిగితే.. సమాధానం చెప్పారు.
నేను ఆఫీసుకి వచ్చేశాక.. ఆయన నుంచి ఫోన్..
“ఏమండీ.. ఇందాక ఆ సినిమా గురించి చెప్పాను కదా.. ఎందుకొచ్చిందీ.. అవాయిడ్ చేసేద్దామండి అది.. ప్లీజ్” అన్నారు నాగార్జున.
అదీ ఆయన అసలైన వ్యక్తిత్వం!
తన వల్ల మరొకరు హర్ట్ అవకూడదన్నది ఆయన అభిమతం!
నాకు ఈ సినిమా పరిశ్రమలో ఎంతోమందితో పరిచయాలు వున్నాయి.
అయితే.. మనసుకు నచ్చే వారు కొందరే వున్నారు..
వారిలో నాగార్జున గారు ఒకరు!
-మోహన్ గోటేటి
.
(నిన్న నాగార్జున గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ..) .
#AnnapurnaStudios
#AkkineniNagarjuna
Share this Article