.
నేను మిడిల్ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే ఆలోచన నన్ను బాగా ఆకర్షించేది. మా నాన్నగారి సహోద్యోగుల కొడుకులు, కూతుళ్లు విదేశాలకు వెళ్లి సాధించిన విజయాల గురించి ఎన్నో అబ్బురపరిచే కథలు విన్నాను.
2003లోనే నేను SAT పరీక్ష రాశాను. NUS, NTU సహా పలు ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశం కూడా లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అంతా సిద్ధమైపోయింది.
Ads
కానీ, అదే సమయంలో తమిళనాడులోని అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఉన్న CEGలో కూడా నాకు అడ్మిషన్ వచ్చింది. అప్పుడు ఎవరూ ఊహించని పని చేశాను. NUS, NTUలను కాదని CEGలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నాను.
మా నాన్నగారికి కోపం కట్టలు తెంచుకుంది! డిగ్రీ పూర్తయ్యే సమయానికి నా ముందు రెండు మార్గాలున్నాయి. GRE రాసి విదేశాలకు వెళ్లడం లేదా CAT రాసి మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించడం. వీలైనంత త్వరగా GRE రాసి, భారత్‌ను విడిచి వెళ్లిపోవాలన్నది నాన్నగారి కోరిక. కానీ నేను CAT ఎంచుకున్నాను. భారత్‌లోనే ఉండిపోయాను.
చివరకు, మన దేశంలో అత్యంత కఠినమైన నియంత్రణలు ఉన్న రంగాల్లో ఒకదానిలో వ్యాపారాన్ని ప్రారంభించాను.
అయితే, నియంత్రణ సంస్థలు నా వ్యాపారాన్ని దాదాపు మూడుసార్లు చంపేసినంత పని చేశాయి. MSEని మూసివేయడం, తమ ఇష్టానుసారం కమీషన్లను తగ్గించడం, ఎప్పటికప్పుడు నెట్‌వర్త్ నిబంధనలను కఠినతరం చేయడం, అసలు నా వ్యాపారం కొనసాగడం సాధ్యమేనా అన్నట్టుగా ప్రశ్నించడం.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.
కొన్ని సందర్భాల్లో భారత్‌లోనే ఉండిపోయి పొరపాటు చేశానేమోనని కూడా అనిపించింది. ఆ భావన కలగడానికి ఈ వ్యవస్థ నాకు ఎన్నో కారణాలు. అయినా, దేవుడి దయవల్ల నేను నిలదొక్కుకోగలిగాను. భారత్‌లో ఒక కంపెనీని నడుపుతూ పదిహేడేళ్లు పూర్తి చేసుకున్నాను.
ఇన్ని అనుభవాల తర్వాత కూడా నాకు ఈ దేశం మీద ప్రేమ ఉంది. ఎందుకో నాకు కూడా పూర్తిగా తెలియదు. బహుశా, ఈ దేశంలోని పల్లె ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కలిగే మనశ్శాంతి కావచ్చు. ఇక్కడి దేవాలయాలు ఇచ్చే ఆత్మతృప్తి కావచ్చు. మల్నాడ్‌లోనో, నా పాండ్య దేశంలోనో, నాకు ఎంతో ఇష్టమైన ట్రావెన్‌కోర్‌లోనో అడుగుపెట్టి, ఆ నేలపై నడుస్తున్నప్పుడు కలిగే చెప్పలేని ఆనందం కావచ్చు.
వీటికి వెలకట్టలేం. అస్సలు వెలకట్టలేం! 1960, 1970 దశకాల్లో భారత్ ఎక్కడ ఉంది? ఈరోజు ఎక్కడికి చేరుకుంది? ఒకసారి చూడండి. మన దేశం ఎంతో దూరం ప్రయాణించింది.
ఒకప్పుడు ఆదాయపు పన్నులో గరిష్ఠ పన్ను రేటు ఏకంగా 97 శాతంగా ఉండేది. ఇప్పుడు అది చాలా తక్కువ స్థాయికి వచ్చింది. నిరాశాజనకమైన సోషలిస్టు ఆర్థిక విధానాల నుంచి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేశాం.
ఒక బజాజ్ చేతక్ స్కూటర్ కొనాలంటే నెలల తరబడి ఎదురుచూడాల్సిన రోజులు పోయాయి. ఇప్పుడు నిమిషాల్లో టయోటా కారు కొనుగోలు చేయగలుగుతున్నాం. ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన మొబైల్ డేటా సేవలు అందిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.
బురద రోడ్ల నుంచి ఎక్స్‌ప్రెస్‌వేల వరకు వచ్చాం. ఒకప్పుడు తీవ్రమైన పేదరికం ఉండేది. వరుమయిన్ నిరం సివప్పు (ఆకలి రాజ్యం) సినిమాలో కమల్ హాసన్ మురికి కాలువలో పడిపోయిన ఆపిల్‌ను తినే సన్నివేశం గుర్తుందా? అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు గ్రామీణ మార్కెట్లలో కూడా సిమ్లా యాపిల్స్ అందుబాటులో ఉండే స్థాయికి చేరుకున్నాం.
భారత్ అద్భుతమైన ప్రయాణం చేసింది. అయితే, మనం ఇంకా ఎంతో మెరుగ్గా ఎదిగి ఉండవచ్చు. పౌర సదుపాయాలు, ప్రభుత్వ సేవలు, పట్టణ ప్రణాళిక వంటి విషయాల్లో సింగపూర్ స్థాయికి చేరుకుని ఉండవచ్చు. మనం ఎన్నో దశాబ్దాలను, ఎన్నో అవకాశాలను వృథా చేసుకున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
అయినా, ఇది భారత్. దశాబ్దాల తరబడి సోషలిస్టు విధానాలు, రాజకీయ అసమర్థత ఉన్నప్పటికీ మన దేశం ఇంత దూరం ప్రయాణించిందన్న విషయమే నాకు సంతోషాన్నిస్తుంది. దేశంలో ఉన్న ప్రతి సమస్యను తలచుకుంటూ, ప్రతి క్షణం ఫిర్యాదులు చేస్తూ కూర్చోవడం కంటే, మనం సాధించిన పురోగతిని చూసి సంతృప్తి చెందుతాను.
భారత్‌ను నేను కూడా విమర్శించగలను. మెరుగైన పాలన కావాలని అడగగలను. మంచి రహదారులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ప్రభుత్వ సేవలు కావాలని డిమాండ్ చేయగలను. అధికార యంత్రాంగం, నిబంధనల వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై అసహనం వ్యక్తం చేయగలను.
కానీ, వీటన్నింటికంటే ఈ దేశంపై నాకున్న ప్రేమ ఎంతో లోతైనది. బహుశా, భారత్‌ను ఎప్పుడూ పాశ్చాత్య దేశాలతో పోల్చి చూసేవాళ్లు అర్థం చేసుకోలేనిది ఇదే కావచ్చు.
ఒక దేశం అంటే కేవలం అక్కడి రహదారుల నాణ్యత, అధికార యంత్రాంగం పనితీరు, ప్రజల జీతభత్యాలు మాత్రమే కాదు. ఆ దేశంతో మనకున్న అనుబంధం, వేల సంవత్సరాల నాగరికతతో ముడిపడిన సంబంధం, అక్కడ మనకు లభించే మనశ్శాంతి కూడా ముఖ్యమే. వీటిని ఏ లెక్కల సమీకరణాల్లోనూ కొలవలేం.
ఆత్మలేని వ్యవస్థలో జీవితమంతా ఒక బానిసలా బతకడం కంటే, నాకు ఇష్టమైన దేశంలో ఒక చిన్న మనిషిగా బతకడానికే నేను ఇష్టపడతాను. విదేశాలకు వెళ్లే అవకాశాలు నాకు వచ్చాయి. అయినా, నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను.
ఇప్పుడు పదిహేడేళ్లు గడిచాయి. ఎన్నో గాయాలు, ఎదురుదెబ్బలు, కష్టాలు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ, ఇక్కడే ఉండాలన్న నా నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ అనిపిస్తోంది. నా దేశం పరిపూర్ణమైనది కాదు. కానీ ఇది నాది.
ఇది నన్ను ఎప్పటికీ వదిలేయదు. నన్ను తనలో భాగంగా అంగీకరించడానికి వీసా అడగదు. ఎందుకంటే దానికి ఒక ఆత్మ ఉంది. నేను ఈ దేశపు బిడ్డను. అదే అన్నింటికంటే ముఖ్యమైన తేడా! — సుభాష్, ‘ఎక్స్’ (X) నుంచి…
Share this Article