Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజాసేవ – ప్రజాభీష్టం – ప్రజాదేశం – ప్రజామోదం – అన్నీ భ్రమపదార్థాలు…

October 24, 2023 by M S R

Bharadwaja Rangavajhala…….  అంతా ప్రజలే చేస్తారు…

మీరు పార్టీ మారుతున్న విషయం మీద పుకార్లు వినిపిస్తున్నాయి మీరేమంటారు?

పుకార్లని మీరే అన్నారు కదా …

Ads

మీకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదంటారా?

లేదని చెప్ప‌లేదు క‌దా … మారాల్సిన టైమొస్తే మారొచ్చు …

అంటే మారుతారా?

ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల అభీష్టం మేరకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ప్రజలు కోరితే పార్టీ మారుతాను. ప్రజలు నేను ఏ పార్టీలో ఉంటే తమకు బాగా సేవ చేసుకోగలననుకుంటారో ఆ పార్టీలోకి మారమని నన్ను ఆదేశిస్తారు. నేను పాటిస్తాను. అంతే …

ప్రజాభిప్రాయాన్ని అమలు చేయడానికి ఏ మాత్రం సంకోచించను.

అదేంటి? అంతా ప్రజల మీదే వేస్తున్నారు …

మీరు ఉద్యోగాల్లోకి జీతాల కోసం వచ్చారు అంటే బాగుంటుందా? అలాగే మేం కూడా …. రాజకీయాల్లోకి ధనార్జన కోసం రాలేదు … ప్రజాసేవ కోసం వచ్చాం … కరక్టుగానే చెప్పాను కదా …

మీరు రాజకీయాల్లోకి వచ్చేప్పుడు మీకు రెండెకరాల పొలం ఉండేది. ఇప్పుడు మీ ఆస్తులు లెక్కలు గట్టడానికి వారం పైన పడుతుంది … మరిదంతా ఎక్కడ నుంచీ వచ్చింది?

అప్పటికి ఇప్పటికీ నాకున్నది ఆ రెండెకరాలే … నేను ప్రజాసేవలోకి వచ్చినప్పుడు మా ఆవిడ ఇక ఇంటికి ఆదాయ మార్గం ఏమిటని ఆందోళన పడింది. చుట్టుపక్కల ఆడవాళ్లని పిల్చి వాళ్లని సంఘటితం చేసి మొదట పాల వ్యాపారం చేసింది. ఆ తర్వాత చీరలమ్మింది. దాంతో పాటు చీటీలేసింది. గోడల మీద పిడకలు వేసి అమ్మింది. అప్పడాలు చేయించి అమ్మింది. అలా సంపాదించుకున్న ఆస్తులే ఇప్పుడు మీరు చెప్తున్న వారం రోజులు పట్టే లెక్కింపు ఆస్తులు. అన్నిటికీ లెక్కలున్నాయి. ఆడిటింగు ఉంది … మేం లెక్కల్లో పర్ఫెక్టు అన్నా … ఒక్క నయాపైసా అవినీతి చేశానని నిరూపించినా తల తీయించుకోడానికి వెనుకాడను.

సరే సరే … మీ వల్లే పార్టీలో అవినీతి పెరిగిందని మీరు ఫలానా కేసులో అరస్టై పార్టీ పరువు తీసేశారని ప్రస్తుతం మీరున్న పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు కదా మీరేమంటారు?

సందర్భశుద్ది లేని విమర్శలవి. ఒక చారిత్రక సందర్భంలో చారిత్రక అవసరం కోసం త్యాగానికి వెనుకాడక ఆ పనిచేశాను. నేనొక్కడినే జైలుకెళ్లా … అయినా నేను ఒకరిని విమర్శించను… అప్పట్లో ప్రజలు కోరుకున్నారు కాబట్టే ఆ పనిచేశాం.

మీ …. అదే మీరు వదిలేస్తున్న పార్టీ అధి నాయకుడు మీతో ఏం మాట్లాడలేదా?

మాట్లాడలేదు. ఆయనకి తెల్సు. ఒక రాజకీయనాయకుడు తీసుకునే నిర్ణయం వెనుక ప్రజల ఆకాంక్షలు ఉంటాయని …ఎందుకంటే … ఆయన కూడా ఈ పార్టీ పెట్టినప్పుడు ఇందులో లేరు. ప్రజల కోరిక మేరకే ఈ పార్టీలో చేరారు. ప్రజల కోరిక మేరకే ఈ పార్టీ అప్పటి నాయకుడికి వెన్నుపోటు పొడిచి మ‌రీ అధికారం చేపట్టారు. ప్రజల కోరిక మేరకే చాలా సందర్భాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. … ప్రజల మనసులు ఇంత బాగా తెల్సిన నాయకుడు ఆయన. అలాంటోడు మరో నాయకుడు ఆ పార్టీలో లేకపోవడం వల్లే నా మీద విమర్శలు వస్తున్నాయి.

రాజకీయనాయకుడు ఏం చేసినా ప్రజల కోసమే అని టెకిట్ గ్రాంటెడ్ అన్నట్టు చెప్తున్నారు మీరు …

ఇవన్నీ రాజకీయాలు ప్రజల హృదయాలు తెలియని వారు మాట్లాడే మాటలు. వీటిని మేం ఖాతరు చేయం …

ఇంతకీ మీ పార్టీ మార్పుకు ముహూర్తం నిర్ణయమైనట్టేనా?

అవన్నీ త్వరలోనే వెల్లడిస్తాను. నేను ఎప్పుడు పార్టీ మారేదీ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నాకు చెప్పాక నేను మీకు వెల్లడిస్తాను. ఎందుకంటే నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టి … నేను పార్టీ మారినా …మారకపోయినా అది ప్రజాదేశం ప్రకారమే చేస్తాను కాబట్టి.

ఉంటామండీ … నమస్తే …

న‌మ‌స్తే

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions