.
సీన్ 1: సంతోషకరమైన క్షణాలు … తెరపై ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్. బయట చినుకులు పడుతుంటాయి. లోపల ముగ్గురు స్నేహితులు—ఇద్దరు యువ హీరోలు, ఒక అగ్ర హీరోయిన్. కెరీర్ కబుర్లు, నవ్వులు, భవిష్యత్తు కలల మధ్య డిన్నర్ నడుస్తోంది. వారి స్నేహం చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది.
సీన్ 2: ఆకస్మిక భయం … సరిగ్గా రాత్రి 8:30 గంటలు. కాలింగ్ బెల్ శబ్దం ఆ గదిలోని సంతోషాన్ని ఒక్కసారిగా తుంచేస్తుంది. కిటికీలో నుంచి బయట ఎవరో చూసిన హీరోయిన్ ముఖం పాలిపోతుంది. వణుకుతున్న స్వరంతో, “వాడు వచ్చాడు.. ప్లీజ్, మీరు మంచం కింద దాక్కోండి.. లేకపోతే నన్ను బ్రతకనివ్వడు” అని వేడుకుంటుంది. ఆ హీరోలు అయోమయంగానే మంచం కిందకి దూరి ఊపిరి బిగబడతారు.
Ads
సీన్ 3: వికృత రూపం … మంచం కింద నుంచి వారికి కేవలం రెండు కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. ఆ కాళ్లు తడబడుతున్నాయి, నడవడానికి ఎవరిదో సాయం కావాలి. లోపలికి వచ్చిన ఆ వ్యక్తి వయసు దాదాపు 80 ఏళ్లు. కానీ అతని నోటి నుంచి వచ్చే మాటలు మాత్రం అత్యంత అసభ్యంగా, కామంతో నిండి ఉన్నాయి. ఆ హీరోయిన్ తన తాత వయసున్న ఆ వ్యక్తి ముందు తలదించుకుని, అసహ్యించుకుంటూనే అతని మాటలు భరిస్తుంటుంది. ఒక ‘పెద్ద మనిషి’ ముసుగులో ఉన్న రాక్షసుడి అసలు స్వరూపం అక్కడ బయటపడుతుంది.
సీన్ 4: చేదు నిజం … ఆ ముసలి నిర్మాత వెళ్ళిపోయాక, బయటకు వచ్చిన స్నేహితులు దిగ్భ్రాంతితో నిలబడిపోతారు. “ఎవడు వాడు? ఎందుకిలా భరించావు?” అని ఆవేశంగా అడుగుతారు. అప్పుడు ఆ హీరోయిన్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నా, పెదవులపై ఒక దీనమైన నవ్వుతో.. “వాడు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి వాడు. వాడు అడిగింది ఇవ్వకపోతే ఇక్కడ మనం ఉండలేం. ఆ ముసలి వాసన భరించడం కంటే.. అవకాశాలు లేక రోడ్డున పడటం ఎక్కువ నరకం రా!” అని చెబుతుంది.
ముగింపు … కెమెరా నెమ్మదిగా ఆ హీరోయిన్ కళ్లలోకి జూమ్ అవుతుంది. అక్కడ కనిపించేది గ్లామర్ కాదు, ఒక అణిచివేయబడిన ఆర్తనాదం. రంగుల ప్రపంచంలో వెలుగులు ఎంత ఎక్కువగా ఉంటాయో, ఆ వెలుగుల వెనుక చీకటి అంత గాఢంగా ఉంటుందని చూపిస్తూ సినిమా టైటిల్ కార్డ్ పడుతుంది…
సినిమా కథ అనుకుంటున్నారా..? కాదు..? నిజమైన కథే, పైగా ముగింపు లేని కథ… అనంతమైన కథ… సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఫ్యాషన్ రంగుల ప్రపంచంలో పలుకుబడి, ధనమదం ఉన్న ప్రతి ఒక్కడూ ఆడదాన్ని అంగట్లో సరుకుగానే చూస్తున్న నిజం… ఈ కథను జేడీ చక్రవర్తి రీసెంటుగా మీడియాతో పంచుకున్నాడు… ఆ హీరోయిన్ ఎవరు, ఆ నిర్మాత ఎవరు అనేది చెప్పకపోయినా… తనతోపాటు ఈ కథలో హీరో సురేష్ కూడా ఉన్నాడు…
ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ ఇప్పుడు… కమిట్‌మెంట్లు, లైంగిక దోపిడీ కామనే… కానీ చివరకు కాళ్లూచేతులు పడిపోయే స్థితిలోని ముసలి గాడిదలు సైతం ఎలా వాడుకుంటాయో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ… అందుకే వైరల్ అయ్యింది… ఆ ముసలి గాడిద ఎవరో మీరే ఊహించుకొండి… నైన్టీస్‌లో ఇండస్ట్రీని శాసిస్తున్నవాడు అయి ఉంటాడు..!!
Share this Article