Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా ఏమైనా రాసుకోనీ… ప్రేక్షకుడి అసలు తీర్పు వేరు- వసూళ్లు వేరు..!!

November 16, 2026 by M S R

.

ఏదైనా రివ్యూ నెగెటివ్‌గా వస్తే ఏడ్చి చస్తారు, శాపనార్థాలు పెడతారు… కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు నిజంగానే ఏవేవో కారణాలతో నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తారు… కానీ రివ్యూలు కానీ, సోషల్ మీడియా జడ్జిమెంట్లు కానీ, విషప్రచారాలు గానీ సినిమాను పెద్దగా ప్రభావితం చేయవు… అవి సినిమాను లేపలేవు, సినిమాను చంపలేవు…

అసలు సగటు ప్రేక్షకుడి తీర్పు ఎవరికీ అంతుపట్టదు… తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, మరోవైపు ప్రేక్షకులు థియేటర్లకు వరుస కడుతూనే ఉంటారు… సో, నాణ్యత వేరు- వసూళ్లు వేరు… సినిమా నాణ్యతకు వసూళ్లు కొలబద్ద కాదు, వసూళ్లు లేనంతమాత్రాన సినిమా నాసిరకం అనీ కాదు…

Ads

అవును, సోషల్ మీడియా తీర్పు వేరు- బాక్సాఫీసు తీర్పు వేరు… ఓటీటీలో వచ్చాక పోస్ట్ మార్టం రిపోర్టులు చాలా వస్తాయి… అప్పటికే సినిమా ఫ్లాపో, హిట్టో తేలిపోతుంది… సినిమా బాగుంటే జనం చూస్తారు. బాగా లేకపోతే చూడరు. ఇది ఒకప్పటి సూత్రం…

ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా వచ్చిన సినిమా మంచి చర్చకు దారితీసింది. జనాదరణ కోసం సంప్రదాయ బుర్రకథకు కాస్త మసాలాలు దట్టించిన గరివిడి లక్ష్మి బయోపిక్… నిజంగా హీరోయిన్ ఆనంది బాగా నటించింది… అవార్డుకు అర్హురాలు… సోషల్ మీడియా ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.

మౌత్ టాక్ కూడా బాగానే ఉంది… అయినా థియేటర్లలో వసూళ్లు సుమారు రూ.9 కోట్ల నెట్ దగ్గరే ఆగిపోయాయి… ఒక మంచి కథ, మంచి నటన, మంచి మాటల ప్రచారం ఉన్నంత మాత్రాన భారీ వసూళ్లు వస్తాయనే గ్యారంటీ లేదని ఈ సినిమా చెప్పింది… ఇది ఉత్తర కోస్తా కథ…

ఇదే సమయంలో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ను చూడండి. హైదరాబాద్ కథ… 1980 నాటి కథ… మతిమాలిన హింస, రక్తపాతంతోపాటు కథనలోపాలూ బోలెడు… ఐనా థియేటర్ల దగ్గర జనం కనిపించారు… అఫ్‌కోర్స్, ఏశనాగులకట్ట మీద పాట ఓ ఆకర్షణ, మిగతావన్నీ సోసో… ఐతేనేం… విడుదలైన ఆరు రోజుల్లోనే ఇండియా నెట్ వసూళ్లు రూ.100 కోట్లు… గ్రాస్ వరల్డ్ వైడ్ 170 కోట్లు..!  అంటే విమర్శకులకు నచ్చని అంశాలే ప్రేక్షకుల్లో కొందరికి ఆకర్షణ కావచ్చు… ఒకరి దృష్టిలో అతిగా కనిపించిన హింస, మరొకరికి తెరపై కావాల్సిన మాస్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు…

ఇక ‘రామాయణం’ సంగతి మరింత ఆసక్తికరం… ఈ సినిమాపై విడుదలకు ముందూ, విడుదలయ్యాకా విమర్శలకు కొదవలేదు. పాత్రల రూపకల్పన నుంచి సాంకేతిక అంశాల వరకు, ఇతిహాసాన్ని తెరకెక్కించిన తీరుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విషప్రచారమూ తక్కువేమీ కాదు.

అయినా నవంబర్ 5న విడుదలైన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల వసూళ్ల మార్కును దాటింది… ఇంకా వీకెండ్స్ బాగా రనవుతోంది… మరో పది దేశాలకు పైగా మార్కెట్లలో విడుదల కావాల్సి ఉంది… 1600- 1700 కోట్ల గ్రాస్‌ దాటి ముగుస్తుందేమో బహుశా… నాన్ థియేటరికల్ డబ్బు సరేసరి… సుమారు 800 కోట్లు ఖర్చు చేస్తే డబుల్ ప్రాఫిట్… తిట్టేవాడు తిడుతున్నాడు, కుటుంబాలు వీకెండ్స్‌లో పిల్లలతో వెళ్తూనే ఉన్నారు…

ఇక ‘దురంధర్’ సినిమాను తీసుకుందాం. దేశభక్తి ముసుగులో ప్రాపగాండా నడుపుతున్నారనే విమర్శల నుంచి, చరిత్రను తమకు అనుకూలంగా మలిచారనే అభ్యంతరాల వరకు ఎన్నో చర్చలు జరిగాయి. రెండో భాగం ‘దురంధర్: ది రివెంజ్’ విషయంలోనూ ఈ వాదనలు మరింత పెరిగాయి. ధ్రువ్ రాఠీ వంటి యాంటీ-నేషన్ సోషల్ మీడియా వ్యాఖ్యాతలు సినిమాను రాజకీయ ప్రచార సాధనంగా అభివర్ణించారు. మరోవైపు ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, రెండో భాగం కూడా విడుదలైన కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కును దాటింది. విమర్శలు ఒకవైపు, బాక్సాఫీస్ మరోవైపు సాగాయి.

ఇది ఒక్క ఈ సినిమాలకే పరిమితమైన పరిణామం కాదు. ధనుష్, కృతి సనన్ నటించిన ‘తేరే ఇష్క్ మేన్’ కూడా ప్రేమ పేరుతో అతి, మానసిక వేధింపులు, హింసను రొమాంటిసైజ్ చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంది. అయినా దేశీయంగా రూ.100 కోట్ల మార్కును దాటింది. అంతకుముందు ‘యానిమల్’, ‘కబీర్ సింగ్’ సినిమాల విషయంలోనూ ఇలాంటి చర్చే జరిగింది. స్త్రీ పాత్రల చిత్రణ, హీరోల ప్రవర్తన, హింసను చూపించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తినా వసూళ్లకు మాత్రం లోటు రాలేదు.

అయితే ప్రతి వివాదాస్పద సినిమా భారీ విజయం సాధిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ‘ఎమర్జెన్సీ’ చుట్టూ ఎంత చర్చ జరిగినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. అలాగే మంచి సమీక్షలు వచ్చినంత మాత్రాన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తాయన్న హామీ కూడా లేదు. అంటే వివాదం ఒక్కటే విజయానికి కారణం కాదు. ప్రశంసలు ఒక్కటే వసూళ్లకు మార్గం కాదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా ఏమైనా రాసుకోనీ… ప్రేక్షకుడి అసలు తీర్పు వేరు- వసూళ్లు వేరు..!!
  • ఎన్టీఆర్ ఓడి- కృష్ణ గెలిచి… రెండు సింహాల నడుమ నలిగిన గిరిబాబు..!!
  • ఓ మర్డర్ కేసును మలుపు తిప్పిన ఆ ఉత్కంఠభరిత మ్యాచ్!
  • MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!
  • చంద్రబాబు చెబితే నవ్వారు- కానీ భావి ప్రయోగాలు- ఆశలు మాత్రం అవే !!
  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!
  • నాటి యండమూరి నవల – రికార్డుల ‘వాయేజర్‌’పై నా గాఢాసక్తికి కారణం…
  • ఈతరం పిల్లలకు మైసూరు ‘కాస్మోస్’ ఎందుకు చూపించాలి..?
  • ఎక్కడ రాకెట్ వదిలాడో, అక్కడే పట్టేసుకున్నాడు… మస్క్, నువ్వు తోపు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions