Muchata

రాయపాటీ..! బీ రెడీ… మళ్లీ చైనాకు పొగాకు ఎగుమతులట…!!

December 3, 2019

అబ్బబ్బబ్బ… ఎంత మంచి వార్త..! ఇటు జగన్ ప్రభుత్వమేమో పోలవరం కంట్రాక్టుల్ని మొత్తం సమీక్షిస్తూ,.. రివర్స్ టెండరింగు పేరిట తన అనుకూల మేఘా వాళ్లకు ఇచ్చేస్తున్న నేపథ్యంలో… అటూఇటూ గాకుండా పోయిన మన ప్రఖ్యాత రాయపాటి సాంబశివరావుకు భలే చాన్సు… మన పొగాకు మళ్లీ చైనాకు పోవడానికి రంగం సిద్ధమైపోయిందని ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… భలే ఆకర్షించింది… అబ్బో, మామూలు వార్తా ఇది..?

అంతగా మూడు కాలాల ఐటమ్ రాశారు… ‘‘అప్పట్లో భారత్ నుంచి నాణ్యతలేని పొగాకు చైనాకు ఎగుమతి అయింది… అప్పట్లో ఈ పొగాకును దిగుమతి చేసుకున్న కొంతమంది అధికారులను అక్కడ ఉరి తీశారు… అప్పటి నుంచీ భారత్ కొనుగోళ్లను చైనా నిషేధించింది…’’ అని రాసిన ఆంధ్రజ్యోతి జాగ్రత్తగా అప్పట్లో ఎవరెవరు ఈ కల్ ప్రిట్స్ అనే సంగతిని మాత్రం దాచిపెట్టింది… నాలుగు దశాబ్దాల క్రితం ఆగిపోయిన పొగాకు ఎగుమతులు మళ్లీ స్టార్ట్ కాబోతున్నాయహో అని చాటింపు వేసింది… ఇక్కడే… ఇది చదవగానే… అప్పట్లో 2011లో కేసీయార్ చేసిన ఓ తీవ్ర ఆరోపణ కూడా గుర్తొచ్చింది… ఇదే ఇదీ…

చైనాకు పొగాకు ఎగుమతిలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అక్రమాలను తాను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, రాయపాటి సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఖర్చులు తామే భరిస్తామని, దమ్ముంటే చైనాకు రావాలని ఆయన రాయపాటి సాంబశివరావును సవాల్ చేశారు. సికింద్రాబాదులోని హరిహర కళాభవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన పాలిటెక్నిక్ జెఎసి గర్జనలో ఆయన ప్రసంగించారు 2011లో…

అఫ్ కోర్స్, ఆయన ప్రయారిటీలు మారిపోయాయి కాబట్టి, సాధారణంగానే తరచూ మారిపోతాయి కాబట్టి… ఇప్పుడు సహజంగానే ఇది గుర్తుండి ఉండదు… గుర్తున్నా ఇదంతా ఏపీ యవ్వారం కాబట్టి పట్టించుకోడు… తనకు అవసరం లేదు ఇప్పుడు… కానీ జగన్..? ఏం చేస్తాడు..? ఎలా స్పందిస్తాడు..? అదీ ప్రశ్న…

పోలవరం కంట్రాక్టు పొందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఎవరిది..? చాలారోజులపాటు కాంగ్రెస్‌లో, తరువాత తెలుగుదేశంలో ఉన్న రాయపాటి సాంబశివరావు… చిన్నాచితకా రోడ్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద కంట్రాక్టుల వరకూ, చివరకు ప్రపంచబ్యాంకు, రష్యా ప్రభుత్వ కంట్రాక్టుల వరకూ ఒక్కటీ చేయలేక, చేతులెత్తేసిన కంపెనీ అది… బ్యాంకు రుణాలు, పోలవరం అడ్వాన్సులు గట్రా తరువాత మాట్లాడుకుందాం… (గతంలో ‘ముచ్చట’ చాలా స్టోరీలు పబ్లిష్ చేసింది కూడా…)

వోకే, ఒకసారి అప్పటి పొగాకు ఎగుమతుల్లో సదరు రాయపాటికి చెందిన జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ ఏం చేసిందో చూద్దామా..?


రాయపాటిది మొదట్లో పొగాకు వ్యాపారమే… అది చైనాకు ఎగుమతి చేసేది… త్వరితగతిన డబ్బు సంపాదించాలనే దురాశతో, ఆ సంస్థ అధినేత కొంతమంది చైనా అధికారులకు లంచం ఆశ చూపి, నాణ్యత లేని – నాసిరకం పొగాకును ఎగుమతి చేశాడు… తమ దేశంలో నాణ్యత లేని సిగరెట్లు తయారు చేయబడుతున్నాయని పలువురు వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడంతో చైనా ప్రభుత్వనికి అనుమానం వచ్చి ఆ సంస్ధ పై నిఘా పెట్టింది…

చైనా ప్రభుత్వం జరిపిన విచారణలో, జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ మరియు గుంటూరులోని 4 ఇతర పొగాకు ఎగుమతి సంస్థల నుండి వచ్చిన పొగాకు కంటైనర్లలో చనిపోయిన పాములు, ముడి కాటన్ ఫైబర్, రాళ్లు దొరికినందుకు చైనా ప్రభుత్వ అధికారులు షాక్ అయ్యారు…

తమ దేశంలోకి లంచాలు తీసుకుని నాణ్యత లేని – మరియు మోసపూరితంగా వేస్ట్ మెటీరియల్ తో కూడిన పొగాకు దిగుమతికి సంబంధించిన అధికారులందరినీ చైనా ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసింది… చైనా ప్రభుత్వం ఆ అవినీతి అధికారులను ఉరితీసింది కూడా…

జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ – అధినేతతో సహా 5 పొగాకు ఎగుమతి సంస్థల యజమానులను అప్పగించాలని చైనా ప్రభుత్వం అప్పటి కాంగ్రెసు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది… కానీ, ఈ అభ్యర్థనను కాంగ్రెసు ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదు… ఎవరి ప్రయోజనాలు వాళ్లకు ఉంటాయి కదా మరి….

కాంగ్రెస్ ప్రభుత్వం అండచూసుకుని, అతడికి మరోసారి దుర్భుద్ధి పుట్టి మళ్లీ పాతవ్యూహాన్ని అమలు చేశాడు – ఈసారి జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ మోసానికి బలైపోయిన దేశం ఇరాక్…!!

ఆయిల్-ఫర్-ఫుడ్ పథకంలో సద్దాం హుస్సేన్ ప్రభుత్వానికి లంచం ఇచ్చినందుకు జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ పేరును వోల్కర్ నివేదికలో పేర్కొనబడింది. ఇంతేకాక ఇరాక్‌కు టీ ని ఎగుమతి చేయడానికి లంచాలు ఇచ్చిన సంస్థలలో జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ ఒకటి అని పాల్ వోల్కర్ నివేదిక స్పష్టంగా పేర్కొంది…

అవినీతి, అక్రమాలు, మోసాలు మన రక్తంలో ఇమిడిపోయాయి కదా మరి..! మళ్ళీ, ఈ అవినీతి రాజకీయ నాయకుడిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోలేదు… ఇక చంద్రబాబు చుట్టూ ఇలాంటివాళ్లే కాబట్టి, తను కూడా కాపాడుతూ వచ్చాడు… ఇలా తన అక్రమ సంపాదన, దురాశ కారణంగా మన దేశం – ప్రపంచంలోనే అత్యధికంగా ( 350 మిలియన్ స్మోకర్స్ ) పొగాకు దిగుమతులు చేసుకునే చైనాతో వ్యాపారం నిలిచిపోయింది… ఇప్పటికి ఎందరో పొగాకు వ్యాపారులు జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్ పేరు వింటేనే మండిపడతారు….

జయలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్, మరో 5 సంస్ధల వలన ఆగిపోయిన పొగాకు ఎగుమతులను పునరుద్ధరించడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుంది… 2019 జున్ 29 న భారత పొగాకు బోర్డు (ఐటిబి) ప్రతినిధి బృందం, దాని ఛైర్‌పర్సన్ కె. సునీతా నేతృత్వంలో రాష్ట్ర పొగాకు గుత్తాధిపత్య పరిపాలన (ఎస్‌టిఎంఎ) చీఫ్ కమిషనర్ జాంగ్ జియాన్‌మిన్‌తో చర్చలు జరిపి, భారతదేశం నుండి పొగాకు దిగుమతి కోసం చైనా తన మార్కెట్‌ను తిరిగి తెరిచేందుకు రెప్రజెంటేషన్ చేసింది… ఇక ఇప్పుడు అంతా క్లియర్ అవుతున్నట్టుంది… తిరిగి పొగాకు ఎగుమతులకు రంగం సిద్ధమవుతున్నది… సో, బారా ఖూన్ మాఫీ అన్నట్టుగా… ఓ కొత్త ఎక్స్‌పోర్ట్స్ సంస్థ తెరిచి, మళ్లీ పొగాకు ఎగుమతులు స్టార్ట్ చేస్తే బెటర్… ఎలాగూ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో అట్టర్ ఫ్లాప్ కదా… అవునూ, ఈ కంపెనీల పట్ల జగన్ ఎలా స్పందించబోతున్నాడు..?! ఎందుకంటే… రాయపాటి తను నిక్కచ్చిగా వ్యతిరేకించే చంద్రబాబు బాపతు మనిషి కాబట్టి… అందరినీ తొక్కేసే పనిలోనే జగన్ బిజీగా ఉన్నాడు కాబట్టి..!!

Filed Under: main news

Recent Posts

  • పౌరసత్వ సవరణ మంటల్లో ఐక్యరాజ్యసమితి ఆజ్యం..!
  • ఈ రాహుల్ రేప్ కథేమిటి..? ఈ సుకన్యాదేవి ఎవరు..? అసలేం జరిగింది..?
  • ఈ విశృంఖల కేరక్టర్ మళ్లీ శబరిమల తెరపై ప్రత్యక్షం..!!
  • అనూహ్యం..! ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
  • పౌరసత్వ సవరణ చట్టం… మరికొన్ని చిక్కు ప్రశ్నలు ఇవీ…
  • మర్దానీ-2…. బిగి సడలని కథనం… రాణిముఖర్జీ పర్‌ఫామెన్స్..!
  • టైమ్ పాస్ పల్లీ..! ఆ కాసేపూ నవ్వించి, కడుపు నింపే వెంకీ మామ..!
  • 8400 కోట్ల బంపర్ ఆఫరా..? ఏమిటా కథ..? దొరకని జవాబు..!!
  • చంద్రబాబును మించి చంద్రజ్యోతి శోకాలు..! విడ్డూరంగా ఉంది బాసూ..?!
  • పాక్ ఉగ్రవాదులపై ఇండియా అంతరిక్ష గూఢచారి… రిశాట్..!
  • మ్యారేజెస్ ఆర్ మేడిన్ కౌన్సిలింగ్ సెంటర్స్
  • దిశ ఎన్‌కౌంటర్ కేసు కథ కంచికేనా..? సుప్రీం దర్యాప్తు మంచికేనా..?
  • ఒక్కసారిగా అతన్ని హగ్ చేసుకున్నా… సారీ, జొమాటో బాయ్..!
  • మామాంగం..! తెలుగు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని ఓ కేరళ వేడుక..!!
  • అనవసర వివాదాలతో బోలెడంత హైప్, ప్రచారం… కానీ ఏముందని ఇందులో..!

Follow

Subscribe to notifications

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.