Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హెయిర్ కట్ కాదు – అచ్చంగా శిరోముండనం! మీకు మరో కథ చెబుతాను…

August 31, 2026 by M S R

.

22 వేల కోట్ల అప్పు ఉంటే, 6.5 కోట్లకు సెటిల్ చేసింది మన వ్యవస్థ… అందరూ రాస్తున్నట్టు ఇది కేవలం ఓ హెయిర్ కట్ కాదు… అచ్చంగా గుండు గొరగడం… అంటే శిరోముండనం… 2016లో తెచ్చిన దివాలా చట్టం మంచి చేస్తోందా..? నిండా ముంచుతోందా..? ఇదీ తాజా ప్రశ్న.., జీ గ్రూప్ సుభాష్ చంద్ర కేసువంటిదే మరో క్లాసిక్ కేసు కూడా చెబుతాను… పదండి…

ఆగస్టు 25, 2026… భారత దివాలా పరిష్కార వ్యవస్థ చరిత్రలో మరో అత్యంత వివాదాస్పదమైన రోజు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన కేసులో రూ.22 వేల కోట్ల మేర అంగీకరించిన క్లెయిమ్‌లకు వ్యతిరేకంగా కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపు ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. అంటే రికవరీ ఎంత..? కేవలం 0.03 శాతం! రుణదాతలు వదులుకోవాల్సిన మొత్తం 99.97 శాతం!

Ads

దీనిని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ వ్యంగ్యంగా, కానీ చాలా సూటిగా ఇలా అభివర్ణించారు: “ఇది హెయిర్‌కట్ కాదు… శిరోముండనం!” అని…

  • నిజమే. ఇది రుణదాతలకు జరిగిన సాధారణ నష్టమా, భారీ హెయిర్‌కట్టా అన్న ప్రశ్న కూడా కాదు. రూ.100 ఇవ్వాల్సిన చోట రూ.30, రూ.40 తిరిగి వస్తే దాన్ని హెయిర్‌కట్ అనొచ్చు. కానీ రూ.22 వేల కోట్లకు పైగా బాకీ ఉండి, చివరకు రూ.6.5 కోట్లతో ఖాతా ముగిస్తే దాన్ని ఏమనాలి?

ఇంకా చెప్పాలంటే, ఇది ఒక్క కేసు గురించి మాత్రమే కాదు. పదేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా తెచ్చిన ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్ – 2016 (IBC) అసలు ఏ లక్ష్యంతో వచ్చిందో, ఇప్పుడు ఏ దిశలో వెళుతోందో అనే పెద్ద ప్రశ్నను ఈ తీర్పు మరోసారి ముందుకు తెచ్చింది.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు రావాల్సింది రూ.1,322 కోట్లు… దక్కేది రూ.38 లక్షలు! ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఉదాహరణల్లో ఒకటి LIC Housing Financeది. సంస్థ క్లెయిమ్ రూ.1,322 కోట్లు. కానీ ప్రతిపాదిత పరిష్కారం ద్వారా దానికి అందేది కేవలం రూ.38 లక్షలు మాత్రమే. అంటే తనకు రావాల్సిన ప్రతి రూ.100లో సంస్థకు తిరిగి దక్కేది పైసల్లో కూడా కాదు. రికవరీ రేటు కేవలం 0.028 శాతం!

ఇది ఒక సాధారణ వ్యాపార నష్టమని చెప్పి పక్కన పెట్టేయగలమా? ముఖ్యంగా బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, వాటి ద్వారా పరోక్షంగా ప్రజల డబ్బు ఇలాంటి రుణాల్లో ఇరుక్కున్నప్పుడు ఈ ప్రశ్న మరింత తీవ్రమవుతుంది.

అసలు IBC తీసుకొచ్చిందే ఇందుకోసమే కదా? రుణాలు తీసుకుని ఎగ్గొట్టే ప్రమోటర్లు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థను వాడుకోవడాన్ని అడ్డుకోవడానికి. రుణదాతలకు అధికారం ఇవ్వడానికి. ఆస్తులను సమర్థవంతంగా విక్రయించి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని రికవర్ చేయడానికి. సంస్థలను కాపాడగలిగితే కాపాడి, కుదరకపోతే విలువను నాశనం కాకుండా చూసేందుకు.

కానీ పదేళ్ల తర్వాత మనం చూస్తున్నది ఏమిటి? కాగితాలపై విజయమే… వాస్తవంలో భారీ కోతలు! IBBI గణాంకాల ప్రకారం జూన్ 2026 నాటికి వేలాది కార్పొరేట్ దివాలా కేసులు IBC కింద ప్రవేశించాయి. వాటిలో వేల కేసులు రిజల్యూషన్ ద్వారా ముగిశాయి. రుణదాతలకు లక్షల కోట్ల రూపాయల రికవరీ కూడా జరిగింది.

కాగితాల మీద చూస్తే ఇదంతా చెడ్డ ఫలితం కాదు. కానీ అసలు సమస్య సగటుల్లో దాగిపోతుంది. సగటు రికవరీ రేటు ఎంత అనేది ఒక విషయం. కొన్ని కేసుల్లో 60, 70 శాతం రికవరీ అయి ఉండొచ్చు. మరికొన్ని కేసుల్లో 20 శాతం వచ్చి ఉండొచ్చు. కానీ 99 శాతం కంటే ఎక్కువ రుణాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, ఆ వ్యవస్థలో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందన్న ప్రశ్న తప్పదు.

ఇటీవలి సంవత్సరాల్లో రికవరీ రేట్లు తగ్గుతున్నాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పెద్ద కేసుల్లో, ముఖ్యంగా రూ.1,000 కోట్లకు పైగా క్లెయిమ్‌లు ఉన్న వ్యవహారాల్లో రికవరీ మరింత బలహీనంగా మారుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు IBC ఉద్దేశించిన వేగవంతమైన పరిష్కార ప్రక్రియ కూడా అనేక కేసుల్లో సంవత్సరాల తరబడి సాగుతోంది.

చట్టం నిర్ణయించిన గడువు ఒకటి… వాస్తవంగా కేసు ముగియడానికి పడుతున్న సమయం మరోటి. అయితే ప్రశ్న ఒక్కటే… త్వరగా పరిష్కారం కాకపోతే సరే, చివరకు పరిష్కారం పేరిట దాదాపు మొత్తం రుణాన్ని వదిలేసుకుంటే IBC తీసుకురావడం వల్ల అసలు ప్రయోజనం ఏమిటి?

ఇది మొదటి భారీ హెయిర్‌కట్ కాదు… ఈ చర్చ కొత్తది కాదు. గతంలోనూ అనేక పెద్ద దివాలా పరిష్కారాలు వివాదాలకు దారి తీశాయి. వీడియోకాన్ ఇండస్ట్రీస్ కేసు అందులో ప్రధాన ఉదాహరణ. రూ.64 వేల కోట్లకు పైగా అంగీకరించిన క్లెయిమ్‌లకు వ్యతిరేకంగా దాదాపు రూ.2,962 కోట్ల పరిష్కార ప్రతిపాదన వచ్చినప్పుడు, రుణదాతలు వదులుకోవాల్సిన మొత్తం 95 శాతానికి పైగా ఉండటం తీవ్ర చర్చకు దారి తీసింది.

భూషణ్ పవర్ అండ్ స్టీల్ వంటి కేసుల్లో రికవరీ రేటు పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ, భారీ మొత్తాల రుణాలు చివరకు నష్టాలుగానే మిగిలాయి. జేపీ ఇన్‌ఫ్రాటెక్ కేసు అయితే మరో కోణాన్ని చూపించింది. బ్యాంకులు మాత్రమే కాదు, వేలాది మంది ఇళ్ల కొనుగోలుదారులు కూడా సంవత్సరాల తరబడి పరిష్కారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • అంటే దివాలా కేసు అంటే కేవలం ఒక కంపెనీ, ఒక బ్యాంకు మధ్య లెక్క కాదు. దాని వెనుక ఉద్యోగులు ఉంటారు. చిన్న సరఫరాదారులు ఉంటారు. ఆ సంస్థకు సరుకులు ఇచ్చి డబ్బు కోసం ఎదురు చూసే ఆపరేషనల్ క్రెడిటర్లు ఉంటారు. ఇల్లు కోసం జీవితకాల పొదుపు పెట్టిన హోంబయ్యర్లు ఉంటారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టిన ప్రజలు ఉంటారు.

అందుకే భారీ రుణాలను చివరకు కొద్దిపాటి మొత్తాలతో సెటిల్ చేయడం అనేది కేవలం కార్పొరేట్ వ్యవహారం కాదు. ప్రజా విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కూడా. అయితే నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఇక్కడ మరో కీలక అంశం ఉంది.

సుభాష్ చంద్ర కేసులో ఈ పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ – Committee of Creditors – ఆమోదించింది. భారీ మెజారిటీతో నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత NCLT దాన్ని ఆమోదించింది. ఇక్కడే IBC వ్యవస్థలోని ప్రాథమిక తత్వం ముందుకొస్తుంది.

రుణదాతలే తమకు ఏది మంచిదో నిర్ణయించుకోవాలి. కోర్టులు వ్యాపార నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు. దీనినే ‘కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ క్రెడిటర్స్’ అంటారు. సూత్రంగా చూస్తే ఇది సరైనదే కావచ్చు. కానీ ఇక్కడే మరో ప్రశ్న ఎదురవుతుంది.

రూ.22,006 కోట్లకు పైగా క్లెయిమ్ ఉండగా, రూ.6.5 కోట్లకు ఒప్పుకోవడం కూడా కమర్షియల్ విజ్డమా? ప్రతి రూ.3,000కు పైగా రావాల్సి ఉంటే ఒక రూపాయి కూడా దక్కని స్థాయి రికవరీని వ్యాపారపరంగా సమర్థించడానికి కారణం ఏమిటి?

బహుశా ప్రత్యామ్నాయం లిక్విడేషన్ కావచ్చు. కంపెనీ ఆస్తుల విలువ మరింత తక్కువగా ఉండొచ్చు. రికవరీ అవకాశమే లేకపోవచ్చు. కేసు సంవత్సరాల తరబడి సాగితే ఇంకా నష్టం ఉండొచ్చు. ఇవన్నీ సాంకేతికంగా సాధ్యమైన వివరణలు. కానీ అవి మరో పెద్ద ప్రశ్నను మాత్రం తొలగించవు.

అసలు రూ.22 వేల కోట్ల క్లెయిమ్‌కు ఎదురు నిలబెట్టగల ఆస్తులు, హామీలు, గ్యారెంటీలు, ఇతర రికవరీ మార్గాలు ఏ స్థితిలో ఉన్నాయి? వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిజంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇలాంటి తీవ్ర అసమానత ఉన్న కేసుల్లో ప్రజలకు ఆ వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది.

‘కమర్షియల్ డెసిషన్’ అనే మాటకు కూడా హద్దులుండాలా? IBC తీసుకొచ్చిన గొప్ప మార్పు ఏమిటంటే, నిర్ణయాధికారాన్ని రుణదాతలకు ఇవ్వడం. కానీ ఏ అధికారం అయినా జవాబుదారీతనం లేకుండా ఉంటే సమస్యే.

ప్రత్యేకించి రుణదాతల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రజల పొదుపులతో పనిచేసే ఆర్థిక సంస్థలు ఉన్నప్పుడు ఇది మరింత సున్నితమైన విషయం.

ఒక బ్యాంకు అధికారి ఇప్పటికే ఆ రుణానికి భారీ ప్రొవిజనింగ్ చేసి ఉండవచ్చు. ఆ నష్టం లెక్కల్లో ముందే నమోదు అయి ఉండవచ్చు. అందువల్ల ఎంత వచ్చినా ‘ఇంకా కొంత రికవరీ’గా భావించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ నష్టం అసలు ఎవరిది?

చివరికి అది బ్యాంకు బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపుతుంది. పరోక్షంగా వాటాదారులు, డిపాజిటర్లు, ప్రజలపై ప్రభావం ఉంటుంది. అందుకే “రుణదాతలు ఒప్పుకున్నారు కదా, ఇక ప్రశ్నే లేదు” అని చెప్పడం కూడా సరిపోదు.

అత్యంత తీవ్రమైన హెయిర్‌కట్‌లకు ఒక స్వతంత్ర ఆడిట్ అవసరమా? ఆస్తుల విలువ నిర్ణయ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండాలా? ప్రజా నిధులు భారీగా ఉన్న కేసుల్లో అదనపు పర్యవేక్షణ అవసరమా? ఇవి ఇప్పుడు చర్చించాల్సిన ప్రశ్నలు.

NCLTపై పెరుగుతున్న ఒత్తిడి… ఇంకో సమస్య సంస్థాగత సామర్థ్యం. NCLT ముందు వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సభ్యుల కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, పెరుగుతున్న కేసుల భారం… ఇవన్నీ పరిష్కార ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి.

IBC ఆలోచనలో కీలకమైన అంశం సమయం… సమయం గడిచే కొద్దీ కంపెనీ విలువ తగ్గిపోతుంది. ఉద్యోగులు వెళ్లిపోతారు. యంత్రాలు నిరుపయోగంగా మారతాయి. కస్టమర్లు దూరమవుతారు. చివరకు మిగిలేది ఆస్తుల గుట్ట మాత్రమే. అప్పుడు రుణదాతల దగ్గర నిజంగా చాయిస్ ఉండదు. ఇది కూడా ఒక ప్రమాదకరమైన చక్రం.

కేసు ఆలస్యం అవుతుంది → కంపెనీ విలువ పడిపోతుంది → బిడ్లు తగ్గుతాయి → రికవరీ తగ్గుతుంది → భారీ హెయిర్‌కట్ తప్పదని చెబుతారు. నిజానికి ఈ చక్రాన్ని IBC విచ్ఛిన్నం చేయాలి. కానీ అదే చక్రంలో IBC కూడా చిక్కుకుంటే?

సంస్కరణలు తప్పవు… ఇప్పుడు ప్రశ్న IBC కావాలా వద్దా అన్నది కాదు. భారత్‌కు సమర్థవంతమైన దివాలా పరిష్కార వ్యవస్థ అత్యవసరం. IBC కంటే ముందు ఉన్న అంతులేని రికవరీ ప్రక్రియలకు తిరిగి వెళ్లడం పరిష్కారం కాదు.

కానీ IBCని ప్రశ్నించకూడదనే పవిత్ర వ్యవస్థగా కూడా చూడలేం. పదేళ్ల అనుభవం తర్వాత లోపాలను సరిదిద్దాల్సిందే. NCLT సామర్థ్యాన్ని పెంచాలి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. విలువ నిర్ధారణ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలి. భారీ ప్రజా నిధులు ఉన్న కేసుల్లో అసాధారణ స్థాయి హెయిర్‌కట్‌లను ప్రత్యేకంగా పరిశీలించే వ్యవస్థ ఉండాలన్న వాదనను సీరియస్‌గా చూడాలి.

అసలు ప్రమోటర్లు లేదా వారికి పరోక్షంగా సంబంధం ఉన్నవారు వెనక తలుపు మార్గంలో ఆస్తులను తిరిగి సొంతం చేసుకునే అవకాశాలు ఉంటే వాటిని కట్టడి చేయాలి. Section 29A వంటి నిబంధనల అమలును మరింత పటిష్ఠం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా IBC అసలు ఉద్దేశాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలి.

దివాలా తీసిన కంపెనీని ఎలాగైనా కాపాడటం మాత్రమే లక్ష్యం కాదు. రుణదాతలకు సాధ్యమైనంత ఎక్కువ విలువను రికవర్ చేయడం కూడా అంతే ముఖ్యమైన లక్ష్యం.

చివరగా… కోడ్‌ను కాపాడాలా, పూడ్చిపెట్టాలా? IBC వచ్చి పదేళ్లు పూర్తవుతోంది. దాన్ని తెచ్చినప్పుడు చెప్పిన కథ ఏమిటి? రుణాలు తీసుకుని, ఎగ్గొట్టి, విలాసవంతంగా జీవించే ప్రమోటర్ల కాలం ముగుస్తుందని. బ్యాంకుల డబ్బు ఇక బందీగా ఉండదని. రుణదాతలకు అధికారం వస్తుందని.

కానీ ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని పరిష్కారాలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. రూ.22,006 కోట్ల క్లెయిమ్… రూ.6.5 కోట్ల పరిష్కారం. ఈ ఒక్క లెక్కే అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

  • విజయ్ మాల్యా కూడా ఇదే నేపథ్యంలో వ్యంగ్యంగా స్పందించాడు. తనపై ఉన్న తీర్పు రుణంతో పోలిస్తే బ్యాంకులు తన నుంచి మరింత మొత్తాన్ని రికవర్ చేశాయని, మరోవైపు ఇంత భారీ క్లెయిమ్‌ను అతి స్వల్ప మొత్తంతో పరిష్కరించారని ఆయన చేసిన పోలిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన లెక్కలు, ఆయన వాదనలు ఎంతవరకు సరైనవో వేరే విషయం. కానీ ప్రజల ముందు ఏర్పడుతున్న ‘ఒకరికి ఒక న్యాయం… ఇంకొకరికి ఇంకో న్యాయం’ అనే అభిప్రాయం మాత్రం వ్యవస్థకు మంచిది కాదు.

జైరాం రమేష్ అన్న ‘ముండనం’ వ్యాఖ్య అందుకే బలంగా వినిపించింది. ఇది నిజంగా ఒక్క సుభాష్ చంద్ర కేసుకు సంబంధించిన వ్యాఖ్యగా మిగిలిపోతుందా? లేక భారీ హెయిర్‌కట్‌లు, అంతులేని ఆలస్యాలు, విలువ కంటే తక్కువ బిడ్లు, చివరకు “కమర్షియల్ విజ్డమ్” అనే రెండు పదాలతో అన్నింటినీ సమర్థించుకునే వ్యవస్థకు ప్రతీకగా మారుతుందా?

IBCని రద్దు చేయాల్సిన అవసరం లేదు. కానీ దాని ఆత్మను తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. లేకపోతే ‘రిజల్యూషన్’ అంటే రుణదాతలకు న్యాయం జరిగిందన్న అర్థం పోయి, భారీ నష్టాన్ని చట్టబద్ధంగా అంగీకరింపజేసే ప్రక్రియ అనే అర్థం మిగిలిపోతుంది.

రూ.22 వేల కోట్లకు రూ.6.5 కోట్లే సమాధానమైతే… అది కేవలం ఒక కంపెనీ రుణ పరిష్కారం కాదు. భారత దివాలా వ్యవస్థ తన అసలు లక్ష్యాన్ని ఎంత దూరం మర్చిపోయిందనే ప్రశ్నకు నిలువెత్తు ఉదాహరణ. ఇక చాయిస్ ఒక్కటే.

కోడ్‌ను సంస్కరించి తిరిగి రుణదాతల ఆయుధంగా మార్చాలి… లేదా ఇలాంటి ‘హెయిర్‌కట్‌ల’తో దాని అసలు ఉద్దేశానికే ముండనం జరుగుతుండటం, అంటే దివాలా కోడ్ తనే దివాలా తీయడాన్ని చూస్తూ ఉండాలి…. Cholleti 

(The writer is with the Cholleti BlackRobe Chambers, Hyderabad, and writes on economy, politics and law)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హెయిర్ కట్ కాదు – అచ్చంగా శిరోముండనం! మీకు మరో కథ చెబుతాను…
  • బతికిన ఒక ఇల్లు – ఉంటుందా? దాన్నీ నదికి వదిలేయాల్సిందేనా?
  • ఇది ప్రకృతి కక్ష కాదు, ప్రతీకారం కాదు… బ్యాలెన్స్ చేస్తోంది తన ధర్మంగా !
  • ఊకో ఊకో రాధాకృష్ణ… రేవంత్ రెడ్డికి ఏమీ కాదు… ఆవేశపడిపోకు !!
  • పాపం… ఈ కాబోయే గవర్నర్‌కు గుర్తుందో లేదో బీజేపీలో ఉన్నానని…
  • ఎక్కాలు రావు, లెక్కలు తెలియవు – ఐతేనేం ఈ ‘రెబెక్కా’కు ఏం తక్కువ ?!
  • ఓ యాపిల్ – ఓ ఫేస్‌బుక్ – ఓ ‘హనుమాన్ అంశ’ ప్రభావం ! వెరీ ఇంట్రస్టింగ్ !!
  • కాపీ కొటేషన్లే డైలాగులా ? ఇదొక విపరీత ‘టాక్సిక్’ పెడపోకడ !!
  • ఏశ నాగుల కట్ట మీద … ఆ ఫోక్ పాటను ఖైమా కొట్టీ కొట్టీ వదిలారు…
  • 67 ఏళ్లు – ఐనా నిత్య యవ్వనుడు – చాలా రేర్ పీస్ నాగార్జున !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions