.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ప్రచారానికి వెళ్లి అభివృద్ధిలో కేరళ దుస్థితిని ఎత్తిచూపినప్పుడు, ప్రశ్నించినప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఉక్కబోతకు గురయ్యాడు.., ఏదో వివరణ ఇచ్చుకున్నాడు… ఒక పొరుగు రాష్ట్ర సీఎం అతిథి ప్రచారకర్తగా వచ్చి ప్రశ్నిస్తేనే ఉలిక్కిపడి, ఉక్కిరిబిక్కిరి అయిన తీరే సీపీఎం ప్రభుత్వం ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉందో అర్థమైంది… అప్పటికే తమ ప్రభుత్వంపై కేరళ ప్రజానీకంలో పెరిగిన వ్యతిరేకతను అది గుర్తించింది…
నిజానికి భారతదేశ రాజకీయాల్లో కేరళది ఒక ప్రత్యేక శైలి… ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం (LDF vs UDF) అక్కడ దశాబ్దాలుగా సాగింది… అయితే, గత ఎన్నికల్లో ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ పినరయి విజయన్ రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు… కానీ, అదే పినరై వ్యవహార ధోరణి సీపీఎం, దాన్ని అంటిబెట్టుకున్న ఇతర వామపక్షాల కొంప ముంచింది… కేరళ ప్రజలు ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ను తిరస్కరించారు… (people left the left)…
Ads

అధికారం చేతిలో ఉంటే… ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాల్సిన జాతీయ లెఫ్ట్ పార్టీ, క్రమేపీ కేరళలో ఒక కుటుంబ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి… కమ్యూనిజం అంటే సిద్ధాంతం, సామాన్యుడి గొంతుక అని చెప్పుకునే పార్టీలో వారసత్వ రాజకీయాలు రాజ్యమేలాయి…
పినరయి అల్లుడు మహమ్మద్ రియాస్‌కు కీలక మంత్రి పదవి కట్టబెట్టడం పార్టీ సీనియర్లలోనే అసంతృప్తిని రగిలించింది… పినరయి కుమార్తె వీణ విజయన్ ఐటీ కంపెనీకి నిధుల మళ్లింపు, ఎక్సలాజిక్ సొల్యూషన్స్ కేసు ఇప్పటిదాకా కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్… జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అంశాలపై కూడా పినరయి మాటే ఫైనల్ కావడం, కేరళ బయట పార్టీకి ఉనికి లేకపోవడంతో సీపీఎం ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది…
కేరళ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు సామాన్యులను విస్తుగొలిపాయి కూడా… స్వయంగా సీఎం కార్యాలయ అధికారుల అండదండలతో విదేశాంగ శాఖ ప్రొటోకాల్ పార్శిళ్లలో బంగారం స్మగ్లింగ్ జరగడం కేరళ సర్కారు చరిత్రలో ఒక మాయని మచ్చ… శబరిమల ధ్వజస్తంభం బంగారం తాపడం రేకులు మాయం కావడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది… హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తూ, సంప్రదాయాలను కాలరాస్తున్నారనే ముద్ర పినరయి ప్రభుత్వంపై బలంగా పడింది… అంతకుముందు శబరిమలలో రుతుమహిళల్ని ప్రవేశపెట్టి, హిందూ మతభావాల్ని, మనోభావాల్ని దారుణంగా కించపరిచిన సంగతి తెలిసిందే…

ఒకప్పుడు బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్, ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థ… బెంగాల్‌లో 34 ఏళ్ల పాలన తరువాత మమతా బెనర్జీ దెబ్బకు నామరూపాలు లేకుండా పోయింది, ఇప్పుడు అదే మమత భంగపడితే, బీజేపీ ఆ స్పేసులోకి వెళ్లింది తప్ప ఇక సీపీఎంకు పునరుద్ధరణ చేతకాలేదు… రాష్ట్రంలో పార్టీస్వామ్యం వల్ల జరిగిన నష్టం… ఇప్పుడు కేరళలో దెబ్బ… ఎక్కడైనా, ఏదైనా ప్రధాన పార్టీ వదిలే ముష్టి సీట్లు తప్ప లెఫ్ట్‌కు సొంతంగా నిలబడి గెలిచే సీట్లు ఏమైనా ఉన్నాయానేది కీలక ప్రశ్న…
భారతదేశానికి అస్సలు సంబంధం లేని రష్యా, చైనా సిద్ధాంతాలను (మార్క్సిజం- లెనినిజం) ఇక్కడి ప్రజలపై రుద్దాలని చూడటం వల్లనే కమ్యూనిస్టులు విఫలమవుతున్నారు… దేశ భక్తి కంటే సిద్ధాంతానికే ప్రాధాన్యత ఇవ్వడం, హిందూ ధర్మంపై వ్యతిరేకత ప్రదర్శించడం వారి పతనానికి ప్రధాన కారణాలు… పడికట్టు పదాలతో వల్లెవేసే కాలం చెల్లిన విధానాలను పట్టుకుని వేలాడితే ఇక లెఫ్ట్ ‘గతం’…
కేరళలో పినరయి విజయన్ చేసిన తప్పులు, సాగించిన అప్రజాస్వామిక పాలన వెరసి… భారత రాజకీయ యవనికపై లెఫ్ట్ శకానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకుల భావన…!!
Share this Article