.
“Democracy is the worst form of Government except for all those other forms that have been tried from time to time.
ప్రజాస్వామ్య రూపంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి మించిన అరాచకం ఇంకొకటి లేదు;
అంతకు మించిన మంచి ప్రత్యామ్నాయం ఇప్పటిదాకా ఇంకొకటి పుట్టలేదు”
-బ్రిటన్ మాజీ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్
ఉన్నది మనకు ఓటు- బతుకుదెరువుకే లోటు;
పేదవాడి కోపం పెదవికి చేటు;
అనువుగాని చోట అధికులమనరాదు- లాంటి సందర్భోచిత పాటలు, పద్యాలు, జాతీయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ రిజెక్ట్ అయిన మా ‘సర్’ కాగితాలను మళ్ళీ సమర్పించడానికి నేను, మా ఆవిడ బయలుదేరాము. టేబుల్ డ్రాలో నుండి మేము గత అనేక ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నామని నిరూపించే కాగితాలు, పాస్ పోర్ట్, ఆధార్ , పాన్ , డ్రైవింగ్ లైసెన్స్…ఇలా యుద్ధానికి ముందు సకల అస్త్ర శాస్త్రాలను ఫైల్లో పెట్టుకుని రోడ్డున పడ్డాము బీ ఎల్ ఓ మహాతల్లిని కలిసి…ఆ పత్రాలన్నీ ఇచ్చి ఓటరుగా ఎలాగైనా మమ్మల్ను బతికించే ఉంచమని ప్రాధేయపడుదామని. పుట్టలు పగిలి చీమలు లెక్కకు మిక్కిలి బారులుతీరినట్లు రోడ్డంతా వాహనాలతో బంపర్ టు బంపర్ ఆఫర్ నడుస్తోంది. అది మొదటి అపశకునం.
Ads
రెండు కిలోమీటర్ల దూరాన్ని 45నిముషాల్లో చేరుకుని…ఆ ప్రభుత్వ కార్యాలయం పార్కింగ్ సెల్లార్ చేరేసరికి బీ ఎల్ ఓ కూర్చుని ఉండాల్సిన టేబుల్ చుట్టూ ఇంకెవరో ఉన్నారు. ఇది రెండో అపశకునం.
వరుసగా సెలవులు కావడంతో ఆమె నాలుగుగంటలకే జంప్. తరువాత వారంలో కలుద్దాం- అని ఫోన్ చేస్తే బరువుతో కూడిన విసుగువల్ల వచ్చిన బాధ్యతతో ఆమె చెప్పింది. ఇది మొదటి శుభాశుభ శకునం.
ఆ అమ్మాయి మాటల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని యథాతథంగా మా ఆవిడ మిమిక్రీ చేసి చెప్పింది. ఇది మూడో అపశకునమైనా మిమిక్రీ కళ సాధనలో పరిణితి సాధించి…పండించిన హాస్యంగానే పరిగణించాలి.
మా ఇంట్లో ఉన్నది నలుగురు. ఇందులో అందరికీ ఒక్కో కారణంతో ‘సర్’ తిరస్కారం జరిగింది. ఇది నాలుగో సామూహిక అపశకునం.
మాలాగా ఎందరికో ఇలాగే జరిగిందని తెలిసింది. ఇది వారందరికీ అపశకునమే అయినా మాకు ఓదార్పులాంటిది!
ఇన్ని సార్లు మనల్ను ఇలా తిప్పుతున్నారు…మనం ఇవ్వడానికి కూడా ఇక ఆధారాల్లేవు…పోతే పోయింది…ఓటరు కార్డు రాక, ఓటు హక్కు రాకపోతే మనకు భౌతికంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఏయే నష్టాలు జరుగుతాయి? అని మా అబ్బాయి ఉడుకురక్తం కార్యకారణ సంబంధాలతో ప్రశ్నించింది. మావాడి ప్రశ్నను ప్రశ్నించే అచ్చమైన ప్రజాస్వామిక స్ఫూర్తికి నిదర్శనంగా చూడాలా? లేక ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదంగా చూడాలా తెలియక నేను తూరుపు తిరిగి దండం పెట్టుకున్నాను.
మా అత్త వయసు 75. అప్పటి వాళ్ళ అమ్మా నాన్న వయసులు ఇప్పటి డేటాతో మ్యాచ్ కావట్లేదట. నాకేమో పాత డాక్యుమెంటుతో శ్రుతి కలవలేదట. మా ఆవిడకేమో గతంలో సర్ పేరుతో సరిపోవడం లేదట. మా అబ్బాయికేమో ఇంకా డీటైల్స్ కావాలట.
“ఇది అయ్యేది కాదులే. ఇక మన ఓట్లు గోవిందా!” అంటూ “ఇప్పటికి మనం ఎన్నిసార్లు ఓట్లు వేసి ఉంటాం? ఇప్పటికి మనం ఎన్నెన్ని కోట్లు ప్రభుత్వానికి అదాయప్పన్ను మెదలు అనేక పన్నులు కట్టి ఉంటాం?” అంటూ మా ఆవిడ రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాల్లోకి; వాటి అన్వయాల్లోకి వెళ్ళింది. జర్నలిజం, సైకాలజీ, మేనేజ్మెంట్ కోర్సులు చేసిన బాధ్యతగల భారతదేశపు పౌరురాలు. రేప్పొద్దున ఓటు హక్కు లేకపోయినా…ఆమె అడిగే హక్కును కాదనే హక్కు నాకు ఉండదు. కానీ ఎవరినడగాలో నాకు తెలియదు.
బెంగళూరులో భారతరత్నమైన శాస్త్రవేత్తనే ఓటు హక్కుకోసం తన ఉనికిని తననే నిరూపించుకోమని ‘సర్’ అడిగినప్పుడు ఆఫ్టరాల్ మేమెంత? అన్నదే ఇందులో మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం లాంటిది!
‘సర్’ లో అందరికీ ఇలాగే జరిగి ఉండకపోవచ్చు. నాకు ఏలినాటి శనివల్ల ‘సర్’ క్లియర్ చెయ్యాలని గట్టిగా అనుకుంటున్నా రాహువు సర్ అంతకంటే గట్టిగానే అడ్డుకుంటున్నాడు. రాహువు సర్ వదిలినా జాతకచక్రంలో కుజుడు సర్ వక్రదృష్టివల్ల గతం డేటా మాయమయ్యింది. ఒకవేళ గతం డేటా దొరికినా శుక్రుడు సర్ మధ్యలో కలగజేసుకోవడంవల్ల బుధుడు సర్ నీచంలో పడ్డాడు. దాంతో సూర్యుడు సారే దిగివచ్చినా…శుక్రమహర్దశ పట్టినా…మా పోబోయే ఓటు హక్కును మాకు ఎలాగైనా ఇప్పించడం అంత ఈజీ కాదేమో అన్నది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా మౌలికమైన అవగాహన.
దీనికి మా ఇంటిపక్కన ఎర్రమంజిల్ గుడిలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం మినహా మరో మార్గం లేదని మా ఇంటి పురోహితుడి సలహా!
దిక్కులేనివారికి దేవుడే దిక్కు!
మా ఓటు హక్కుకు దేవుడే దిక్కు!!
‘సర్’ అన్నది పదాల ముందు అక్షరాల పొడి రూపమైనా ఇప్పుడది దేశం పట్టనంత పెద్ద నామవాచకం.
ఇంత సువిశాల దేశానికి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆదిమూలం. పునాది. భాగస్వామ్యం. కర్తవ్యం. బాధ్యత.
రేప్పొద్దున ఓటులేని అనాథలుగా మేము ఈ పునాదికి, భాగస్వామ్యానికి, కర్తవ్యానికి, బాధ్యతకు దూరమవుతామేమో అన్న బాధ మాత్రం లోలోపల దహించివేస్తోంది.
కొన్ని ఏడుపులకు అర్థం వెతుక్కోకూడదు. పరమార్థం గ్రహించాలి-అంతే!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article