.
Mohammed Rafee …. సినిమా రంగంలో గట్టిబాబు
త్రిపురనేని చిట్టిబాబు ఇక లేరు!
కొన్నాళ్ళ క్రితం విశాఖపట్నం నుంచి మిత్రుడు వెలిచేటి శ్రీనివాస్ ఫోన్ చేసి “ఈ చెవులకు జుట్టు వేసుకుని టివి డిబేట్లలో నోరేసుకుని మాట్లాడుతున్న ఆ సినిమా ఆయన ఎవరండీ? సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి విషయానికి ముందుకొచ్చి అడ్డంగా మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీ ఎలా భరిస్తుంది” అని అడిగాడు!
అప్పుడు నేను చిట్టిబాబు గురించి, ఆయన అనుభవం గురించి చెప్పుకొచ్చాను! “అవునా” అని అతను తెల్లబోయాడు! రాజకీయ యువ నేత శ్రీనివాస్ ఒక్కడికే కాదు, ఇటీవల కాలంలో చాలా మందికి చిట్టిబాబు వ్యవహారం, ఆయన మాట తీరు, టివి డిబేట్లలో వాదించే పధ్ధతి నచ్చలేదు. చాలాసార్లు చాలామంది నోట ఈమాట విన్నాను.
Ads
అసలు ఈతరంలో చాలామందికి ఆయన గురించి అస్సలు తెలియదు! నిజానికి త్రిపురనేని చిట్టిబాబు చాలా మంచోడు! ముక్కుసూటితనం, లోపల దాచుకోలేని భోళాతనం, నిజాయితీతనం వెరసి ఒకే ఒక్కడు చిట్టిబాబు! తనకు ఏమనిపిస్తే అది మాట్లాడేయడం వల్ల చాలామందికి నచ్చలేదు కానీ, దగ్గరగా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఆయన్ని ఆనందంగా భరిస్తారు! ఒక మంచి వ్యక్తిత్వం, కమ్యూనిస్ట్ భావజాలం, సాయం చేసే తత్వం, 53 ఏళ్ల సినిమా జీవితం… త్రిపురనేని చిట్టిబాబు!
త్రిపురనేని చిట్టిబాబు కొన్ని రోజులుగా గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ నిన్న మంగళవారం రాత్రి తీవ్రమైన గుండెపోటుతో కనుమూశారు. వారి వయసు 71. రచయిత, నిర్మాత, దర్శకుడు త్రిపురనేని మహారథి కుమారుడు!
తన 17వ ఏటనే సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆత్రేయ, అప్పలాచార్య లాంటి వారి దగ్గర రచనా రంగంలో అసిస్టెంట్ గా చేరి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, డైరెక్టర్ అయ్యారు. సంభాషణల రచయితగా మారారు. నిర్మాత గా విస్తరించారు. ప్రొడక్షన్ హౌస్ కూడా నిర్వహించారు. 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. 49 సినిమాలకు కో డైరెక్టర్ గా వ్యవహరించారు. 30 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడు అనిపించుకున్నారు.
సినిమాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు కానీ, అన్ని పార్టీలు ఆయన్ని వాడేసుకున్నాయి! ప్రోత్సహించింది లేదు! తండ్రి వారసత్వంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రారంభించి కాంగ్రెస్, టిడిపి, అన్న టిడిపి, వైసిపి పార్టీ కండువాలు మార్చి చివరకు బిజెపిలో స్థిరపడ్డారు. సినిమా యూనియన్లలో, “మా” సంస్థలో, సినిమా రచయితల సంఘంలో తనదైన వాదనలతో సలహాలతో కీలక పాత్ర పోషించారు.
ఏం చేసినా సూటిగా సుత్తి లేకుండా ఉండేది! రాజకీయ విశ్లేషకులుగా డిబేట్ల లోనూ అడ్డదిడ్డంగా తనకేం అనిపిస్తే అది మాట్లాడుతూ ఎక్కువ మంది శత్రువులను పెంచుకున్నారు. చాలా మందికి దూరమైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం వదలలేదు! ఎవరేమనుకున్నా తన మడమ తిప్పలేదు! నోటికి తాళం వేసుకోలేదు! తనదైన మార్క్ సృష్టించుకున్నారు. వార్తల్లో నిలిచారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా మీడియా ముందు కనిపించే వ్యక్తిగా సుపరిచితులయ్యారు!
నిజానికి త్రిపురనేని చిట్టిబాబు ఎందరికో ఇండస్ట్రీలో ఆసరా అయ్యారు! ఎందరికో సినిమా మార్గం చూపించారు. సినిమాపై ఆసక్తి ఉండి దారి తెలియని, అవకాశాలు రాని వారి వేలు పట్టి నడిపించారు. అందరి హృదయాల్లో అందాల నటిగా తిష్టవేసిన దివంగత సౌందర్యను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసింది చిట్టిబాబు!
మహా రచయితలు పరుచూరి బ్రదర్స్ కు సినిమా దారి సుగమం చేసింది చిట్టిబాబు! మంచి సృజనాత్మక దర్శకులుగా పేరు పొందిన కృష్ణ వంశీ, శివనాగేశ్వరరావు, రసూల్, శోభన్, విజయన్ లాంటి ఎందరో దర్శకులకు తొలినాళ్లలో అవకాశాలు ఇప్పించి దర్శకులను చేసింది చిట్టిబాబు! ఆ రోజుల్లో మహా దర్శకులు త్రిలోక్ చందర్, భారతీ రాజా, కెయస్ఆర్ దాస్, కన్నదాసన్, ఎమ్మెస్ విశ్వనాథన్ లాంటి వారితో కలసి పని చేసిన వ్యక్తిత్వం చిట్టిబాబు!
సీతారామశాస్త్రి లాంటి సూపర్ కలాన్ని విశ్వనాధ్ కు పరిచయం చేసింది చిట్టిబాబు! ఇలా చెప్పుకుంటూ పోతే, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏదోవిధంగా ఎవరికో చెప్పి సాయం చేయించే వారు! ఇండస్ట్రీకి తనకు తానే పెద్దగా ముద్ర వేసుకుని బాధ్యతలు నిర్వహించారు. అన్నిటిలోనూ తనే ముందొచ్చి నిలబడే వారు!
కానీ విధి విచిత్రం ఎలా ఉంటుందంటే… తను కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. కుమారులు ఆర్ధిక సహకారం కోసం ఎదురు చూస్తే ఏ కొద్దిమంది మాత్రమే నామమాత్రపు సహకారం అందించారు. ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఆయన సేవలు అందించిన రాజకీయ పార్టీలు కూడా అటు వైపు తొంగి చూడలేదు!
చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. తన 28వ ఏట 1984లో సంతానం అనే చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ చేశారు. నా పేరు దుర్గ, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం వంటి వైవిధ్య చిత్రాలకు ఆయన దర్శకుడు! ఆనాటి గరుడాచలం, భైరవ ద్వీపం, దశావతారం, నేటి జాతి రత్నాలు, జాంబి రెడ్డి, దర్జా తదితర సినిమాల్లో నటించారు. భార్య ఉషాలత, కుమారులు నరోత్తమ్, భాస్వంత్, మోనిషా కుమార్తె వున్నారు.
ఒకసారి సారధి స్టూడియోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో చిట్టిబాబు కలసినప్పుడు “ఎందుకండీ టివి డిబేట్లకు వెళ్లి చెడ్డ పేరు తెచ్చుకుంటారు” అని అడిగాను. “ఎవరో ఒకరు వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఉండాలిగా, నా వాదన కొందరికి నచ్చక పోవచ్చు. కానీ, వాస్తవం నిదానంగా తెలుసుకున్నాక నేనే కరెక్ట్ అని అంగీకరిస్తారు. కొంత టైమ్ పట్టొచ్చు. కానీ నేను మాట్లాడుతున్న దాంట్లో నూటికి నూరు శాతం నిజం వుంది. రాజకీయాలకు కొత్త దారి చూపించే ప్రయత్నం చేస్తున్న” అన్నారు. నిజమే అనిపించింది.
నిజాలను అర్ధం చేసుకోవడానికి కొంత టైం పట్టవచ్చు! కానీ అంత టైమ్ ఆగకుండా ఆయనే తొందరపడి వెళ్లిపోయారు! ఇవాళ మహా ప్రస్థానంలో త్రిపురనేని చిట్టిబాబు గారి అంత్యక్రియలు. ఒక మేధావి, దర్శక నిర్మాత రచయిత, రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారిని కోల్పోయాం. నా నివాళులు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…. – డా. మహ్మద్ రఫీ
Share this Article