Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…

November 28, 2026 by M S R

.

సుప్రీంకోర్టు ముక్క చీవాట్లు పెట్టినా సరే… జోసెఫ్ విజయ్ ప్రభుత్వం అడ్డదారిలో నడుస్తోంది… నానా వేషాలూ వేస్తోంది… దీపత్థూన్ వద్దకు ముస్లింలను ఆర్గనైజ్ చేస్తోంది… సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడానికి నిన్నటిదాకా నానా వేషాలూ వేసిన విజయ్ ఇప్పుడు శాంతి భద్రతలను ఎరవేస్తున్నాడు… most dangerous… కాదు, మూర్ఖపు ముఖ్యమంత్రి…

ఒక దీపం వెలిగించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది… చివరకు కోర్టు ఆదేశాలను అమలు చేయించడానికి సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది… ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే ఇజ్జత్ పోయే పరిస్థితి ఏముంటుంది?

Ads

మధురై తిరుప్పరన్‌కుండ్రం కార్తీకదీపం వివాదం ఇప్పుడు కేవలం మతపరమైన అంశం కాదు. న్యాయవ్యవస్థను ఎదుర్కొనే విషయంలో ఒక ప్రభుత్వం ఎంతటి రాజకీయ అపరిపక్వత ప్రదర్శించిందో చెప్పే ఉదంతం…

తిరుప్పరంకుండ్రం

1. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం, అది పెండింగ్ అనే పేరిట సుప్రీం తీర్పు తుంగలో తొక్కే వేషాలు

2. తరువాత అర్జెంటుగా ట్రస్ట్ బోర్డు సభ్యులను మార్చి, కొత్తవాళ్లను నియమించి, వాళ్లే అడ్డుకుంటున్నారనే నెపంతో… కలెక్టర్, డీజీపీ, సీఎస్‌లను బలిపశువులను చేసే వేషాలు… అజ్ఞానం…

3. ఇప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి, మొత్తం ఈ షోను అభాసుపాలు చేయడానికి దీపత్థూన్ దగ్గరకు ముస్లింలను ఆర్గనైజ్ చేయడం… వీడు తమిళ పాలకుడు..!!


కార్తీకదీపం

కానీ ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు… దీపక్ సాయి, జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్… ఒకరు న్యాయపోరాటంలో నిలబడితే, మరొకరు న్యాయపీఠంపై ఉండి ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు…

దీపక్ సాయిని మరో రామ్ జెఠ్మలానీ అనాలో, పరాశరన్ అనాలో! కేసులోని న్యాయపరమైన చిక్కులను విడమరిచి చెప్పడమే కాదు, సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను నిలదీస్తూ, కోర్టు ఆదేశాల అమలు విషయంలో రాజీ పడకుండా పోరాడిన తీరు అభినందనీయం… నవంబర్ 27న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలోనూ ఆయన వాదనలు కీలకంగా నిలిచాయి…

ఇక జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాలి… గత ఏడాది డిసెంబర్ 1న దీపథూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించినప్పటి నుంచి ఆయనపై రాజకీయ దాడులు మొదలయ్యాయి… వంద మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు ఆయనపై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వడం చిన్న విషయం కాదు…


న్యాయమూర్తి తీర్పును నచ్చకపోతే విమర్శించవచ్చు… కానీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టడం, అభిశంసన అస్త్రంతో ఒత్తిడి చేయడం ఎలాంటి సంప్రదాయం? అయినా స్వామినాథన్ వెనక్కి తగ్గలేదు… ఇప్పుడు అదే వివాదంలో మరోసారి ఆయన న్యాయపరమైన జోక్యం కనిపించింది… ఇప్పుడు దీపం వెలిగించే పర్యవేక్షణ బాధ్యత తనదే…

ఎటొచ్చీ విజయ్ ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించింది. … గతంలో డీఎంకే ప్రభుత్వం దీపథూన్ వద్ద దీపం వెలిగించడానికి అభ్యంతరం చెప్పింది. ఆ ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించిన విజయ్ అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి? న్యాయస్థానం ఆదేశాలను గౌరవించి అమలు చేయాలి. కానీ సుప్రీంకోర్టులో అప్పీలు, సమీక్ష పిటిషన్లు అంటూ న్యాయపోరాటం ఒకవైపు నడిపిస్తూనే, మరోవైపు కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం ఎందుకు?

సుప్రీంకోర్టు నవంబర్ 20న దీపథూన్ వద్ద ఒకసారి దీపం వెలిగించడానికి స్పష్టమైన అనుమతి ఇచ్చింది. నవంబర్ 24న దీపం వెలిగించాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం సంప్రదాయ స్థలమైన ఉచ్చిపిళ్లయార్ మండపం వద్దే దీపం వెలిగించింది. అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు సహకరిస్తామని మద్రాస్ హైకోర్టుకు హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ కూడా ఆచరణలో విఫలమయ్యాడు.

ఇక్కడే ప్రభుత్వం మరో తెలివితక్కువ ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతను దేవస్థానం ట్రస్టీల మీదకు నెట్టే ప్రయత్నం చేసింది. కొత్తగా ట్రస్టీ బోర్డును పునర్వ్యవస్థీకరించి, ఆ బోర్డు తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని కోర్టు ఆదేశాల అమలుకు మెలిక పెట్టింది.

అంటే ప్రభుత్వమే నేరుగా ఎదురు నిలబడకుండా, ట్రస్టీలను ముందు పెట్టి సుప్రీంకోర్టుకు గండికొట్టాలన్న ప్రయత్నం. అయితే ట్రస్టీల తీర్మానం, దాని వెనుక ఉన్న అధికారుల పాత్ర, రాజకీయ ఆదేశాలున్నాయా లేదా అన్నది ఇప్పుడు కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.

కానీ సుప్రీంకోర్టు అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. నవంబర్ 27న ఏకంగా దేవస్థానం ట్రస్టీ బోర్డునే సస్పెండ్ చేసింది. ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులను ఆలయ పరిపాలన పర్యవేక్షణకు నియమించింది. ఆలయం, కొండ ప్రాంతం భద్రతను సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఏమైనా ఆదేశాలు వెళ్లాయా? ఎవరెవరితో మాట్లాడారు? ఫోన్లు, మెయిల్స్, సందేశాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ముఖ్యమంత్రి రాజకీయ ప్రమేయం ఉందా లేదా అన్నది కూడా విచారణలో తేలాల్సి ఉంది.

ఒక రాష్ట్రంలో ఒక ఆలయ దీపం వెలిగించడానికి కేంద్ర బలగాలు రావాల్సిన పరిస్థితి రావడం ఎంతటి పరిపాలనా వైఫల్యం! స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదని సుప్రీంకోర్టు భావించే స్థాయికి వ్యవహారం వెళ్లడం విజయ్ ప్రభుత్వానికి పెద్ద అప్రతిష్ఠే.

vijay

ఇదంతా ఎందుకు జరిగిందంటే.. విజయ్‌కు రాజకీయ లెక్కలు ఉండవచ్చు. ఆయనది మైనారిటీ పార్టీల మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం. మైనారిటీ ఓటు బ్యాంకు దూరమవుతుందేమోనన్న భయం ఉండవచ్చు. మైనారిటీ ఓట్లన్నీ తనకే వస్తాయన్న ఆశ కూడా ఉండవచ్చు. కానీ రాజకీయ లాభనష్టాల లెక్కలు వేసుకుంటూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరిస్తే ఎలా?

మత సామరస్యం పేరుతో ఒక వర్గం మత విశ్వాసాలను నిర్లక్ష్యం చేయడం పరిష్కారం కాదు. అదే సమయంలో దర్గాకు సంబంధించిన హక్కులు, భద్రతను విస్మరించడం కూడా సరికాదు. సుప్రీంకోర్టు కూడా తన మధ్యంతర ఆదేశంలో దర్గా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అసలు వివాదంలోని భూమి హక్కులు, ఆచారాలపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. కానీ కోర్టు ఇచ్చిన అప్పటి ఆదేశాన్ని మాత్రం అమలు చేయాలి కదా!

రాజకీయాల్లో అనుభవం లేకపోవడం తప్పు కాదు. కానీ రాజకీయ అపరిపక్వతతో రాజ్యాంగ వ్యవస్థలతోనే ఆటలాడుకోవడం మాత్రం క్షమించరాని తప్పిదం.

విజయ్ ఇప్పుడొకటి గుర్తుంచుకోవాలి. ఓట్ల కోసం వేసే రాజకీయ ఎత్తుగడలు ఎన్నికల దాకా పనికిరావచ్చు. కానీ న్యాయస్థానాల ముందు అవి పనిచేయవు. ఈ వ్యవహారంలో దీపక్ సాయి, స్వామినాథన్‌లు తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. విజయ్ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ లెక్కలతో తానే చిక్కుల్లో పడింది. దీపం వెలిగింది.. కానీ ఆ వెలుగులో బయటపడింది ప్రభుత్వ వైఫల్యం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…
  • నేలపై మెతుకులు ఏరుకున్న ‘పెళ్లి భోజనం’! దిక్కుమాలిన పెళ్లి జాతర!!
  • పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు!
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్థానీ కంటెంట్ వివాదం! కేంద్రం ఊరుకోవాలా..?!
  • యూపీ సభా? బహిరంగసభా? డీలిమిటేషన్‌ పర్వంలో ఓ ఉపకథ!!
  • ఇండస్ట్రియల్ పాలసీ 2.0 … గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలు!!
  • మీరు బహుశా ఈ సినిమా గురించి విని ఉండకపోవచ్చు!
  • మహేశ్ బాబు లుక్‌కు ఎఐ నగిషీలు- సిక్స్ ప్యాక్ ప్రయాసలు..?
  • నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!
  • బుక్ చేసుకొండి- ‘ఆ నలుగురు’ వస్తారు, పాడె మోస్తారు, కట్టె కాలుస్తారు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions