నిజమే… రాజకీయాల్లో ఒక పుల్లను ఇటు నుంచి తీసి అటువైపు పెట్టడం అంటే… దానికి ఓ హేతువు ఉంటుంది, దాని వెనుక ఓ ఉద్దేశం ఉంటుంది… పొద్దుపోక పుల్లలు మార్చరు ఎవరూ..! మరి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును ఎందుకు తొలగించారు..? మళ్లీ ఎక్కడికీ గవర్నర్‌గా ఎందుకు పంపించలేదు..? ఓహో… ఇక తనను తెలంగాణ ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొస్తారేమో… అసలే ఇక్కడ నాయకత్వ లేమి ఉంది కాబట్టి, ఏకంగా విద్యాసాగర్‌రావును బీజేపీ అధ్యక్షుడిగా తీసుకొచ్చి, రాబోయే కాలానికి కాబోయే సీఎంగా అభ్యర్థిత్వం ప్రకటించేసి, ఇంకాస్త దూకుడు పెంచాలని బీజేపీ భావిస్తున్నది అంటూ బొచ్చెడు వార్తలు కనిపిస్తున్నాయి… ప్రచారాలూ సాగుతున్నాయి… ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంది… కొందరైతే ఇంకా ముందుకు పోయి, ఓ వెలమ రాజుకు మరో వెలమ నాయకుడిని ప్రత్యర్థిగా నిలబెట్టబోతున్నది, వాహ్, ఏం వ్యూహం బాస్ అన్నట్టుగా కూడా రాసిపారేస్తున్నారు… నిజమా..? విద్యాసాగర్‌రావుకు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉద్వాసన పలకడం వెనుక అంత కథ ఉందా..? బహుశా బీజేపీ పెద్దలు కూడా ఇప్పుడు అనుకోవాలి ఓసారి ఇలా… ‘‘ఓహో, మా చేష్టల వెనుక ఇంత, మనకే తెలియనంత ఈస్థాయి వ్యూహం నిజంగానే దాగి ఉందా…?’’
కానీ… కాస్త భిన్నమైన కోణంలో వెళ్దాం ఓసారి… ప్రస్తుతం విద్యాసాగర్‌రావు వయస్సు 77 సంవత్సరాలు… మొన్న తన పదవీకాలం ముగిసింది కాబట్టి, ఇక కొనసాగింపు ఇవ్వలేం, నీ సేవలు ఇక చాలు అన్నారు తప్ప తనను కావాలని ఏమీ తొలగించలేదు… అయితే ఇంకెక్కడో ఇవ్వవచ్చు కదా అనేది ప్రశ్న…
తను ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ఎదిగినవాడే… అనేక ప్రతికూల పరిస్థితుల్లోనూ బీజేపీనే పట్టుకుని కొనసాగాడు తప్ప, వేరే ఏ పార్టీల వైపూ తొంగిచూడలేదు… మోడీకి గానీ, అమిత్ షాకు గానీ మొదట్లో తన మీద తటస్థ భావనే ఉండేది… వాళ్లకన్నా సీనియర్ విద్యాసాగర్‌రావు, ఓసారి కేంద్రమంత్రిగా కూడా చేశాడు… ఢిల్లీ టాప్ నాయకులందరితోనూ సత్సంబంధాలు ఉండేవి… ఇప్పటికీ ఆయన పట్ల బీజేపీ ద్వయానికి వ్యతిరేకత ఏమీ లేదు… కాకపోతే సానుకూలత లేదు… ఎందుకు..?
కేసీయార్, బీజేపీ నడుమ సంబంధాలు బాగున్నన్ని రోజులూ విద్యాసాగర్‌రావుకు కేసీయార్ పౌరసన్మానం చేసినా, వాళ్లిద్దరి బంధం ఎంత గాఢంగా కనిపించినా ఒక మోడీకి, ఒక అమిత్ షాకు అభ్యంతరంగా ఏమీ లేదు… అవసరమైతే కేసీయార్‌తో రాజకీయ దౌత్యం చేయటానికి విద్యాసాగర్‌రావు పనికొస్తాడులే అనే భావనే ఉండేది… కానీ మోడీ కుర్చీని పెకిలించటానికి కేసీయార్ చేసిన ప్రయత్నాలతో బీజేపీ, కేసీయార్ బంధం వికటించింది… పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బాగా బలోపేతమై ఉంది… కేసీయార్ సహకారం అస్సలు అవసరం లేదు…
ఇంకా చెప్పాలంటే..? దక్షిణాదిన కర్నాటక తరువాత ఇక తెలంగాణలోనే అడ్డా వేయాలనేది బీజేపీ ప్లాన్… (అప్పట్లో బీజేపీలోని ఓ పెద్ద నాయకుడు చెప్పినట్టు… ఏ రాష్ట్రాన్నీ వదిలేదు లేదు, కాకపోతే మార్గాలు వేర్వేరు…) అలాంటప్పుడు కేసీయార్‌ను ఢీకొట్టడమే బీజేపీకి కర్తవ్యం అయిపోయింది… సో, ఇప్పుడు కేసీయార్ దోస్త్ విద్యాసాగర్‌రావు పట్ల అంత సానుకూలత లేకుండా పోయింది… గవర్నర్‌గా కొనసాగింపూ లేదు, ఇంకెక్కడికో పంపించడమూ లేదు…
ఈ స్థితిలో తనకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగిస్తారా..? తన వయస్సు 77… ఏవేవో మార్గాల్లో, బీజేపీ కలల కంటున్న అధికారం ఏ మూడేళ్లకో దక్కుతుందనే అనుకుందాం… అప్పటికి విద్యాసాగరుడు 80 దాటేస్తాడు… బీజేపీ కొత్త రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండొద్దు… అయితే మేధోమథన విభాగానికి వెళ్లిపోవాలి లేకపోతే ఏదో ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లి కృష్ణా రామా అని కాలం గడపాలి… అంతే… మరి ఈ ఈక్వేషన్‌లో కూడా విద్యాసాగరుడు ఫిట్ కాడు…
ఇవన్నీ వదిలేసి, ఇప్పుడు తెలంగాణకు ఓ దూకుడు తంత్రం నేర్పే ఓ మాంత్రికుడు కావాలి కాబట్టి బీజేపీ తనను ఎంచుకుంటుందని అనుకుందాం… ఫర్ డిబేట్… తను రాజకీయంగా క్రియాశీలకంగా లేక చాలా ఏళ్లయ్యింది… తను ఇప్పుడు ఓ పక్కా ప్రొటోకాల్, సెరిమోనియల్ లీడర్… పైగా తెలంగాణ రాజకీయాలు బాగా మారిపోయాయి… బీజేపీకి ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ సెక్షన్లలో లీడర్లను ఎంకరేజ్ చేయాల్సి ఉంది… జనంలో ఉండే లీడర్లు కావాలి… ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ బీసీలు… సొయెం బాపూరావు ఎస్టీ… (రాష్ట్ర గవర్నర్‌గా తీసుకొచ్చిన తమిళిసై కూడా బీసీ…) ఈ స్థితిలో బీసీ లక్ష్మణ్‌ను తొలగించి, ఓసీ విద్యాసాగరుడికి పగ్గాలు ఇస్తారా అనేది అతిపెద్ద క్వశ్చన్ మార్క్..? అది రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టవుతుంది…
అసలు బండారు దత్తాత్రేయను దూరంగా పంపించటం వెనుకా కేసీయార్‌తో సత్సంబంధాలే కారణం అనే ఓ ప్రచారం ఉంది… కేసీయార్‌తో పోరాటం సమయంలో కేసీయార్ సన్నిహితులు కాషాయశిబిరాల్లో కీలకంగా ఉండటం బీజేపీ హైకమాండ్‌కు ఇష్టం లేదు అనేవాళ్లూ ఉన్నారు… మరి అలాంటప్పుడు కేసీయార్ దోస్తుగా చెప్పబడే నాయకుడికి ఏకంగా పార్టీ పగ్గాలు ఇస్తారా..? ఇది మరో డౌటనుమానం… అబ్బే… ఈ లెక్కలన్నీ వేస్ట్ సారూ, మీరు చూస్తూ ఉండండి, ఒక వెలమదొరను మరో వెలమదొరతోనే కొట్టేస్తారు మావాళ్లు అన్నాడో వీరాభిమాని… ఔనా..? అదంత వీజీయా..?! ఇది కేసీయార్ పట్ల అండర్ ఎస్టిమేషన్, విద్యాసాగరుడి పట్ల ఓవర్ ఎస్టిమేషన్ కాదుకదా…!?