.
‘బట్వారా 1947’ : చరిత్రను కదిలించే కథ… కానీ సినిమా అంతగా కదిలించిందా? సన్నీ డియోల్ మళ్లీ అదే Fire తో వచ్చారా? షబానా ఆజ్మీ ఎందుకు ప్రశంసలు అందుకుంటున్నారు? ప్రీతి జింతా రీఎంట్రీ ఎలా ఉంది? ఆమీర్ ఖాన్ బ్రాండ్ ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడింది?
1947… భారతదేశ చరిత్రలో క్యాలెండర్‌పై ఉన్న ఒక సంవత్సరం మాత్రమే కాదు. కోట్లాది జీవితాలను రెండు ముక్కలు చేసిన పెను విషాదానికి, మతం పేరిట సాగిన మారణకాండకు, రావణకాష్టంగా ఎప్పుడూ చల్లారని రెండు దేశాల ప్రత్యర్థిత్వానికి అది పేరు.
Ads
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆనందం ఒకవైపు ఉంటే, అదే సమయంలో ఇళ్లు, ఊళ్లు, బంధాలు, మనుషులు చీలిపోయిన విషాదం మరోవైపు. అందుకే భారత విభజన నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాపైనా సహజంగానే ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
ఇప్పుడు అందుకు సన్నీ డియోల్, షబానా ఆజ్మీ, ప్రీతి జింతా లాంటి పేర్లు తోడయ్యాయి. దానికి తోడు ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మాణం. దర్శకత్వం రాజ్‌కుమార్ సంతోషిది. పైగా దేశభక్తి, జాతీయత, చారిత్రక కథలు ప్రేక్షకుల్లో బలమైన స్పందన రేపుతున్న ప్రస్తుత ట్రెండ్‌లో సినిమా విడుదలైంది. దీంతో ‘బట్వారా 1947’పై అంచనాలు పెరగడం సహజమే.
మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? పూర్తిగా కాదు… కానీ నిరాశపరిచే సినిమా కూడా కాదు. ఇదే బహుశా ‘బట్వారా 1947’కు సరైన తీర్పు. 1947 విభజన అనే వాస్తవ చారిత్రక విషాదాన్ని నేపథ్యంగా తీసుకుని, ఒక కల్పిత కుటుంబం– ఒక వృద్ధ మహిళ చుట్టూ అల్లుకున్న కథ ‘బట్వారా 1947…
ఇంకో ఆసక్తికరమైన విషయం…: ఈ సినిమాకు విభజన కాలాన్ని నిజాయితీగా చూపించేందుకు విస్తృత పరిశోధన చేసినట్టు నిర్మాణ బృందం చెబుతోంది. కానీ ఇది అస్గర్ వజాహత్ రాసిన ప్రముఖ నాటకం Jis Lahore Nai Vekhya, O Jamya E Nai ఆధారంగా రూపొందింది. అంటే సన్నీ డియోల్ పోషిస్తున్న సికందర్ మిర్జా, ప్రీతి జింతా పోషిస్తున్న హమీదా, షబానా ఆజ్మీ పోషిస్తున్న ‘మాయ్’ వంటి ప్రధాన పాత్రలు చరిత్రలోని నిర్దిష్ట వ్యక్తుల జీవిత కథలు కావు…

కథ కంటే ముందు… ఆ కాలాన్ని చూపించే ప్రయత్నం
సినిమా 1947 విభజన నేపథ్యంలో మనుషుల జీవితాలపై పడిన ప్రభావాన్ని ప్రధానంగా తీసుకుంటుంది. ఇక్కడ భారత్- పాకిస్థాన్ రాజకీయాల కంటే, ఆ రాజకీయ నిర్ణయాల మధ్య నలిగిపోయిన సామాన్య మనుషుల బాధను చెప్పాలన్న ప్రయత్నం కనిపిస్తుంది.
ఇది ‘విభజన’ను కేవలం దేశాల మధ్య గీసిన గీతగా చూడదు. ఆ గీత ఇళ్ల మధ్య, మనుషుల మధ్య, మతాల మధ్య, బంధాల మధ్య ఎలా చీలికలు తెచ్చిందో చూపించే ప్రయత్నం చేస్తుంది. అదే ఈ సినిమాకు బలం. అయితే సమస్య కూడా అక్కడే మొదలవుతుంది.
విభజనపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ కథలోని హింస, వలసలు, భయం, మత విద్వేషం, మానవత్వం వంటి అంశాలను ప్రేక్షకుడు కొత్తగా చూడటం లేదు. అందువల్ల ‘బట్వారా 1947’ చెప్పే విషాదం మనసును తాకినా, కథనం కొన్ని చోట్ల కొత్త అనుభూతిని ఇవ్వకుండా గతంలో చూసిన సినిమాల జ్ఞాపకాలను రేకెత్తిస్తుంది.
అయితే దీనిని రాజ్‌కుమార్ సంతోషి కెరీర్‌లో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఏమీ చూడలేం, తన ప్రజెంటేషన్ స్టయిల్, కథనం గతంలోనే ఆగిపోయినట్టు అనిపించింది.
సన్నీ డియోల్… ‘గదర్’కు భిన్నమైన హీరో … ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణాల్లో సన్నీ డియోల్ ఒకరు. విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ అంటే సహజంగానే ‘గదర్’ గుర్తొస్తుంది. కానీ ‘బట్వారా 1947’లో ఆయన పాత్ర అదే తరహాలో ఉండదని సినిమా బృందం మొదటి నుంచీ చెబుతూ వచ్చింది. ఇక్కడ ఆయన పోరాటం కేవలం దేశం కోసం కాదు… మనుషుల కోసం.
సన్నీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఆయన గొంతు, కళ్లలోని ఆవేశం, భావోద్వేగ సన్నివేశాల్లో కనిపించే నిస్సహాయత సినిమాకు బలాన్నిస్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. సన్నీ డియోల్‌ను చూడటానికి వెళ్లిన ప్రేక్షకుడికి ఇది ‘గదర్’ కాదు.
ఆ సినిమా ఇచ్చిన మాస్ ఎలివేషన్, యాక్షన్ ఉత్కంఠను ఇక్కడ ఆశిస్తే కొంత నిరాశ తప్పదు. ‘బట్వారా 1947’లో ఆయన పాత్ర మరింత మానవీయమైనది, భావోద్వేగంతో కూడుకున్నది. అదే ఈ పాత్ర ప్రత్యేకత.
షబానా ఆజ్మీ… సినిమాలో అసలు బలం … ఈ సినిమాకు బలం షబానా ఆజ్మీ. 75 ఏళ్ల వయసులోనూ ఆమె మరోసారి తన నటన ఎంత బలమైనదో గుర్తు చేసింది… ఆమె పాత్రలో బాధ, భయం, ఆత్మగౌరవం, మానవత్వం అన్నీ కలగలిసి కనిపిస్తాయి. ఆమెను కేవలం సీనియర్ నటిగా తెరపైకి తీసుకురాలేదు. పాత్రకు భావోద్వేగ కేంద్రంగా ఉపయోగించుకోవడం సినిమాకు పెద్ద ప్లస్.
‘బట్వారా 1947’ చూసిన తర్వాత ప్రేక్షకుడు ఎక్కువగా గుర్తుంచుకునే నటన సన్నీ డియోల్‌దా, షబానా ఆజ్మీదా అంటే… షబానా వైపే మొగ్గు కనిపించే అవకాశముంది.
ప్రీతి జింతా… తెరపైకి తిరిగి రావడం మరో ఆకర్షణ … చాలాకాలం తర్వాత ప్రీతి జింతాను ఇలాంటి సీరియస్ పాత్రలో చూడటం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సన్నీ డియోల్‌తో ఆమెకు ఉన్న పాత కెమిస్ట్రీ, 2000ల నాటి బాలీవుడ్ జ్ఞాపకాలు ప్రేక్షకుల్లో నాస్టాల్జియాను రేపుతున్నాయి. అయితే ఇది ప్రీతి జింతా పాతకాలపు గ్లామర్ రీఎంట్రీ కాదు.
పాత్రలోకి వెళ్లి నటించాల్సిన సినిమా ఇది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా… షబానాయే మంచి మార్కులు కొట్టేస్తుంది… అయినా ప్రీతి జింతాను మళ్లీ పెద్ద తెరపై చూడటం ఆమె అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతే.
ఆమీర్ ఖాన్… పేరుకే కాదు, నమ్మకానికీ? … ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో ప్రధాన కారణం ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్. ఆమీర్ ఖాన్ నిర్మిస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో సహజంగానే ఒక అంచనా ఉంటుంది—కంటెంట్ విషయంలో రాజీ ఉండకపోవచ్చు అన్న నమ్మకం.
దానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం, జావేద్ అఖ్తర్ సాహిత్యం, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ లాంటి పేర్లు కలవడంతో ‘బట్వారా 1947’ మూవీకి అదనపు బలాలుగా అంచనాలు ఏర్పడ్డాయి… కానీ పెద్ద పేర్లు కలిసి పనిచేశాయన్న కారణంతో సినిమా గొప్పదైపోదు. సినిమా చివరకు నిలబడేది కథనం మీదే. అక్కడే ‘బట్వారా 1947’కు కొంత బలం… కొంత బలహీనత కనిపిస్తుంది.
దేశభక్తి ట్రెండ్‌కు తగ్గ సినిమా? … ఇది కూడా ఆసక్తికరమైన అంశమే. ప్రస్తుతం బాలీవుడ్‌లో దేశభక్తి, జాతీయత, చారిత్రక సంఘటనలు, సైనిక కథలు, భారత చరిత్రకు సంబంధించిన అంశాలు ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి.
అలాంటి సమయంలో 1947 విభజన కథ రావడం సినిమాకు సహజంగానే అదనపు ఆసక్తి తెచ్చింది. కానీ ‘బట్వారా 1947’ను కేవలం దేశభక్తి సినిమాగా చూడటం సరైంది కాదు. ఇది అంతకంటే ఎక్కువగా విభజన వల్ల మనిషి ఎదుర్కొన్న విషాదం, మత విద్వేషం మధ్య మానవత్వం, భయం మధ్య ధైర్యం గురించి మాట్లాడే ప్రయత్నం.
అందుకే ఈ సినిమాను ఒక వర్గాన్ని రెచ్చగొట్టే లేదా మరో వర్గాన్ని నిందించే సినిమాగా కాకుండా, విభజన సమయంలో సామాన్యుల జీవితాల్లో జరిగిన విధ్వంసాన్ని ఎంతవరకు నిజాయితీగా చూపించిందన్న కోణంలో చూడాలి.
మరి లోపాలేంటి? … సినిమా ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది చెప్పే కథ కొత్తది కాకపోవడం. విభజన నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఒక ప్రమాదం ఉంటుంది. ప్రేక్షకుడిని కదిలించడానికి హింస, కన్నీళ్లు, అరుపులు, విడిపోతున్న కుటుంబాలు, మత ఘర్షణలు చూపించడం సులభం. కానీ వాటి వెనుక ఉన్న మానవ సంక్లిష్టతను చూపించడం కష్టం.
‘బట్వారా 1947’ కొన్ని సందర్భాల్లో భావోద్వేగాన్ని బలంగా రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని సన్నివేశాలు నిజంగా పనిచేస్తాయి. మరికొన్ని మాత్రం ఎమోషన్‌ను ప్రేక్షకుడిపై కొంచెం బలవంతంగా రుద్దుతున్నట్టుగా అనిపిస్తాయి… ఇదే అంశాన్ని ట్రైలర్ దశలో కూడా కొందరు విమర్శకులు ప్రస్తావించారు—పాత దేశభక్తి, భావోద్వేగ ఫార్ములాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని.
చివరికి… చూడాలా? … చూడొచ్చు. కానీ ఏం ఆశించి వెళ్తున్నారన్నదే ముఖ్యం. సన్నీ డియోల్ నుంచి మరో ‘గదర్’ కావాలనుకుంటే ఈ సినిమా మీకు పూర్తిగా సంతృప్తి ఇవ్వకపోవచ్చు. ప్రీతి జింతా రీఎంట్రీ చూడాలనుకుంటే మాత్రం మంచి కారణమే. షబానా ఆజ్మీ నటనను ఆస్వాదించాలనుకుంటే సినిమా తప్పక ఆసక్తికరంగా ఉంటుంది. 1947 విభజన చరిత్రపై సినిమాలు ఇష్టపడేవారికి ఇది చూడదగ్గ ప్రయత్నం.
చివరగా…. ఇది చరిత్రను గుర్తుచేసే సినిమా… భావోద్వేగాన్ని రేకెత్తించే సినిమా… కానీ కొత్తగా చరిత్ర రాసేంత గొప్ప సినిమా మాత్రం కాదు…
Share this Article