పొలిటికల్ కన్సల్టెంట్లు ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా..? రాలేరు…! ఒక పార్టీ బతకాలన్నా, గెలవాలన్నా రకరకాల కారణాలుంటయ్… కాకపోతే నాయకుడి అడుగుల్లోని తప్పొప్పులు, జనం స్పందనను సరైన పద్ధతిలో క్రోడీకరించి, నివేదించి.., ఇంకొన్ని కొత్త క్రియేటివ్ ఆలోచనలతో పార్టీ ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోవటానికి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ వంటి సంస్థలు ఉపకరిస్తాయి… అంతే… 2014లో బొటాబొటి మెజారిటీ ఇచ్చిన తెలంగాణ జనం 2018లో మరింత మెజారిటీని ఇచ్చారు కేసీయార్‌కు… ఏ కన్సల్టెంట్లు లేరు, ఏదీ లేదు… ఆ అయిదేళ్లలో తను పాలనలో తప్పులు చేయలేదని కూడా కాదు… ఉన్నంతలో తనే నయం అనుకున్నారు సగటు జనం… అదే అయిదేళ్ల కాలంలో ఏపీని పాలించిన చంద్రబాబు కూడా బోలెడు టక్కుటమార విద్యలు తెలిసినవాడే… కానీ ఏమైంది..? ఏపీ, తెలంగాణ భిన్నంగా స్పందించాయి… చంద్రబాబు తన జీవితంలో ఎరుగని ఓటమి పాలయ్యాడు… ఏపీలో జనానికి చంద్రబాబుతో రాజీపడి, సర్దుకోవాల్సిన అవసరం లేదు, ఎదురుగా జగన్ కనిపించాడు వాళ్లకు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? పార్టీలు ప్రశాంత్ కిషోర్ సంస్థ సేవల కోసం ఎగబడటం, పోటీపడటం, ఏదో ఛూమంతర్ అని మంత్రమేసి తను గెలిపిస్తాడని విశ్వసించడం… కానీ జగన్ గెలుపు పీకేకు విపరీతంగా కలిసొచ్చింది..,
మమత మీద బెంగాల్ జనంలో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోతున్నది… తన నావను మునిగిపోకుండా కాపాడు స్వామీ అని ప్రశాంత్ కిషోర్‌ను అడిగింది… భారీ ఒప్పందం… తెలుసు కదా, పీకే సేవలు చాలా చాలా ఖరీదు… సరే, ఏదో కొన్ని ఉపాయాలు స్టార్ట్ చేశాడు, అక్కడ కథ నడుస్తూ ఉంది… తమిళనాడులో మొదట స్టాలిన్‌తో సంప్రదింపులు సాగాయి, దాదాపు ఒప్పందం కుదిరినట్టే… తరువాత అన్నాడీఎంకే అప్రోచైంది… సేమ్, భారీ డీల్స్… జనం తిరస్కరించిన కమల్‌హాసన్‌కు కూడా ఇప్పుడు పీకే కావాలట… ముగ్గురూ తన కస్టమర్లే… ఎవరిని గెలిపిస్తాడు..? ఎవరి కోసం పనిచేస్తాడు..? కేసులో ఒక కక్షిదారే కదా గెలివాల్సింది… ఓటరు న్యాయమూర్తి దగ్గరకు వెళ్లి, నా ముగ్గురు కక్షిదార్లకూ అనుకూలంగా తీర్పు ఇవ్వు అంటూ వాదనలు వినిపించినట్టు ఉంటుంది ఇది… అందుకని గిరాకీ వదులుకోలేడు, అలాగని ఒకరికి అనుకూలంగా ‘సలహాల అమ్మకం’ చేయలేడు… సో, నేను జనం నుంచి రకరకాల స్పంనదలు, అభిప్రాయాల డేటా ప్రిపేర్ చేస్తాను, ఇంకా మీకు ఏరకమైన సర్వేలు కావాలన్నా చేసిస్తాను… అంతా పీస్ మీల్ వర్క్… ఆ డేటాను మీరు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం… అంటే పక్కాగా ఓ బిజినెస్ మాడ్యూల్… పొలిటికల్ అడ్వయిజర్ నుంచి డేటా ప్రొవైడర్ సీన్‌లోకి… ఎస్, తమిళనాడులో ఇప్పుడు పీకే రోల్ అదే…
మహారాష్ట్ర శివసేన బాగానే ఉందిగా, తనకు కూడా పీకే ఎందుకు..? దానికీ రీజన్ ఉంది… ఎన్సీపీ ఘోరంగా దెబ్బతినిపోతున్నది… కాంగ్రెస్, ఎన్ఎన్ఎస్ డిటో డిటో… కానీ శివసేనకు తన పొత్తుదారు బీజేపీతోనే అసలు సమస్య… వీలయితే ఈ శివసేననూ తొక్కేసి, దాటేసి సొంతంగా మహారాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్… అందుకని సొంతంగా బలపడాల్సిన అవసరం శివసేనది… మరి బీహార్..? పీకే సొంత పార్టీ జేడీయూ… అక్కడ తన వర్క్ బిజినెస్ కాదు, ఇంటిపని..!
మరి ఏపీ..? ఇక్కడే ఓ ఇంట్రస్టింగు… తమిళనాడులో ఎలాగైతే బిజినెస్ మాడ్యూల్ మారిపోయిందో… ఏపీలో ఇంకా దాన్ని విస్తరించి, కేవలం ఒక పార్టీకే గాకుండా, ప్రభుత్వ వ్యవహారాల కన్సల్టెన్సీగా విస్తరించాలని అనుకున్నాడు పీకే… మొన్నటి ఎన్నికల తరువాత జగన్ తనతో ఒప్పందాన్ని మరో మూడేళ్లకు పొడిగించాడు… అవునూ, ఎన్నికలయిపోయాయి, ఇక పీకే పనేమిటీ అంటారా..? అసలు పని ఇప్పుడే ఉంది… జగన్ వేస్తున్న అడుగులకు స్పందన, పథకాల పట్ల జనంలో రియాక్షన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఓ అవసరం… పార్టీకి మాత్రం ఆ పనిచేసి ఇస్తున్నాడు… కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వపరంగా ఓ అధికారిక కన్సల్టెన్సీగా పనిచేయటానికి కొందరు ఐఏఎస్ అధికారులు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం… మరి తెలంగాణ…? డిజిటల్ పోలీసింగు ఎట్సెట్రా వ్యవహారాల్లో పీకే వర్క్ చేసి పెడుతున్నాడు… ఏతావాతా చెప్పొచ్చేదేమిటీ అంటే..? పీకే అంటే రాజకీయమే కాదు… ఏపీ గెలుపుతో వచ్చిన పాపులారిటీని ఇప్పుడు బహుముఖంగా వాడుకునే పనిలో ఉన్నాడు అని…!! తమిళనాడులో ఒక తరహా, మహారాష్ట్ర- బెంగాల్‌లలో మరో తరహా, ఏపీలో ఇంకో తరహా, తెలంగాణలో భిన్నతరహా… ఎక్కడ ఏది వీలయితే అది… వారెవ్వా పీకే…