.
Srini Journalist …. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల విషయానికి వస్తే, గ్రామ స్థాయిలో ప్రజలు తమకు నచ్చినట్లు, నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ ఈ రాజకీయ పార్టీలు, పెద్ద పెద్ద నేతలు అంతా వచ్చేసి, ‘మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏకగ్రీవాలే చేసుకుంటాం’ అనడం ఎంతవరకు సమంజసం?
2021లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో దాదాపు 20 శాతం స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అదేదో ప్రజలందరూ ప్రేమతో చేసినవి కావు; భయపెట్టించి, నయానో భయానో చేసుకున్న ఎన్నికలవి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తుందా? అసలు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా? అక్కడ హోరాహోరీ పోటీ జరుగుతుంది కదా?
Ads
మరి గ్రామాల్లో కూడా అలాగే రానివ్వండి. రాష్ట్ర స్థాయిలో మీరు ఎలాగైతే ఓట్లు అడుగుతారో, గ్రామాల్లో కూడా ప్రజలను మాట్లాడుకోనివ్వండి. అన్న, అక్క అంటూ ఆప్యాయంగా ఓట్లు వేసుకొని, తమకు నచ్చిన వారిని ఎన్నుకోనివ్వండి. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని బతికే రాజకీయ పార్టీలే ఈరోజు వచ్చి, ‘మేము పోటీ జరగనివ్వం, ఏకగ్రీవాలు చేపిస్తాం’ అనడం ఏంటి? అసలు వాళ్ళు పోటీ చేస్తే తప్పేముంది? ఏకగ్రీవాలు ఎందుకు కావాలి? అసలు ఈ విధానమే తప్పు. ఏకగ్రీవం అనే కాన్సెప్ట్నే తీసి పారేయాలి.
ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వం నుండి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు అదనపు నిధులు ఇస్తారట. ఎందుకు ఇవ్వాలి? ద్వేషాలు పెంచే ఎన్నికలు వద్దు గానీ, ఆరోగ్యకరమైన పోటీతత్వం, సహృద్భావ వాతావరణం ఉండే ఎన్నికలను అన్ని పార్టీలు ఎందుకు ప్రోత్సహించవు?
పోటీ ఉంటే గ్రామాల్లో కక్షలు పెరుగుతాయనేది వాదన.
నిజంగానే పోటీ వల్ల కక్షలు వస్తాయనుకుంటే, అసలు ఎన్నికలనే తీసి పారేసి అందరికీ ఏకగ్రీవాలు చేసేయండి.
పోటీ చేస్తే కక్షలు వస్తాయన్నప్పుడు,
గత ఎన్నికల్లో కేవలం 20 శాతం మాత్రమే ఏకగ్రీవాలు అయ్యాయి కదా. మరి మిగిలిన 80 శాతం స్థానాల్లో పోటీ జరిగినప్పుడు అక్కడ కక్షలు వచ్చాయా? రాలేదు కదా!
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఒక కొత్త నరేటివ్‌ను బిల్డ్ చేస్తున్నారు Delhi లో.
నిజంగా ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే అలాగే అర్థమవుతుంది.
గత ప్రభుత్వంలో 20 శాతం లోకల్ బాడీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ రికార్డును బీట్ చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఇలా బలి చేయాలి?
ఎందుకు ప్రతిదీ ఏకగ్రీవం కావాలి? నిజంగా గ్రామస్థులంతా కలిసి ఒక మంచి వ్యక్తిని ఏకాభిప్రాయంతో ఎన్నుకుంటే ఆ ఏకగ్రీవాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా, సంఖ్యా బలం ఎక్కువగా కనిపించాలనే దుర్బుద్ధితో ప్రతిదీ ఏకగ్రీవం చేయాలనుకోవడం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నేతలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పక్క జగన్, మరో పక్క లోకేష్.. అంతా యువ నాయకులే కదా! ఇలాంటి youngsters కూడా ఇంకా పాత పద్ధతిలో, పాత మూసలోనే రాజకీయాలు చేస్తే ఎలా? పైగా ఈ ఏకగ్రీవాలు ఏ రీతిలో సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఈ పద్ధతి తప్పు అని చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి.
ఇలాంటి విధానాల వల్ల ప్రజాస్వామ్యం ఎంత మాత్రం బతికే అవకాశం లేదు.”
Share this Article