Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం ఈటీవీ… ఫాఫం నిఖిల్… స్పై మూవీ హారిబుల్ డిజాస్టర్…

December 14, 2023 by M S R

కార్తికేయ-2 జాతీయ స్థాయిలో ఎంత హిట్టో కదా… నిఖిల్ హీరో… తనను ఒకేసారి పది మెట్ల దాకా ఎక్కించింది ఈ సినిమా… ఐతేనేం, ఎవరైనా సరే, గెలుపు స్థానాన్ని సస్టెయిన్ చేసుకోవడమే కష్టం… స్పై పేరిట ఓ మూస సినిమాలో హీరోగా చేశాడు… అదేమో తలాతోకా లేని కథ, ప్రజెంటేషన్… మళ్లీ నిఖిల్ నేల మీదకు దిగొచ్చాడు దీంతో… ఫ్లాప్ ఈడ్చి కొట్టింది…

సాధారణంగా ఈటీవీ కొత్త సినిమాలను కొని ప్రీమియర్లు ప్రసారం చేయదు… తనకన్నీ చీప్‌గా నడిచిపోవాలి… ఏవో పాత సినిమాల్నే పదే పదే వేస్తూ ఉంటుంది… అందుకే అది తెలుగు వినోద చానెళ్లలో మూడో స్థానానికి పడిపోయింది… కొత్త సినిమాల విషయంలో జెమిని నయం కాస్త… మామూలుగానే ఆ చానెల్‌ను ఎవరూ ట్యూన్ చేయరు… నాలుగు, ఐదో స్థానాల్లో ఉంటుంది, అప్పుడప్పుడూ ఆరో స్థానంలోకి కూడా… కానీ సన్ గ్రూపు కొన్ని కొత్త సినిమాల్ని కొంటుంది కదా, అందుకని వాటి కోసం జెమిని టీవీని అప్పుడప్పుడూ జనం చూస్తారు…

ఈ నిఖిల్ నటించిన స్పై సినిమాను ఈటీవీ ప్రసారం చేసింది… మొన్నటి మూడో తారీఖున… అసలు సినిమాయే థియేటర్‌లో ఫ్లాప్… ఆ మౌత్ టాక్ ఉంటుంది కదా… టీవీల్లో ప్రసారం చేసినా ఎవడూ దేకలేదు… మరీ ఘోరంగా… అత్యంత ఘోరంగా 1.28 రేటింగ్స్ వచ్చాయి.., దీనిబదులు ఏ అరవైల నాటి పాత సినిమాయో ప్రసారం చేసుకున్నా రెండో మూడో రేటింగ్స్ వచ్చేవేమో… నిఖిల్ యాక్సెప్టెన్సీ స్థాయి పెంచుకోవాలంటే ఇదుగో ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలి… ఈ రేటింగ్స్ చెప్పిన పాఠం అదే…

Ads

ఆ సినిమా సమీక్ష కావాలా ఇదుగో…



 

సుభాష్ చంద్రబోస్ కథ అనేసరికి… నిజంగా నేతాజీ మీద సినిమా అనుకునేరు సుమా… ఆయన తాలూకు ఫైల్స్ ప్రస్తావన ఉంటుంది… మరీ తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి కథేమో అని పరుగులు తీయాల్సిన పనేమీ లేదు… నిఖిల్ హీరోగా చేసిన స్పై మూవీకి అంత సీన్ లేదు… సగటు తెలుగు హీరో మార్క్ ఉత్త మూస గూఢచారి సినిమా ఇది…  కాకపోతే నేతాజీ పేరు ఈ సినిమా ప్రచారానికి వాడుకోబడింది… అంతే…

మళ్లీ గూఢచారి సినిమా అనేసరికి జేమ్స్‌బాండ్ సినిమాల్ని, షాడో నవలల్ని గుర్తుతెచ్చుకోకండి… ఇక్కడ ఆ సీన్ కూడా లేదు… ఓ కథ వండారు… ఓ రా ఏజెంట్ (‘రా’… మన దేశ గూఢచార సంస్థ… అసలు ఎవరు పడితే వాళ్లు ఈ సంస్థ పేరు వాడుకోకుండా, ప్రాణాలకు తెగించి దేశం కోసం పనిచేసే ఏజెంట్ల పరువు తీయకుండా నిషేధం పెడితే బాగుండు… దీనికితోడు సినిమాలో ఒక ఎన్ఐఏ ఏజెంట్ కూడా ఉంది…) ఓ ఆపరేషన్‌లో మరణిస్తాడు…

నాసిరకం డిటెక్టివ్ కథల్లో రాసుకున్నట్టే దేశం మీద న్యూక్లియర్ అటాక్, ఉగ్రవాదం గట్రా కథలోకి వస్తాయి… మరణించిన రా ఏజెంట్ సోదరుడి రంగంలోకి దిగుతాడు… తనకో సత్రకాయ వంటి దోస్త్, తను కూడా రా ఏజెంటే… లవ్వరేమో ఎన్ఐఏ ఆఫీసర్… వావ్, ఇంకేముంది..? కథ దున్నేసి ఉంటారు కదా అంటారా..? అసలు సమస్యే సినిమాకు సరైన కథ లేకపోవడం… దాంతోనే నిఖిల్ ఏదో ఒంటి చేత్తో సినిమాను మోస్తున్నట్టు తెగ కష్టపడ్డాడు కానీ అస్సలు వర్కవుట్ కాలేదు… కథ అంటూ ఉంటే, కథనం బాగుంటే హీరో శ్రమకు ఓ విలువ, సార్థకత…

హీరోయిన్ చూడ్డానికి బాగున్నా… ఆమెకు సరైన స్క్రీన్ స్పేస్ లేదు, స్కోపూ లేదు… పాటలు ఉన్నవే రెండు… ఒక్కటీ గుర్తుండి చావదు… బీజీఎం సోసో… దర్శకుడిగా మారిన ఎడిటర్ గ్యారీ ఈ రెండంశాల్లోనూ ఫెయిల్… జుట్టు అంటూ ఉంటే ఏరకం కొప్పు ముడిచినా అందంగా ఉంటుంది… అసలిక్కడ జుట్టే లేదు… అనగా కథ బాగాలేదు… చూడబోతే స్థూలంగా కామెడీ, యాక్షన్, రొమాన్స్, లవ్వు మన్నూమశానం అన్నీ ఉన్నయ్… అంతేకాదు, ఆర్యన్ రాజేష్ ఉన్నాడు, రానా మెరుపులా వచ్చిపోతాడు… చాలామంది ప్రముఖ నటులూ ఉన్నారు… అయితేనేం, అనేక కూరగాయలు, పప్పులు కలబోసి వండిన కిచిడీలో ఉప్పు లేదు… అనగా థ్రిల్ లేదు… చివరకు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగాలేదు…

నిజానికి ఇలాంటి కథల్లో ఏముంటుంది..? ఓ హీరో… డిష్యూం డిష్యూం… ఫైట్లు, తుపాకులు… హీరోయిజం… చివరకు పాజిటివ్‌గా శుభం కార్డు… కథనం అదరగొట్టేలా సీన్లు రాసుకుంటే యాక్షన్, థ్రిల్ పండుతుంది… స్పై ప్రేక్షకుడు కూడా ఓ పెద్ద భూతద్దం పట్టుకుని సినిమాలో థ్రిల్ కోసం వెతకాలి… ఇంకా దీనికి రివ్యూ కూడా అనవసరం… అక్కడక్కడ సిల్లీ సీన్లు సినిమా నిర్మాతలు, దర్శకుల పట్ల జాలిని కలిగిస్తాయి… అఫ్‌కోర్స్ హీరోపై కూడా…

వాస్తవానికి కార్తికేయ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు… ఆ రేంజ్ తగ్గకూడదనుకుని ఈ స్పై స్టోరీ ఎన్నుకున్నట్టున్నాడు… పాన్ ఇండియా సినిమాయే ఇది… కానీ అన్నీ కార్తికేయలు అయిపోవుగా నిఖిల్… కానీ ఒంట్లో సత్తువ లేకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేసినట్టుగా… స్టోరీయే అంత బాగాలేదు, పోనీ కథనమూ సోసో… ఇక నువ్వు ఎంత వర్కవుట్ చేస్తే ఏం లాభం..? కార్తికేయ వందో, నూటయాభై కోట్లో వసూలు చేయవచ్చుగాక… దాని కథ వేరు, ఆ ట్రెండ్ వేరు… ఈ మూస కథ వేరు… సో, ఆ కార్తికేయ-2 వసూళ్ల వాపు కాస్తా ఈ స్పై సినిమాతో తగ్గిపోయింది… నిఖిల్ నేల మీదకు దిగినట్టే…!! చివరగా… రా అంటే ముడి సరుకు… అవును, ఈ సినిమా కూడా ఉత్త రా మెటీరియల్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…
  • ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఓన్లీ…!
  • ‘‘నేనెందుకు అర్చకవృత్తి చేపట్టానంటే…’’ చిలుకూరు రంగరాజన్ కథ…
  • చిరంజీవి క్లాసిక్ చేస్తే ఎందుకో గానీ ఆ ‘ఆరాధన’ దక్కదు తనకు…
  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions