.
ఓ వార్త, ఓ ఫోటో, ఓ వీడియో… వాట్సప్ గ్రూపులో కనిపించింది… నిజానికి అది చిన్న వార్తేమీ కాదు… బహుశా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అప్రధనంగా తోచవచ్చు కూడా! కానీ ఈ వార్తకు విశేష ప్రాధాన్యం ఉంది, అటవీ ప్రాంతాల్లో ఉండేవారికి తెలుసు ఈ సమస్య ఎంత రావణ కాష్టమో… ముందుగా నేపథ్యం చెప్పుకుందాం…
జల్, జంగిల్, జమీన్… ఇదే కదా ఆదివాసీల పోరాటసూత్రం… అడవి మాదే, ఆ జలాలూ మావే, ఆ భూమీ మాదే… కానీ ఏటా వేల ఎకరాల్లో చెట్లు కొడుతూనే ఉంటారు, పోడు వ్యవసాయం జరుగుతూనే ఉంటుంది… ఫారెస్ట్ విభాగం, పోలీసులు కేసులు పెడుతూనే ఉంటారు, వేధింపులు, కేసులు, లంచాలు, అవినీతి, అదొక అరాచకం…
Ads
మరి దీనికి పరిష్కారం..? స్వరాష్ట్రం వచ్చినా, ఆదివాసీ సమాజం ఎంత ప్రాధేయపడినా కేసీయార్ వాళ్లను పట్టించుకోలేదు ఎప్పుడూ… వాళ్లు మన గిరిజనమే అయినా గొత్తికోయల్ని మరీ రోహింగ్యాల్లాగా చూస్తూ వేధించిన రోజుల్ని చూశాం… తను కౌలు రైతులనే గాలికి వదిలేశాడు… వీళ్లెంత..? మరి ఇప్పుడు..?
తెలంగాణలో పోడు భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు, భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టింది… అంటే ఒకరకంగా క్రమబద్ధీకరించడం… ఇది మామూలు చర్య కాదు… ఆదివాసీల మెప్పు పొందడం అంత సులభమూ కాదు… డిజిటలైజేషన్‌లో భాగంగా ఇప్పటికే కేంద్ర చట్టం (ఎఫ్ఆర్ఏ) కింద పోడు పట్టాలు కలిగి ఉండి, ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు దూరమైన ఆదివాసీ, గిరిజన రైతులకు ఊరటనిస్తూ భూభారతి పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చింది…
రాష్ట్రవ్యాప్తంగా ఆర్వోఎఫ్ఆర్ (ROFR- Recognition of Forest Rights) చట్టం కింద పట్టాలు పొందిన 2.30 లక్షల మందికి పైగా గిరిజన రైతులకు చెందిన 6.70 లక్షల ఎకరాల పోడు భూముల వివరాలను ఈ పోర్టల్‌లో డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు… ఈ డిజిటల్ నమోదు ద్వారా పోడు పట్టాలున్న రైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం, విద్యుత్ కనెక్షన్లు, బోరుబావులకు అనుమతులు సులభంగా లభిస్తాయి.
2006లో కేంద్రం ఓ చట్టం తెచ్చింది. FRA-2006… దీని కింద పోడు భూములకు పట్టాలిస్తారు, మామూలు రైతులకు దక్కే అన్ని ప్రయోజనాలు వీళ్లకు కూడా దక్కాలి, కానీ ఈ భూముల్ని అనుభవించడానికి తప్ప ఎవరికీ అమ్మడానికి వీల్లేదు… కానీ ఆచరణలో సాధారణ రైతులకే దక్కే ప్రభుత్వ ప్రయోజనాలు వీళ్లకు దక్కడం లేదు… పట్టాలను బట్టి సరిహద్దులు, మ్యాపింగ్ సరిగ్గా లేకపోవడమే కారణం…
ఇప్పుడు ఏకంగా భూభారతి పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా అందరు రైతుల్లాగే వాళ్లకూ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు దక్కుతాయి… ఉపగ్రహాలు (Satellite imagery), డ్రోన్ల సహాయంతో భూముల హద్దులను స్పష్టంగా గుర్తించి, సరిహద్దు వివాదాలు తలెత్తకుండా, వాటిని డిజిటల్ పద్ధతిలో మ్యాపింగ్ చేస్తున్నారు….

ఈ ఫోటో వార్త విషయానికి వద్దాం… ‘‘ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో పోడు భూములను భూభారతి పోర్టల్ లో చేర్చాలని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని పలుసార్లు కలిశారు… ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం, ములుగు జిల్లా మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవ కారణంగా భూ భారతి పోర్టల్ లో పోడు భూములకు చోటు దక్కుతోంది…’’
అదుగో, అందుకే వెంకటాపురం, వాజేడు మండలాల ఆదివాసీ పోడు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చిత్ర పటాలకు శుక్రవారం పాలాభిషేకం చేశారు… మంత్రి సీతక్క, కోదండ రెడ్డి చొరవతో పాలెం వాగు ప్రాజెక్ట్ కాలువకు పది కిలోమీటర్లు వరకు రైతులకు త్రీఫేజ్ కరెంటు లైన్ కూడా వేయించారు…
‘‘పోడు భూములను భూభారతి చేర్చకపోవడం వల్ల పోడు పట్టాలు ఉన్నప్పటికీ పోడు భూములు లాక్కోవడం, అక్రమ కేసులు పెట్టడం జరిగేది… పట్టా భూముల్లో వ్యవసాయ బోర్లు, కరెంట్ లైన్లు వేయాలన్నా అటవీ శాఖ అధికారులు అడ్డుకునే వారు… బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదు… ఇప్పుడు మాకు ఆ సమస్యల నుంచి విముక్తి’’ అని ఆదివాసీ నవనిర్మాణ సేన ప్రతినిధులు చెప్పుకొచ్చారు..!!
Share this Article