.
లిరిక్ రైటర్ చంద్రబోస్ కొన్ని మంచి పాటలు రాసి ఉండొచ్చు… కానీ ఎన్నేళ్లుగానో తనలోని తెలంగాణతనాన్ని లోలోపలే అణుచుకున్నాడు… ఎన్నేళ్లుగానో గాఢ నిద్రలో ఉన్న తనలోని ఓ తెలంగాణ మట్టిమనిషిని తట్టిలేపాడు… పాపం, ఇన్నేళ్లు ఈ తెలంగాణ వ్యతిరేక ఇండస్ట్రీలో బతుకుతూ, అణిగిమణిగి ఉంటూ… పొరపాటున కూడా ఒక్క తెలంగాణ పదాన్ని కూడా తన పాటల్లో రాయడానికి భయపడిన తను హఠాత్తుగా సోయి తెచ్చుకున్నాడు… ఎందుకు..? ఎలా..?
తన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం ఒక పొరపాటు నిర్ణయం… ఆ పాటలో సాహిత్య విలువలు మచ్చుకైనా లేవు సరికదా, అదొక వెర్రి పాట… మనం గతంలోనే చెప్పుకున్నాం… అదేదో రాజమౌళి మార్క్ డబ్బుల లాబీయింగుతో దక్కిన ఆస్కారం… పురస్కారం… మరి ఇప్పుడు..?
Ads
తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్ముదులుపుతున్నాయి… తెలంగాణ నేపథ్యం, తెలంగాణ పాత్రలు, తెలంగాణ యాస, తెలంగాణ మట్టి బాక్సాఫీసు ట్రెండ్… (సరే, సోకాల్డ్ ఆంధ్రా హీరోలు అత్యంత కృతకంగా దీన్నీ ఖూని చేస్తున్నారనేది వేరే చర్చ…) మరోవైపు జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ వంటి రచయితలూ తెలంగాణతనాన్ని దట్టించిన పాటలతో దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నారు…
సో, చంద్రబోస్ మీద ఒత్తిడి పెరిగింది… నీకెందుకు చేతకాదు అనే ప్రశ్న భయంకరంగా ఎదుట నిలిచినట్టుంది… దాంతో తప్పనిసరై తెలంగాణ నడిబొడ్డున చల్లగరిగెలో పుట్టిన తను తన మట్టిని, తన సంస్కృతిని, తన వాతావరణాన్ని గుర్తుకు తెచ్చుకుని ఓ పాట రాశాడు… ఆ పాటే ‘ఎగిలివారంగ లేసి’… శర్వానంద్ నటిస్తున్న భోగి అనే సినిమా కోసం…
ఆ పాట భావంలోనూ అక్కడక్కడా కొన్ని విమర్శించే అంశాలున్నాయి… కానీ తనలోని ఆత్మను నిద్రలేపుకున్నాడు కదా చంద్రబోస్, సో, వాటిని ఇగ్నోర్ చేయొచ్చు… ఈ పాటలో ‘చల్లగరిగె’ కనిపించింది… ప్రత్యేకించి… పాత వరంగల్ జిల్లా మట్టి వాసనలు… (కాసర్ల శ్యామ్ది కూడా వరంగలే)…
(శర్వానంద్ డిఫరెంట్ రగ్గడ్ లుక్, డిఫరెంట్ రోల్, అనుపమ పరమేశ్వరన్ డీగ్లామర్ రోల్, దొరలను ఎదిరించిన ఓ సిక్స్టీస్ నాటి పీరియాడికల్ సినిమా కథా కాకరకాయ గురించి ఇక్కడ చెప్పుకోవడం లేదు, కేవలం పాట గురించే… తెలంగాణ ఫోక్ను బాగా పట్టుకున్న భీమ్స్ సిసిరీలియో ట్యూన్పరంగా దీన్ని కూడా రక్తికట్టించాడు… అఫ్కోర్స్, గాయకులు నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ సరేసరి)
ముందుగా లిరిక్స్…
ఎగిలి వారంగాలేసి… ఇల్లలికి పూదిచ్చి… ఇల్లలికి పూదిచ్చి…
దీగుట్ల దేవతలకు… దీపాలు ముట్టించి… దీపాలు ముట్టించి…
కొట్టంలో బర్లు గొడ్లకు… కుడితినే తాపిచ్చి… కుడితినే తాపిచ్చి…
పజ్జొన్న గడకలోకి… సల్లానీల్లే పోసి… సల్లానీల్లే పోసి…
ముత్తెంత నోట్లో పెట్టి… కడుమాది సద్దిగట్టి… కడుమాది సద్దిగట్టి…
సెలకల్లో తొవ్వబట్టి… సేను తొవ్వబట్టి… సేను తొవ్వబట్టి…
ఎదురు బడ్టోళ్లతోని… పారాశకాలాడి… పారాశకాలాడి…
కండ్ల బడ్టోళ్లతోని… కారెడ్డాలాడుతూ… ఈరెడ్డాలాడుతూ…
బండ్ల బాటల్లా పోతూ… ముండ్ల బాటల్లా పోతూ…
బొందల్లా పోతూ పోతూ… లొందల్లా పోతూ పోతూ…
భూదేవి కడుపులోనా… భూలచ్చిమి గడపలోనా…
రెక్కాలు ముక్కలు చేసే… బక్కా జీవులం… బడుగు జీవులం…
రామ రామ రామ రామ… రామోచ్ఛ రామ రామ…
.
అరె ఓటుంటే ఓటి లేదు… రామోచ్ఛ రామ రామ…
నాగలుంటే ఎద్దు లేదు… రామోచ్ఛ రామ రామ…
రేగడుంటే నీళ్లు లేవు… రామోచ్ఛ రామ రామ…
చెమట నీళ్ల సేద్యము… రామోచ్ఛ రామ రామ…
రగతమే పెట్టుబడి… రామోచ్ఛ రామ రామ…
అటు తిప్పి ఇటు తిప్పి ఆ పంట పండించి…
కల్లాలు గుడిపించీ… బండ్ల మీదికెక్కించీ…
గుమ్మిలోన నింపించీ… కుంచమన్ని తీపిచ్చి…
కుండాలోన ఉడికిచ్చీ…
మేదారీ నరసన్నా… బుట్టాలు తేవంగా… తట్టాలు తేవంగా…
కమ్మారీ గంగన్నా… కత్తులు తేవంగా… కొడవండ్లు తేవంగా…
సాకాలి సమ్మన్నా… బట్టలు సుట్టంగా… బట్టలు సుట్టంగా…
మాదిగా ఐలన్నా… డప్పులు కొట్టంగా… సప్పుడు చేయంగా…
గొల్లోళ్ల సులోచనా… మోదుగాకు తేవంగా… విస్తర్లు కుట్టంగా…
నలుగురీ చేతులతోటి… నైవేద్యం తీయంగా… నైవేద్యం తీయంగా…
పోశమ్మక్కానే కాదు… మైసమ్మక్కానే కాదు…
శివుడికి గానే కాదు… రాముడికి గానే కాదు…
మా ఊరి దేవుడు… మా గుట్ట దేవుడు… బొగ్గుట్ట దేవుడు…
మా ఊరి పటేలుకూ… నైవేద్యం బెడతాముల్లా…
మా ఊరి పటేలుకూ… నైవేద్యం బెడతాముల్లో…
.
నిజంగా చంద్రబోసే రాశాడా అన్నట్టుంది… ఆంధ్రా రీడర్స్ కోసం… కొన్ని తెలంగాణ వ్యవహారిక పదాలు అర్థం కావడం కోసం…
ఇల్లలికి, పూదిచ్చి… ఇల్లు అలికి, అలంకరించి
పజ్జొన్న గడక.. పచ్చ జొన్న గట్క
ఎగిలివారంగా… పొద్దున్నే
దిగుట్ల దేవతలు… గోడలకు చేసే అరను దిగుడు అంటారు, అందులో దేవతలకు…
కడుమది… మిగతాది
పరాష్కమ్… కారెడ్డం… సన్నిహితులతో ఫన్నీ సెటైర్లు, ఛలోక్తులు
ముత్తెంత, ముత్యమంత… కొంచెం
.
ఉంది, 1960, 70 నాటి అచ్చ తెలంగాణ వాతావరణం ఉంది, వ్యవసాయ వాతావరణం అది… చంద్రబోసూ… ఇక కాపాడుకో నీ అస్థిత్వాన్ని ఇకనైనా… బాగుంది పాట…
.
మరి సుద్దాల అశోక్ తేజ ..? అదొక మహా విషాదపర్వం... ఇంకెప్పుడైనా చెప్పుకుందాం...
Share this Article