.
వెలిగొండ ఎవరి క్రెడిట్..? 30 ఏళ్ల ప్రాజెక్టుకు ఈ క్రెడిట్ లొల్లి ఎందుకు? వెలిగొండ ప్రాజెక్ట్ ఎవరు కట్టారు? చంద్రబాబా? వైఎస్సారా? జగనా? ఇప్పుడు కూటమి ప్రభుత్వమా? ఈ ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. కానీ అసలు చూస్తే ఇది ఒక్క వెలిగొండ సమస్య కాదు. ప్రభుత్వం అనే వ్యవస్థను మన రాజకీయ పార్టీలు ఎలా చూస్తున్నాయన్నదే అసలు సమస్య.
హైదరాబాద్‌లో మూసారాంబాగ్ బ్రిడ్జిని రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తుంటే, “కేసీఆర్ కట్టిన బ్రిడ్జికి రేవంత్ ప్రారంభోత్సవం” అంటూ క్రెడిట్ చోరీ కథనం కేసీయార్ పత్రికలో… నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ సహా చాలా అంశాల్లో ఇదే గత్తర ప్రచారం… ఏపీలో జగన్, తెలంగాణలో కేసీయార్, దోస్తులు కదా సేమ్ సేమ్…
Ads
- ఒక కీలక ప్రశ్న… ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని తర్వాతి ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా? లేక “మాది కాదు” అంటూ గాలికి వదిలేయాలా?
ప్రభుత్వం అంటే ఐదేళ్ల కాంట్రాక్ట్ కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. కేసీఆర్ హయాంలో మొదలైన బ్రిడ్జిని రేవంత్ పూర్తి చేస్తే, రేవంత్ ఏదో కేసీఆర్ క్రెడిట్ దొంగిలించినట్టు కాదు. అదే విధంగా వైఎస్ ప్రారంభించిన పనిని చంద్రబాబు పూర్తి చేస్తే, అది ఆయా నేతల సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మొదలైన పని ప్రజలకే చేరింది — అంతే…
అయితే వెలిగొండ విషయంలో మరో విచిత్రం ఉంది. 30 ఏళ్లుగా న- డు- స్తు- న్న ప్రాజెక్ట్. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి. ఇన్ని బడ్జెట్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ “నా క్రెడిట్” అంటూ ఇద్దరూ డప్పులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
నిజంగా ఎవరికైనా తమ హయాంలోనే వెలిగొండ పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే పట్టుదల ఉంటే, తమకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సింది. ముఖ్యంగా చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన హయాంలోనే ఎందుకు పూర్తి కాలేదు?
వైఎస్సార్ హయాంలో పనులు వేగం పుంజుకున్నాయి. ఆయన తర్వాత సాంకేతిక సమస్యలు, రాజకీయ అనిశ్చితి వచ్చాయి. జగన్ హయాంలో ట్విన్ టన్నెల్స్ పూర్తయ్యాయి. కానీ ప్రాజెక్ట్ మొత్తం ప్రజలకు నీళ్లు అందించే స్థాయికి వెంటనే రాలేదు. ఇప్పుడు మిగిలిన పనులు, పునరావాసం, కాల్వలు, ఇతర అనుబంధ పనులు పూర్తవుతున్నాయి.
అంటే ప్రతి ప్రభుత్వం ఏదో ఒక దశలో భాగస్వామి. కానీ ఎవరూ 30 ఏళ్ల ప్రాజెక్ట్‌ను ఒంటరిగా సొంతం చేసుకోలేరు. అసలు ఈ ప్రచారాలే ఓ దిక్కుమాలిన లొల్లి… మన తెలుగు రాష్ట్రాల పార్టీలకే ఈ అరుదైన వ్యాధి… ఆద్యులు జగన్, కేసీయార్… వాళ్ల సోషల్ మీడియా, మీడియాల శుష్క వాదనలు…
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ అడుగుతున్న మరో ప్రశ్న — “వెలిగొండ ద్వారా ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు?” అన్నది. సరే. అది ప్రశ్నించాల్సిన అంశమే అనుకుందాం. మరి కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో ఇదే ప్రశ్న ఎందుకు అడగలేదు?
వెలిగొండ పనులు అప్పుడూ సాగాయిగా? ట్విన్ టన్నెల్స్ జగన్ పూర్తి చేసింది, జాతికి అంకితం చేసింది కేసీయార్ హయాంలోనేగా..? అప్పుడేమయ్యాయి ఈ గొంతులు? ఈ కేకలు? ఈ నిందలు? కృష్ణా జలాల లెక్కలు అప్పుడూ ఉన్నాయిగా? ప్రాజెక్ట్ నిర్మాణం అప్పుడే జరుగుతూనే ఉందిగా?
అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట ఎందుకు? వెలిగొండపై రాజకీయ క్రెడిట్ లొల్లి కంటే మనం అడగాల్సిన ప్రశ్న చాలా సింపుల్. 30 ఏళ్లుగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడైనా పూర్తిగా ఉపయోగంలోకి రావాలి.
ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు టన్నెల్ తవ్వించారు, ఎవరు రిబ్బన్ కట్ చేశారు అన్నది చరిత్రలో ఉంటుంది. కానీ చివరకు నీళ్లు అందేది రైతుకే. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులకు క్రెడిట్ ప్రభుత్వాలది కాదు – ప్రజలది.
ప్రభుత్వాలు వస్తాయి. పోతాయి.
పనులు మాత్రం కొనసాగాలి. అదే పరిపాలన. అదే ప్రజాస్వామ్యం. “నేను కట్టాను, నేేనే కట్టాను” అనే లొల్లికి అర్థం లేదు… అది అర్థం చేసుకునే సోయి మన పార్టీలకు లేదు… అది అసలైన విషాదం..!!
చివరగా... వెలిగొండ మొత్తం పూర్తి కాలేదు !!
Share this Article