.
ఇతర భాషలు వదిలేయండి…. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రియాలిటీ షో అని డప్పుకొట్టుకుంటుంది కదా బిగ్‌బాస్ టీమ్… కానీ తెలుగు విషయానికొస్తే ప్రతి సీజన్‌కు మరీ నాసిరకం సరుకు వచ్చి చిరాకు పుట్టిస్తోంది… మరీ ప్రస్తుత సీజన్ అయితే గాలి సరుకు పోగేశారు… మరి ఈ స్థితిలో డిఫరెంట్‌గా, దానికి పోటీగా మరో రియాలిటీ షో వస్తే..?
ఎస్, వస్తోంది తెలుగులో కూడా… ఆల్రెడీ హిందీలో రెండు సీజన్లు… హిట్… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం… ఆసక్తికరంగా ఉంటుంది…
Ads
రియాలిటీ షో అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘బిగ్‌బాస్’. ఒక భారీ ఇల్లు.. అందులో సెలబ్రిటీలు.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కలిసి జీవించడం.. టాస్కులు.. నామినేషన్లు.. గొడవలు.. స్నేహాలు.. ప్రేమలు.. ఎలిమినేషన్లు.. ఇలా వారాలు, నెలలు గడిచేకొద్దీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూడటమే గేమ్.
ఇప్పుడు ఆ రియాలిటీ షో ఫార్మాట్‌కు పూర్తిగా భిన్నమైన గేమ్ ఒకటి తెలుగులోకి వస్తోంది. అదే ‘ది ట్రెయిటర్స్’.
అయితే ఇది బిగ్‌బాస్‌కు మరో పేరు కాదు. బిగ్‌బాస్‌లో మాదిరిగా రోజూ టీవీలో కనిపించదు. టీవీలో అసలే రాదు. ఓన్లీ ఓటీటీ.. అదీ వారానికి ఒక్కరోజే! అక్టోబర్ 15 నుంచి Prime Videoలో స్ట్రీమింగ్ కానున్న ఈ షోలో ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు వస్తాయి. మొత్తం 10 ఎపిసోడ్లు.. నాలుగు వారాల్లోనే గేమ్ ముగిసిపోతుంది.
అంటే పదీ పదిహేను వారాల రియాలిటీ షో మారథాన్ కాదు. ప్రేక్షకుడికి కూడా అంత సుదీర్ఘమైన కమిట్‌మెంట్ అవసరం లేదు. నాలుగు వారాలు.. పది ఎపిసోడ్లు.. ఖేల్ ఖతం!

ఒక ఇంట్లో బందీలు కాదు…
ఇక్కడ మరో ముఖ్యమైన తేడా ఉంది. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లు ఒక ఇంట్లో కలిసి జీవిస్తారు. అక్కడ వాళ్ల రోజువారీ జీవితం కూడా గేమ్‌లో భాగమే. ఎవరు ఎవరితో మాట్లాడారు? ఎవరు ఎవరితో గొడవపడ్డారు? ఎవరు ఎవరికి దగ్గరయ్యారు? ఎవరు గ్రూపు కట్టారు? ఇవన్నీ ప్రేక్షకుడి ఆసక్తిలో భాగం.
‘ది ట్రెయిటర్స్’లో మాత్రం అసలు ఆట మనుషుల్ని నమ్మడంలో ఉంది. 20 మంది కంటెస్టెంట్లు ఒకే ప్రపంచంలోకి వస్తారు. కానీ అందరూ ఒకే టీమ్ కాదు. కొందరు ‘ఇన్నోసెంట్స్’.. మరికొందరు రహస్యంగా ‘ట్రెయిటర్స్’.
ఇన్నోసెంట్స్ పని.. తమ మధ్య దాక్కున్న ట్రెయిటర్స్‌ను గుర్తించడం. ట్రెయిటర్స్ పని.. తాము ఎవరో బయటపడకుండా మిగతావాళ్లను మోసం చేయడం. అక్కడ మొదలవుతుంది అసలు ఆట.
ఎవరిని నమ్మాలి?
ఎవరు అబద్ధం చెబుతున్నారు?
ఎవరు కావాలనే ఇంకొకరిపై అనుమానం పెడుతున్నారు?
ఎవరు స్నేహితుడిలా కనిపిస్తూ లోపల మాత్రం గేమ్ మార్చేస్తున్నారు?
బిగ్‌బాస్‌లో వ్యక్తిత్వం గేమ్‌ను నడిపిస్తే.. ట్రెయిటర్స్‌లో అనుమానం గేమ్‌ను నడిపిస్తుంది.
ప్రేక్షకుడికీ ఒక కొత్త అనుభవమే.. బిగ్‌బాస్‌లో ప్రేక్షకుడు ఇంట్లో జరిగే గొడవలు, స్నేహాలు, వ్యూహాలు అన్నీ చూస్తూ ఎవరు నచ్చారు.. ఎవరు నచ్చలేదు అనే అభిప్రాయం ఏర్పరుచుకుంటాడు. కానీ ‘ది ట్రెయిటర్స్’లో మాత్రం మరో రకమైన ఉత్కంఠ ఉంటుంది.
“అరే.. మనం నమ్ముతున్న ఈ వ్యక్తే ట్రెయిటర్ అయితే?” అదే ఈ గేమ్‌లో అసలు కిక్. కంటెస్టెంట్ బాగా మాట్లాడుతున్నాడంటే అతను మంచివాడని అర్థం కాదు. మరీ మంచివాడిలా కనిపిస్తున్నాడంటేనే అనుమానం రావచ్చు. ఒకరిని కాపాడుతున్నాడంటే అతనికి అతనిపై నమ్మకమా? లేక ఇద్దరూ కలిసి ఆడుతున్నారా?
- అంటే ఇక్కడ నిజం తెలుసుకోవడం కంటే.. అబద్ధాన్ని కనిపెట్టడమే గేమ్. ఈ ఫార్మాట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో అడాప్ట్ అయింది. భారతదేశంలో హిందీ వెర్షన్ రెండు సీజన్లు పూర్తి చేసుకుని Prime Videoకు బ్రేక్‌అవుట్ రియాలిటీ హిట్‌గా నిలిచింది.
హిందీలో హిట్.. ఇప్పుడు తెలుగులో… హిందీలో కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన ఈ షోకు బాలీవుడ్, టెలివిజన్, డిజిటల్ రంగాల నుంచి సెలబ్రిటీలు వచ్చారు. రెండో సీజన్ కూడా పూర్తయింది. ఇప్పుడు అదే ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నారు.
తెలుగు వెర్షన్‌కు తేజ సజ్జ హోస్ట్. హీరోగా ఇప్పటికే తనదైన గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ఇప్పుడు రియాలిటీ షో హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఇది కూడా ఈ షోపై ఆసక్తి పెంచుతున్న అంశమే.
ఇక కంటెస్టెంట్ల జాబితాలో కూడా తెలిసిన ముఖాలే కాదు.. విభిన్న రంగాలకు చెందిన ఆసక్తికరమైన పేర్లు కనిపిస్తున్నాయి. సింగర్స్ చిన్మయి శ్రీపాద, స్వీకర్ అగస్తి, నటులు హర్ష వర్ధన్, ప్రగతి మహావాది, విద్యుల్లేఖ రామన్, విష్ణు ఓయ్, ఆశికా పదుకొనే, వర్షా డిసౌజా తదితర మొహాలు ఫస్ట్ సీజన్‌లో అనేసరికి షో మీద ఆసక్తి పెరుగుతోంది… మొత్తం 20 మంది పోటీదారులు ఉన్నారు.
బిగ్‌బాస్‌కు అసలు తేడా ఇదే.. బిగ్‌బాస్‌లో “ఇతను ఎలా ఉంటాడు?” అనేది ప్రశ్న. ట్రెయిటర్స్‌లో “ఇతను నిజంగానే ఇలానే ఉన్నాడా?” అనేదే ప్రశ్న. బిగ్‌బాస్‌లో స్నేహం బలపడితే అది ఒక ఎమోషనల్ ట్రాక్. ట్రెయిటర్స్‌లో స్నేహం బలపడితే.. “ఈ స్నేహం వెనుక ఏదైనా గేమ్ ఉందా?” అనే అనుమానం. బిగ్‌బాస్‌లో నామినేషన్ ఒక కీలక ఘట్టం.
ట్రెయిటర్స్‌లో మాత్రం ఎవరిని అనుమానించాలి.. ఎవరిని బయటకు పంపాలి అనేది గేమ్‌లోనే ప్రధాన భాగం. ట్రెయిటర్స్ రహస్యంగా తమ ప్రత్యర్థులను తొలగించే ప్రయత్నం చేస్తారు; మిగిలిన వాళ్లు తమ మధ్య దాగిన ట్రెయిటర్స్‌ను కనిపెట్టి బయటకు పంపాలి.
అందుకే ఇది బిగ్‌బాస్‌కు మరో ప్రత్యామ్నాయం కాదు.. రియాలిటీ షోను మరో కోణంలో చూపించే ప్రయత్నం.
నాలుగు వారాల్లోనే అసలు పరీక్ష… బిగ్‌బాస్‌లా రోజూ ఏం జరిగిందో తెలుసుకోవడానికి టీవీ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్క ఎపిసోడ్ కోసం ఎదురుచూడాలి. ఆ ఎపిసోడ్‌లో ఎవరు ఎవరిని మోసం చేశారు? ఎవరి అసలు రంగు బయటపడింది? ఎవరు ఎవరిపై అనుమానం పెట్టారు? అనే ప్రశ్నలతో తదుపరి గురువారం వరకు ప్రేక్షకుడి క్యూరియాసిటీ కొనసాగుతుంది… స్టార్ మా, నాగార్జునా కాచుకో…!!
Share this Article