.
Nàgaràju Munnuru ……. డాక్టర్ షామా మహమ్మద్ అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భారత్ కాప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతిని గేలి చేస్తూ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి, ఇప్పటి వరకు ఉన్న భారత క్యాప్టెన్ లలో అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేని వ్యక్తి అని విమర్శలకి దిగింది…
అవును నిజమే.. అతను కెప్టెన్‌గా కాదు కదా.. జట్టులో ఉండటానికి కూడా పనికి రాడు అంటూ టీఎంసీ నాయకుడు సుగతా రాయ్ పెట్రోల్ పోశాడు… ఆ శామ్ పిట్రోడా నుంచి చాలామంది చేసే అనాలోచిత వ్యాఖ్యలు, ట్వీట్లు కాంగ్రెస్ పార్టీకే నష్టం… కంగనా రనౌత్ మీద మండీలో (మార్కెట్‌లో, అంగట్లో) రేటెంత పలుకుతోంది అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాటే చేసిన చిల్లర, వెగటు వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా…
Ads
ప్రజల కష్టాల గురించి, పరిపాలనా వైఫల్యాల గురించి అధికారంలో ఉన్న పార్టీని విమర్శించి నాలుగు ఓట్లు సంపాదించడం తెలియని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పసలేని చొప్పదంటు విమర్శలు చేసి నవ్వులపాలు కావడం పరిపాటిగా మారింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రాన్ని విమర్శించే ఉద్దేశంతో ఇటీవల జరిగిన మహకుంభమేళాను ఉద్దేశించి గంగలో మునిగితే పేదరికం పోతుందా అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించడం నేర్చుకోవాలి.
ఇక షామా మహమ్మద్ లేవనెత్తిన విషయానికి వస్తె క్రికెట్ లో భారత్ కి సారథ్యం వహించిన కెప్టెన్లలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు కలిగి ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి, భారత్ ఫైనల్ చేరడంతో ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో జట్టును ఎక్కువసార్లు ఫైనల్ కి తీసుకెళ్లిన తొలి కెప్టెన్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
రోహిత్ శర్మ సారథ్యంలో 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్, 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్షిప్ ట్రోపిలో భారత్ ఫైనల్ చేరింది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలవగా మిగతావాటిలో రన్నరప్ గా సరిపెట్టుకుంది.
రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన మూడేళ్ల కాలంలోనే నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్ కి తీసుకెళ్లిన ఘనత సాధించాడు. అసలు కాంగ్రెస్ పార్టీ సమస్య రోహిత్ శర్మ బరువు, పెర్ఫార్మెన్స్ కాదు, కులం…!?
నిజానికి ఓ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు, పార్టీలో ఏదైనా పదవిలో ఉన్నప్పుడు వ్యక్తపరిచే వ్యక్తగత అభిప్రాయాలు కూడా పార్టీకి ఆపాదించబడతాయి… కానీ ఆ జాగ్రత్తలు కాంగ్రెస్ నాయకుల్లో కొరవడ్డాయి..!!
చెప్పనే లేదు కదూ… రోహిత్ శర్మ మీద చేసిన వ్యాఖ్యలపై నెటిజనం విరుచుకుపడ్డారు… దాంతో ఆ ట్వీట్ డిలిట్ చేయబడింది… ఇదే ఆ ట్వీట్…
Share this Article