.
ఒక క్యాన్సర్‌తో పోరాటం.. మరోసారి మృత్యువుతో ముఖాముఖి! సోనియా గాంధీ ఆరోగ్య రహస్యాలు.. 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ప్రజాజీవితంలో ఉన్నవారి వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తుంటాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం ఏళ్ల తరబడి అత్యంత గోప్యంగా ఉండిపోతాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యానికి సంబంధించిన ఓ కీలక అధ్యాయం కూడా అలాంటిదే. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ.. ఆపరేషన్.. ఏడాది తిరగకుండానే మరోసారి ప్రాణాంతక వ్యాధి కావచ్చనే అనుమానంతో ప్యాంక్రియాస్‌లో కణితి గుర్తింపు.. వరుసగా రెండు శస్త్రచికిత్సలు! ఈ అనుభవాలన్నింటినీ ఆమె ఇప్పుడు తొలిసారిగా తన ఆత్మకథలో బయటపెట్టింది.
Ads
సోనియా గాంధీ రచించిన ‘Belonging: A Journey of Love’ పుస్తకం నవంబర్ 10న విడుదలైంది. 526 పేజీల ఈ పుస్తకంలో రాజకీయాలు, కుటుంబ జీవితం, వ్యక్తిగత అనుభవాలతో పాటు ఆమె ఆరోగ్య పోరాటానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2010, 2011 సంవత్సరాల్లో ఎదుర్కొన్న రెండు తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాల గురించి ఆమె రాసిన విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

2010.. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ … 2010లో సోనియా గాంధీకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యులపై పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, తన అనారోగ్యం బయటపడితే దేశవ్యాప్తంగా మీడియా హడావుడి మొదలవుతుందని ఆమె ఆందోళన చెందింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బహిరంగ చర్చగా మారడం ఆమెకు ఇష్టం లేదు.
అందుకే భారత్‌లో కాకుండా ఇటలీలోని మిలాన్ సమీపంలో ఉన్న యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రముఖ సర్జన్ డాక్టర్ ఉంబర్టో వెరోనెసి పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరిగింది.
ఆపరేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో రాహుల్, ప్రియాంక తన చేతులు పట్టుకుని, నుదుటిపై ముద్దుపెట్టి ధైర్యం చెప్పిన క్షణాలను సోనియా గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన మనసులో ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నాయని రాసుకుంది.
వైద్యులు రెండు కణితులను తొలగించారు. వాటిలో ఒకటి అనుమానాస్పదంగా లేకపోయినా ముందు జాగ్రత్తగా తొలగించారు. శస్త్రచికిత్స సమయంలోనే రేడియేషన్ చికిత్స (Intra-operative Radiation) అందించడంతో, ఐదు వారాలపాటు చేయాల్సిన రేడియోథెరపీ అవసరం తప్పిందని ఆమె పేర్కొంది.
2011.. ప్యాంక్రియాస్‌లో మరో కణితి! మొదటి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న సమయంలోనే మరో సమస్య ఎదురైంది. 2011లో సాధారణ వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్‌లో (క్లోమ గ్రంథి) మరో కణితి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే రొమ్ము క్యాన్సర్‌తో పోరాడిన ఆమెకు, ఇది మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టిందేమోనన్న భయాన్ని కలిగించింది. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వైద్యులు మొదట అది న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (Neuroendocrine Tumour) అయి ఉండవచ్చని అనుమానించారు. అలాంటిదైతే సుదీర్ఘమైన శస్త్రచికిత్స, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని భావించారు.
ఈసారి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో ఉన్న ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ప్రముఖ ప్యాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ కాస్పర్ వాన్ ఐక్ చికిత్స అందించారు. అసలు వ్యాధి తీవ్రత ఏమిటో ఆపరేషన్ తర్వాతే తెలుస్తుందని వైద్యులు చెప్పడంతో సోనియాలో ఆందోళన మరింత పెరిగింది.

ఒకవేళ అది శరీరంలోని మరోచోటు నుంచి వ్యాపించిన క్యాన్సర్ కణితి (Metastatic Growth) అయితే పరిస్థితి ఏమిటి? తాను కోలుకోగలనా? కీమోథెరపీ అవసరమవుతుందా? ఎంతకాలం ఇంటికి, పనికి దూరంగా ఉండాల్సి వస్తుంది? ఇలాంటి ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు ఆమె తన పుస్తకంలో వివరించింది.
అయితే ఆపరేషన్ తర్వాత వైద్యుల నుంచి ఊరటనిచ్చే సమాచారం అందింది. ప్యాంక్రియాస్‌లోని కణితి ప్రారంభ దశలోనే గుర్తించబడిందని, అది ప్రీ-క్యాన్సరస్ దశలో ఉందని వైద్యులు తెలిపారు. అంటే అది క్యాన్సర్‌గా మారకముందే గుర్తించి తొలగించగలిగారు. దీంతో మరోసారి పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లయింది.
కీమోథెరపీ అవసరం రాలేదు.. అదృష్టంగా భావించా! ఈ రెండు సందర్భాల్లోనూ శస్త్రచికిత్సల ద్వారా కణితులను తొలగించగలగడం, కీమోథెరపీ అవసరం రాకపోవడం తనకు పెద్ద ఉపశమనమని సోనియా పేర్కొంది. ముఖ్యంగా రెండో శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి నాలుగు వారాలపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో ప్రియాంక తన పక్కనే ఉండి చూసుకుంది. నెదర్లాండ్స్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు రాత్రిపూట ఉండేందుకు సాధారణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు. అయినప్పటికీ ప్రియాంక వారం రోజులకు పైగా నేలపైనే షాల్ కప్పుకుని నిద్రించిన విషయాన్ని కూడా సోనియా భావోద్వేగంగా గుర్తుచేసుకుంది.
వ్యాధులకంటే గోప్యత గురించే ఎక్కువ ఆందోళన! ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గోప్యత కూడా అంతే ముఖ్యమని సోనియా భావించింది. తన ఆరోగ్య సమస్యల గురించి మీడియా చర్చించడం, ప్రతి చిన్న విషయాన్ని బహిరంగం చేయడం ఆమెకు ఇష్టం లేదు. ‘నేను పబ్లిక్ ఫిగర్‌నే కావచ్చు. కానీ నాకు కనీసం కొంత వ్యక్తిగత గోప్యత పొందే హక్కు కూడా లేదా?’ అన్న ఆమె ప్రశ్నలో ఆ సమయంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ కనిపిస్తుంది.
ఈ ఆరోగ్య సమస్యలకు ముందు తనకు ఆస్తమా, అలర్జీలు, అప్పుడప్పుడు కడుపు సంబంధిత సమస్యలు మాత్రమే ఉండేవని ఆమె తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెరిగిన ఒత్తిడి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు తరచుగా వేధించాయని, వయసు పెరిగే కొద్దీ అవి మరింత తీవ్రమయ్యాయని వైద్యులు చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.
2016 వారణాసి రోడ్‌షో కోలుకోలేని దెబ్బ…: క్యాన్సర్ చికిత్సల నుంచి కోలుకున్నప్పటికీ సోనియాకు ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. 2016లో వారణాసిలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీవ్ర అలసటకు గురై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆమె భుజం ఎముక విరగడంతో మరోసారి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. వరుసగా ఎదురైన ఈ ఆరోగ్య సమస్యలు రాజకీయ బాధ్యతల నిర్వహణపై కూడా ప్రభావం చూపించాయి. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి తన ఆరోగ్యం కూడా ఒక ముఖ్యమైన కారణమని ఆమె పుస్తకంలో వివరించింది.
ఎనభై ఏళ్ల వయసులోనూ ప్రజాజీవితంలో కొనసాగుతున్న సోనియా గాంధీ ప్రయాణంలో రాజకీయ విజయాలు, అపజయాల సంగతి పక్కన పెడితే.. క్యాన్సర్ భయం నుంచి శస్త్రచికిత్సల వరకు, కుటుంబ సభ్యుల అండ నుంచి కోలుకుని తిరిగి నిలబడటం వరకు సాగిన ఈ ఆరోగ్య పోరాటం ఆమె జీవితంలోని మరో కోణాన్ని పరిచయం చేస్తుంది…
Share this Article