Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆత్మవిమర్శ, దిద్దుబాటు, రీవ్యాంప్… KCR కళ్లు తెరుచుకున్నట్టేనా…

April 28, 2026 by M S R

.

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అన్నట్టు… గత ఏడాది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు… లక్షల మందితో సభ… అన్ని జిల్లాల నుంచి కార్యకర్తల తరలింపు… వరుసగా తగులుతున్న పొలిటికల్ దెబ్బల నుంచి కేడర్‌లో మళ్లీ ఓ జోష్ పెంచే ప్రయత్నం జరిగింది… మరి ముగింపు..? నిన్న పిడికెడు మందితో, అంటే కేవలం కొద్దిమందితో, అదీ పార్టీ ఆఫీసులో… పూర్తిగా కళతప్పిన వాతావరణం…

ఈ పార్టీ పాత పేరు ‘టీఆర్ఎస్‌’ను కైవసం చేసుకున్న కేసీయార్ బిడ్డ కవిత మొన్న తన పార్టీ ఆవిర్భావసభలో స్ట్రెయిటుగా తండ్రిపై, తన చుట్టూ ఉన్న కోటరీపై నిప్పులు చెరిగింది… కరవాలం పట్టి యుద్ధం ప్రకటించింది… అంటే ఇప్పుడు బీఆర్ఎస్, టీఆర్ఎస్  ప్రత్యర్థి పార్టీలే కదా… మరి నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఆమెకు కౌంటర్లు పడాలి కదా… కొత్త పార్టీపై ఏదో స్పందన ఉండాలి కదా… నిల్… ఏదో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి అని కేటీయార్ ఏదో చిట్‌చాటాడు తప్ప… కేసీయార్ ప్రసంగంలో ఒక్క వాక్యమూ లేదు…

Ads

బిడ్డ పార్టీని అసలు నేను గుర్తించడం లేదుపో అనే కేసీయార్ మార్క్ వ్యూహాత్మక తీసికట్టు సూచన అనుకుందాం… రాష్ట్రంలో కాంగ్రెస్ తన ప్రబల ప్రత్యర్థి కాబట్టి, రేవంత్ రెడ్డి అంటేనే కయ్యం కాబట్టి… రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు సరే, మరి బీజేపీ మీద..? కర్నాటక బీజేపీ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యల మీద ఒకింత ఆగ్రహ ప్రకటన తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలపై, బీజేపీ పోకడలపై వీసమెత్తు విమర్శ లేదెందుకు..? కమలంతో పొత్తుకు సానుకూల వాతావరణం కొనసాగింపా ఇది..?

ఫేస్‌బుక్‌లో ఓ వీడియో కనిపించింది…

కుడిఎడమల చురకత్తులు మెరయగ అన్నట్టు… కేసీయార్ వెంట కనిపిస్తున్నవాళ్లు… మానుకోట రాళ్ల హీరో పాడి కౌశిక్ రెడ్డి, ఒకప్పటి విశ్వనగర సమైక్య సారథి తలసాని శ్రీనివాస యాదవ్, జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉండి, తరువాత దొర చెంతకు చేరిన పొన్నాల లక్ష్మయ్య, 14 కాంగ్రెస్ బీఫారాలు పొంది, రీసెంటుగా గడీస్వామ్యంలోకి ప్రవేశించిన జీవన్‌రెడ్డి… విశేషంగా అనిపించింది, కేసీయారే అప్పుడప్పుడు చెప్పే ఫక్తు రాజకీయం అంటే ఇదేనేమో…

brs

కానీ ఎట్టకేలకు కేసీయార్ కళ్లు తెరుచుకున్నాయి అనిపించే ఒకటీరెండు విషయాలు మాత్రం మెచ్చుకోవచ్చు… ఇకపై మొఖాలు చూసి టికెట్లు ఇచ్చేది లేదు, ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ అవసరం, 60 లక్షల సభ్యత్వాలున్నా ఈ ఓటములు ఏమిటి, అన్ని కమిటీలు రద్దు, కార్యకర్తలకు శిక్షణ, మళ్లీ కొత్త కమిటీల ఏర్పాటు… ఇవీ కేసీయార్ నిర్ణయాలు…

నిజం… అన్ని లక్షల సభ్యత్వాలున్నా ఓటములు ఏమిటి..? ఇది తనను తానే వేసుకోవాల్సిన ప్రశ్న… తనకు తానే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ప్రశ్న… అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్నాళ్లూ మొఖాలు చూసి టికెట్లు ఇచ్చాననే ఒప్పుకోలు… జనంలో విపరీతంగా బదనాం అయిపోయి, నయా సామంతరాజుల్లా, జమీందార్లలా, దొరల్లా మారిన అనేక మంది సిట్టింగులను వదులుకోలేక, మళ్లీ టికెట్లు ఇచ్చి, వెన్నుతట్టి, జనంపైకి వదిలిన పాపఫలితం ఇప్పుడైనా అర్థం అయినందుకు అభినందనలు… నిన్నటి మీటింగులో ఆ నయా దేశ్‌ముఖాలు కూడా కనిపించాయి… 60 లక్షల సభ్యత్వాలూ పనికిరాలేదు అంటే లీడర్‌కూ కేడర్‌కూ నడుమ అంత భారీ గ్యాప్, అగాధం ఉన్నాయని అర్థం… ఏళ్లుగా అసలు పార్టీ నిర్మాణాన్నే పట్టించుకోని ఫలితం అర్థమైంది తనకు…

పార్టీలోని అన్ని లేయర్ల ప్రక్షాళన, కొత్త దిశానిర్దేశం, ఆత్మవిమర్శ, పునర్నిర్మాణం, దిద్దుబాటు మంచిదే… దీనికితోడు బీజేపీ కూడా కలిసొస్తే, కాషాయం ప్లస్ పింక్ కలిస్తే… సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా… ఇక రాష్ట్రంలో రెండు కూటముల నడుమ పోరాటమే ఖాయం… ఒకవైపున కాషాయపక్షం మరోవైపున కాంగ్రెస్‌పక్షం… స్ట్రెయిట్ ఫైటే..!!

చివరగా… ప్రజలే తప్పుచేశారు, నన్ను ఓడించారు అనే అబద్ధాలు, భ్రమలు, అహాల నుంచి కేసీయార్ వాస్తవంలోకి వచ్చాడు, దిద్దుకుంటా, ఆత్మవిమర్శ చేసుకుంటాను అంటున్నాడు… శుభం… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రీల్స్, జోక్స్, డాన్స్… ఇవి కాదు, మల్లారెడ్డిది పెద్ద ప్లానింగే…
  • ఆత్మవిమర్శ, దిద్దుబాటు, రీవ్యాంప్… KCR కళ్లు తెరుచుకున్నట్టేనా…
  • ఢిల్లీ ఐపీఎల్… మరీ నాసిరకం ప్లే… ఓ దశలో 8 పరుగులకు 6 వికెట్లు…
  • సహజీవన మొగుళ్లూ… ఈ వార్త మీ కోసమే… జాగ్రత్త… సోలో బతుకే సో బెటరు…
  • నక్కీరన్ గోపాల్..! తెగువ, చొరవ, దూకుడు… ఇవే హీరోను చేశాయి…!!
  • రఘురాయ్… గొప్ప ఫోటోగ్రాఫర్… ఎందుకు స్మరించుకుంటానంటే..?
  • ఒకటి కట్నం, మరొకటి రివర్స్ కట్నం… 2 హైప్రొఫైల్ కేసుల కంట్రాస్టు…
  • మంత్రించిన నిమ్మకాయ ఓ ఫేక్… కానీ ఆ నవలలో ఓ సీన్ గుర్తొచ్చింది…
  • ఆల్రెడీ చచ్చిపోయిన హీరో ఓ విలన్‌ను సైలెంటుగా లేపేస్తాడు…
  • మధుబాల, సుబ్బులక్ష్మి… సాయిపల్లవి చేజారిన రెండు అదృష్టాలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions