Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!

November 28, 2026 by M S R

.

 ప్రేమకు నోటరీ సాక్ష్యం! మొదటి బంధాల్లో నమ్మకాలు కోల్పోయి… కొత్త బంధంలో అపనమ్మకాలకు అగ్రిమెంట్! కానీ నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!

ప్రేమకు వయసుతో పనిలేదు. పరిచయం ఎక్కడ మొదలైందన్న పట్టింపు లేదు. ఇద్దరి మనసులు కలిస్తే చాలు… కలిసి జీవించాలని అనిపిస్తుంది. కానీ ఆ కలిసి జీవించాలన్న నిర్ణయానికి కూడా ఒక స్టాంప్ పేపర్, తొమ్మిది షరతులు, నోటరీ సంతకం అవసరమైతే మాత్రం కాస్త ఆశ్చర్యపోవాల్సిందే!

Ads

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోషిణి వయసు 23 ఏళ్లు. అమిత్ కుమార్ వయసు 37 ఏళ్లు. ఇద్దరికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరికీ గతంలో పెళ్లిళ్లయ్యాయి. పిల్లలూ ఉన్నారు.

కానీ తమ తమ వైవాహిక జీవితాల్లో కొనసాగలేకపోయిన ఈ ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విడాకుల ప్రక్రియ పూర్తికాకపోవడంతో సహజీవనం మొదలుపెట్టేందుకు వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై తొమ్మిది షరతులతో ఒప్పందం రాసుకున్నారు. నోటరీతో ధ్రువీకరించుకున్నారు.

అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఒప్పందంలో ఉన్న అంశాలు చూస్తేనే అసలు కథ అర్థమవుతుంది.

కొత్త జీవితంలో ఇద్దరూ తమ బాధ్యతలు నిర్వర్తించాలి. అమిత్ తన పిల్లలతో పాటు భవిష్యత్తులో పుట్టే సంతాన బాధ్యతలూ తీసుకోవాలి. రోషిణి కూడా అమిత్ మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లలను సొంత పిల్లల్లాగే చూసుకోవాలి. ఆర్థిక, కుటుంబ బాధ్యతలు, పరస్పర గౌరవం, ఒకరి పట్ల మరొకరు వ్యవహరించాల్సిన తీరు… ఇలా చాలా అంశాలను ముందుగానే కాగితం మీద పెట్టుకున్నారు.

ప్రేమలో పడినప్పుడు ఇన్ని లెక్కలేమీ ఉండవు. కానీ కలిసి జీవించాలనుకున్నప్పుడు మాత్రం ఇన్ని షరతులా? ఇక్కడే ఈ ఉదంతంలోని అసలు ఆసక్తికరమైన కోణం ఉంది.

మొదటి బంధాల్లో నమ్మకాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఆ కొత్త బంధానికి పునాది వేస్తున్నది నమ్మకమా? లేక అపనమ్మకమా? గతంలో ఎదురైన అనుభవాలు మళ్లీ ఎదురుకాకూడదనే ముందుజాగ్రత్తా? లేక రేపు ఏదైనా తేడా వస్తే ఈ కాగితం సాక్ష్యంగా ఉంటుందనే ఆలోచనా? బంధానికి నోటరీ బీమా!!

conditional love

ఒకప్పుడు పెళ్లిళ్లు పెద్దల సమక్షంలో జరిగేవి. జీవితాంతం కలిసి ఉంటామని నలుగురి ముందు మాట ఇచ్చుకునేవారు. ఆ మాట నిలబడుతుందా లేదా అన్నది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ముందే తమ మధ్య ఏం జరగాలి, ఏం జరగకూడదు, ఎవరి బాధ్యత ఏమిటి అన్నది తొమ్మిది పాయింట్లలో రాసుకుని నోటరీ చేయించుకుంటున్నారు.

నిజానికి ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కలిసి జీవించాలనుకునే ఇద్దరికీ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక అంశాలపై స్పష్టత ఉండటం మంచిదే. కానీ ఆ కాగితం మీద సంతకాలు చేసినంత మాత్రాన మనసుల్లో నమ్మకం ఏర్పడిపోతుందా? ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం, నిబద్ధత వచ్చేస్తాయా?

సమస్య అక్కడే ఉంది. కాపురాలు నిలబడేది స్టాంప్ పేపర్ల మీద కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటంలో, మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిన్నటి బంధంలో ఆ నమ్మకం ఎందుకు నిలబడలేదో తెలియదు. కానీ రేపటి బంధంలో అది నిలబడాలని కోరుకుంటూ ముందుగానే అగ్రిమెంట్ రాసుకోవడం మాత్రం ఒక విచిత్రమైన వైరుధ్యం.

ప్రేమకు హామీ పత్రం ఉండదు. సహజీవనానికి నోటరీ సర్టిఫికెట్ ఉండొచ్చేమో కానీ సహజీవనంలో సహజత్వానికి మాత్రం అది గ్యారంటీ ఇవ్వలేదు. నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!
  • బుక్ చేసుకొండి- ‘ఆ నలుగురు’ వస్తారు, పాడె మోస్తారు, కట్టె కాలుస్తారు
  • గరివిడి నుంచి గరికపాటి వరకు… ఇద్దరూ లక్ష్ములే… ఇద్దరిదీ ఎదురీతే!
  • ఇండియాపై చైనా- పాకిస్తాన్- బంగ్లాదేశ్‌ ఉమ్మడి కుట్ర – పార్ట్ 1
  • కార్తీకదీపం వెలగాల్సిందే- విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్!!
  • నాన్న కుట్టి… సెంటిమెంట్ ఉంది… కనెక్టివిటీ ఏది ఆంటోనీ..?
  • తెలంగాణతనం అంటే రక్తపాతమేనా? ఇదేం ‘భోగి’రా శర్వానందూ..!!
  • ఓ రాత్రి- ముసురు, చీకటి, చలి – ఓ బస్టాపులో ఆ ముగ్గురు… తరువాత?
  • వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!
  • ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions