.
కాలం కట్టేసే సమయం వచ్చినప్పుడు… కట్టె మోయడానికీ, కట్టె కాల్చడానికి… ఓ నలుగురు కావాలి… మరి ‘ఆ నలుగురూ’ లేనివాళ్ల గతి..? ఎన్ని వార్తలు చదువుతున్నాం… దేశంకాని దేశానికి వెళ్లి, ఇక్కడ కన్నవాళ్లకు కాలానికి వదిలేసి, చివరకు కాలం తీరాక ‘అంత్యక్రియల బాధ్యతల’ను సైతం వదిలేస్తున్న వార్తలు… ఎవరు నిర్వర్తించాలి, పైకి గౌరవంగా పంపించే బాధ్యతను..!?
ఇదుగో ఇక్కడే ‘వ్యాపారం’ ప్రవేశించింది… నిజానికి వ్యాపారమే కావచ్చుగాక… కానీ చాలామందికి ఓ ఊరట… రేప్పొద్దున పిండం పెట్టేవాడు రాకపోతే, గయకు వెళ్లి ఆత్మపిండం పెట్టుకోవచ్చు మనమే… కానీ కట్టె కాలేదెలా..?
Ads
మనిషి మరణం తర్వాత ఎదురయ్యే లాజిస్టిక్స్, క్రతువులు, ఏర్పాట్ల హడావుడిని ఒక ‘సర్వీస్ ప్యాకేజీ’గా మార్చేసి, బతికుండగానే ముందే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఓ స్టార్టప్ తెరపైకి వచ్చింది… ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘మోక్ష వాయేజ్’ (Moksha Voyage) చుట్టూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది…

‘మోక్ష వాయేజ్’ తన ప్రధాన కార్యకలాపాలను ప్రస్తుతానికి ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిధి నుంచే ప్రారంభించినా, దేశంలోని పలు ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలు, అలాగే విదేశీ సమన్వయ సేవల వైపు విస్తరిస్తున్నట్లు సంస్థ వెబ్‌సైట్ వివరాల ద్వారా తెలుస్తోంది…
ప్రధాన కార్యకలాపాలు… ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతాలు (నిగమ్‌బోధ్ ఘాట్, ఘాజీపూర్, నోయిడా సెక్టార్ 94 వంటి స్మశాన వాటికల సమన్వయంతో సహా)..,.
పాశ్చాత్య దేశాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ‘ప్రీ-ప్లాన్డ్ ఫ్యూనరల్ సర్వీసెస్’ తరహాలోనే, మన సంప్రదాయాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు…
-
ప్యాకేజీలు, ధరలు..: విడివిడి సేవలు సుమారు ₹6,000 నుంచి ప్రారంభమవుతుండగా, పూర్తిస్థాయి ప్యాకేజీలు ₹29,999 (‘సమ్మాన్ సేవ’), ₹69,999 (‘శ్రాద్ధ సేవ’), ₹1,49,999 (‘మోక్ష సంకల్ప సేవ’) శ్రేణుల్లో ఉన్నాయి…
-
అందించే సేవలు..: మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్, శవవాహనం, పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులను సమకూర్చడం, దహన సంస్కారాలకు అవసరమైన కట్టెలు, పూలు, పూజా సామగ్రి, పురోహితుడు, డెత్ సర్టిఫికెట్ వంటి పత్రాల ప్రక్రియలో సహాయాన్ని ఈ సంస్థ అందిస్తుంది…
-
తర్వాతి క్రతువులు…: అస్థికల సేకరణ, నిమజ్జనం, 10 నుంచి 13వ రోజు వరకు జరిగే దశదిన, ఏకాదశ, త్రయోదశ కర్మలు, బ్రాహ్మణ భోజనం, హరిద్వార్ లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు ప్రయాణ ఏర్పాట్లు కూడా విస్తృత ప్యాకేజీలలో భాగంగా ఉంటాయి…
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రీజినల్ ఆఫీస్ ఉన్నట్లు సంస్థ సంప్రదింపుల వివరాలలో కనిపిస్తోంది… ప్రవాస భారతీయులు (NRI) & అంతర్జాతీయ సేవలు… అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల కోసం రిమోట్ కోఆర్డినేషన్, పత్రాల ప్రక్రియ, భారత్‌లో అంత్యక్రియల ఏర్పాట్లు వంటి సేవలను అందిస్తున్నట్లు సంస్థ చెబుతోంది…
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రైవేట్ ఫ్యూనరల్ సర్వీస్ సంస్థలు, శవవాహనాలు, ఫ్రీజర్ బాక్సులు, స్మశాన వాటికల వద్ద ఏర్పాట్లు చేసే ప్రొఫెషనల్ సర్వీసులు పనిచేస్తున్నాయి (ఉదాహరణకు స్థానికంగా పనిచేసే వివిధ అంత్యక్రియల సేవా సంస్థలు మహాప్రస్థానం, బన్సీలాల్‌పేట, అంబర్‌పేట వంటి చోట్ల సమన్వయం చేస్తుంటాయి)…
అయితే ‘మోక్ష వాయేజ్’ విషయానికి వస్తే, అది ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రధానంగా నడుస్తున్న స్టార్టప్ అయినప్పటికీ, ఆన్‌లైన్/ టెలిఫోన్ ద్వారా ప్రీ-బుకింగ్ లేదా రిమోట్ కోఆర్డినేషన్ కోరుకునే వారికి సంప్రదించే అవకాశం కల్పిస్తోంది…
ఆత్మీయత, సంప్రదాయంతో ముడిపడి ఉన్న అంతిమ ఘట్టాన్ని కూడా ప్యాకేజీల రూపంలో అమ్మకానికి పెట్టడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న కూడా కొందరి నుంచి వినిపిస్తోంది. రేపు పొద్దున ‘ఆ నలుగురు’ మనుషుల స్థానంలో ‘ప్యాకేజీ సిబ్బంది’ వస్తే, బంధాల లోటును డబ్బుతో పూడ్చగలమా అని విమర్శ… కానీ ఎవరూ లేనివాళ్లను, ఎవరూ రానివాళ్లను, ఒకరకం ఒంటరి బతుకుల్ని ఎప్పుడూ వేధించే ఓ ప్రశ్నకు ఈ ప్యాకేజీలు ఊరటనిచ్చే జవాబులే..!!
Share this Article