Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?

September 15, 2026 by M S R

.

హిందూ… ఈ పత్రిక ఓ ఫుల్ పేజీ యాడ్ పబ్లిష్ చేసింది… కానీ తరువాత ఆ యాడ్ పబ్లిష్ చేసినందుకు తనే రీడర్స్‌కు, సొసైటీకి అపాలజీ చెప్పింది… పాత్రికేయ నైతికతకు, ప్రమాణాలకు పెట్టింది పేరు అని చెప్పుకునే ఆ పత్రికే క్షమాపణలు చెప్పుకున్నదీ అంటే… ఇది చాలా ప్రశ్నల్ని లేవనెత్తే ఓ కీలకాంశమే… జర్నలిస్టులే కాదు, సొసైటీ కూడా డిబేట్ చేసుకోవాల్సిందే… ఎందుకంటే, మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువే కాబట్టి!!

ఏది పడితే అది పబ్లిష్ చేసేసి… అది యాడ్ (ప్రకటన) మాత్రమే, పత్రికకు సంబంధం అని చెప్పేస్తే బాధ్యత అయిపోయిందా? ఒక వివాదాస్పదుడు, నేరస్థుడికి ఫుల్‌పేజీ యాడ్ వేసి, తర్వాత క్షమాపణ చెప్పడం అనేది అసాధారణం! అసలు తప్పెక్కడ జరిగింది?

Ads

ఒక వార్తను పబ్లిష్ చేయడానికి ముందు జర్నలిస్టు వంద ప్రశ్నలు అడగాలి. ఆధారం ఏమిటి? ఎవరు చెప్పారు? నిజమేనా? మరో వైపు ఏమంటోంది? కోర్టులో ఏమైంది? పత్రాలు ఏమంటున్నాయి? క్రాస్ చెక్‌తోపాటు అది రీడర్స్‌కు ఎంతవరకు అవసరం అనేది కూడా చూడాలి… కానీ అదే విషయం ఒక యాడ్ రూపంలో వస్తే ఈ ప్రశ్నలన్నీ అవసరం లేదా?

ఇప్పుడు భారత ప్రింట్ మీడియా ముందున్న అసలు ప్రశ్న ఇదే…. సెప్టెంబర్ 12న ‘ది హిందూ’ ఢిల్లీ, మొహాలి, నార్త్ ఇండియా ఎడిషన్లలో ఫ్రంట్ పేజీ మొత్తాన్ని ఆక్రమించిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. “What is Dera Sacha Sauda? (Facts vs Fiction)” అనే శీర్షికతో వచ్చిన ఈ ప్రకటన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను సమర్థించే విధంగా ఉంది. అదే ప్రకటన హిందీలో దైనిక్ భాస్కర్ ఢిల్లీ ఎడిషన్‌లోనూ కనిపించింది.

ఇది చిన్న విషయం కాదు. గుర్మీత్ రామ్ రహీమ్ ఇద్దరు మహిళా శిష్యులపై లైంగికదాడి చేసిన కేసులో 2017లో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన వ్యక్తి. ప్రస్తుతం కూడా ఆ శిక్షే అమల్లో ఉంది. పదే పదే పెరోల్‌పై వస్తున్నాడు, పోతున్నాడు…  21 రోజుల ఫర్లాఫ్ మీద బయటే ఉన్నాడు ఇప్పుడు… అయితే ఆ ప్రకటనలో రామ్ రహీమ్ గురించి కనిపించిన చిత్రం మాత్రం పూర్తిగా భిన్నం.

‘కుట్ర జరిగిందా?’… ‘అవును… పూర్తిగా!’ …. యాడ్‌లో ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు కూడా యాడ్ ఇచ్చినవారే చెప్పేశారు… “Was there a conspiracy against Guru Ji?” సమాధానం — “Yes, absolutely.” అంటే రామ్ రహీమ్‌ను ఇరికించడానికి కుట్ర జరిగిందని, తప్పుడు సాక్షులను డబ్బు ఆశ చూపించి తయారు చేశారని ప్రకటన చెబుతోంది…

మరి సీబీఐ విచారణ, కోర్టు తీర్పు అన్నీ ఫేక్ అని, కుట్ర అని ఈ యాడ్ చెబుతున్నట్టే కదా… ఇదే కాదు, వరుస పెరోల్స్, ఫర్లాఫ్‌లపై కూడా ప్రశ్నలే… “ఇది VIP treatment కాదా?” యాడ్ సమాధానం — “No, not at all.” అంతేకాదు, అవన్నీ చట్ట ప్రకారమే లభించాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నాయని చెప్పింది…

ఇంతటితో ఆగలేదు… డేరా సచ్చా సౌదా చేసిన సామాజిక సేవల పేరుతో భారీ సంఖ్యలు కూడా యాడ్‌లో పెట్టారు.

7.5 కోట్ల మందికి వ్యసనాల నుంచి విముక్తి …
35.40 కోట్ల చెట్లు నాటాం…
33.85 లక్షల యూనిట్ల రక్తాన్ని దానం చేశాం…
22 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాం…

ఆ సొంత డబ్బా మాటెలా ఉన్నా… “ADVERTISEMENT” అని రాసేస్తే … ఇక ఏదైనా చెప్పుకోవచ్చా..?  ఇక్కడ ‘ది హిందూ’ తరఫున ఒక వాదన ఉంది. అది వార్తగా ప్రచురించలేదు. పైనే ADVERTISEMENT అని ఉంది. కింద మరో disclaimer కూడా ఉంది.

“The Hindu has no editorial or journalistic involvement in the creative…” అంటే ఈ ప్రకటనలోని విషయానికి తమ సంపాదకీయ ప్రమేయం లేదని పత్రిక స్పష్టం చేసింది. సరే. అయితే ఒక ప్రశ్న. ఒక వార్తకు బాధ్యత వహించేది ఎడిటోరియల్ డెస్క్ మాత్రమేనా? ప్రకటనల డెస్క్‌కు అసలు పాత్రికేయ, నైతిక బాధ్యత ఉండదా?

ఒక వ్యక్తి డబ్బులు చెల్లించి ఒక పత్రికలో “న్యాయస్థానం తప్పు చేసింది… అతడిపై కుట్ర జరిగింది… అతడు స్వచ్ఛమైనవాడు… అతని మీద వచ్చిన ఆరోపణలు అబద్ధాలు” అని ప్రచారం చేసుకుంటే, పత్రిక కేవలం “ఇది యాడ్” అని చెప్పి పక్కకు తప్పుకోవచ్చా? ఇదే అసలు నైతిక ప్రశ్న.

రేప్పొద్దున ఇంకెవరో ఇంకేదో రాసిచ్చి, డబ్బులిచ్చి, పబ్లిష్ చేయాలని అడిగితే వేసేస్తారా..? అసలే అడ్వర్టోరియల్ అనే దుష్ట సంప్రదాయం పెరిగింది… అంటే యాడ్ అని కూడా చెప్పకుండా… బయాస్డ్ కథనాల్ని రాసిపారేయడం! దానికితోడు ఇదుగో ఇలాంటి యాడ్స్…

ప్రకటనను వార్తగా పాఠకుడికి అమ్ముతున్నామని ఎవరూ అనడం లేదు. కానీ పత్రిక తన పేరుతో, తన ముద్రతో, తన ఫ్రంట్ పేజీపై ఆ సందేశానికి, సమర్థనకు స్థలం ఇస్తోంది. అంటే కనీస పరిశీలన బాధ్యత పూర్తిగా పోతుందా?

ఫ్రంట్ పేజీకి కూడా ఒక విలువ ఉంటుంది. ఒక చిన్న క్లాసిఫైడ్ యాడ్‌కు, ఫ్రంట్ పేజీ ఫుల్‌పేజీ ప్రకటనకు ఒకే నైతిక బరువు ఉండదు. ముఖ్యంగా ‘ది హిందూ’ లాంటి పత్రిక విషయంలో మరింత ఎక్కువ. ఎందుకంటే దశాబ్దాలుగా ఆ పత్రిక తన బ్రాండ్‌ను వాస్తవ నిర్ధారణ, సంపాదకీయ గంభీరత, సంస్థాగత నమ్మకం చుట్టూ నిర్మించుకుంది. పైగా పత్రికల బలమైన నైతిక సూత్రం ఏమిటంటే… పత్రికలో అచ్చయిన ప్రతి అక్షరానికీ పత్రికదే బాధ్యత!!

అందుకే ఇక్కడ ప్రశ్న: “ది హిందూ యాడ్ తీసుకుందా?” కాదు. “ఏ యాడ్ తీసుకోవాలి, ఏ యాడ్ తిరస్కరించాలి అన్నదానికి కూడా ఒక ప్రమాణం ఉండాలా?” అన్నది. ఒక కంపెనీ తన కొత్త సబ్బు బాగుందని యాడ్ ఇస్తే అది వేరు… ఒక రాజకీయ నాయకుడు తన అభివృద్ధి కార్యక్రమాలు గొప్పవని యాడ్ ఇస్తే అదింకా వేరు…

కానీ అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి తరఫున, అతడిపై జరిగిన న్యాయ ప్రక్రియనే కుట్రగా చిత్రీకరిస్తూ, అతడిని సామాజిక సేవకుడిగా చూపించే పూర్తి పేజీ ప్రకటన వస్తే? అక్కడ కనీస editorial judgement అవసరం లేదని చెప్పడం కష్టం.

the hindu

మరి డ్యామేజ్ జరిగితే? ఇదే మరో ముఖ్యమైన ప్రశ్న. ఒక తప్పుడు వార్త ప్రచురిస్తే పత్రికపై విమర్శ వస్తుంది. కరెక్షన్ ఇస్తుంది. క్షమాపణ చెబుతుంది. కానీ ఒక ప్రకటనలో తప్పుడు లేదా నిర్ధారణ కాని సమాచారం వెళ్లిపోయినప్పుడు?

“మేము రాయలేదు… డబ్బులు తీసుకుని వాళ్లు ఇచ్చింది పబ్లిష్ చేశాం” అని చెప్పడం సరిపోతుందా? పాఠకుడికి అది ఎవరి పేజీలో కనిపించింది? ది హిందూ పేజీలో.

దాని masthead ఎవరిది? ది హిందూదే.

దాన్ని లక్షలాది మంది పాఠకులు చూసింది ఎక్కడ? ది హిందూలోనే.

అయితే డ్యామేజ్‌కు ప్రకటన ఇచ్చినవారే పూర్తిగా బాధ్యత వహించాలి అని చెప్పడం ఎంతవరకు సరైనది?

సరే , తెరవెనుక ఏం జరిగిందో… తనే తప్పు తెలుసుకుని లెంపలేసుకుందో గానీ, చివరకు… ది హిందూ క్షమాపణ చెప్పింది వివాదం పెరగడంతో సెప్టెంబర్ 13న ‘ది హిందూ’ వెనక్కి తగ్గింది. పత్రిక స్వయంగా ఆ ప్రకటనను “offensive”, “deeply offensive” అని పేర్కొంది. ఇంకా ముఖ్యంగా — unconditional apology చెప్పింది.

“డ్రగ్ మాఫియాలు, డేరాకు వ్యతిరేక శక్తులు రామ్ రహీమ్‌పై కుట్ర చేశాయి” అన్న ఆరోపణలు కూడా ప్రకటనలో ఉన్నాయని పేర్కొంటూ, దాన్ని ప్రచురించినందుకు పాఠకులకు క్షమాపణ చెప్పింది. ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్. రామ్ కూడా ఈ క్షమాపణను అన్ని ఎడిషన్లలో ప్రచురించినట్టు తెలిపారు. అంటే ప్రకటన వెళ్లిన ప్రాంతాలకే పరిమితం కాకుండా, పత్రిక దేశవ్యాప్తంగా ఈ తప్పును అంగీకరించింది…

తప్పు సరిదిద్దుకునే సంస్కారం… (సవరణ, ఖండన, వివరణ వంటి పదాలు కాదు, స్పష్టంగా అపాలజీ అని రాసుకుంది…) చాలా పత్రికలకు ఇదీ లోపించింది… పర్టిక్యులర్‌గా పార్టీల పత్రికలయితే మరీ ఘోరం!

దైనిక్ భాస్కర్ సంగతేంటి? ఇంకో ఆసక్తికరమైన విషయం. అదే ప్రకటన దైనిక్ భాస్కర్ ఢిల్లీ ఎడిషన్‌లోనూ వచ్చింది. ‘ది హిందూ’ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా భాస్కర్‌పై మాత్రం ఇలాంటి స్పందన కనిపించలేదని సెప్టెంబర్ 13న వచ్చిన రిపోర్టులు పేర్కొన్నాయి. ఇది నిజమైతే, ఈ వివాదం ఇంకా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.

ప్రింట్ మీడియా ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది? ఒకప్పుడు పత్రికకు ప్రకటన ఆదాయం అవసరమే అయినా, “ఇది మా పేజీ. మా పాఠకుడికి మేము బాధ్యత వహించాలి” అన్న భావన ఉండేది. ఇప్పుడు డిజిటల్ మీడియా పోటీ, తగ్గుతున్న ప్రింట్ ప్రకటన ఆదాయం, భారీ నిర్వహణ ఖర్చులు, మార్కెట్ ఒత్తిళ్లు… ఇవన్నీ పత్రికలపై ఉన్నాయి.

అందుకే ఒక ప్రమాదకరమైన సరిహద్దు ముందుకొస్తోంది. డబ్బు ఇచ్చినవాడు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పుకోవచ్చు… పత్రిక కేవలం ప్రింటింగ్ ప్రెస్‌గా మారిపోతుందా? అలా అయితే జర్నలిజం ఎక్కడ? ‘యాడ్’ అనే రెండు అక్షరాలు అన్ని బాధ్యతలనూ తుడిచేస్తాయా?

ఇక్కడ ‘ది హిందూ’పై ఒక విమర్శ చేయాల్సిందే. వార్తలో fact-checking అవసరమని చెప్పే పత్రిక, ప్రకటనలో మాత్రం అదే ప్రమాణాన్ని పూర్తిగా పక్కన పెట్టకూడదు. అయితే మరోవైపు ఒక విషయం కూడా స్పష్టంగా చెప్పాలి.

ప్రకటనలోని ప్రతి వాదనను వార్తలా fact-check చేయాలని చెప్పడం కూడా ఆచరణాత్మకంగా సరైన ప్రమాణం కాదు. వాణిజ్య ప్రకటనకు, సంపాదకీయ కథనానికి తేడా ఉంది. కానీ ఆ తేడా ఉన్నంత మాత్రాన చట్టవిరుద్ధం, మోసం, ద్వేషం, నేరాన్ని సమర్థించడం, న్యాయస్థాన తీర్పులను వక్రీకరించడం లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే తీవ్రమైన ఆరోపణలను ఎలాంటి scrutiny లేకుండా ప్రచురించాల్సిన బాధ్యత పత్రికకు ఉండదు.

అసలు మంచి మీడియా సంస్థ గొప్పదనం ఏ వార్తను ప్రచురించిందో మాత్రమే కాదు… ఏదాన్ని ప్రచురించడానికి నిరాకరించిందో కూడా తెలుస్తుంది. అందుకే ఈ ఘటనలో ‘ది హిందూ’ క్షమాపణ చెప్పడం మంచిదే. కానీ క్షమాపణతో కథ ముగిసిపోకూడదు.

ఆ ప్రకటనను ఎవరు స్వీకరించారు? ఎవరు పరిశీలించారు? ఏ స్థాయిలో ఆమోదించారు? ఎందుకు ఫ్రంట్ పేజీ ఇచ్చారు? ఇలాంటి ప్రకటనలకు ఇకపై ఎలాంటి ప్రమాణాలు ఉంటాయి? వీటికి సమాధానాలు వస్తేనే ఈ క్షమాపణకు విలువ ఉంటుంది.

లేకపోతే రేపు ఇంకొకరు డబ్బులు ఇస్తారు. ఇంకొక వివాదాస్పద వ్యక్తిని “మహాత్ముడు” చేస్తారు. మరో సంస్థ తన గణాంకాలను “నిజాలు”గా ముద్రిస్తుంది. పత్రిక మాత్రం కింద చిన్న అక్షరాల్లో… “We have no editorial involvement…” అని రాసుకుంటుంది. అది జర్నలిజం కాదు. అది కేవలం ప్రింటింగ్ వ్యాపారం.

మరి భారతీయ ప్రింట్ మీడియా నిజంగా ఆ దిశగా వెళ్తోందా? ఈ రామ్ రహీమ్ యాడ్ వివాదం అసలు అడిగిన ప్రశ్న అదే. ఇక్కడ రెండు మూడు విషయాలను వేరు చేయాలి:

1) యాడ్ అంటే డబ్బు తీసుకుని ప్రకటనదారుడి సందేశాన్ని ప్రచురించడం. అది వార్త కాదని పాఠకుడికి స్పష్టంగా తెలియాలి…

2) Advertorial అంటే ప్రకటనలా డబ్బు తీసుకున్న కంటెంట్‌ను వార్తా కథనం రూపంలో చూపించడం. అందుకే అది ఇంకా సున్నితమైన వ్యవహారం. పాఠకుడికి ఇది సంపాదకీయ కంటెంటా, చెల్లింపు ప్రచారమా అన్నది స్పష్టంగా ఉండాలి…

… పైగా “Facts vs Fiction” అనే టైటిల్ పెట్టడం చాలా కీలకం… ఎందుకంటే అది సాధారణంగా “ఇదిగో మా సంస్థ ఇచ్చిన ప్రచార సందేశం” అని చెప్పడం కాదు… “ఇందులో నిజం ఏది, అబద్ధం ఏది మేము చెబుతున్నాం” అన్న authorityని ఆ శీర్షిక స్వయంగా తీసుకుంటోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions