.
Subramanyam Dogiparthi …. తరచూ ఏదో చానల్లో వచ్చే ఈ సినిమాను చూసినప్పుడల్లా 1994 లో ఈ సినిమా కధను ఎలా ఎంపిక చేసుకున్నారు ; ఈ సినిమా అంత సూపర్ హిట్ ఎలా అయింది అని ఆశ్చర్యపోతూ ఉంటా . సినిమా అంతా ఏ 1950s/ 1960s లోనో రావలసిన సినిమా లాగా ఉన్నా ఒక్క క్లైమాక్స్ మాత్రం సూపరో సూపర్ .
నాలుగు వేల రూపాయల జీతం కోసం కోడలి బతుకును బుగ్గి చేద్దామనుకున్న మొగుడిని విధవరాలయి కత్తిపీటతో నరికేస్తుంది సుధ పాత్ర . ఆ సీన్లో ఆమె డైలాగులు కూడా సూపర్బ్ . అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది . 1994 కాబట్టి పురాణాలను ప్రశ్నించినా , అర్జునుడిని , రాముడిని , హరిశ్చంద్రుడిని ప్రశ్నించినా జనం పట్టించుకోలేదు .
Ads
ఇప్పుడయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని మగధ న్యూస్ లక్ష్మి వంటి వారు , అనంత శ్రీరాం వంటి స్వయంప్రకటిత సనాతన ధర్మ పరిరక్షకులు పెద్ద యుధ్ధమే ప్రకటించేవారు . అప్పుడు కాబట్టి జరిగిపోయింది , సినిమాను ప్రేక్షకులు తార్కిక భావంతో చూసి 15 సెంటర్లలో వంద రోజులు ఆడించారు .

తెలుగులో ఊహకు మొదటి సినిమా . శ్రీకాంత్ తో జంటగా నటించి నిజ జీవితంలో కూడా చక్కటి జంటయ్యారు . ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది . సినిమాలో నటన విషయానికి వస్తే అందరూ పోటాపోటీగా నటించారని చెప్పాలి . ముఖ్యంగా పిసినారి తండ్రిగా కోట శ్రీనివాసరావు , స్త్రీలోలుడు, నీచుడిగా తనికెళ్ళ భరణి మొదటి వరుసలో ఉంటారు .
వారిద్దరి తర్వాత రాజీ బతుకుని లాగించే అసమర్ధ దిగువ మధ్య తరగతి కుటుంబ పెద్దగా చంద్రమోహన్ గొప్పగా నటించాడు . సినిమా అంతా నోరు మూసుకుని పడి ఉండే భార్యగా , క్లైమాక్సులో తోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే అపర భద్రకాళిగా విరుచుకుపడే పాత్రలో సుధ పాత్రను , ఆమె నటనను ప్రేక్షకుడు మరవలేడు .
ఇద్దరు హీరోలు చక్కగా హీరోయిక్ గా నటించారు . రెండు మూడు డైలాగులే ఉన్నా “ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేస్తా” అనే డైలాగుతో ప్రేక్షకులను ఆకట్టుకునే నరేష్ తండ్రి పాత్రలో చలపతిరావు గుర్తుండిపోతాడు . ఇంక ఊహ . పురాణాలలో , పాత సినిమాలలో పతివ్రతలు పడే అష్టకష్టాలు పడే పాత్రలో జీవించింది .
ఇతర పాత్రల్లో సంగీత , ఏవియస్ , బ్రహ్మానందం , ఐరన్ లెగ్ శాస్త్రి , జెన్నీ , వరలక్ష్మి , శిరీష , శ్రీదేవి , కల్పన తదితరులు నటించారు . ఐరన్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ అయిపోవడం, ఐరన్ లెగ్ శాస్త్రి కోటీశ్వరుడు కావటం సరదాగా ఉంటుంది .

టూకీగా కధ ఏంటంటే ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలోని అమ్మాయిని శ్రీకాంత్ ప్రేమించి పిసినారి తండ్రికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని శోభనం నాడే రోడ్ ప్రమాదంలో చనిపోతాడు . కారుణ్య నియామకం పొందిన మరదలు జీతం కోసం , స్త్రీ లౌల్యంతో మరదలి మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు బావ తనికెళ్ళ భరణి .
ప్రతిఘటించిన మరదలిని కోర్టుకు ఈడ్చి కుటుంబ సభ్యుల చేత బలవంతంగా అనుకూల సాక్ష్యం చెప్పించుకుని కోర్ట్ నుండి వివాహ బంధానికి కట్టుబడి ఉండాల్సిందే అని తీర్పుని పొందుతాడు తనికెళ్ల భరణి . చాకచక్యంగా అతని నీచ బుధ్ధిని జడ్జి గారి ముందు బయటపెట్టి తీర్పుని రివర్స్ చేపిస్తాడు నరేష్ .
అన్నీ సర్దుకుని నరేష్ , ఊహల పెళ్ళికి ఏర్పాట్లు జరిగే సమయంలో పిసినారి మామ కోడల్ని మానభంగం చేయటానికి ప్రయత్నిస్తాడు . ఆ సమయంలో కత్తిపీటతో నరికేస్తుంది భార్య సుధ . ఆమె ఆశీస్సులతో నరేష్ , ఊహలు భార్యాభర్తలు అవటంతో సినిమా బరువుగా ముగుస్తుంది . ఇదీ “ఆమె” కధ .
విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో భువనచంద్ర వ్రాసిన పాటలన్నీ చాలా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో , గిరీశం , గంగాధర్ శ్రావ్యంగా పాడారు . ముఖ్యంగా ఓ చల్ల గాలీ ఓదార్చిపోవా పాట బాగా హిట్టయింది కూడా . ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు , చల్లగాలికి ఈడు వచ్చింది , నాగమణీ నాగమణీ అంటూ సాగే డ్యూయెట్ల చిత్రీకరణ కూడా బాగుంటాయి .
ఈ సినిమాలో డైలాగులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఇసుకపల్లి మోహనరావు వ్రాసారు . ఆయనకు ప్రత్యేక జ్యూరీ నంది అవార్డు కూడా వచ్చింది . ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది .
కధను నేసిన ఇ వి వి సత్యనారాయణ అద్భుతమైన దర్శకత్వ సారధ్యాన్ని వహించారు . 1950 s , 1960 s కధయినా 1990s లో ప్రేక్షకరంజకంగా చిత్రీకరించడం అంటే గొప్ప విషయమే . ఆయన నైపుణ్యాన్ని అభినందించాలి . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు …
Share this Article