Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…

October 11, 2026 by M S R

.

Bhavanarayana Thota …. ఒక ఫోన్ కాల్ .. ఒక అరెస్ట్ .. వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
మద్రాసులో తెలుగు పత్రికల రిపోర్టింగ్ అంటే తమిళనాడు మొత్తం కవర్ చేయాల్సిందే. సాయంకాలం పత్రికలు చాలా ఉండటం వల్ల వార్తలకు ఎలాంటి లోటూ ఉండదు. ‘వార్త’లో నాతోబాటు పనిచేస్తున్న బొల్లం రాజు, యామిజాల జగదీష్ చాలా వేగంగా తమిళం చదివి తెలుగులో అనువదించి టైప్ చేయగలరు కాబట్టి టాబ్లాయిడ్ నింపటం కష్టమనిపించేది కాదు. మద్రాసు వార్తలు నేరుగా కవర్ చేసి ముఖ్యమైన వార్తలు మెయిన్ పేపర్ కి హైదరాబాద్ పంపేవాళ్ళం.

1996లో తమిళనాడు ఎలక్షన్స్ చాలా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 1991లో అన్నా డీఎంకే కూటమి ఘనవిజయం సాధించటంతో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. డీఎంకేకి కేవలం 2 సీట్లే వచ్చాయి. అయితే, అయిదేళ్లలో జయలలిత పాలన మీద వ్యతిరేకత రావటం, కాంగ్రెస్ లో మూపనార్ వర్గం జయతో పొత్తు వద్దని కొత్త పార్టీ పెట్టుకోవటం చకచకా జరిగిపోయాయి. డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి రజనీకాంత్ పరోక్షంగా మద్దతు ప్రకటించటంతో ఉత్కంఠ మరింత పెరిగింది.

Ads

మే 2 వ తేదీ. తమిళనాడులో అసెంబ్లీకి, లోక్ సభకు పోలింగ్ జరిగింది. (రెండు ఎన్నికలూ ఒకేసారి జరగటం తమిళనాడులో అదే ఆఖరు. ఆ తరువాత మధ్యంతర ఎన్నికల కారణంగా వేరు వేరుగా జరుగుతూ వచ్చాయి). ఆ రోజంతా వార్తల హడావిడి ఎక్కువగా ఉంది. తమిళనాడు నలుమూలలనుంచి వచ్చే సమాచారంతో సాధ్యమైనంత సమగ్రంగా వార్తలు సేకరించాం. తమిళనాడు టాబ్లాయిడ్ తయారయ్యే తిరుపతికి ఎప్పటికప్పుడు పంపుతూ వచ్చాం.

రాత్రి ఏడున్నరయింది. వార్త ఆఫీసులో ఫోన్ మోగింది. నేనే తీశా. “భావనారాయణ గారు ఉంటే పిలుస్తారా? నేను శ్రీలక్షీ ప్రసాద్ అని చెప్పండి” అన్నారు. అవతల ఉన్నది సీబీఐ ఎస్పీ శ్రీలక్ష్మీ ప్రసాద్. ఆమె 1986 బాచ్ ఐపీఎస్ అధికారి. ఆమె భర్త ప్రసాద్ ఓఎన్జీసీ అధికారి. సుమారు ఏడాది కిందట ఆమె స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి ఆంధ్రప్రభలో ఉండగా రాశా. ఆ తరువాత ఒకటీ రెండు సార్లు నేనే ఫోన్ చేశాను గాని ఇప్పుడు ఆమే స్వయంగా ఫోన్ చేయటంతో ఆశ్చర్యం, కంగారు. ఎలక్షన్ వార్తల హాంగోవర్ నుంచి బైటపడుతూ, కంగారు వినబడకుండా “నేనే మేడమ్. బాగున్నారా?” అన్నాను.

నా ప్రశ్నకు జవాబివ్వకుండా ఆమె సూటిగా చెప్పటం మొదలుపెట్టారు. “రాత్రి 9 గంటలకు సింధూరి హోటల్ లో చంద్రస్వామిని అరెస్ట్ చేయబోతున్నాం. లఖూ భాయ్ పాఠక్ కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశాలను మా హెడ్ క్వార్టర్స్ ఇక్కడికి పంపింది. ఈ విషయం జర్నలిస్టులెవరికీ చెప్పకండి. మా కింది స్టాఫ్ ని కూడా ఎవరికీ చెప్పవద్దంటూ అపోలో హాస్పిటల్ అని అబద్ధం చెప్పాం. ఎంత వద్దని చెప్పినా వాళ్ళకి తెలిసిన మీడియా వాళ్ళకు చెబుతారని మాకు తెలుసు. సరే, మీ ఫాక్స్ నెంబర్ ఇవ్వండి. ఇంకొన్ని డీటైల్స్ ఇస్తా. వివరాలు వాడుకోండి తప్ప ఆ కాపీ మాత్రం పేవర్లో వేయకండి” అన్నారు. ఈ ఫోన్ నెంబర్ కే ఫాక్స్ చేయమని చెప్పా.

  • చంద్రస్వామి అసలు పేరు నేమి చంద్ జైన్. గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ కుటుంబం వారిది. చిన్నప్పుడే తంత్ర విద్యల మీద దృష్టి పెట్టిన నేమి చంద్ జైన్ తనకు తానే చంద్రస్వామి అని పేరు పెట్టుకొని రాజకీయ నాయకులను బుట్టలో వేసుకోవటం మొదలుపెట్టాడు. ముందుగా అప్పటి రైల్వేమంత్రి లలిత్‌ నారాయణ్ మిశ్రా కోటలో పాగా వేయగలిగాడు. మిశ్రా ద్వారా అవ్పటి సోషలిస్ట్ నాయకుడైన రాజ్‌నారాయణ్‌ పంచన చేరాడు.

 

  • అక్కడి నుంచి నంజయ్‌ గాంధీ కూటమిలో చేరి రాజకీయ తంత్రం నడిపాడు. మొరార్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర నిర్వహించి ఢిల్లీలో పేరు మోశాడు. ఆ తర్వాత పీవీ నరసింహారావుకు గురువుగా ఆవతరించాడు. హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ వ్యాధిని తన మంత్రశక్తితో నయం చేశానని చెప్పుకోవటమే కాదు, అనేకమంది అంతర్జాతీయ ప్రముఖులకు ఆధ్యాత్మిక సలహాదారుడిగా మారాడు. ఆ పరిచయాలను తరువాత తన స్వార్థానికి వాడుకుంటూ అనేక ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్నాడు.

ఈ సంగతులు నెమరు వేసుకుంటూ ఉండగానే ఫోన్ మోగటం, ఫాక్స్ సౌండ్ కు మిషన్ ఆన్ చేయటం, ఫాక్స్ రావటం చక చకా జరిగిపోయాయి. అందులో కేసు వివరాలున్నాయి. పచ్చళ్ల వ్యాపారంతో లండన్ లో స్థిరపడిన లఖూభాయ్ పాఠక్ అనే పచ్చళ్ల వ్యాపారిని న్యూయార్క్ లో పీవీ నరసింహారావును పరిచయం చేయటంతోబాటు న్యూస్ ప్రింట్ సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చేలా హామీ ఇప్పించి, లక్ష డాలర్లు లంచంగా తీసుకున్నాడనేది చంద్రస్వామి మీద అభియోగం.

ఆ మొత్తాన్ని చంద్రస్వామికి, అతడి అనుచరుడు కైలాస్ నాథ్ అగర్వాల్ అలియాస్ మామాజీకి రెండు చెక్కుల ద్వారా ఇచ్చినా, తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ లఖూభాయ్ పాఠక్ కోర్టుకెక్కాడు. అయితే కొన్నేళ్ళపాటు కేసు ముందుకు సాగకుండా చంద్రస్వామి శాయశక్తులా ప్రయత్నించినా సీబీఐ వదలకుండా అరెస్ట్ వారంట్ తెచ్చింది. చికిత్స కోసం మద్రాస్ వచ్చినా, అపోలో ఆస్పత్రిలో చేరితే తెలుస్తుందని అక్కడికి దగ్గరలో ఉన్న సింధూరి హోటల్ లో బస చేసినట్టు అప్పటికే సీబీఐ దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది.

సింధూరి హోటల్ లో చంద్రస్వామిని అరెస్ట్ చేసినట్టు రాసి, కన్ఫామ్ చేయగానే హైదరాబాద్ పంపమని చెప్పి, హోటల్ కి బయలు దేరాను. రాత్రి సుమారు 8.45 అవుతోంది. సింధూరి హోటల్ దగ్గర ఎలాంటి అలికిడీ లేదు. మరో ఐదు నిమిషాలు గడిచేసరికి సీబీఐ వాహనాలు వచ్చాయి. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ముఖర్జీ, ఎస్పీ శ్రీలక్ష్మీ ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. జేడీ ముఖర్జీ రిసెప్షన్ దగ్గర కూర్చున్నారు. శ్రీలక్ష్మీ ప్రసాద్ లోపలికి వెళుతూ ఉండగా నేను పలకరించాను. “అరెస్ట్ చేయటం ఖాయమే కదా?” అని అడిగాను.

‘‘అదేం ప్రశ్న?” అన్నట్టు నా వైపు చూసి “కచ్చితంగా.. మీరు బయట వెయిట్ చేయండి. ఎగ్మోర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకువస్తామని సమాచారం కూడా ఇచ్చాం. ఆయన అనుమతితో ఢిల్లీకి తీసుకు వెళతాం.” అన్నారు.

ఆమె బృందం లిఫ్ట్ బటన్ నొక్కి ఎదురు చూస్తుండగా జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి హడావిడిగా వచ్చారు. అప్పటికే ఈ విషయం తెలిసి చంద్రస్వామి ఫోన్ చేసి ఉండవచ్చు. ఆయన వస్తూనే సీబీఐ జాయింట్ దగ్గరికెళ్ళి “మా మిత్రుడికి హార్ట్ ప్రాబ్లెం ఉంది. ఎలా అరెస్ట్ చేస్తారు?” అన్నారు. మాకు రూల్స్ చెప్పకండి. మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం.” అని చాలా కూల్ గా చెప్పారు.

అయినా ఆగకుండా రిసెప్షన్ దాకా వచ్చిన సుబ్రమణ్యన్ స్వామి మళ్ళీ శ్రీలక్ష్మీ ప్రసాద్ ను కూడా అదే ప్రశ్న అడిగారు. “మేం వారంట్ ఇవ్వటానికి వెళుతున్నాం. మీరు జోక్యం చేసుకోవద్దు” అని కాస్త గట్టిగానే జవాబివ్వటంతో ఆయన హోటల్ బయటికి రాక తప్పలేదు. అప్పటివరకూ అపోలో హాస్పిటల్ కి వెళ్ళిన మీడియా వాళ్ళు కూడా సుబ్రమణ్యన్ స్వామి ఇచ్చిన సమాచారంతో సింధూరి హోటల్ కి వచ్చారు.

ఈలోపు అక్కడికి దగ్గర్లో ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి మా రిపోర్టర్ బొల్లం రాజుకు ఫోన్ చేసి కొద్దిపాటి మార్పులు చెప్పా. అరెస్ట్ చేసి ఎగ్మోర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచినట్టు, అక్కడి నుంచి ఢిల్లీకి తరలించినట్టు జోడించి పంపమని చెప్పా. అలా ఆ వార్త హైదరాబాద్ ఆఫీసుకు వెళ్ళిపోయింది.

నేను తిరిగి సింధూరి హోటల్ దగ్గరికొచ్చా. 9.30 దాటింది. కానీ నాలుగో అంతస్తులో చంద్రస్వామిని అరెస్ట్ చేయటానికి వెళ్ళిన శ్రీలక్ష్మీ ప్రసాద్ ఎంతకూ తిరిగిరాలేదు. మీడియా వాళ్ళకేమీ అర్థం కావటం లేదు. పది గంటలయ్యేసరికి నా గుండెల్లో దడ మొదలయింది. సరిగ్గా అప్పుడే శ్రీలక్ష్మీ ప్రసాద్ కిందికి వచ్చి జాయింట్ డైరెక్టర్ తో మాట్లాడి వెళ్ళారు. నేనిచ్చిన వార్త నిజం కాకపోతే ‘వార్త’ తోబాటు నేను కూడా అభాసుపాలవుతానన్న సంగతి పదే పదే గుర్తుకొస్తోంది. ఆమె అరెస్ట్ చేయకుండా మధ్యలోనే కిందికి ఎందుకొచ్చారో అర్థం కావటం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది.

మీడియావాళ్ళెవరూ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదిప్పుడు. జాయింట్ డైరెక్టర్ అడ్డంగా కూర్చొని ఉన్నారు. ఎవరికి వాళ్ళు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఇంతలోనే సుబ్రమణ్యన్ స్వామి మీడియాతో మాట్లాడుతూ, చంద్రస్వామిని అరెస్ట్ చేయటం కుదరదని, ఇప్పటికే ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ ఉందని చెబుతున్నారు. ఈ మాటతో నేను మరింత ఇరకాటంలో పడ్డా.

స్వామి చాలా నమ్మకంగా చెబుతారు గానీ సగానికి పైగా అబద్ధాలుంటాయని తెలుసు. అయినా, నా భయం నాది. హైదరాబాద్ కి ఫోన్ చేసి వార్త తీసేయమని చెబితే ఎలా ఉంటుంది? ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే అది మరీ దారుణంగా ఉంటుందా? ఎస్పీ అంత నమ్మకంగా చెప్పిన తరువాత కూడా అరెస్ట్ జరగదా? అలా ఆలోచిస్తూనే ఉన్నాను గానీ .. నా కళ్ళన్నీ హోటల్ లిఫ్ట్ డోర్ మీదనే ఉన్నాయి.

అప్పటికి 10.45 అయింది. ఉన్నట్టుండి లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. వీల్ ఛెయిర్ లో చంద్రస్వామి, ఆయన వెనుకే శ్రీలక్ష్మీ ప్రసాద్ బృందం కారిడార్ గుండా గేట్ వైపు వస్తూ కనిపించారు. ఒక్కసారిగా నాకు అతిపెద్ద రిలీఫ్. జర్నలిస్టులతో బాటు ఉన్న సుబ్రమణ్యన్ స్వామి హోటల్ గేటు దాటి లోపలికి వెళుతూ.. “గుండె జబ్బుతో బాధపడుతున్న నా ఫ్రెండ్ ని ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లాలి” అంటూ అడ్డుపడబోయారు. కానీ, సీబీఐ వాళ్ళు ఆగలేదు.

చంద్రస్వామిని వ్యాన్ ఎక్కించారు. అప్పుడు నన్ను చూసిన శ్రీలక్ష్మీ ప్రసాద్ “మెహతానగర్ లో ఉన్న చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళుతున్నాం” అని చెబుతూ కారెక్కారు. కొత్తగా తెలుసుకొని చేయగలిగేదేమీ లేకపోయినా, మరో జర్నలిస్ట్ మిత్రుడి బైక్ మీద మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళా. అక్కడ ఇంకో గంట గడిచాక మేజిస్ట్రేట్ ‘ట్రాన్సిట్ వారంట్’ ఇవ్వటంతో చంద్రస్వామిని, మామాజీని ఢిల్లీకి తీసుకువెళ్లటానికి సీబీఐ బృందం మద్రాసు ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది.

మొత్తానికి ఈ ఫస్ట్ పేజ్ వార్త ఎంత ఉత్సాహంగా మొదలైందో అంత టెన్షన్ పెట్టింది. కథ సుఖాంతమైంది కాబట్టి సరిపోయింది గాని.. అనుకున్నట్టు జరక్కపోయి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహకు కూడా అందలేదు. “సోర్స్ ఎంత విశ్వసనీయమైన సమాచారం ఇచ్చినా అది ఎప్పుడైనా, ఏ మలుపైనా తీసుకోవచ్చునన్న ఆలోచన కూడా రిపోర్టర్ కి ఉండాలి కదా?” అని కూడా ఆ తరువాత అనిపించింది.

“చంద్రస్వామి అరెస్ట్ ?” అని క్వశ్చన్ మార్క్ పెడితే సగం వార్త మాత్రమే ఇచ్చినట్టయ్యేది. ఏమైనా అన్ని వివరాలతో ఫస్ట్ ఎడిషన్ నుంచే ఈ వార్త పబ్లిష్ అయింది. అప్పట్లో అత్యుత్సాహం చూపానేమో గాని ఇలాంటి రిస్క్ తీసుకోవటం మంచిది కాదని ఇది గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది.
– తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…
  • గాఢనిద్రలో ఉన్న చంద్రబోస్ తెలంగాణతనం సోయి తెచ్చుకుంది !!
  • మీరూ మాలాగే దారితప్పారా పుష్పా? హీరో అంటేనే అన్‌వాంటెడ్ ఎలిమెంటా?
  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions