Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీరూ మాలాగే దారితప్పారా పుష్పా? హీరో అంటేనే అన్‌వాంటెడ్ ఎలిమెంటా?

October 11, 2026 by M S R

.

డాన్‌లను ఆరాధించాలా.. దేశాన్ని దోచుకునేవాళ్లను హీరోలుగా కొలవాలా? నేరం చేసే వాడి దగ్గర డబ్బు, అధికారం, స్టైల్ ఉంటే చాలు.. అతడే కథానాయకుడా? యువతపై తమ సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించే బాధ్యత సినీ పరిశ్రమకు లేదా? పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ చూస్తే ఇలాంటి ప్రశ్నలు వేయాలనిపిస్తుంది…

స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లు, మాఫియా డాన్‌లు.. సినిమా పరిశ్రమకు హీరోలు దొరకడం లేదా? సమాజంలో ఎంతోమంది కష్టపడి బతుకుతున్నారు. నిజాయితీగా పనిచేస్తున్నారు. అన్యాయంపై పోరాడుతున్నారు. కుటుంబాల కోసం తమ జీవితాలను ధారపోస్తున్నారు. వాళ్ల కథల్లో హీరోయిజం లేదా? వాళ్ల జీవితాల్లో డ్రామా లేదా? వాళ్ల విజయాల్లో థ్రిల్ లేదా? మరి తెరమీదకు వచ్చేసరికి మాత్రం చేతిలో తుపాకీ, వెనుక పదిమంది అనుచరులు, హింస, అక్రమ సంపాదనతో నిర్మించిన సామ్రాజ్యం ఉన్నవాడే హీరో అయిపోతున్నాడు!

Ads

ఇది ఒక సినిమా సమస్య మాత్రమే కాదు. పదేపదే అదే తరహా పాత్రలను గొప్పగా చూపిస్తున్నప్పుడు తలెత్తే సామాజిక ప్రశ్న.

తెలుగు సినిమా ‘పుష్ప’తో ఒక కొత్త తరహా మాస్ హీరోయిజాన్ని దేశవ్యాప్తంగా మార్కెట్ చేసుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తి.. వ్యవస్థను ఎదిరించే తిరుగుబాటుదారుడిలా, తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే విజేతలా తెరమీద కనిపిస్తాడు. అతడి స్టైల్, అతడి డైలాగులు, అతడి ఎదుగుదల ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయి. సినిమా వసూళ్లు సాధించిందా లేదా అన్నది వేరే విషయం. ఆ పాత్రను ఎలా చూపించారు? ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి ముద్ర వేస్తుంది? అన్నది మరో ప్రశ్న.

ఇప్పుడు మలయాళ సినిమా కూడా ఇలాంటి కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఖలీఫా’లో బంగారం స్మగ్లింగ్, నేర సామ్రాజ్యాలు, ప్రత్యర్థి ముఠాలు, రాజకీయ సంబంధాలు ప్రధానమైన అంశాలు. ఒకప్పుడు ప్రశాంతంగా బతికిన అమీర్ అలీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బంగారం అక్రమ రవాణా ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడి నుంచి అతడి ఎదుగుదల, సంఘర్షణ, ప్రతీకారం కథలో భాగమవుతాయి.

తెలుగు సినిమాను చూసి మలయాళం వాళ్లు కూడా దారితప్పారా అనిపించేంతగా ఈ తరహా కథలు ఒకదానిని మరొకటి గుర్తుచేస్తున్నాయి. అయితే మలయాళ సినిమాకు ఇలాంటి కథలు కొత్త కాదు. అక్కడా గతంలో గ్యాంగ్‌స్టర్ కథలు వచ్చాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. అలాంటి పాత్రలను చూపించడమే కాదు, వాటిని ఎంత గొప్పగా, ఎంత ఆకర్షణీయంగా చూపించాలనే పోటీలో సినిమా పరిశ్రమ ఎక్కడికి వెళ్తోంది?

స్మగ్లింగ్ చేసే హీరో ఖరీదైన కారులో తిరుగుతాడు. అతడి కోసం పదిమంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. పోలీసుల్ని, ప్రత్యర్థుల్ని లెక్కచేయడు. ఒకే దెబ్బకు శత్రువులను మట్టికరిపిస్తాడు. అతడి మాటే శాసనం. అతడి జీవితం ఒక సామ్రాజ్యం. తెరమీద ఈ దృశ్యాలన్నీ చూసే ప్రేక్షకుడికి అతడి జీవితం గొప్పగా కనిపించకుండా ఉంటుందా?

కానీ ఆ సామ్రాజ్యం నిర్మించడానికి అతడు ఎవరిని తొక్కాడు? ఎంతమందికి అన్యాయం చేశాడు? అతడి అక్రమ వ్యాపారం వల్ల సమాజానికి ఎంత నష్టం జరిగింది? అతడి చేతిలో బలైనవారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు కథలో ఎంత ప్రాధాన్యం ఉంటుంది?

నేరస్థుడి జీవితాన్ని చూపించకూడదని ఎవరూ చెప్పడం లేదు. నేర ప్రపంచంలోని చీకటిని, దాని వెనుక ఉన్న రాజకీయాలను, అధికార వ్యవస్థలోని అవినీతిని బయటపెట్టే సినిమాలు రావాలి. కానీ నేరస్థుడి ఎదుగుదలనే విజయగాథగా, అతడి క్రూరత్వాన్నే ధైర్యంగా, చట్టాన్ని లెక్కచేయకపోవడాన్నే హీరోయిజంగా చూపిస్తే మాత్రం అభ్యంతరం చెప్పాల్సిందే.

ఈ కథల్ని గ్లోరిఫై చేస్తే, హీరోను అనుకరించే అభిమానులు, అతడి స్టైల్‌ను అనుసరించే యువత ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ తన బాధ్యత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? డబ్బు సంపాదించడానికి కష్టపడే యువకుడికి ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించినవాడిని చూసి అసూయపడాలా? చట్టబద్ధంగా బతికే వ్యక్తిని చూసి గర్వపడాలా? ఈ రెండింటిలో ఏది గొప్పదో చెప్పాల్సిన బాధ్యత సమాజానిదే కాదు.. సమాజంపై ప్రభావం చూపగల కళారూపాలదీ!

ఖలీఫా.. పేరు గొప్ప, కథలో కొత్తదనం ఎంత?

ఇక సినిమా విషయానికొస్తే.. జస్ట్, ఇదొక పల్లీబఠానీ టైంపాస్ సినిమా… నిజానికి అదీ కాదు… ‘ఖలీఫా’కు దర్శకుడు వైశాఖ్. పృథ్వీరాజ్ సుకుమారన్ అమీర్ అలీ పాత్రలో కనిపిస్తాడు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యం, కుటుంబ వారసత్వం, ప్రత్యర్థుల మధ్య పోరు, రాజకీయ సంబంధాలు, ప్రతీకారం.. ఇవన్నీ కలిపి ఒక భారీ యాక్షన్ సినిమాగా తీర్చిదిద్దాలన్నది దర్శకుడి ప్రయత్నం.

సినిమాలో భారీ సెటప్ ఉంది. ఖరీదైన లొకేషన్లు ఉన్నాయి. హీరో ఎంట్రీలు ఉన్నాయి. ఫైట్లు ఉన్నాయి. హీరో నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్‌ను హోరెత్తించే ప్రయత్నమూ ఉంది. పృథ్వీరాజ్ తన శరీరాకృతితో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అమీర్ అలీ పాత్రకు ఒక ప్రత్యేకమైన రూపం ఇవ్వడానికి కష్టపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతడి శ్రమ కనిపిస్తుంది.

కానీ హీరో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తే అంత గొప్ప సినిమా అయిపోదు కదా! అతడు ఎందుకు నేర ప్రపంచంలోకి వచ్చాడు? అక్కడే ఎందుకు కొనసాగుతున్నాడు? అతడిని నడిపిస్తున్నది డబ్బా, అధికారమా, ప్రతీకారమా? ఒక దశలో అతడి వ్యక్తిగత సమస్య పరిష్కారమైన తర్వాత కూడా స్మగ్లింగ్ ప్రపంచంలోనే కొనసాగడానికి బలమైన కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు కథ నుంచి తగిన సమాధానాలు రావాలి. లేదంటే హీరో ఎంత హడావుడి చేసినా పాత్రలోని అంతర్గత బలం కనిపించదు.

‘ఖలీఫా’లో ప్రధానంగా కనిపించే లోపం ఇదే. భారీ యాక్షన్‌తో ప్రేక్షకుడిని కట్టిపడేయాలన్న ప్రయత్నం ఉంది. కానీ కథలో కొత్తదనం, భావోద్వేగాల్లో లోతు, పాత్రల నిర్మాణంలో బలం ఆశించిన స్థాయిలో లేవు. బంగారం అక్రమ రవాణా ఎలా జరుగుతుందనే అంశం కొన్ని ఆసక్తికరమైన సందర్భాలను అందించినా, అవే సినిమా మొత్తాన్ని నిలబెట్టలేవు.

పృథ్వీరాజ్ నటన, అతడి ఫిజిక్, స్క్రీన్ మీద అతడి నడక ఈ సినిమాకు బలాలు. అయితే కథానాయకుడి పాత్రను ప్రేక్షకులు పూర్తిగా నమ్మేలా చేయడంలో రచన విఫలమైంది. ప్రత్యర్థి పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ కూడా ఆశించిన స్థాయిలో భయం పుట్టించలేకపోయాడు. హీరోకు దీటైన విలన్ లేకపోతే పోరాటంలో ఉత్కంఠ ఎక్కడి నుంచి వస్తుంది?

షమ్మీ తిలకన్ పాత్ర కొంత గుర్తుండిపోతుంది. తండ్రీకొడుకుల మధ్య బంధం కథకు భావోద్వేగాన్ని అందించే అవకాశం కల్పిస్తుంది. కానీ ఆ భావోద్వేగాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోకుండా సినిమా మళ్లీ యాక్షన్ హడావుడిలోకి వెళ్లిపోతుంది. మహిళా పాత్రలకు కూడా పరిమితమైన ప్రాధాన్యమే దక్కింది.

సినిమా చివర్లో మోహన్‌లాల్ కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ. టోవినో థామస్ తదితరుల ఎంట్రీలతో తర్వాతి భాగంపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఒక సినిమా తన కథతోనే ప్రేక్షకుడిని సంతృప్తిపరచాలి. తర్వాతి భాగం కోసం పెద్ద పెద్ద పాత్రలను పరిచయం చేసి, ప్రస్తుత కథలోని లోపాలను కప్పిపుచ్చలేరు. ఆ హీరోయిన్ ఎందుకున్నదో ఆమెకు కూడా తెలియదు పాపం…

ఒక తేడా ఉంది… ఈ సినిమా బాధ్యులకు తెలియదేమో… స్మగ్లర్‌ను హీరోగా చూపించొచ్చు.. కానీ స్మగ్లింగే హీరోయిజం అన్న భావనను మాత్రం అమ్మకూడదు. డాన్ కథ చెప్పొచ్చు.. కానీ డాన్ కావడమే గొప్ప జీవితం అన్న భ్రమను సృష్టించకూడదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీరూ మాలాగే దారితప్పారా పుష్పా? హీరో అంటేనే అన్‌వాంటెడ్ ఎలిమెంటా?
  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!
  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions