.
సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా… రేవంత్ ప్రభుత్వానికి పెరుగుతున్న గుడ్‌విల్
తెలంగాణలో లక్షలాది మంది జీవితాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సింగరేణితో ముడిపడి ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వేలాది కుటుంబాలకు సింగరేణే జీవనాధారం. బొగ్గు గనుల విస్తరణతో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండగా, గనులు, రవాణా, పరిశ్రమల కార్యకలాపాల నేపథ్యంలో ప్రమాదాల అవకాశాలు కూడా పూర్తిగా లేకపోవు.
Ads
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ప్రమాద బీమా పథకం ఇప్పుడు సింగరేణి కార్మిక కుటుంబాల్లో విశేష ఆదరణ పొందుతోంది.
దీనికి ఉదాహరణగా సంతోష్ కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరిన కేవలం 18 నెలల్లోనే రోడ్డు ప్రమాదంలో అతడు మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులకు అతడే ఏకైక ఆధారం. సర్వీసు తక్కువ కావడంతో టర్మినల్ బెనిఫిట్స్ కూడా పెద్దగా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఉచిత ప్రమాద బీమా పథకం కింద కుటుంబానికి కోటి రూపాయల భరోసా లభించింది. ఇదే పరిస్థితి రంజిత్ కుమార్ కుటుంబానిది కూడా. నెల రోజుల పసిబిడ్డను చూసి వస్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబానికి కూడా కోటి రూపాయల బీమా సొమ్ము అందింది.
ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే ఉద్యోగి ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి యాజమాన్యం వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో కార్పొరేట్ శాలరీ ఖాతాలు కలిగిన ఉద్యోగులకు ఈ సదుపాయం అందుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్‌లు ప్రమాద మరణానికి కోటి రూపాయల బీమా అందిస్తుండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు రూ.1.25 కోట్ల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాయి.
ప్రమాద మరణాలకే కాదు, శాశ్వత అంగవైకల్యానికి కూడా ఈ బీమా వర్తించడం మరో విశేషం. గని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన కార్మికుడు సత్యనారాయణ కుటుంబానికి కోటి రూపాయల బీమా సొమ్ము అందింది. అలాగే సహజ మరణాలకు కూడా పలు బ్యాంకులు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉచిత బీమా సదుపాయం అందిస్తున్నాయి.
ఈ పథకం ప్రయోజనం కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిమితం కాలేదు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది *పొరుగు సేవల* సిబ్బందికి కూడా 30 నుంచి 40 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇటీవల ప్రమాదంలో మరణించిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల బీమా అందడం ఈ పథకం విస్తృతిని చాటిచెబుతోంది.
గత రెండేళ్లలోనే వివిధ ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు రూ.28 కోట్లు, యూనియన్ బ్యాంక్ సుమారు రూ.13 కోట్లు చెల్లించాయి. అంటే ఇది కేవలం కాగితాలపై ఉన్న సంక్షేమ పథకం కాదని, వాస్తవంగా కుటుంబాలకు అండగా నిలుస్తున్న వ్యవస్థ అని స్పష్టమవుతోంది.
- సంక్షేమం అంటే కేవలం మరణానంతరం పరిహారం ప్రకటించడం కాదు. కుటుంబం ఆర్థికంగా కూలిపోకుండా ముందుగానే భద్రతా వలయం ఏర్పాటు చేయడం. ఆ దిశగా చూస్తే సింగరేణిలో అమలవుతున్న ఈ ఉచిత ప్రమాద బీమా పథకం తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ విధానాల్లో ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది.
రూపాయి ప్రీమియం లేకుండా కోటి రూపాయల భద్రత, ఉద్యోగి సర్వీసు కాలంతో సంబంధం లేకుండా కుటుంబానికి ఆర్థిక భరోసా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వరకూ విస్తరించిన రక్షణ… ఇవన్నీ కలిసి ఈ పథకాన్ని సింగరేణి కార్మిక కుటుంబాలకు ఒక భద్రతా కవచంగా మార్చాయి. అదే సమయంలో కార్మిక వర్గంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గణనీయమైన గుడ్‌విల్‌ను కూడా తీసుకొస్తున్నాయి.
Share this Article