Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!

September 19, 2026 by M S R

.

మాజీ యాంకరిణి ఉదయభాను… నీ 15 ఏళ్ల కల ఇదేనా..? తెలంగాణ కథల్ని, కల్చర్‌ను, ఫోక్‌ను, మట్టి వాసనల్ని  ప్రపంచం మాట్లాడుతున్న వేళ… తమరు తమిళ అడాప్టేషన్‌తో జబ్బలు చరుచుకోవడమేనా? పైగా ఎవరైనా టచ్‌లోకి వస్తే కంటెంటు క్రియేట్ చేసి పెడతావా..? అసలు ఏమైంది నీకు..?

తెలుగు ఓటీటీకి ఇప్పుడు కథల కొరత లేదు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వస్తున్న ఫోక్, కల్చర్, స్థానిక జీవితం, పల్లె నేపథ్య కథలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. కొత్త కథ చెప్పాలంటే మన చుట్టూనే వంద కథలు ఉన్నాయి. మన భాషలో, మన నేలలో, మన మనుషుల్లో, మన యాసలోనే ఎన్నో అద్భుతమైన కథలు దాగి ఉన్నాయి. నటీనటుల్లోనూ ప్రతిభ ఉంది… కొత్త మొహాలు అదరగొడుతున్నాయి….

Ads

అలాంటి సమయంలో ‘పంచనామా’ వచ్చింది. పేరు మాత్రం అదిరిపోయింది. కానీ పేరు చూస్తే పంచనామా… సిరీస్ చూస్తే పంచనామా కంటే ముందు ప్రేక్షకుడే తన సహనానికి పంచనామా రాసుకోవాల్సిన పరిస్థితి!

జీ5లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్‌కు ఉదయభాను నిర్మాత, షోరన్నర్‌గా వ్యవహరించింది. ఆమె స్వయంగా దీన్ని దాదాపు 15 ఏళ్లుగా కలగన్న ప్రాజెక్టుగా చెప్పుకుంది. అంతేకాదు, నిర్మాతగా మారడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నో ఏళ్లుగా ఈ ప్రయాణం కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చింది… నవ్వొచ్చింది…

అది విన్నప్పుడు సహజంగానే ప్రేక్షకుడికి ఒక అంచనా ఏర్పడుతుంది. 15 ఏళ్ల కల అంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి. తెలుగు కథపై నమ్మకం ఉండాలి. మన ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఇవ్వాలన్న తపన ఉండాలి.

కానీ ‘పంచనామా’ చూస్తే ఆ అంచనాలే ముందుగా పంచనామా అయిపోతాయి. ఇది పూర్తిగా ఒరిజినల్ తెలుగు కథ కాదు. లభించిన సమీక్ష వివరాల ప్రకారం తమిళ సిరీస్ ‘రేగై’ ఆధారంగా రూపొందించిన అడాప్టేషన్. అడాప్టేషన్ తప్పేమీ లేదు. మంచి కథ ఎక్కడున్నా తీసుకుని మన ప్రేక్షకుడికి తగ్గట్టుగా మలచుకోవచ్చు. కానీ అసలు ప్రశ్న అక్కడే మొదలవుతుంది.

తమిళంలో ఉన్న కథను తెలుగులోకి మార్చడం మాత్రమేనా? లేక తెలుగు కథా ప్రపంచానికి ఏదైనా కొత్తది జోడించామా? ‘పంచనామా’ చూస్తే రెండో ప్రశ్నకు సమాధానం వెతకడం కష్టమే.

కథకు కొంత పొటెన్షియల్ ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే తొందరపాటుగా సాగింది… క్యారెక్టర్లు బలంగా లేవు…  ఎమోషన్, థ్రిల్ పెద్దగా పండలేదు… మొత్తంగా సిరీస్ సాధారణ మూసలోనే నడిచింది… వెరసి ఉదయభాను ఇజ్జత్ పంచనామా అయిపోయింది…

ఒకప్పుడు టెలివిజన్‌పై తనదైన ముద్ర వేసి, పదే పదే వివాదాలతో మాత్రమే తెర మీదకు వచ్చే పక్కా నెగెటివ్ కేరక్టర్ ఉదయభాను… తోటి యాంకర్లపై ఏడుపు… సరే, వ్యక్తిగతం కావచ్చు, చాన్నాళ్లు తెర మీద లేదు, ఆ మెంటాలిటీకి భయపడి ఎవరూ చాన్సులివ్వరు… ఇప్పుడు నిర్మాతగా తిరిగి రావడం మంచిదే… 15 ఏళ్ల కలను నిజం చేసుకోవడం కూడా అభినందించాల్సిన విషయమే.

కానీ ఒక కళాకారిణి తిరిగి వచ్చినప్పుడు ప్రేక్షకుడు తన పాత గుర్తింపును మాత్రమే చూడడు. కొత్తగా ఏం తీసుకొచ్చింది అన్నదే చూస్తాడు. అక్కడే ‘పంచనామా’ చిక్కుల్లో పడుతుంది.

ఒకవైపు సిరీస్‌లో పెద్దగా కొత్తదనం కనిపించదు. మరోవైపు సిరీస్ బయట మాత్రం ఉదయభాను కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. టీవీ ఇండస్ట్రీలో పీఆర్ కల్చర్, కొందరు యాంకర్లు అన్ని కార్యక్రమాలను గుత్తాధిపత్యంగా నడుపుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇటీవల చర్చకు వచ్చాయి. ఆమె ఎవరినీ నేరుగా పేరుపెట్టి విమర్శించకపోయినా, ఆ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో చర్చ నడిచింది.

ఇదంతా చూస్తుంటే ఒక విచిత్రమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద కంటెంట్ మాట్లాడాలి. స్క్రీన్ బయట కాంట్రవర్సీ మాట్లాడకూడదు. ఆ సోయి ఉదయభానులో కనిపించదు… అలవిమాలిన ఫ్రస్ట్రేషన్ ఏదో కమ్మేసినట్టుంది పాపం…

తెలంగాణకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ఊపు వచ్చింది. తెలంగాణ ఫోక్, జానపద సంగీతం, స్థానిక భాష, గ్రామీణ జీవితం, ఇక్కడి మనుషుల కథలు జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటి సమయంలో తెలంగాణకు చెందిన ఒక సీనియర్ కళాకారిణి నిర్మాతగా మారి తన తొలి పెద్ద ప్రాజెక్టు చేస్తే…

ఇంకా ఎందుకు మన కథే దొరకలేదు? మన దగ్గర కథలు లేవా? ఒక రైతు కుటుంబం కథ లేదు. ఒక పల్లె కథ లేదు. ఒక తెలంగాణ మహిళ కథ లేదు. ఒక స్థానిక నేరం వెనుక ఉన్న సామాజిక నేపథ్యం లేదు. ఒక జానపద నమ్మకం వెనుక దాగిన మిస్టరీ లేదు? అన్నీ ఉన్నాయి.

కానీ మన దగ్గర ఉన్న కథల్ని తవ్వి తీసే కష్టానికి బదులు, ఇప్పటికే ఇంకో భాషలో ఉన్న కథను తీసుకుని దానికి తెలుగు రంగు పూస్తే సరిపోతుందా? ఇదే అసలు బాధ. ‘పంచనామా’కు సంబంధించిన ప్రమోషనల్ కథనాల్లో దీన్ని ‘తెలుగు ఒరిజినల్’, ‘క్వాలిటీ కంటెంట్’ అంటూ బలంగా ప్రొజెక్ట్ చేశారు. ZEE5 కూడా దీన్ని Telugu Originalగా పేర్కొంటోంది… శుద్ధ అబద్ధం…

అది మార్కెటింగ్ భాష కావచ్చు. కానీ ప్రేక్షకుడు మాత్రం మార్కెటింగ్ పోస్టర్‌తో కాదు… కంటెంట్‌తో తీర్పు చెబుతాడు. ఆరు ఎపిసోడ్లు. ఒక్కో ఎపిసోడ్ 20–31 నిమిషాల మధ్య. మొత్తం పెద్దగా సమయం తీసుకోదు. థాంక్ గాడ్… ఇదొక్కటే కొంత ఉపశమనం.

తెలంగాణలో ఒక సామెత ఉంది… “ఇజ్జత్ పంచనామా అయిపోయింది” అంటారు. అంటే పరువు పోయిందని. ‘పంచనామా’ సిరీస్ విషయంలో కూడా ఇప్పుడు ప్రేక్షకుడి నుంచి అదే మాట అనిపిస్తోంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!
  • దానం అనర్హత కేసులో సుప్రీంకోర్టుకు టీబీజేపీ!
  • హార్వర్డ్ హైదరాబాద్‌కు..! ఇక విదేశీ విద్యకూ భాగ్యనగరం!!
  • ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!
  • ఆస్కార్‌కు గొందల్ ! భారీ పోటీ నడుమ ఈ మూవీయే ఎందుకు ఎంపిక?!
  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!
  • మీనాక్షి నటరాజన్! వదలక వెంటాడుతున్న ఆ రెండు కేసులూ !!
  • తెలంగాణ అమరుల కథలు వేర్వేరు- ఏ సోయీ లేని పార్టీల ప్రముఖులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions