.
ఇప్పుడు విదేశీ విరాళాలు, మతమార్పిడి నిరోధ చట్టాలు, ఉమ్మడి పౌరస్మృతి వివాదాంశాలుగా వార్తల్లోకి వస్తున్నాయి కదా, కానీ ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే… ప్రధానంగా నాస్తిక ప్రభుత్వాలుండే తమిళనాడులో ఓ ప్రభుత్వ కమిషన్ ఇవన్నీ చర్చించింది… అదేం చెప్పింది..? దాని నేపథ్యం ఏమిటి…?
మత ఘర్షణల నుంచి పుట్టిన ఓ ప్రభుత్వ కమిషన్… ఈ రోజు దేశ రాజకీయాల్లో తరచూ వినిపిస్తున్న మూడు అంశాలు… ఉమ్మడి పౌరస్మృతి (UCC), విదేశీ విరాళాల నియంత్రణ, మతమార్పిడి నిరోధక చట్టాలు… వీటిపై పార్లమెంటులోనూ, రాజకీయ పార్టీల మధ్యా, సామాజిక వేదికలపైనా తీవ్ర చర్చ జరుగుతోంది… అయితే, దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే తమిళనాడులో ఈ అంశాలు ఓ ప్రభుత్వ విచారణ కమిషన్ సిఫార్సుల్లో చోటు చేసుకున్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు…
Ads
ఆ కమిషన్ ఏర్పాటుకు కారణం ఒక మతపరమైన వివాదం… ఒక ఆలయ ఉత్సవం సందర్భంగా మొదలైన ఉద్రిక్తతలు… చివరకు పోలీసు కాల్పులు, ప్రాణనష్టానికి దారితీశాయి… ఆ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ పి. వేణుగోపాల్ కమిషన్ నివేదికలో మతసామరస్యాన్ని కాపాడటంతోపాటు, మతమార్పిడులు, విదేశీ నిధులు, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలు చర్చకు వచ్చాయి…
ఆ ఘటన జరిగినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)… ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉన్న రాష్ట్రంలో ఈ కమిషన్ ఏర్పడటం, దాని సిఫార్సులు వెలుగులోకి రావడం ఆసక్తికరమైన అంశం…
మండైకాడులో అసలేం జరిగింది? తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న మండైకాడు భగవతి అమ్మన్ ఆలయం ప్రసిద్ధ ఆదిశక్తి క్షేత్రం… అక్కడ జరిగే వార్షిక ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు… ఉత్సవాల్లో భాగంగా సముద్ర స్నానం చేయడం కూడా ఒక ఆచారం…
1982 ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆలయ ఉత్సవాల సమయంలోనే ఉద్రిక్తతలు మొదలయ్యాయి… ఆలయానికి సమీపంలోని మత్స్యకారుల నివాస ప్రాంతం మీదుగా సముద్ర స్నానానికి వెళ్లడం, ప్రార్థనా స్థలాల వద్ద లౌడ్స్పీకర్ల వినియోగం వంటి అంశాలు వివాదానికి కారణమయ్యాయి… అప్పటికే హిందువులు, క్రైస్తవుల మధ్య ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు ఈ వివాదంతో మరింత పెరిగాయి…
మార్చి 1న పరిస్థితి అదుపు తప్పింది… పోలీసులపై దాడి, పోలీసు వాహనానికి నిప్పుపెట్టే ప్రయత్నం వంటి ఘటనలు జరిగినట్లు అప్పటి పార్లమెంటరీ రికార్డుల్లో పేర్కొన్నారు… పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా ఆరుగురు మరణించారు… మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు… మృతులంతా క్రైస్తవ మత్స్యకారులేనని అప్పటి ఇండియా టుడే కథనం పేర్కొంది…
ఎంజీఆర్ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ … ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీఆర్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది… అప్పటి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. వేణుగోపాల్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ను నియమించింది…
కమిషన్ బాధ్యత పోలీసు కాల్పులపై విచారణ జరపడానికే పరిమితం కాలేదు… రెండు మత వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరిగాయి..? వాటికి కారణమైన పరిస్థితులు ఏమిటి..? భవిష్యత్తులో ఇలాంటి హింసను ఎలా నివారించాలి..? అన్న అంశాలనూ పరిశీలించాల్సి ఉంది…
జస్టిస్ వేణుగోపాల్ 1985 సెప్టెంబర్ 21న తన నివేదికను సమర్పించినట్లు న్యాయపరమైన రికార్డుల్లో ఉంది… ఈ సిఫార్సుల్లో అత్యంత ఆసక్తికరమైనది ఉమ్మడి పౌరస్మృతి… భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం, దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతిని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి… వివాహం, విడాకులు, వారసత్వం వంటి వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా ఉన్న చట్టాల స్థానంలో ఉమ్మడి చట్టాల దిశగా వెళ్లాలన్నది ప్రధాన ఉద్దేశం…
విదేశీ విరాళాలు… మతమార్పిడులపై ఆందోళనలు …విదేశాల నుంచి వచ్చే విరాళాలు విద్య, వైద్యం, సామాజిక సేవ వంటి ప్రయోజనాల కోసమే కాదు, మతమార్పిళ్లకూ ఉపయోగపడటంపై ఆందోళన… విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని సవరించడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని సిఫార్సు…
ఇక్కడ మరో చారిత్రక అంశం ఉంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) 1976లోనే అమల్లోకి వచ్చింది… అంటే మండైకాడు ఘటనకు ముందే విదేశీ నిధులపై నియంత్రణకు సంబంధించిన చట్టం ఉంది… ఆ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేయాలన్నది కమిషన్ సిఫార్సు… (ప్రస్తుతం ఈ సవరణ బిల్లు పార్లమెంటు కమిటీ తుది పరిశీలనలో ఉంది)…
అదేవిధంగా, మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిషన్ సిఫార్సు… ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన కోణం తమిళనాడు రాజకీయ నేపథ్యం… ద్రవిడ ఉద్యమం, హేతువాద భావజాలం, మతంపై విమర్శలు తమిళ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి… అలాంటి రాష్ట్రంలో ఈ సిఫార్సులను ఓ ప్రభుత్వ కమిషన్ చేయడమే ఈ కథనంలో ముఖ్యాంశం…
మండైకాడు అమ్మవారిని ఏకంగా మేరీ మాతగా ప్రచారం చేయడంపైనా హిందూ సంఘాలు ఆందోళనలు చేశాయి… మండైకాడు ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి… కానీ అప్పట్లో చర్చకు వచ్చిన అంశాలు నేటికీ భారత రాజకీయాల్లో ప్రాధాన్యం కోల్పోలేదు…
ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలా? విదేశీ నిధులపై ఎంత నియంత్రణ ఉండాలి? మతమార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాలు అవసరమా? మత స్వేచ్ఛను కాపాడుతూనే బలవంతపు లేదా ప్రలోభపూరిత మతమార్పిడుల ఆరోపణలను ఎలా విచారించాలి? మత ఘర్షణలకు కారణమయ్యే సంస్థలు, వ్యక్తులపై చర్యలు ఎలా తీసుకోవాలి? ఈరోజుకూ జవాబులు దొరకనివి ఇవే ప్రశ్నలు!!
Share this Article