Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోనియా జ్ఞాపకాల ప్రచురణపై పెంగ్విన్ వెనుకంజ – ఓ విశ్లేషణ !!

August 31, 2026 by M S R

.

సోనియాకు తన మాటలు చెప్పుకునే స్వేచ్చ ఉంది.. పెంగ్విన్‌కు నచ్చని మాటలు ప్రచురించకపోయే స్వేచ్చ లేదా? సోనియాగాంధీ రాసిన పుస్తకాన్ని భారత్‌లో ప్రచురించబోమని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

పుస్తకంలోని కొంత భాగంలో ఎడిటోరియల్ మార్పులు, తొలగింపులు చేయాలని పెంగ్విన్ కోరిందని, అందుకు సోనియాగాంధీ అంగీకరించలేదని, దాంతో పెంగ్విన్ ప్రచురణ నుంచి తప్పుకుందని చెబుతున్నారు. అంతే.

Ads

అసలు ఏం తొలగించాలనుకున్నారు? ఏ అంశాలపై అభ్యంతరం వచ్చింది? ఎందుకు మార్పులు కోరారు? ఇవేవీ మనకు పూర్తిగా తెలియవు. అయినా అప్పుడే ఒక వాదన మొదలైపోయింది.

ఇది రచయిత స్వేచ్చపై దాడి.
పెంగ్విన్ అధికారానికి భయపడుతోంది.
పబ్లిషర్లు సెన్సార్‌లుగా మారుతున్నారు.

సోనియాగాంధీ తన మాటలను మార్చడానికి నిరాకరించారట. అందుకు ఆమెను అభినందించాలట. సరే. తన కథను తన మాటల్లో చెప్పుకోవాలనుకోవడం సోనియాగాంధీ హక్కే. కానీ ఆమె జీవితం సాధారణమైనది కాదు.

ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన యువతి నుంచి నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యురాలిగా, అక్కడి నుంచి భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగిన అసాధారణ ప్రయాణం అది.

ఇందిరాగాంధీ హత్యను చూసింది. రాజీవ్‌గాంధీని నష్టపోయింది. దశాబ్దాల రాజకీయ పరిణామాలకు కేంద్రంగా ఉంది. 2004లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆమెను అభిమానించేవాళ్లు ఉన్నారు. ఆమెను తీవ్రంగా వ్యతిరేకించేవాళ్లు ఉన్నారు.

ఆమె రాజకీయాలను విమర్శించే హక్కు అందరికీ ఉంది. అలాగే తన అనుభవాలను తాను చెప్పుకునే హక్కు ఆమెకు కూడా ఉంది. ఇందులో రెండో మాట లేదు. కానీ…

ఇక్కడే మరో ప్రశ్న. పెంగ్విన్‌కు తన స్వంత పరిమితులు పెట్టుకునే హక్కు లేదా? ఒక రచయితకు…

“ఇది నా కథ.
నేను ఇలా రాశాను.
ఒక్క పదం కూడా మార్చను.”

అని చెప్పే హక్కు ఉన్నప్పుడు… ఒక ప్రచురణకర్తకు… “సరే. మీరు మార్చకపోతే నేను ఈ పుస్తకాన్ని ప్రచురించను.” అని చెప్పే హక్కు ఎందుకు ఉండకూడదు? రచయిత స్వేచ్చ ఉన్నట్టే ప్రచురణకర్త స్వేచ్చ కూడా ఉండాలి కదా!

పెంగ్విన్ ఒక ప్రభుత్వ సంస్థ కాదు. సెన్సార్ బోర్డు కాదు. ఏ రచయిత పుస్తకమైనా తప్పనిసరిగా ప్రచురించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత దానికి లేదు. అది ఒక ప్రచురణ సంస్థ. అందుకే తన ఎడిటోరియల్ పాలసీ ఏమిటో, ఏ రిస్క్ తీసుకోవాలో, ఏ పుస్తకాన్ని ప్రచురించాలో, ఏ పుస్తకాన్ని ప్రచురించకూడదో నిర్ణయించుకునే హక్కు దానికి ఉంటుంది.

అది మనకు నచ్చకపోవచ్చు. దాని నిర్ణయాన్ని తప్పుపట్టవచ్చు. కానీ దానిని “సెన్సార్‌షిప్” అని పిలవడం మాత్రం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సెన్సార్‌షిప్ అంటే సాధారణంగా ఒక వ్యక్తి లేదా సంస్థపై బయటి అధికారం తన మాటను ఆపడం.

ఇక్కడ మనకు తెలిసినంతవరకూ అలాంటిదేమీ నిరూపితం కాలేదు. ఇక్కడ ఒక రచయిత, ఒక ప్రచురణకర్త మధ్య సంపాదకీయ విభేదం వచ్చింది. రచయిత తగ్గలేదు. పబ్లిషర్ కూడా తగ్గలేదు. అంతే.

sonia

ఇద్దరూ తమ తమ స్వేచ్చను ఉపయోగించుకున్నారు. ఇందులో ఎవరు తప్పు? అనే ప్రశ్న కంటే… ఇద్దరికీ తమ తమ నిర్ణయం తీసుకునే హక్కు ఉందా? అనే ప్రశ్న ముఖ్యమైనది. ఇంకో విషయం. పెంగ్విన్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.

  • వివాదాస్పద పుస్తకాల విషయంలో గతంలోనూ పెంగ్విన్ నిర్ణయాలు చర్చకు వచ్చాయి. వెండి డోనిగర్ రాసిన The Hindus: An Alternative History విషయంలో 2014లో పెంగ్విన్ పుస్తకాన్ని ఉపసంహరించుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది.
  • జో సాకో రాసిన The Once and Future Riot విషయంలోనూ ప్రచురణపై వివాదం వచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే జ్ఞాపకాల పుస్తకం విషయంలోనూ పెంగ్విన్ చుట్టూ ప్రశ్నలు తలెత్తాయి.

అంటే… పెంగ్విన్ తనకు తాను కొన్ని పరిమితులు పెట్టుకోవడం ఇదేమీ కొత్త విషయం కాదు. ఆ పరిమితులు మనకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు అవి అతిగా జాగ్రత్తపడినట్టుగా కూడా అనిపించవచ్చు.

కానీ ఒక సంస్థ తన ప్రతిష్ఠ, చట్టపరమైన బాధ్యతలు, ఎడిటోరియల్ పాలసీ, వ్యాపార ప్రయోజనాలు, భవిష్యత్ పరిణామాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడాన్ని మనం ఎందుకు తప్పనిసరిగా తప్పుగా చూడాలి?

ఒక పుస్తకాన్ని ప్రచురించకపోవడం కూడా ఒక నిర్ణయమే. అది గొప్ప నిర్ణయం కావచ్చు. చెత్త నిర్ణయం కావచ్చు. భయపడిన నిర్ణయం కావచ్చు. తెలివైన నిర్ణయం కావచ్చు. కానీ అది తీసుకునే స్వేచ్చ ఆ సంస్థకు ఉండకూడదా?

ఇక్కడ మరో విచిత్రం ఉంది. రచయిత తన పుస్తకంలో తనకు నచ్చినది రాసుకునే స్వేచ్చను మనం చాలా గట్టిగా సమర్థిస్తాం. కానీ అదే రచయితతో ప్రచురణకర్త విభేదిస్తే… “పబ్లిషర్ రచయిత మాటను ఎందుకు మార్చాలనుకున్నాడు?” అంటాం. అది సరే. కానీ పబ్లిషర్ చివరికి… “మీరు మార్చకపోతే నేను ప్రచురించను.” అంటే మాత్రం… “రచయిత గొంతు నొక్కుతున్నారు!” అంటాం.

ఇది కొంచెం విచిత్రంగా లేదూ? రచయితకు “లేదు” చెప్పే హక్కు ఉంటే… పబ్లిషర్‌కు కూడా “అయితే వద్దు” అనే హక్కు ఉండాలి కదా! అంతేకాదు… ఒక మెమోయిర్ అంటే రచయిత జ్ఞాపకాలు. కానీ జ్ఞాపకాలు అన్నీ చరిత్రాత్మకంగా నిర్ధారించబడిన వాస్తవాలే కావాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తి చూసిన సంఘటనను, గుర్తుపెట్టుకున్న విధానాన్ని, తన అనుభవాన్ని తన కోణంలో చెప్పవచ్చు. అదే సమయంలో పబ్లిషర్ మాత్రం… “ఇది ప్రచురిస్తే ఈ ఆరోపణకు ఆధారం ఏమిటి?” “ఈ వ్యక్తి గురించి ఇలా రాయడానికి మన దగ్గర ఆధారాలున్నాయా?” “ఇది చట్టపరంగా ఇబ్బంది కలిగిస్తుందా?” అని అడగవచ్చు.

sonia

అది కూడా ఎడిటోరియల్ బాధ్యతలో భాగమే. కాబట్టి ఎడిటర్ ఒక వాక్యాన్ని ప్రశ్నించడం, తొలగించాలని సూచించడం, మార్చాలని కోరడం అన్నీ సెన్సార్‌షిప్‌గా మారిపోవు. అదే సమయంలో… ఒక రచయిత ఆ మార్పులను అంగీకరించకపోవడం కూడా తప్పు కాదు.

ఆమె తన పుస్తకాన్ని మరో ప్రచురణకర్త ద్వారా తీసుకురావచ్చు. అదీ ఆమె స్వేచ్చే. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక చిన్న వాక్యంలో చెప్పాలంటే…

సోనియాగాంధీ తన మాటలను మార్చడానికి నిరాకరించారు.
పెంగ్విన్ ఆ మాటలను ప్రచురించడానికి నిరాకరించింది.

ఇద్దరూ ఓడిపోయారా? కాదు, అలా అనాల్సిన అవసరం లేదు. ఇద్దరూ తమ నిర్ణయాన్ని గౌరవించుకున్నారేమో. ఇప్పుడు పుస్తకం మరొక ప్రచురణకర్త ద్వారా వస్తే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది.

అప్పుడు పెంగ్విన్ తొలగించాలనుకున్న భాగాలు ఏంటో, సోనియాగాంధీ ఎందుకు వాటిని మార్చలేదో, ఆ వివాదం అసలు ఎందుకు వచ్చిందో మనకు తెలుస్తుంది. అప్పుడే అసలు తీర్పు చెప్పొచ్చు.

ప్రస్తుతం మాత్రం… పెంగ్విన్‌ను అధికారానికి భయపడిన సంస్థగా ముద్ర వేయడానికి మన దగ్గర సరిపడా సమాచారం లేదు. సోనియా గాంధీని కూడా భావప్రకటన స్వేచ్చకు ఏకైక యోధురాలిగా నిలబెట్టాల్సిన అవసరం కూడా లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లు అరవింద్ మాటల్లో తప్పు లేదు- తను యశ్‌ను కించపరచలేదు !!
  • బ్రెజిల్‌లో ఈ ఆవు ధర 36 కోట్లు !! ఆ జాతికి పూర్వీకులు మన పశువులే !!
  • ఏశ నాగుల కట్ట మీద – కంట్రవర్సీ ఏమిటి..? తప్పెవరిది..? రైట్స్ ఎవరివి..?
  • సమాజం అంతే, సర్కారూ అంతే – స్పందనను పూర్తిగా కోల్పోయాయి
  • చెలరేగిపోతున్న హిజ్రా మాఫియా ! చెక్కగాళ్లు కనిపిస్తే చాలు వణుకే !!
  • Prof Nageshwar … ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావు సారూ…
  • సోనియా జ్ఞాపకాల ప్రచురణపై పెంగ్విన్ వెనుకంజ – ఓ విశ్లేషణ !!
  • క్రెడిట్ చోరీ ! ఓ దిక్కుమాలిన లొల్లి ! జగన్, కేసీయార్ క్యాంపుల రోదన !!
  • నయనతార స్థితప్రజ్ఞత ! టాక్సిస్ ఫలితంపై ఓ పరిణత స్పందన !!
  • హెయిర్ కట్ కాదు – అచ్చంగా శిరోముండనం! మీకు మరో కథ చెబుతాను…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions