Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ మర్డర్ కేసును మలుపు తిప్పిన ఆ ఉత్కంఠభరిత మ్యాచ్!

November 16, 2026 by M S R

.

(  రమణ కొంటికర్ల  )…. ఓ క్రికెట్ మ్యాచ్ ఓ మర్డర్ కేసులో ఓ కీలక మలుపుకు ఆధారమైన ఘటన మీకు తెలుసా..? ఆ విశేషాలు తెలుసుకోవాలంటే.. ఓసారి 1986 ఆస్ట్రేలియా వేదికగా.. ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్ చరిత్రలోకి వెళ్లాలి మనం.

ఆ మ్యాచ్ జరిగేకంటే రెండేళ్ల క్రితమే చనిపోయాడనుకున్న వ్యక్తి… ఆ మ్యాచులో ప్రత్యక్షమవ్వడంతో ఓ మర్డర్ కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ హత్య కేసు మళ్లీ వార్తల్లోకెక్కింది.

Ads

ప్రేమ – అనుమానం – అదృశ్యం… ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో వుడ్‌బెర్రీ అనే చిన్న పట్టణం. అక్కడ పీటర్ బర్టన్, మార్గరెట్ బర్టన్ దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలానికి మార్గరెట్‌కు.. రోనాల్డ్ బర్క్ అనే వ్యక్తితో సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారిపోయింది. దాంతో భార్యాభర్తలైన పీటర్ బర్టన్, మార్గరెట్ బర్టన్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. మార్గరెట్‌కు ఆస్తిలో ఏమీ దక్కకుండా చేయాలని పీటర్ భావిస్తున్నట్టుగా కొన్ని ఆడియా క్లిప్స్ కూడా న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు లభించాయి.

1983, మే 29న పీటర్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతడి కారు ఎక్కడో రోడ్డుపై వదిలేసి ఉండటం, బ్యాంకు లావాదేవీల్లో తేడాలు, ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల దర్యాప్తు అనుమానాలతో మొదలైంది. దాంతో పోలీసులు మార్గరెట్ బర్టన్ ను గట్టిగా విచారించారు.

అంతకుముందు రోజు.. రోనాల్డ్ తనతో మాట్లాడుతూ పీటర్‌ను అడ్డు తొలగించగల వ్యక్తిని తాను ఏర్పాటు చేస్తానని చెప్పినట్టు… మార్గరెట్ పోలీసులకు వెల్లడించింది. పీటర్ కనిపించకుండా పోయిన తర్వాత అడిగితే.. అంతా అయిపోయింది.. పని పూర్తయిందన్నాడని మార్గరెట్ పోలీసులకు తెలిపింది.

దాంతో పీటర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న అభియోగాలపై మార్గరెట్, రోనాల్డ్‌ ఇద్దరికీ 1984 నవంబర్ 8వ తేదీన జీవిత ఖైదు విధించారు. పీటర్ మృతదేహం మాత్రం పోలీసులకు లభించలేదు.

super twist

క్రికెట్ మ్యాచ్‌లో ప్రత్యక్షమైన మృతుడు! 1986 జనవరి నెలలో ఆస్ట్రేలియాలో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ జరిగింది. జనవరి 31న భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన లీగ్ మ్యాచ్ జరిగింది. భారత జట్టుకు కపిల్ దేవ్, ఆస్ట్రేలియాకు అలన్ బోర్డర్ నాయకత్వం వహించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 235 పరుగులు చేసింది. రవిశాస్త్రి రెండు కీలక వికెట్లు పడగొడితే.. కపిల్ దేవ్ నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశాడు.

భారత్ లక్ష్య ఛేదనకు దిగుతున్న సమయంలో టీవీ కెమెరాలు ప్రేక్షకుల గ్యాలరీ వైపు తిరిగాయి. అక్కడ సన్‌గ్లాసెస్ ధరించి మ్యాచ్ చూస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు. ఆస్ట్రేలియాలోని మరో ప్రాంతంలో టీవీలో మ్యాచ్ చూస్తున్న జూడీ ఎడ్మండ్స్ అనే మహిళ ఆ ముఖాన్ని గుర్తుపట్టింది. అతడు రెండేళ్లుగా కనిపించకుండా పోయిన పీటర్ బర్టన్ అని ఆమె భావించింది.

దాంతో కేసు మళ్లీ తెరపైకొచ్చింది. కోర్టులో సాక్ష్యం చెబుతూ మ్యాచ్ వీడియోలో కనిపించిన వ్యక్తి పీటర్ అని గుర్తించానంది. మరో స్నేహితురాలు జాన్ డైసన్‌తో పాటు, మరో ఏడుగురినీ విచారించగా.. వారంతా కూడా చనిపోయాడనుకున్న వ్యక్తి పీటర్‌ను పోలి ఉన్నట్టు ధృవీకరించారు.

హత్య కేసులో అనూహ్య మలుపు! పీటర్ బతికే ఉన్నాడన్న అనుమానంతో మార్గరెట్ తరఫు న్యాయవాదులు కోర్టులో అప్పీలు చేశారు. పీటర్ మరణించినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని వాదించారు. ఆ కొత్త సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న న్యూ సౌత్ వేల్స్ అప్పీల్ కోర్ట్.. మార్గరెట్‌కు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. అయితే పీటర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న నేరారోపణ మాత్రం కొనసాగింది. అంటే హత్య చేసినట్లు నిర్ధారణ కాకపోయినా.. హత్యకు కుట్ర పన్నిన నేరం నుంచి వారు విముక్తి పొందలేదు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఆస్ట్రేలియా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ మంచి ఆరంభాన్నిస్తే… దిలీప్ వెంగ్‌సర్కార్ అజేయంగా 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఒకవైపు, భారత క్రికెట్ జట్టు విజయం.. మరోవైపు, రెండేళ్లుగా హత్యకు గురయ్యాడనుకున్న వ్యక్తి ఆ మ్యాచులో ప్రత్యక్షమవ్వడంతో.. ఆ రోజు జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే కాదు.. ఆస్ట్రేలియా న్యాయ చరిత్రలోనూ ఒక ఆసక్తికరమైన ఘట్టంగా మిగిలిపోయింది. కొన్నిసార్లు క్రికెట్ మ్యాచులు రికార్డులు సృష్టించడం మాత్రమే కాదు.. ఊహించని మలుపులనూ వెలుగులోకి తెస్తాయనే ఓ సరికొత్త విషయం ఆ మ్యాచ్ చెప్పింది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ మర్డర్ కేసును మలుపు తిప్పిన ఆ ఉత్కంఠభరిత మ్యాచ్!
  • MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!
  • చంద్రబాబు చెబితే నవ్వారు- కానీ భావి ప్రయోగాలు- ఆశలు మాత్రం అవే !!
  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!
  • నాటి యండమూరి నవల – రికార్డుల ‘వాయేజర్‌’పై నా గాఢాసక్తికి కారణం…
  • ఈతరం పిల్లలకు మైసూరు ‘కాస్మోస్’ ఎందుకు చూపించాలి..?
  • ఎక్కడ రాకెట్ వదిలాడో, అక్కడే పట్టేసుకున్నాడు… మస్క్, నువ్వు తోపు..!!
  • కింగ్ ఆఫ్ స్లో మోషన్ – ఈ ‘క్రాక్రోయాక్స్’ ఇప్పుడు మేఘనాథుడు..!!
  • సినిమాల ‘నరుకుడు’ రోగానికి సెన్సార్ చికిత్స..! భోగితో స్టార్ట్..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions