.
Subramanyam Dogiparthi …. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది .
1993 లో వచ్చిన ఈ అంకురం సినిమా ఐకానిక్ సాంగ్ ఇది . సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కీర్తిని సముపార్జించిన పాటల్లో ఒకటి . మానవ హక్కులు , పౌర హక్కులు గురించి వచ్చిన అర్ధవంతమైన సినిమాలలో మొదటి వరుసలో సినిమా ఈ అంకురం .
Ads
మా తరం వాళ్ళకు , సామాజిక స్పృహ ఉన్నవారికి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓ యదార్ధ ఉదంతం గుర్తుండే ఉంటుంది . వరంగల్ వద్ద గిరిజన నాయకుని భార్య పైశాచికంగా చనిపోవటానికి S.I యాదగిరిరెడ్డి కారణం కావటం , అతన్ని నక్సలైట్లు చంపేయటం , చనిపోయిన SI అంతిమ యాత్రలో పౌర హక్కుల నేత డా. రామనాధాన్ని అతని హాస్పిటల్లోనే పోలీసులు చంపటం గుర్తుండే ఉంటుంది .
ఆ యదార్ధ కధ చుట్టూ అల్లబడిన కధే ఈ అంకురం సినిమా కధ . దర్శకుడు ఉమామహేశ్వరరావు చాలా గొప్పగా కధను నేయటమే కాకుండా స్క్రీన్ ప్లేని కూడా బిర్రుగా తయారుచేసుకున్నారు . రాజమండ్రి చుట్టుపక్కల ఏజన్సీ ప్రాంతంలో షూట్ చేయబడిందీ సినిమా .
రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు ఏడుస్తున్న తన బిడ్డ పాల కోసం ప్లాట్‌ఫామ్ మీదకు వెళతాడు . అతను ఓ గిరిజన నాయకుడు . గిరిజనులలో చైతన్యాన్ని కలగచేయటానికి కృషి చేస్తుంటాడు . అతన్ని పోలీసులు ఎత్తుకుపోతారు . రైలు కదులుతుంది . ఆ బిడ్డను అందుకున్న నవ వివాహిత కష్టాలు ప్రారంభం అవుతాయి .
అత్త గారింట్లో అత్త , భర్త విసుక్కుంటారు . ఇంట్లోనుంచి తరిమేస్తే పుట్టింటికి చేరుతుంది . తండ్రి సహాయంతో ఆ బిడ్డ తండ్రి కొరకు అన్వేషణ కొనసాగిస్తుంది . ఆ క్రమంలో వ్యభిచారిగా అరెస్ట్ అయి లాయర్ విశ్వం సహాయంతో నిర్దోషిగా బయటపడుతుంది .
ఆ లాయర్ సహాయంతో సత్యం వెనుక ఉన్న కధను తవ్వి, నిజ నిర్ధారణ కమిటీలో కేసనపల్లి అనే గిరిజన గ్రామానికి చేరి సత్యం అరెస్ట్ వెనకాల ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు . ప్రభుత్వం ఏక సభ్య కమీషన్ని నియమిస్తుంది . SI పశ్చాత్తాపంతో ఆ కమీషన్ ముందుకు సత్యాన్ని తీసుకుని వచ్చి నిజాలను వెల్లడిస్తాడు . నిజాలు తెలుసుకున్న రేవతి భర్త తన భార్యను ఆదరించటంతో సినిమా ముగుస్తుంది .
గొప్ప సినిమా . 2021 లో పౌర హక్కుల మీద వచ్చిన జై భీమ్ సినిమాకన్నా ఓ ముప్పై ఏళ్ళ ముందే మన తెలుగులో అలాంటి సంచలన సినిమా రావటం మన తెలుగు వారికి గర్వకారణమే .
రేవతి సింధూర పాత్రలో గొప్పగా నటించింది . ఓ సాధారణ గృహిణి సంపూర్ణ మానవత్వంతో ఎవరో తెలియని ఓ బిడ్డ తండ్రి కొరకు పోరాటం చేసే పాత్రలో అద్భుతంగా నటించింది . అంతే గొప్ప పాత్ర లాయర్ విశ్వం . శరత్ బాబు గొప్పగా నటించాడు . మన రాష్ట్రంలో పౌర హక్కుల కొరకు , మానవ హక్కుల కొరకు పోరాడిన కన్నాభిరాం , బాలగోపాల్ , బొజ్జా తారకం , మా గుంటూరు యువ న్యాయవాది భువనగిరి చంద్రశేఖర్లను గుర్తుకు తెస్తుంది శరత్ బాబు పాత్ర .
మరో పాత్ర . రేవతి తండ్రి పాత్ర . బాలయ్య చాలా గొప్పగా నటించారు . వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయిన ఆ పాత్ర తన విద్యార్ధులకు బోధించిన విలువల అమలుకు కూతురికి తోడుగా నిలబడతాడు . అరాచక పోలీసులు అమాయక ప్రజలను ఎలా హింసిస్తారో SI పాత్రలో కోట శంకరరావు జీవించేసాడు .
ఈమధ్యనే మనం చూసాం . కరోనా టైంలో షాప్ ఆలస్యంగా మూసారనే ఆరోపణ మీద తండ్రీకొడుకులను తమిళనాడులో లాకప్ హత్య చేసిన కేసులో పోలీసులకు ఉరిశిక్ష విధించటం జరిగింది . ఎవరో ఎప్పుడో ఎక్కడో ఓ ముందడుగు వేస్తారు . అలాంటి న్యాయమూర్తులు , సాక్ష్యం ఇచ్చిన లేడీ పోలీస్ వంటి మహనీయులు ఎక్కడో ఉంటారు . అందరూ నీచులే ఉండరు కదా !
మళ్ళా అంకురం సినిమాలోకి వద్దాం . డా. మిత్రా పాత్రలో చారుహాసన్ , సత్యం గురించి సాక్ష్యం ఇచ్చే బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే పాత్రలో సాయిచంద్ , రేవతి భర్తగా హరిప్రసాద్ , అత్తమామలుగా పి ఆర్ వరలక్ష్మి , పి యల్ నారాయణ , ఇతర పాత్రల్లో రాజా రవీంద్ర , ఆలీ , విద్యాసాగర్ , హనుమంతరావు తదితరులు నటించారు .
రేవతికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ , దర్శకుడు ఉమామహేశ్వరరావుకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ , నిర్మాత కె వి సురేష్ కుమార్ కి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ వచ్చాయి . 24 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితం అయింది .
ఈరోజుకీ పౌర హక్కుల విషయంలో గొప్ప సినిమాగా చెప్పబడుతుంది . ముఖ్యంగా సత్యం పాత్రలో ఓం పురి జీవించేసాడు . కాసేపే కనిపించినా చక్కటి నటనను ప్రదర్శించారు . (ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్ సగమే తీసుకున్నాడు, ఆ పాత్ర తనే పోషించాలనే పట్టుదలతో..) ఇంత గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఉమామహేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందించాలి . అలాగే ధైర్యం చేసిన నిర్మాత కె వి సురేష్ కుమార్ని .
An unmissable humane movie . సినిమా యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . నా ఇల్లే వైకుంఠం నా బొందే కైలాసం అనుకునే సంకుచిత రోజుల్లోకి వచ్చాం . ఎవరయినా ప్రశ్నించినా , హక్కుల గురించి మాట్లాడినా , అన్యాయాన్ని ఎత్తిచూపినా అర్బన్ నక్సలైట్లు , బొద్దింకలు అనే దిక్కుమాలిన కాలం లోకి వచ్చాం .
- అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలను చూస్తే ఏదయినా కాస్తో కూస్తో మానవత్వం మిగిలి ఉంటే అది మేల్కొంటుంది . మేల్కొనాలని ఆశిస్తున్నాను …..
Share this Article