.
కేసీయార్ నిర్వాకంతో లక్ష కోట్ల కాళేశ్వరం నిరర్థకంగా మారిపోవడమే కాదు, ఇప్పుడు దాని రిపేర్లకు మళ్లీ తెలంగాణ ప్రజల సొమ్ము కాస్తా తడిసి మోపెడయ్యేట్టు ఉంది… ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఒక రాష్ట్ర పాలన ఎలా ఉండకూడదో చెప్పడానికి కాళేశ్వరం ఓ పక్కా ఉదాహరణగా మారిపోయింది…
మేడిపండులా కట్టిన మేడిగడ్డ నిలువునా తస్కితే… అబ్బే, నాలుగు తట్టల కాంక్రీట్ చాలు, ఇలా రిపేరు, అలా వినియోగం అని లొట్టపీసు కథలు చెప్పింది బీఆర్ఎస్… ప్రత్యేకించి కేటీయార్, హరీశ్ రావు… అంతేనా..? కమాన్ కమాన్ నీళ్లు ఎత్తిపోయి అని ఒత్తిళ్లు, విమర్శలు… ఉత్త డొల్ల రాజకీయాలు,..
Ads
నిజంగానే వాళ్లు క్రియేట్ చేసిన ఒత్తిళ్లతో నీటి లిఫ్టింగ్ స్టార్ట్ చేసి ఉంటే ఆ బరాజుల పని ఏమయ్యేదో..? ఇంకా ఎంత గాయిగత్తర చేసేవాళ్లో…! ఇప్పుడు కేంద్రం ఏం చెప్పిందీ అంటే..? తస్కిన ఆ మేడిగడ్డ ఏడో బ్లాక్ రిపేరు కుదరదు, మొత్తం తీసేసి, కొత్తగా కట్టాలి అని… అదీ కేసీయార్ మార్క్ ఇంజినీరింగ్… మనమే కట్టుకుని, మనమే కూలగొట్టి, మళ్లీ మనమే కొత్తగా కట్టుకోవాలి…
నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సభ్యులు (టెక్నికల్) అధ్యక్షతన ఏర్పాటైన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ (టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ) భేటీ జరిగింది… తెలంగాణ సాగునీటి శాఖ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు… అథారిటీ తేల్చేసింది… ఆ బ్లాక్ పునర్నిర్మాణమే కాదు… సుందిళ్ల, అన్నారం బరాజులకూ రిపేర్లు, కొత్త నిర్మాణాలు తప్పవని చెప్పింది… (అన్నిరకాల సాంకేతిక పరీక్షల అధ్యయనం తరువాత ఈ సూచనలు…)

ఏడో బ్లాక్‌లోని కొన్ని పియర్ల (పిల్లర్లు)కు తీవ్ర పగుళ్లు ఏర్పడ్డాయి… రాఫ్ట్ (పునాది) భాగం నదీ గర్భంలోకి కుంగిపోయింది… ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి పునర్నిర్మించాలా? లేక బ్లాక్‌ను నాన్ ఓవర్ ఫ్లో (ఎన్ఓఎఫ్) డ్యామ్‌గా మార్చాలా? అనే రెండు ప్రత్యామ్నాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది… కానీ..?
ఎన్ఓఎఫ్ డ్యామ్‌గా మార్చాలని నిర్ణయిస్తే ఏడో బ్లాక్ గేట్లను తొలగించి, పూర్తిగా కాంక్రీట్ గోడగా పటిష్టం చేయాలి… కానీ దెబ్బ తిన్న భాగాలను పూర్తిగా తొలగించి, మొదటి నుంచి పునర్నిర్మించకతప్పదని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ సూచించింది… ఈ విధానంలో దెబ్బతిన్న నిర్మాణ భాగాలను (డైమండ్ వైర్ సా) కత్తిరించి తొలగించడం, అనంతరం పునాదుల స్థాయి నుంచి తిరిగి నిర్మించడం చాలా క్లిష్టమైన పని…
అందుకే బరాజు నిర్మాణ సంస్థలతో (ఎల్అండ్టీ–పీఈఎస్ జేవీ) చర్చించాల్సి ఉంది… ప్రభుత్వానికి సహకరించేందుకు ఆ ఎల్అండ్టీ మొరాయిస్తోంది… నిన్నటి భేటీలో బరాజుల పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్ కన్సల్టెన్సీ ‘ఆఫ్రీ ఇండియా’ రూపొందించిన ప్రాథమిక డిజైన్లు, డ్రాయింగ్స్ పరిశీలించారు… 3 వారాల తరువాత సమగ్ర డిజైన్లు, డ్రాయింగ్స్‌తో మరోసారి భేటీ వేస్తారు…
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజులకు అదనపు భద్రత కోసం వాటికి ఎగువన, దిగువన డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణంతో పాటు దిగువన ఉన్న స్టిల్లింగ్ బేసిన్ల విస్తరణ, కొత్త కటాఫ్ వాల్స్ నిర్మాణం, పునాదుల కింద నీటి ప్రవాహం నివారణ అవసరం… అంటే, ఇప్పుడున్న స్థితిలో ఏ బరాజు కూడా వినియోగ యోగ్యం కాదు…
వెరసి, ఏం అర్థమవుతోంది..? అడ్డదిడ్డంగా కట్టడం, కట్టిన దాన్ని కూల్చేయడం, కూల్చేసినచోట మళ్లీ కట్టుకోవడం… ఇదీ కేసీయార్ మార్క్ ఇంజినీరింగ్ అద్భుతం..!!
Share this Article