.
NISAR ఉన్నా EOS-05 ఎందుకు? 36 వేల కిలోమీటర్ల ఎత్తునుంచి భారత్‌కు మరో ‘ఆకాశ కన్ను’ ఎందుకు అవసరం? ఉపగ్రహం ప్రయోగించారంటే చాలు… “ఇక భూమ్మీద చీమ చిటుక్కుమన్నా కనిపిస్తుంది” అని చెప్పుకోవడం మనకు అలవాటైపోయింది.
కెమెరా ఉందంటే ఫోటో తీస్తుంది. రిజల్యూషన్ ఎక్కువైతే మరింత స్పష్టంగా తీస్తుంది. అంతే కదా అనిపిస్తుంది. కానీ అంతరిక్షంలో మాత్రం అసలు లెక్క వేరు. ఎంత దగ్గరగా చూడగలదు? ఒక ప్రశ్న. ఎంత తరచుగా చూడగలదు? మరో ప్రశ్న. ఈ రెండూ ఒకటే కాదు.
Ads
ఇదే తేడాను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన EOS-05ను, ఏడాది క్రితం ఇస్రో- నాసా కలిసి ప్రయోగించిన NISARతో పోల్చి చూడాలి.
NISAR ఏం చేస్తుంది? NISAR అంటే NASA-ISRO Synthetic Aperture Radar. ఇది సాధారణ కెమెరా కాదు. రాడార్‌తో భూమిని స్కాన్ చేస్తుంది. అందుకే చీకటి ఉన్నా, మేఘాలు కమ్ముకున్నా పనిచేస్తుంది. దాదాపు 747 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ భూమి మీద మార్పులను 3 నుంచి 10 మీటర్ల స్థాయి వరకు గుర్తించగలదు. ప్రపంచంలోని భూభాగాలు, మంచు ప్రాంతాలను 12 రోజుల చక్రంలో పరిశీలిస్తుంది.
భూమి కింద ఏమవుతోంది?
భూమి కొద్దిగా కదిలిందా?
భూకంపం తర్వాత నేల ఎంత మారింది?
కొండచరియలు కదులుతున్నాయా?
హిమనదాలు ఎలా మారుతున్నాయి?
పంటలు, నేలలో తేమ ఎలా మారుతున్నాయి?
ఇలాంటి ప్రశ్నలకు NISAR అద్భుతమైన సమాధానం. అంటే… NISAR గొప్ప కెమెరా కంటే గొప్ప ‘మార్పుల గుర్తింపు యంత్రం’. అయితే మరి మన సొంత EOS-05 ఎందుకు? అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకటి పరుగెత్తే కెమెరా… మరొకటి ఒకేచోట కాపలా….
NISAR లాంటి ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒక ప్రాంతం మీదుగా వెళ్లి పరిశీలిస్తుంది. మళ్లీ తన కక్ష్యలో తిరుగుతుంది. కొంత సమయం తర్వాత అదే ప్రాంతాన్ని మళ్లీ చూస్తుంది. ఇది ఒక పోలీసు పెట్రోలింగు జీపు లాంటిది. వస్తుంది… పరిస్థితి చూస్తుంది… వెళ్లిపోతుంది… మళ్లీ వస్తుంది.
EOS-05 మాత్రం మరో రకం… ఇది దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో geosynchronous orbitలో ఉండేలా రూపొందించారు. భూమి ఎంత వేగంగా తిరుగుతుందో అదే వేగంతో ఉపగ్రహం కూడా తిరుగుతుంది. ఫలితంగా భూమి మీద నుంచి చూస్తే అది దాదాపు ఒకే ప్రాంతం మీద నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది.
అంటే… ఇది పరుగెత్తే కెమెరా కాదు. ఒకేచోట కూర్చుని కాపలా కాసే కెమెరా. ఇదే EOS-05 అసలు ప్రత్యేకత. మరి 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఉపయోగమేంటి?
ఉంది. చాలా పెద్ద ఉపయోగమే ఉంది. ఒక తుపాను బంగాళాఖాతంలో ఏర్పడిందనుకుందాం. NISAR దానిని అత్యంత వివరంగా పరిశీలించగలదు. కానీ EOS-05 తరహా ఉపగ్రహానికి మరో ప్రయోజనం ఉంటుంది.
ఆ తుపాను ఎలా కదులుతోంది?
మేఘాల సమూహం ఎలా మారుతోంది?
ఏ ప్రాంతం వైపు దూసుకొస్తోంది?
కొద్దిసేపటి క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
అంటే ఒకే ప్రాంతాన్ని మళ్లీ మళ్లీ చూడటం. ప్రకృతి విపత్తుల్లో ఈ ‘సమయం’ చాలా విలువైనది. వరదలు అకస్మాత్తుగా పెరగొచ్చు. క్లౌడ్‌బర్స్ట్ ఒక్కసారిగా సంభవించొచ్చు. అడవుల్లో మంటలు వేగంగా వ్యాపించొచ్చు. తుపాను దిశ కొన్ని గంటల్లో మారొచ్చు.
అలాంటి సందర్భాల్లో “ఐదు రోజుల తర్వాత మళ్లీ చూస్తాం” అనేది పనికిరాదు. “ఇప్పుడేం జరుగుతోంది?” అనేదే ముఖ్యం. అందుకే EOS-05. చీమ కనిపించదు… కానీ చీమల గుంపు కదులుతున్నట్టు కనిపిస్తుంది! ఇక్కడే ఒక అపోహను కూడా సరిచేసుకోవాలి.
EOS-05ను చూసి “36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి కింద చీమను కూడా చూస్తుంది” అనుకోవద్దు. అంత దూరం నుంచి అలా చూడటం దాని ఉద్దేశం కాదు. ఇంత ఎత్తు నుంచి అత్యంత సూక్ష్మమైన వస్తువులను ఫోటో తీయడం కోసం కాదు ఈ ఉపగ్రహం. ఇది పెద్ద ప్రాంతాలను త్వరగా, పదేపదే పరిశీలించడానికి ఉద్దేశించబడింది. అందుకే దాని గొప్పతనం spatial resolutionలో మాత్రమే లేదు.
temporal resolution — అంటే ఎంత తరచుగా అదే ప్రాంతాన్ని చూడగలదన్నదే దీని అసలు బలం. అందుబాటులో ఉన్న సాంకేతిక వివరాల ప్రకారం EOS-05 సుమారు 42 మీటర్ల స్థాయి spatial resolutionతో పెద్ద ప్రాంతాలను పరిశీలించగలదు; ఎంపిక చేసిన ప్రాంతాలను మరింత తరచుగా గమనించే సామర్థ్యం దీని ప్రధాన ఉద్దేశం.
ఇది విన్న వెంటనే ఒక విషయం అర్థమవుతుంది. NISARతో పోలిస్తే EOS-05 కెమెరా అంత “సూక్ష్మదర్శిని” కాదు. కానీ… అదే ప్రదేశాన్ని మళ్లీ మళ్లీ చూడటంలో మాత్రం దాని విలువ వేరే. అందుకే NISARను EOS-05 భర్తీ చేయదు. ఇది చాలా ముఖ్యమైన విషయం.
NISAR వచ్చేసింది కాబట్టి EOS-05 అవసరం లేదు అనడం ఎంత తప్పో… EOS-05 వచ్చేసింది కాబట్టి NISAR అవసరం లేదు అనడం కూడా అంతే తప్పు. రెండింటి పనులు వేరు.
NISAR: “భూమిలో ఏం మారింది? ఎంత మారింది? ఎంత సూక్ష్మంగా మారింది?” అని అడుగుతుంది.
EOS-05: “ఇప్పుడే అక్కడ ఏం జరుగుతోంది? మళ్లీ ఐదు నిమిషాల తర్వాత పరిస్థితి ఏమిటి?” అని అడుగుతుంది.
ఒకటి డిటెక్టివ్ అయితే… మరొకటి వాచ్‌మన్. ఒకటి భూమి మీద మార్పులను శాస్త్రీయంగా కొలుస్తుంది. మరొకటి పెద్ద ప్రాంతంపై నిరంతర నిఘా పెట్టడానికి ఉపయోగపడుతుంది.
భారత్‌కు దీని అవసరం మరింత పెద్దది… భారతదేశం లాంటి దేశానికి ఇలాంటి ఉపగ్రహం ఎందుకు కావాలి? మనకు ఒకేసారి ఎన్నో సమస్యలు ఉన్నాయి.
తుపాన్లు.
వరదలు.
అడవి మంటలు.
కరువు.
పంటల పరిస్థితి.
తీర ప్రాంతాల పర్యవేక్షణ.
అటవీ ప్రాంతాల మార్పులు.
సరిహద్దులు.
సముద్ర ప్రాంతాలు.
ఇవన్నీ ఒకే రకమైన ఉపగ్రహంతో పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఒక ఉపగ్రహం దగ్గరగా చూడాలి. మరొకటి విస్తృతంగా చూడాలి. ఇంకొకటి చీకట్లో కూడా చూడాలి. మరొకటి అదే ప్రాంతాన్ని నిమిషాల వ్యవధిలో మళ్లీ చూడాలి. ఇదే కారణంగా భారత్‌కు ఇప్పుడు ఉపగ్రహాల ఒక “కన్నుల వ్యవస్థ” ఏర్పడుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం… ఇది కేవలం ఉపగ్రహం విజయం కాదు. EOS-05 కథలో మరో కోణం ఉంది. ఇది కేవలం ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం కాదు. GSLV-F17 ద్వారా ఈ 2,367 కిలోల ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడం కూడా ముఖ్యమైన ఘట్టమే. ISRO ప్రకారం ఇది GSLV యొక్క 19వ ప్రయోగం.
ముఖ్యంగా GSLVకు గతంలో ఎదురైన వైఫల్యాల నేపథ్యంలో ఈ విజయం ఇస్రోకు మరింత ప్రాధాన్యమైనది. అంటే… EOS-05 కేవలం ఆకాశంలోకి వెళ్లిన మరో ఉపగ్రహం కాదు. భారత్‌కు 36 వేల కిలోమీటర్ల ఎత్తులో కొత్త కాపలా స్థానం ఏర్పడింది. కనురెప్ప వేయకుండా కాపలా!
మన పక్కన చైనా, ఇటు ధూర్త పాకిస్థాన్... కొత్త శత్రువుగా బంగ్లాదేశ్... ఈ ఉపగ్రహం అసలు ఉద్దేశాల్లో ప్రధానమైంది దేశ రక్షణ... సరిహద్దుల్లో కదలికల్ని ఖచ్చితంగా పట్టుకునే స్పై కెమెరా ఈ ఉపగ్రహం..!!
అన్నట్టు ESO5 అనేది Canon SLR కెమెరాల్లో ఓ మోడల్ కూడా !!
Share this Article