Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శిష్యుడిని మింగిన గురువు అరుదైన కథ… ప్రతి పాటా ఓ స్వాతికిరణమే…

June 4, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. Operation success ; patient dead . ఈ సంగీత సాహిత్య కావ్యానికి కరెక్టుగా సెట్ అవుతుంది ఆ మాట . నా వరకు నేను ఈ సినిమాను ఎన్ని సార్లు చూసానో లెక్కే లేదు . ఓ అసామాన్య చిత్రం . బహుశా విశ్వనాథ్ , బాలచందర్ వంటి వాళ్ళు మాత్రమే సాహసించగలరు .

సాధారణంగా విశ్వనాథ్ సమస్యలను పిక్ చేసి మెత్తని పరిష్కారాలను కూడా ఇస్తారు . కానీ ఈ సినిమాను విషాదాంతంగా ఎందుకు చేయవలసి వచ్చిందో మనకు తెలియదు . ఏ మానవుడికయినా అరిషడ్వర్గాలను అణచుకోవటం , నియంత్రించుకోవటం అంత ఆషామాషీ విషయం కాదు .

Ads

నాకు తెలిసి భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను ముంచిన బిడ్డలు , గురువుకు పంగనామాలు పెట్టిన శిష్యులు , సాయం చేసిన వారి చెయ్యిని నరికిన కృతఘ్నులు కావలసినంత మంది దొరుకుతారేమో కానీ శిష్యుడి ఎదుగుదలను చూసి ఈర్ష్య , అసూయాద్వేషాలను నియంత్రించుకోలేని గురువులు వేళ్ళ మీద లెక్కేయటానికి కూడా దొరకరు .

అలాంటి rarest of rare fellow వ్యక్తిత్వాన్ని తీసుకుని దానికి అమాయక శిష్యుడు పాత్రను బలివ్వటం జీర్ణించుకోవటం కష్టం . అందువలనే సినిమాకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి . కానీ ఆరోజుల్లో వ్యాపారపరంగా హిట్ కాలేదు .

అదంతా ఎలా ఉన్నా సంగీత సాహిత్యాల పరంగా మరో కళా సృష్టి . సి నారాయణరెడ్డి , సిరివెన్నెల , వెన్నెలకంటి , మాడుగుల నాగ ఫణి శర్మ అద్భుతమైన సాహిత్యభరిత పాటల్ని అందించారు . ఆనతినీయరా హరా సన్నుతి చేయగా !!! సాహిత్యం , గానం , సంగీతం అద్భుతం . ఈ పాటను పాడిన వాణీ జయరాంకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు కూడా వచ్చింది .

మరో గొప్ప పాట . శివానీ భవానీ శర్వాణీ . మొదట గంగాధరం (మాస్టర్ మంజునాథ్) పాడతాడు . ఆ పాట నచ్చలేదని ఆత్మవంచన చేసుకున్న అనంతరామ శర్మ (మమ్ముట్టి) గణపతి సచ్చిదానంద స్వామి సన్నిధిలో పాడతాడు . ఈ సందర్భంగా మిత్రులతో నేను వ్యక్తిగతంగా పంచుకొనవలసిన విషయం ఒకటి ఉంది . 1990 ప్రాంతంలో గణపతి సచ్చిదానంద స్వామి మా ఇంటికి పాదపూజకు వచ్చారు .

నాకు చాలా చాలా ఇష్టమైన పాట శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి . మాతృ సమానురాలయిన గురుపత్నిని కూర్చోబెట్టి ప్రేమతో , ఆరాధనా భావంతో పాడే పాట . విశ్వనాథ్ ఎంత బాగా చిత్రీకరించారో .
మరో గొప్ప చిత్రీకరణ తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ పాట . సుందరమైన లొకేషన్స్ . బహుశా తూర్పు గోదావరి జిల్లా లోని పట్టిసీమ ప్రాంతంలో షూట్ చేసారేమో ! చాలా బాగుంటుంది . రాధిక , మమ్ముట్టిల మీద సాగే ప్రణతి ప్రణతి ప్రణతి పాట . ఎంత శ్రావ్యంగా ఉంటుందో .

ఆ పాట మధురము సంగీతము అంటూ సాగే ఓపెనింగ్ పాట లోకేషన్స్ కూడా చాలా బాగుంటాయి . అలాగే మాస్టర్ మంజునాథ్ , అతని స్నేహితుల మీద వచ్చే కొండల్లో కోనల్లో లోయల్లో పాట చిత్రీకరణ కూడా అందంగా ఉంటుంది .

నాకు నచ్చిన మరో పాట సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే . ఏం సాహిత్యం . జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా , వైష్ణవి భార్గవి వాగ్దేవి , శ్రీకరం శివ శేఖరం (శ్లోకం) అంటూ సాగే పాటలన్నీ శ్రావ్యంగా సాగుతాయి .

నటనపరంగా చెప్పుకోవలసింది ముందు ముగ్గురు . ఒకటి మాస్టర్ మంజునాథ్ . మాల్గుడి డేస్ సీరియల్ ద్వారా సుపరిచితుడయిన ఆ చిరంజీవిని విశ్వనాథ్ భలే పికప్ చేసారు . రెండవ వారు మమ్ముట్టి . తెలుగులో ఇదే మొదటి సినిమా అనుకుంటా . చాలా కష్టమైన నెగటివ్ పాత్ర . క్షణం క్షణం సంఘర్షణకు గురయ్యే పాత్ర . మెచ్చుకోకుండా ఉండలేదు అతనిలో పాండిత్యం . భరించలేడు అతనిలో ఈర్ష్యాద్వేషాలతో బంధించబడిన సాధారణ మనిషి . గొప్పగా నటించాడు .

మూడవ వారు రాధిక . బిడ్డలు లేని ఆవిడ గంగాధరంలో స్వంత బిడ్డని చూసుకుంటూ ప్రోత్సహిస్తూ ఉంటుంది . అతని మీద భర్త ఈర్ష్యాద్వేషాలను గమనిస్తూ ఉంటుంది . బాధ పడుతూ ఉంటుంది . పరాకాష్ట “ఈ దేవుడు చంపాడా ఆ దేవుడు చంపాడా” అని మూడు సార్లు అనే డైలాగ్ డెలివరీలో గొప్పగా నటిస్తుంది .

ఈ మూడు పాత్రల తర్వాత నాకు నచ్చిన పాత్ర జయంతిది . గంగాధరాన్ని అల్లరిచిల్లరి దారి నుండి గొప్ప సంగీత విద్వాంసుడిగా చేయాలనే తపన కల మరో తల్లి పాత్ర . గంగాధరం తల్లిదండ్రులుగా డబ్బింగ్ జానకి , ధర్మవరపు సుబ్రమణ్యం , మాస్టారిగా మిశ్రో , ఇతర పాత్రల్లో వైజాగ్ ప్రసాద్ , అనంత్ , సాక్షి రంగారావు  తదితరులు నటించారు .

యం వి యస్ హరనాధరావు డైలాగులను అద్భుతంగా వ్రాసారు . నృత్యాలను శేషు , కూచిపూడి నృత్య కళాకారులు కరోతి వెంకట సత్యనారాయణ కంపోజ్ చేసారు . పాటల్ని , శ్లోకాలను బాలసుబ్రమణ్యం , వాణీ జయరాం , చిత్ర అద్భుతంగా పాడారు . విశ్వనాథ్ సినిమాలలో పాటలు ఎలా ఉండాలో అలాగే పాడారు . నిర్మాత డా వి మధుసూధనరావు .

సంగీత దర్శకత్వాన్ని వహించిన కె వి మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది . కె వి మహదేవన్ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే భారమంతా పుహళేందే మోసి గురువు పేరు ముందు పెట్టారు . నిర్మాత డా వి మధుసూధనరావుకి ఉత్తమ కుటుంబ చిత్రంగా అక్కినేని పేరున పెట్టబడ్డ నంది అవార్డు వచ్చింది . సినిమా మరియు పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . సంగీత సాహిత్య ప్రియులు ఎన్ని సార్లయినా తనివితీరా చూడవచ్చు , ఆస్వాదించవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మారని KTR దగ్గూదమ్మూ భావజాలం… 8 నుంచి బత్తిన చేపమందు…
  • శిష్యుడిని మింగిన గురువు అరుదైన కథ… ప్రతి పాటా ఓ స్వాతికిరణమే…
  • ‘తెలుగు మందు’ సీసా ‘అందుబాటు’ సైజుల్లో… ఖజానాకు మరింత కిక్కు…
  • పెద్ది… నటుడిగా రాంచరణ్‌‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి…
  • బెంగాల్ షిండే..! ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
  • తులం బంగారమూ అమ్మలేదు… రిజర్వ్ బ్యాంకు స్పష్టీకరణ…
  • తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…
  • ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’
  • లక్ష కోట్ల బంగారం అమ్మేశాడా మోదీ..! బ్లూమ్‌బర్గ్ కథనం- వార్తలు…
  • కళ్లు పొడిచే LED కాంతి..! రాత్రి ప్రయాణం ప్రాణాంతకమేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions