Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…

April 16, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. షాజహాన్ , ముంతాజులలోనే కాదు ; హీన , దీన జన గుండెల్లోనూ ప్రేమ ఉంటుంది . ఈ ప్రేమ పలుకులతో సినిమా టైటిల్స్ ప్రారంభం అవుతాయి . ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . ప్రముఖ నటి , రాజకీయ నాయకురాలు , ఫైర్ బ్రాండ్ రోజాగా మారిన శ్రీలత రెడ్డి తెరంగ్రేటం చేసిన సినిమా ఈ ప్రేమ తపస్సు . మరో ప్రముఖ నటుడు , నిర్మాత , దర్శకుడు , రాజకీయ నాయకుడు అయిన శివ ప్రసాద్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా .

ఇద్దరు పేద ప్రేమికుల ప్రేమ కధ కావటంతో ఇద్దరూ పేదవారిగా కనిపించేందుకు మేకప్ లేకుండా నటించారు రాజేంద్రప్రసాద్ , రోజా . సినిమా అంతా తిరుపతిలో తీయటమే కాకుండా పూర్తి చిత్తూరు జిల్లా యాసలో ఉంటాయి డైలాగులు . కధను తమిళ రచయిత కులశేఖర్ , దర్శకుడు శివప్రసాదులే నేసుకున్నారు . వీళ్ళిద్దరే డైలాగులను కూడా వ్రాసారు .

Ads

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ రెండు పాటల్ని కూడా పాడారు . ఇది మరో విశేషం . ఒక పాటను శివప్రసాదే వ్రాసారు . అంటే ఈ సినిమా అంతా శివప్రసాదుదే . కధ , మాటలు , పాటలు , దర్శకత్వం , నిర్మాణ బాధ్యతలను మోసాడు ఆయన . భారం మరీ ఎక్కువ అయిందేమో సినిమాను ప్రేక్షక రంజకంగా తీయలేకపోయాడు .

ఇద్దరు పేద యువతీయువకులు చిన్నప్పటి నుంచీ కలిసిమెలిసి పెరిగి గాఢంగా ప్రేమించుకుంటారు . హీరోహీరోయిన్లు వీరిద్దరు . హీరో రాజేంద్రప్రసాద్ వీర అమాయకుడు , ఏ పనీ చేయలేని నిష్ప్రయోజకుడు . హీరోయిన్ నాలుగిళ్ళల్లో చాకిరి చేసి తనను , తన ప్రేమికుడిని పోషించుకుంటూ ఉంటుంది .

చుట్టుపక్కల ఆవారా గాళ్ళు హీరోయిన్ మీద కన్ను వేసిఉంటారు . వాళ్ళే కాకుండా వ్యభిచార వ్యాపారంలో ఉన్న వయ్యారాల వై విజయ కూడా కన్ను వేసి ఉంటుంది . వీళ్ళందరితో పాటు ఓ రౌడీ బిచ్చగాడు కూడా ఉంటాడు . ప్రజానాట్య మండలిలో ప్రముఖుడు , నిర్మాత పోకూరి బాబూరావు ఈ పాత్రను వేసాడు .

  • వీళ్ళందరినీ దాటుకుని అమాయక హీరోని పెళ్ళి చేసుకోవాలని హీరోయిన్ అనుకున్నా రౌడీ బిచ్చగాడు హీరోని చంపేస్తానని బెదిరించగానే హీరోయిన్ అతనినే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది . హీరోని వదిలించుకోవటానికి నువ్వు ఏం సంపాదించగలవు ; వాడయితే ఒక కాలు లేనోడు ; ఎక్కువ సంపాదిస్తాడు అని అంటుంది . ఆ మాటతో వాడి కన్నా ఎక్కువ సంపాదింతాలంటే అంగవైకల్యం ఇంకా ఎక్కువ ఉండాలి కాబట్టి తన రెండు కళ్ళను అమ్మ వారి గుళ్ళో శూలానికి పొడుచుకుని రెండు కళ్ళనూ పోగొట్టుకుంటాడు .

ఈ హఠాత్ పరిణామానికి విస్మయం చెంది రౌడీ బిచ్చగాడు మంచివాడు అయిపోయి క్షమాపణ అడుగుతాడు . ప్రేమ కోసం కళ్ళు పోగొట్టుకుంటారా !? చెత్త ప్రశ్న . ప్రేమ గుడ్డిది . ఏమయినా పోగొట్టుకుంటారు . అందుకే ఈ సినిమాకు ప్రేమ తపస్సు అనే టైటిలుని పెట్టుకున్నారు . ఇదండీ స్టోరీ .

రోజా మొదటి సినిమా అయినా బాగా నటించింది . మేకప్ లేకపోయినా అందంగానే ఉంది . బ్లాక్ బ్యూటీ అంటారు . అంత బ్లాక్ గా ఏం కనిపించదు మరి ! తప్పకుండా మెచ్చుకోవలసింది రాజేంద్రప్రసాదుని . బిచ్చగాడిగా , అమాయకుడిగా , పిచ్చి ప్రేమికుడిగా బాగా నటించాడు . పదహారేళ్ళ వయసులో చంద్రమోహన్ గుర్తుకొస్తాడు .

ఇతర పాత్రల్లో రాజ్ వర్మ , సాయికుమార్ , దేవకి , సుత్తి వేలు , నర్రా , హేమ సుందర్ , వై విజయ , ఫణి , రాజేశ్వరి , పోకూరి బాబూరావు  తదితరులు నటించారు . రాజా సంగీత దర్శకత్వంలో వెన్నెలకంటి , వేదవ్యాస , శివప్రసాద్ , కుసుమాంబ పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , హీరో రాజేంద్రప్రసాద్ , వందేమాతరం శ్రీనివాస్ , రాధిక పాడారు .

ఎట్టెట్టో అవుతుంది, ఏదేదో ఇదిగా ఉంది… ఆడేస్తానే అమ్మి పాడేస్తానే అమ్మి అంటూ సాగే ఈ రెండు పాటల్ని రాజేంద్రప్రసాదే పాడారు . ఏమో ఎందుకో ఈ తాపము , ఏం ప్రేమలో ఇది ఏం మాయలో , నేరమా ఘోరమా వింత లోకమా అంటూ సాగుతాయి మరో మూడు పాటలు . థియేటర్లో బాగానే ఉంటాయి .

సినిమా యూట్యూబులో ఉంది . రోజా మొదటి సినిమా ఎలా ఉంటుంది అనే ఉత్సుకత కల ఆమె అభిమానులు ట్రై చేయవచ్చు . సినిమా స్లోగా నడుస్తుంది . ఓపిగ్గా చూసే ఓపిక కలవారు ట్రై చేయవచ్చు .
ఆడని సినిమాకీ రివ్యూనా అని సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చకండి . నేను సినిమాల రివ్యూని వ్రాయటం లేదు . పరిచయం చేస్తున్నాను .

ఆ సినిమాతో నా అనుభవాలు , ఆ సినిమా ద్వారా నాకు ఏర్పడిన భావాలు , సినిమాతో నాకున్న బంధాలు , అనుబంధాలు పంచుకుంటున్నా . అంతవరకే . దయచేసి గమనించగలరు . ఈ ప్రపంచంలో పనికిరానిది ఏమీ ఉండదు . ప్రతీ దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది . చూసేందుకు మనకు మనసు , నేత్రాలు , మస్తిష్కాలు ఉండాలి . శుభం….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions