.
ప్రాణహితపై తుమ్మడిహెట్టి బరాజును 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే… ఒక్క ఊరూ ముంపుకి గురికాదు, ఒక్క కుటుంబాన్నీ తరలించాల్సిన అవసరం లేదు… జస్ట్, 2300 ఎకరాల ముంపు ఉంటుంది, దానికి ఎక్కువ పరిహారం చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదు… కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆ బరాజు ‘ప్రాణహితం’ అయి ఉండేది…
కానీ కేసీయార్ ప్రభుత్వం దాన్ని సాధించలేకపోయింది… ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఈమేరకు ఒప్పించలేకపోయింది… కేవలం 148 మీటర్ల ఎత్తుకే ఒప్పందం కుదుర్చుకుంది… ఈ ఎత్తు సరిపోదనే సాకుతో లక్ష కోట్ల ఖర్చుతో కాళేశ్వరం నిర్మాణానికి పూనుకుంది… మూడు బరాజుల దురవస్థ ఇప్పుడు తెలిసిందే కదా…
Ads
పాత ‘ప్రాణహిత- చేవెళ్ల’ ప్రాజెక్టు స్వరూపానికి గండికొట్టి, కేసీయార్ కాళేశ్వరానికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చాడో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కదా… కానీ అక్కడ 152 మీటర్ల ఎత్తుతో బరాజు కడితేనే ఎల్లంపల్లికి ప్రయోజనం, అంటే గోదావరి నీటిని వీలైనంత గరిష్టంగా వాడుకునే వీలు… నిజానికి మహారాష్ట్ర అంత తీవ్ర వ్యతిరేకతతో ఏమీ లేదు మొదటి నుంచీ… ఎటొచ్చీ, కేసీయార్‌కే ఆ ఎత్తు బరాజు ప్రాణహితపై కట్టడం ఇష్టం లేదు… అందుకని మహారాష్ట్రను ఒప్పించడానికి సరిగ్గా ప్రయత్నించలేదు, తన ప్లాన్ వేరు కదా…
ఈరోజు సాగునీటి అంశాలపై సమీక్షలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే…? ‘‘తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు జరుపుదాం, మన ఇంజినీర్లు- ఉన్నతాధికారులు మన వాదనల్ని సిద్ధం చేయాలి… తుమ్మడిహెట్టి బరాజ్ ఎత్తుపై ఈనెల 23 తరువాత చర్చలు జరపటానికి మహారాష్ట్ర సీఎం సానుకూలం… సూచనప్రాయంగా దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించాడు’’
ఈ సమీక్ష సమావేశంలో సాగునీటి ఇంజినీర్లు చెప్పిన ఇతర వివరాలు… ‘‘తుమ్మిడిహెట్టి బరాజు నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదు… 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2300 ఎకరాల భూములు ముంపుకి గురవుతాయి… అదే 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాలలోపే ముంపు ప్రభావం ఉంటుంది..’’
నిజానికి ఈ ముంపు భూములకు అధిక పరిహారం ఇవ్వడానికి కూడా తెలంగాణ సిద్ధంగా ఉంది… సో, ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, సీడబ్ల్యుసీ కోరిన సమాచారాన్ని అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించాడు…
‘‘అటవీ, గిరిజన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహెట్టి బరాజు అవసరం… ఎల్లంపల్లికీ ప్రాణం… అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలి… జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఏళ్లకేళ్లు పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలి…’’
… ఇదీ రేవంత్ రెడ్డి సంకల్పం… గుడ్… సరైన పాజిటివ్ ధోరణి… ఈ బరాజు ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే దిశలో సాయం చేయాలని సీఎం ఆల్రెడీ కేంద్రాన్ని కోరాడు కూడా…
ఈ తుమ్మడిహెట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించుకున్నట్టయితే ఆదిలాబాద్ ఆయకట్టు మాత్రమే కాదు… మూడు కేసీయార్ బరాజుల దురవస్థతో రాను రాను ప్రశ్నార్థకంగా మారుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకూ కొత్త ఊపిరి అవుతుంది… ఈ లక్ష కోట్ల ఖర్చుకు సార్థకత నెరవేరాలన్నా ప్రాణహితపై తుమ్మడిహెట్టి నిర్మాణమే శరణ్యం..!! దానికి మహారాష్ట్ర అంగీకారమే అవశ్యం..!!
Share this Article