మనం ఎంత ఆనందంగా ఉన్నాం? తరగని ఆస్తుల్లేకపోయినా, ఎడాపెడా ఆదాయం లేకపోయినా మనం సుఖంగానే ఉండగలుగుతున్నామా? ఏదేని ఆపదొస్తే తోటి సమాజం మనల్ని ఎంతగా పట్టించుకుంటున్నది? తలసరి ఆదాయం సరే, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? భవనాలు, భూములు, బ్యాంకు బ్యాలెన్సుల్లోనే జీవితాన్ని కొలుచుకుంటున్నామా? ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం? నిజంగా మనం ఆనందంగా ఉన్నామా? మన సమాజం తన అభివృద్ధి ప్రాతిపదికల్లో ఆనందాన్ని కూడా ఓ అంశంగా ఎందుకు పరిగణించడం లేదు?
…. ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా?
ఠాట్, ఇవన్నీ ఎందుకండీ… క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇవన్నీ లైవ్ గా ఉన్నంతకాలం మన ఆనందానికి వచ్చిన ఢోకా లేదంటారా? కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్లు, సెల్పీ ముచ్చట్లు, సోషల్ మీడియా కబుర్లు, టీవీ రియాలిటీ షోలతో మన ఆనందానికి ఎదురే లేదని భావిస్తున్నారా?
పోనీ, ప్రపంచంలో ఆనందసూచికల్లో మనం ఎక్కడున్నామో తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు, మనకన్నా ఎవరెవరు ఆనందంగా జీవిస్తున్నారో తెలిస్తే… మన ఆనందం మరింతగా పడిపోతుంది… నిజమేనండీ… మనకన్నా పాకిస్థానోడు ఆనందంగా ఉన్నాడు. తెల్లారిలేస్తే బాంబుదాడులు తప్ప మరేమీ వినిపించని పాలస్తీనావాడూ మనకన్నా ఆనందంగానే ఉన్నాడు. చివరకు బంగ్లాదేశ్, ఇరాక్ వంటి దేశాలూ మనకన్నా ఆనందంగా ఉన్నాయి…
మార్చి 20న ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆనందసూచికలను ఎస్డీఎస్ఎన్ (సస్టయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్) విడుదల చేసింది. మొత్తం 157 దేశాల్లో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో లెక్కలు తీసింది. క్రోడీకరించింది. దాంట్లో మన స్థానం ఎంతో తెలుసా?….. 117
పాకిస్థాన్ 81, పాలస్తీనా 108, బంగ్లాదేశ్ 109, ఉక్రెయిన్ 111, ఇరాక్ 112 స్థానాల్లో ఉన్నాయి… గత సర్వేతో పోలిస్తే ఇండియా స్థాయి 111 నుంచి ఆరు స్థానాలు పడిపోయింది…
ప్రపంచంలోకెల్లా ఏయే దేశాల ప్రజలు ఆనందంగా ఉన్నారో లెక్కతీస్తే… టాప్ టెన్ లో డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్ లాండ్, నార్వే, ఫిన్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ నిలిచాయి… సామాజిక భద్రత, తలసరి ఆదాయం, శాంతిభద్రతలు, జీవనప్రమాణాలు, సగటు ఆయుప్రమాణం వంటి అనేకానేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు
ఆనంద సూచికల్లో బాటమ్ టెన్ లో మడగాస్కర్, టాంజానియా, లిబేరియా, గినియా, రువాండా, మెనిన్, అఫ్ఘనిస్థాన్, టోగో, సిరియా, బురుండి ఉన్నాయి…
‘‘మనం ఆదాయపరంగా, ఆస్తులపరంగా అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ డబ్బు కోసమే అన్వేషిస్తున్నాం, తప్పుడు అంశాలే మనల్ని ఆకర్షిస్తున్నాయి, సామాజికాంశాలు మనకు ప్రాధాన్యాలు గాకుండాపోయాయి, ప్రభుత్వాలపై విశ్వాసం లేకుండాపోతున్నది. అందుకే ఆనందం తగ్గిపోతున్నది’’ అని విశ్లేషిస్తాడు సాక్స్ అనే ఈ సర్వే బృందంలోని సభ్యుడొకరు
అసలు కొన్ని ప్రభుత్వాలు ఆనందసూచికలకు అత్యుత్తమ ప్రాధాన్యం ఇస్తాయో తెలుసా? ప్రజల జీవనప్రమాణాలు కొలవటానికి పలు దేశాలు ఆదాయసూచికలను గాకుండా ఆనందసూచికలనే పరిగణనలోకి తీసుకుంటారు. భూటాన్, ఈక్వడార్, స్కాట్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనెజులా వంటి దేశాలు ప్రత్యేకంగా ఆనంద మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. దేశంలో ఆనందవాతావరణాన్ని బాగా పెంచేవి సామాజికభద్రత, సంఘీభావ ధోరణి. ఈ అంశాల్లో బలంగా ఉన్నాయి కాబట్టే భూకంపాలు, ఆర్థికమాంద్యాల వంటి షాకులను కూడా తట్టుకుని ఐర్లాండ్, ఐస్ లాండ్, జపాన్ వంటి దేశాలు ఆనందసూచికలు దిగజారిపోకుండా కాపాడుకుంటున్నాయి…