Nancharaiah Merugumala… ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సాంగంత హిట్ ఎప్పుడవుతుందో!
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు.
Ads
‘రాజ్యసభ, లోక్ సభల మొత్తం డోర్లు అన్నీ మూసి వేయించేసి సోనియమ్మ ఏపీ విభజన బిల్లు బలవంతంగా ఆమోదింపజేయించారు,’ అనే ఒక్క విషయం చెప్పడానికి రాజమండ్రి నిరుపయోగ నియోగ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పేద్ద పుస్తకం రాసి జనం మీదకు విసిరేశారు. అయినా ఆయనకు ఎలాంటి ప్రయోజనం సిద్ధించలేదు. పార్లమెంటు తలుపులు మూసేసి అనే ఆయన జిత్తులుమారి మాటలు ‘ ఆ కుర్చీ మడత పెట్టి ’ పాటంత హిట్ కాలేదు. ఆంధ్రా ప్రజల నోళ్లలో నాననే లేదు.
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మెజారిటీ సభ్యుల ఆమోదం పొంది ఆదివారానికి పదేళ్లు గడిచినా ఆంధ్రోళ్లకు న్యాయం జరగలేదంటూ ఈ మాజీ ఎంపీ రాజమండ్రిలో వాపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. కనీసం ఆంధ్రా మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ గారి మాదిరిగా ఏపీకి ప్రత్యేక హోదా అనే మరో పాత పాటెత్తుకున్నా– ఉండవల్లి గారికి కనీసం బెజవాడ కృష్ణలంక, సత్యనారాయణపురం ప్రాంతాల్లో జనం మద్దతు దొరికేది.
తెలంగాణ ఏర్పాటు చట్టబద్ధతను లేదా రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టుకు ఎక్కి ఒంటరి పోరాటం చేస్తున్న అరుణ్ కుమార్ గారి వంటి అసలు సిసలు మేధావుల అవసరం నేడు ఏపీకి నిజంగా ఉందా? అనే అనుమానం వస్తోంది ఆయన నేటి మాటలు విన్నాక. 21వ శతాబ్దంలో రాజమండ్రి లోక్ సభ సభ్యుడిగా పదేళ్లు ఉన్న ఉండవల్లి గారిది కొత్త రికార్డు.
ఉండవల్లి రచించిన ‘పార్లమెంటు తలుపులు మూసి’ అనేది అసలు జనం బుర్రలో రికార్డు కాని పాత పాట. కుర్చీ మడత పెట్టి అనే మోతక్కే పాట రాసిన దరివేముల రామ జోగయ్య శాస్త్రి ఉరఫ్ సరస్వతీ పుత్ర ఎంత కాదనుకున్నా ఉండవల్లి అరుణ్ కుమార్ కంటే కాస్త మెరుగైన రచయిత. ఎంతైనా గోదావరి జిల్లాల బ్రాహ్మణ మేధావుల కన్నా గుంటూరు జిల్లాకు చెందిన బ్రామ్మణ కవులు, రచయితలే ఎక్కువ గొప్పోళ్లని దరివేముల శాస్త్రి గారి పాటలు విన్నాక అనిపిస్తోంది…
Share this Article